రాంచీ/పట్నా: అపరిశుభ్రత, దోమల బెడద, కుక్కల అరుపులతో ఇబ్బందిగా ఉన్నందున వేరే వార్డుకి మార్చాలంటూ ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ రిమ్స్ అధికారులను కోరారు. వివిధ అవినీతి కేసుల్లో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆర్జేడీ నేత భోలా యాదవ్ అన్నారు. దోమలు కుట్టడంతోపాటు ఆ పక్కనే మార్చురీ ఉండటంతో వీధికుక్కల సంచారం, అరుపులతో తమ నేత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఈ సమస్యలను రిమ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పక్కనే కొత్తగా నిర్మించిన వార్డులోకి మారిస్తే అవసరమైన అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. గతంలో లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండే వార్డులోకి మార్చామని తెలిపారు. ఆస్పత్రిలో లాలూకు కలిగిన అసౌకర్యంపై అధికార జేడీయూ ఎద్దేవా చేసింది. ‘ప్రస్తుతం మీరు దోమలు, కుక్కలను చూసి భయపడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి బిహార్ ప్రజలు భయపడ్డారు’ అని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment