సింగారెడ్డిపాలెంలో దోమపోటు సోకిన పొలం
నేలకొండపల్లి: ఈసారి ఖరీఫ్ సీజన్‌లో వరిపంటను సాగు చేసిన రైతులకు దోమపోటు ప్రభావంతో తీవ్ర నష్టాలే మిగులుతున్నాయి. ఎకరానికి రూ.25వేలకు పైగా పెట్టుబడి పెట్టగా..దోమపోటు సోకి రోజుల వ్యవధిలోనే ధాన్యం తాలుగా మారి దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం కాగా..చెరువుల ఆయకట్టు కింద ముమ్మరమయ్యాయి. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వరకు వస్తుందని రైతులు ఆశించగా..అందులో సగం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టగా..అది పూడడం కష్టంగా మారింది. జిల్లాలోని మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో రైతులు 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు.
పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా పంటకు దోమపోటు సోకింది. పలుచోట్ల రైతులకు సలహాలు, సూచనలు చేసే వ్యవసాయాధికారి లేక ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల వద్ద మందులు కొనుగోలు చేసి పిచికారీ చేయాల్సి వచ్చింది. అయినా..దోమపోటు తగ్గలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో వానలు బాగా కురవడంతో ఎంతో ఆనందంగా వరి పంట వేసుకున్నారు. అయితే..అదును సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో..బోరులు, బావుల్లో కూడా నీరు అడుగంటింది.
పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో వరి సాగు పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు ఏ మందు వాడుతున్నారో తెలియక, ఇష్టం వచ్చినట్లుగా పిచికారీ చేయడం వలన ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేలా లేదని వాపోతున్నారు. నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, అనాసాగారం, సింగారెడ్డిపాలెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో వరికి దోమపోటు తీవ్రత ఎక్కువగా ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెడితే..చివరకు అప్పులు మిగులుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
రబీ సాగు కలిసొచ్చేనా..
ఈ ఏడాది వరిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే చాలాచోట్ల దోమపోటు ప్రభావంతో దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు..తీవ్ర నిరాశకు గురై..ముందున్న రబీ (ఏసంగి) సాగును నమ్ముకుంటున్నారు. దోమపోటు ప్రభావం లేకుంటే..ధాన్యం నాణ్యత బాగుండి కలిసొస్తుందని అనుకుంటున్నారు. అయితే..ఖరీఫ్‌తో పోల్చితే..రబీలో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దీంతో..వానాకాలం పంటలో నష్టపోయిన చాలామంది తిరిగి యాసంగిలో వరి పండించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఎకరంన్నర తాలుగా మారింది..
ఎకరంన్నర వరి సాగు చేశాను. రూ.25 వేలు ఖర్చు పెట్టిన. దోమపోటుతో వరి పంట మొత్తం తాలుగా మారింది. 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ..గింజ ధాన్యం చేతికి వచ్చేట్లు కనిపించడం లేదు. అప్పుల పాలయ్యాను. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. – నెల్లూరి రామయ్య, రైతు, ముజ్జుగూడెం
పంటమొత్తం దెబ్బతింది..
వరి సాగు కోసం అందినకాడికల్లా అప్పులు చేసి పండించిన. దోమపోటుతో వరి పంట మొత్తం దెబ్బతింది. వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గతేడాది ఖర్చులే ఇయాల్టీకి తీరలేదు. కొత్తగా సాగుకు చేసిన అప్పులకు కట్టాల్సి వస్తోంది. సర్కారు ఆదుకోవాలి. – కాశిబోయిన అయోధ్య, రైతు, నేలకొండపల్లి
ఇది తీరని నష్టం..
వరి పంటకు సోకిన దోమపోటుకు పలు రకాల మందులు పిచికారీ చేసిన. అయినా ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇది వరకు కురిసిన అకాల వర్షాలకు వరి పంట చాలా వరకు దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. రైతులకు దోమపోటు తీరని నష్టం చేసింది. ఇక కోలుకోలేం. – పి.కోటేశ్వరరావు, రైతు, సింగారెడ్డిపాలెం
కొంతమేర నష్టం వాస్తవమే..
జిల్లాలో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలోనే దిగుబడి వస్తుంది. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాం. హెక్టారుకు 5,200 కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశాం. పంట భాగానే ఉన్నా..కొన్నిచోట్ల దోమపోటు ప్రభావం కనిపించింది. అక్కడ దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. – ఝాన్సీలక్ష్మీకుమారి, జేడీఏ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment