మొండి దోమ సమస్యకు ఎల్‌ఈడీ బల్బుతో పరిష్కారం
ఎల్‌ఈడీ కాంతిలోకి రాని యాసిడ్ ఫ్లై దోమలు
యూఓహెచ్ విద్యార్థి ‘సింపుల్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అది అలాంటి ఇలాంటి దోమ కాదు.. కుడితే చర్మం ఎర్రగా మారిపోతుంది. భరించలేని మంట పుడుతుంది. అదే యాసిడ్ ఫ్లై దోమ. కందిరీగ మాదిరిగా ఉండే ఈ దోమను నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లైగా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఇది కుడితే పెడెరస్ డెర్మటైటిస్ సమస్య ఏర్పడు తుంది. కుట్టిన చోట కా లిన గాయాల తరహాలో చర్మం మండుతుంది. కమిలిపోతుంది. ఈ దోమలతో నిత్యం ఇబ్బంది పడిన ఓ విద్యార్థి.. దానికి విరుగుడు కనుగొన్నాడు. తనతోపాటు తోటి విద్యార్థుల సమస్యను తీర్చాడు.
సమస్య నుంచి ఆవిష్కారం
హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యాసిడ్ ఫ్లై దోమల సమస్య తీవ్రంగా ఉండేది. విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు. యాసిడ్ ఫ్లై బాధితుల్లో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయిన తేజస్ ఆంటో కన్నంపూజ కూడా ఉన్నాడు. అయితే ఇతర విద్యార్థులలాగా దోమ కరిచినప్పుడు బాధపడి తర్వాత ఆ విషయాన్ని వదిలేయలేదు. యాసిడ్ ఫ్లై దాడులను అరికట్టడానికి మార్గాలను అన్వేషించాడు. ఈ దోమల సంచారంపై అధ్యయనం చేశాడు. ఈ క్రమంలో యాసిడ్ ఫ్లై దోమలు హాస్టల్‌లో కొన్ని రూమ్స్‌లో మాత్రమే అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. అందుకు కారణాలను అన్వేషించగా.. అల్ట్రా వయలెట్ కిరణాలకు ఈ దోమ ఆకర్షింపబడుతోందని తేలింది.
కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్‌ఎల్) ట్యూబ్ లైట్లకు ఇవి బాగా ఆకర్షింపబడుతున్నాయని గుర్తించాడు. రేడియేషను అధికంగా విడుదల చేసే ఎల్‌ఈడీ లైట్లు ఉన్న గదుల్లోకి ఈ దోమలు అంతగా రావటంలేదని గమనించాడు. దీంతో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా.షమన్న ఆధ్వర్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం నిర్వహించి.. వర్సిటీకి నివేదిక సమర్పించాడు. తేజస్ పరిశోధన పెద్ద సమస్యను తీర్చిందని డాక్టర్ షమన్న సాక్షికి తెలిపారు. ఎక్కడైనా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేయటం ద్వారా యాసిడ్ ఫ్లై సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. వర్సిటీ హాస్టల్‌లో యాసిడ్ ఫ్లై సమస్య గతంలో 38 శాతం ఉండగా.. లైట్ల మార్పుతో 8 శాతానికి తగ్గిందని చెప్పారు.
బాధకు పరిష్కారం వెతికాను
కొంతకాలంగా హాస్టల్ రూమ్స్‌లో యాసిడ్ ఫ్లై బాధను అనుభవించాం. పరిష్కారం కోసం అన్వే షించడంలో తప్పులేదుగా అనుకున్నా. మొత్తానికి సమస్యకు మూలం గుర్తించడంతో పరిష్కారం కూడా దొరికింది. – తేజస్, హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment