Mosquito problem
-
ఆశల ఆ‘వరి’!
నేలకొండపల్లి: ఈసారి ఖరీఫ్ సీజన్లో వరిపంటను సాగు చేసిన రైతులకు దోమపోటు ప్రభావంతో తీవ్ర నష్టాలే మిగులుతున్నాయి. ఎకరానికి రూ.25వేలకు పైగా పెట్టుబడి పెట్టగా..దోమపోటు సోకి రోజుల వ్యవధిలోనే ధాన్యం తాలుగా మారి దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం కాగా..చెరువుల ఆయకట్టు కింద ముమ్మరమయ్యాయి. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వరకు వస్తుందని రైతులు ఆశించగా..అందులో సగం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టగా..అది పూడడం కష్టంగా మారింది. జిల్లాలోని మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో రైతులు 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా పంటకు దోమపోటు సోకింది. పలుచోట్ల రైతులకు సలహాలు, సూచనలు చేసే వ్యవసాయాధికారి లేక ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల వద్ద మందులు కొనుగోలు చేసి పిచికారీ చేయాల్సి వచ్చింది. అయినా..దోమపోటు తగ్గలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో వానలు బాగా కురవడంతో ఎంతో ఆనందంగా వరి పంట వేసుకున్నారు. అయితే..అదును సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో..బోరులు, బావుల్లో కూడా నీరు అడుగంటింది. పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో వరి సాగు పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు ఏ మందు వాడుతున్నారో తెలియక, ఇష్టం వచ్చినట్లుగా పిచికారీ చేయడం వలన ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేలా లేదని వాపోతున్నారు. నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, అనాసాగారం, సింగారెడ్డిపాలెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో వరికి దోమపోటు తీవ్రత ఎక్కువగా ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెడితే..చివరకు అప్పులు మిగులుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రబీ సాగు కలిసొచ్చేనా.. ఈ ఏడాది వరిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే చాలాచోట్ల దోమపోటు ప్రభావంతో దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు..తీవ్ర నిరాశకు గురై..ముందున్న రబీ (ఏసంగి) సాగును నమ్ముకుంటున్నారు. దోమపోటు ప్రభావం లేకుంటే..ధాన్యం నాణ్యత బాగుండి కలిసొస్తుందని అనుకుంటున్నారు. అయితే..ఖరీఫ్‌తో పోల్చితే..రబీలో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దీంతో..వానాకాలం పంటలో నష్టపోయిన చాలామంది తిరిగి యాసంగిలో వరి పండించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎకరంన్నర తాలుగా మారింది.. ఎకరంన్నర వరి సాగు చేశాను. రూ.25 వేలు ఖర్చు పెట్టిన. దోమపోటుతో వరి పంట మొత్తం తాలుగా మారింది. 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ..గింజ ధాన్యం చేతికి వచ్చేట్లు కనిపించడం లేదు. అప్పుల పాలయ్యాను. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. – నెల్లూరి రామయ్య, రైతు, ముజ్జుగూడెం పంటమొత్తం దెబ్బతింది.. వరి సాగు కోసం అందినకాడికల్లా అప్పులు చేసి పండించిన. దోమపోటుతో వరి పంట మొత్తం దెబ్బతింది. వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గతేడాది ఖర్చులే ఇయాల్టీకి తీరలేదు. కొత్తగా సాగుకు చేసిన అప్పులకు కట్టాల్సి వస్తోంది. సర్కారు ఆదుకోవాలి. – కాశిబోయిన అయోధ్య, రైతు, నేలకొండపల్లి ఇది తీరని నష్టం.. వరి పంటకు సోకిన దోమపోటుకు పలు రకాల మందులు పిచికారీ చేసిన. అయినా ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇది వరకు కురిసిన అకాల వర్షాలకు వరి పంట చాలా వరకు దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. రైతులకు దోమపోటు తీరని నష్టం చేసింది. ఇక కోలుకోలేం. – పి.కోటేశ్వరరావు, రైతు, సింగారెడ్డిపాలెం కొంతమేర నష్టం వాస్తవమే.. జిల్లాలో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలోనే దిగుబడి వస్తుంది. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాం. హెక్టారుకు 5,200 కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశాం. పంట భాగానే ఉన్నా..కొన్నిచోట్ల దోమపోటు ప్రభావం కనిపించింది. అక్కడ దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. – ఝాన్సీలక్ష్మీకుమారి, జేడీఏ, ఖమ్మం -
దోమలు చంపుతున్నాయ్, వార్డు మార్చండి
రాంచీ/పట్నా: అపరిశుభ్రత, దోమల బెడద, కుక్కల అరుపులతో ఇబ్బందిగా ఉన్నందున వేరే వార్డుకి మార్చాలంటూ ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ రిమ్స్ అధికారులను కోరారు. వివిధ అవినీతి కేసుల్లో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆర్జేడీ నేత భోలా యాదవ్ అన్నారు. దోమలు కుట్టడంతోపాటు ఆ పక్కనే మార్చురీ ఉండటంతో వీధికుక్కల సంచారం, అరుపులతో తమ నేత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను రిమ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పక్కనే కొత్తగా నిర్మించిన వార్డులోకి మారిస్తే అవసరమైన అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. గతంలో లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండే వార్డులోకి మార్చామని తెలిపారు. ఆస్పత్రిలో లాలూకు కలిగిన అసౌకర్యంపై అధికార జేడీయూ ఎద్దేవా చేసింది. ‘ప్రస్తుతం మీరు దోమలు, కుక్కలను చూసి భయపడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి బిహార్ ప్రజలు భయపడ్డారు’ అని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
దోమ రాలేదు.. దిగుబడి తగ్గలేదు..!
రసాయనిక వ్యవసాయం చేసే వరి రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో దోమ తీవ్రనష్టం కలిగించింది. ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేసినా పంట దెబ్బతిన్నది. కొన్నిచోట్ల అసలు పంటే చేతికి రాని పరిస్థితి. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన వరి పంటకు అసలు దోమే రాలేదని నలవాల సుధాకర్ అనే సీనియర్ రైతు సగర్వంగా చెబుతున్నారు. ద్రావణాలు, కషాయాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం తయారు చేసుకొని వాడుకోవటం వంటి పనులను ఓపికగా అలవాటు చేసుకోగలిగిన రైతులకు ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.. ‘తొలకరి జల్లుకు తడిసిన నేల... మట్టి పరిమళాలేమైపాయే.. వానపాములు, నత్తగుల్లలు భూమిలో ఎందుకు బతుకుత లేవు.. పత్తి మందుల గత్తర వాసనరా.. ఈ పంట పొలాల్లో..’ అంటూ ఓ కవి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు పంట పొలాలకు ఎంతటి చేటు చేస్తున్నాయో వివరించారు. ప్రస్తుతం పంట పొలాలు చాలావరకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల బారిన పడుతున్నవే. అధికంగా పంట అధిక దిగుబడిని ఆశించి వారానికో మందు కొడుతున్న ఫలితంగా పచ్చని పంట భూములన్నీ విషపూరితమవుతున్నాయి. స్వచ్ఛమైన పంటకు బదులు, రోగాలకు దారితీసే కలుషితమైన ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. పర్యావరణంలో సమతుల్యత కూడా దెబ్బతింటోంది. ఈ ఫలితంగానే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పొలాల్లో దోమ విధ్వంసం సృష్టించింది. వరి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. ఖర్చుకు వెనకాడకుండా వరుస పిచికారీలు చేసినా రైతులకు దుఃఖమే మిగిలింది. దిగుబడి కూడా ఎక్కువే.. అయితే, ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నలువాల సుధాకర్ పొలంలో మాత్రం వరికి దోమ సోకలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లోని పెర్కపల్లి వాస్తవ్యుడైన సుధాకర్ ఐదెకరాల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 4 ఎకరాల్లో తెలంగాణ సోన, ఎకరంలో జైశ్రీరాం సన్నరకాల వరిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 30 బస్తాల (70 కిలోల)కు ధాన్యం దిగుబడి తగ్గదని భరోసాతో ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదట దిగుబడి తక్కువగా వచ్చినా, కొద్ది ఏళ్లకు వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలకు పెరిగింది. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో కన్నా 5 బస్తాలు ఎక్కువగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పొలం చూస్తేనే అర్థమవుతుంది. ఈ పంటకు మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సాగు లాభసాటిగానే ఉంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన దిగుబడిని సుధాకర్ సాధిస్తున్నారు. మియాపూర్ ప్రాంతంలో సాధారణ రసాయనిక సాగులో ఎకరానికి దాదాపు 40 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చే స్తే, మొదటి సంవత్సరంలో 20 నుంచి 25 బస్తాల వరకే వస్తాయి. కానీ, మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇవి 40 బస్తాలకు చేరుకొంటాయి. సాధారణ బియ్యానికి కిలో సుమారు రూ.30 ఉంటే, ప్రకృతి వ్యవసాయ బియ్యానికి స్థానికంగా కిలోకు సుమారు రూ.50ల ధర పలుకుతోంది. సాధారణ రసాయనిక పద్ధతిలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ‘రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తున్న వరి రైతు విషం తిని ప్రజలకు విషాహారాన్ని పంచుతున్నాడు.. కేన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవటం, సుగర్ రావటం, చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవటం.. వంటి ఆరోగ్య సమస్యలన్నిటికీ రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణం.. రైతులు ఓపిక పెంచుకుంటే ప్రకృతి వ్యవసాయం కష్టమేమీ కాద’ని సుధాకర్ చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తే ఎక్కువ మంది రైతులు ఈ దారిలోకి రావటానికి అవకాశం ఉందని ఆయన అంటున్నారు. మీ పంటే బాగుందంటున్నారు.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో దోమ బాగా నష్టం చేసింది. వారం వారం మందులు వేయటంతో పంట వేగంగా పెరుగుతుంది. చీడపీడలు కూడా తొందరగా ఆశిస్తాయి. ఈ ఏడాది 7–8 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. మొత్తం ఖర్చు ఎకరానికి రూ. 20 వేల వరకు వచ్చింది. కానీ, దోమ వల్ల దిగుబడి 25 బస్తాలకు పడిపోయింది. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా పొలంలో వరికి ఈ సంవత్సరం అసలు దోమ రానే లేదు. వేప నూనె ఒకే ఒక్కసారి పిచికారీ చేశా. ఎప్పటిలాగా భూమిలో ఎకరానికి క్వింటా వేప పిండి వేశా. జీవామృతం, ఘనజీవామృతం వేశా.. నాకు మొత్తంగా ఎకరానికి రూ. 10 –11 వేలు ఖర్చయింది. దిగుబడి వారికన్నా ఎక్కువగానే 30 బస్తాలు కచ్చితంగా వస్తుంది. ఆ రైతులు మా పంటను మొదట్లో ఎదుగుదల తక్కువగా ఉందనే వారు. ఇప్పుడు చివరకొచ్చే వరకు మీ పంటే బాగుందంటున్నారు. రైతులందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినే అవకాశం లభిస్తుంది. దిగుబడి లాభసాటిగా ఉంటుంది. పర్యావరణ సమస్య తలెత్తదు. భూమి విషపూరితం కాదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం రైతుకు ఎకరాకు రూ.15 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి. దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మార్కెటింగ్ సౌకర్యం లేక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్లు కూడా మానేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారు. – నలువాల సుధాకర్ (98498 86034), మియాపూర్, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా – ఆది వెంకట రమణారావు, స్టాఫ్ రిపోర్టర్, పెద్దపల్లి ఫోటోలు : మర్రి సతీష్ కుమార్, ఫోటో జర్నలిస్టు -
వ్యవశా స్త్రవేత్తలు
ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. కళ్ల ముందరే పసిమొగ్గలు నేలరాలడం వారిని కలచివేసింది. ప్రకృతిలో ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నది వారి విశ్వాసం. వ్యవసాయ పనులు చేస్తూనే ఖాళీ సమయాల్లో అడవుల్లో చెట్లూపుట్టల వెంట తిరిగారు. దోమల సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుకొన్నారు. ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’ నేతృత్వంలో ఇచ్చే రాష్ట్రపతి అవార్డును 2013లో వారికి దక్కించుకొని ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారు. ప్రాణాంతక వ్యాధులను తక్కువ ఖర్చుతో నయం చేసే మందులను కొనుక్కోవడం కోసం అన్వేషణ సాగిస్తున్నారు చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామీణ శాస్త్రవేత్తలు. వీరికి ప్రయోగశాల కూడా అందుబాటులో లేదు. ఆ మాటకొస్తే ఈ బృందంలో ఇద్దరు మినహా మిగతావాళ్లవి వానకారు చదువులే. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ ఎం.ఏ(ఫిలాసఫీ) మధ్యలోనే ఆపేశాడు. ్ఞఇంటర్మీడియెట్లో బైపీసీ విద్యార్థి అయిన చంద్రశేఖర్‌కు సైన్సులో కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యం అందించిన మనదేశం ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం విదేశాల వైపు చూస్తోండటం చంద్రశేఖర్‌ను ఆలోచింపజేసింది. సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే ఉంటుందని పెద్దలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తే సంచలనం సృష్టించవచ్చన్న భావనతో డిగ్రీ చదివిన చిరంజీవులు, నాలుగైదు తరగతులు చదివిన భాస్కర్, బత్తెయ్యనాయుడు, శివ, వెంకటేశ్వర్లు, మురళీ, శ్రీధర్‌లతో కలిసి ‘జగదీష్ చంద్రబోస్’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి 20 ఏళ్ల క్రితమే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి చేసిన తొలి ప్రయోగం విఫలమైన సందర్భంలోనే కారాకొల్లును సెరెబ్రల్ మలేరియా చుట్టుముట్టింది. అడవిబాటలో... దోమ కాటుకు ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా సోకి పసిమొగ్గలు కళ్ల ముందే నేలరాలుతోండటంతో ఆ బృందం మళ్లీ అడవిమార్గం పట్టింది. దోమలు, క్రిములు వాలని మొక్క, చెట్టు దొరికితే సమస్యకు పరిష్కారం లభించినట్లేనన్నది వారి భావన. అదే లక్ష్యంతో చెట్లెంటా పుట్లెంటా తిరిగారు. చివరకు తెల్లజుమికి మొక్కపై దోమలు, క్రిములు వాలకపోవడాన్ని గుర్తించారు. వాలిన దోమలు, క్రిములు కూడా చనిపోవడాన్ని పసిగట్టారు. తెల్లజుమికి మొక్క ఆకులపై, కాయలపై జిగురులాంటి పదార్థం ఉండటం వల్ల దోములు, క్రిములు వాలడం లేదని భావించారు. తెల్లజుమికి ఆకులు, కాయల రసాన్ని దోమల లార్వాలపై ప్రయోగించారు. దెబ్బకు దోమల లార్వాలు చనిపోయాయి. ఆ రసాన్ని ఊర్లో మురుగుకాలువలు, నీళ్లు నిలిచే ప్రాంతాలపై చల్లారు. దెబ్బకు దోమలన్నీ చనిపోయాయి. ఊళ్లో వాళ్లందరికీ ఆ రసాన్ని ఇచ్చారు. పడుకునే ముందు చేతులకు కాళ్లకు పూసుకుంటే దోమలు కుట్టవని చెప్పారు. ఆ ఊరి ప్రజలు అలానే చేశారు. దోమకాటుకు పరిష్కారం దొరకడంతో సెరెబ్రల్ మలేరియా నుంచి కారాకొల్లుకు విముక్తి కలిగింది. ఇదే సమయంలో తాము కనుగొన్న మందుకు శాస్త్రీయత ఉందని నిరూపించాలని బృందం భావించింది. ఎస్వీ యూనివర్శిటీలో ఎంటమాలజీ ప్రొఫెసర్ హరినాథబాబును సంప్రదించారు. బృందం అందించిన శాంపుల్స్‌పై పరిశోధనలు చేసిన హరినాథబాబు, తెల్లజుమికి రసంలో క్రిమిసంహారక లక్షణాలున్నట్లు తేల్చారు. న్యుమటోడ్స్ (చెట్ల ఆకులపై రసం పీల్చే పురుగులు) నిర్మూలించడానికి ప్యురాడాన్ ఉపయోగిస్తున్నారు. ప్యూరాడాన్ కన్నా తెల్లజుమికితో తయారుచేసిన మందే న్యుమటోడ్స్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు ప్రొఫెసర్ హరినాథబాబు తేల్చారు. అడవే ప్రయోగశాల... తెలుగుగంగ ఆయకట్టు ప్రాంతమైన కారాకొల్లులో చిత్తడి నేలలు అధికం. చిత్తడి నేలల్లో నడవడం వల్ల ఆ గ్రామ ప్రజలను బురదపుండ్లు పట్టి పీడిస్తుండడంతో గాయాన్ని మాన్పే మందు కోసం అన్వేషణ సాగించారు. వెంట్రుకలను నల్లగా మార్చడానికి చేసిన ప్రయోగంలో గతంలో ఉపయోగించిన బురుగుడు ఆకు రసాన్ని ఓ ఎద్దు గాయంపై ప్రయోగించారు. త్వరగా మానిపోయింది. ఆ తర్వాత కోడికి తగిలిన గాయంపై ప్రయోగించారు. అదీ మానిపోయింది. మనుషుల గాయాలకూ, చర్మవ్యాధులకు ఇదే మందును పూశారు. 15 నిముషాల్లో ప్రభావం చూపాయి. బురుగుడు ఆకు రసం తయారుచేసిన మందుపై పరిశోధనలు చేసిన కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ రఘునాథరాజు ఆ మందు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని తేల్చారు. తక్కువ ధరకు మందును అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ‘ఎంజెల్-హెచ్’ అనే పేరుతో మార్కెట్ చేసేందుకు పూనుకున్నారు. ‘‘మేం తయారు చేసిన మందులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొనడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అంటున్నారు బృందంలో సభ్యుడైన చంద్రశేఖర్. ‘జగదీశ్ చంద్రబోస్’ సంఘం సభ్యులు చేస్తున్న కృషిని గమనించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఏఫ్) రాష్ట్ర కో-ఆర్డినేటర్ గణేశం వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. బృందం ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి ఆవిష్కరణలకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ప్రజలకు మేలు చేసే మరిన్ని మందులను ఈ గ్రామీణ శాస్త్రవేత్తల బృందం కనుగొనాలని ఆశిద్దాం. ఎన్ఐఎఫ్ను సంప్రదించండి... దేశంలో ప్రతిభకు కొదువ లేదు. పల్లెల్లో అద్భుతాలు సృష్టించే యువకులు ఎందరో ఉన్నారు. ఎవరు ఏ ఆవిష్కరణలు చేసినా నన్ను(ఫోన్ నెంబరు 09866001678) సంప్రదించండి. రాష్ట్రంలో ఇప్పటికే 112 ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లాం. 22 మందులకు పేటెంట్లు తెప్పించాం. 12 మందికి రాష్ట్రపతి అవార్డులు వచ్చేలా చేశాం. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ బృందం అద్భుతాలు సాధిస్తోంది. - గణేశం, రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎన్ఐఎఫ్.