LED bulb
-
యాసిడ్ ఫ్లైనా.. ‘లైట్’ తీస్కోండి!
సాక్షి, హైదరాబాద్: అది అలాంటి ఇలాంటి దోమ కాదు.. కుడితే చర్మం ఎర్రగా మారిపోతుంది. భరించలేని మంట పుడుతుంది. అదే యాసిడ్ ఫ్లై దోమ. కందిరీగ మాదిరిగా ఉండే ఈ దోమను నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లైగా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఇది కుడితే పెడెరస్ డెర్మటైటిస్ సమస్య ఏర్పడు తుంది. కుట్టిన చోట కా లిన గాయాల తరహాలో చర్మం మండుతుంది. కమిలిపోతుంది. ఈ దోమలతో నిత్యం ఇబ్బంది పడిన ఓ విద్యార్థి.. దానికి విరుగుడు కనుగొన్నాడు. తనతోపాటు తోటి విద్యార్థుల సమస్యను తీర్చాడు. సమస్య నుంచి ఆవిష్కారం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యాసిడ్ ఫ్లై దోమల సమస్య తీవ్రంగా ఉండేది. విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు. యాసిడ్ ఫ్లై బాధితుల్లో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయిన తేజస్ ఆంటో కన్నంపూజ కూడా ఉన్నాడు. అయితే ఇతర విద్యార్థులలాగా దోమ కరిచినప్పుడు బాధపడి తర్వాత ఆ విషయాన్ని వదిలేయలేదు. యాసిడ్ ఫ్లై దాడులను అరికట్టడానికి మార్గాలను అన్వేషించాడు. ఈ దోమల సంచారంపై అధ్యయనం చేశాడు. ఈ క్రమంలో యాసిడ్ ఫ్లై దోమలు హాస్టల్లో కొన్ని రూమ్స్‌లో మాత్రమే అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. అందుకు కారణాలను అన్వేషించగా.. అల్ట్రా వయలెట్ కిరణాలకు ఈ దోమ ఆకర్షింపబడుతోందని తేలింది. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్ఎల్) ట్యూబ్ లైట్లకు ఇవి బాగా ఆకర్షింపబడుతున్నాయని గుర్తించాడు. రేడియేషను అధికంగా విడుదల చేసే ఎల్ఈడీ లైట్లు ఉన్న గదుల్లోకి ఈ దోమలు అంతగా రావటంలేదని గమనించాడు. దీంతో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా.షమన్న ఆధ్వర్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం నిర్వహించి.. వర్సిటీకి నివేదిక సమర్పించాడు. తేజస్ పరిశోధన పెద్ద సమస్యను తీర్చిందని డాక్టర్ షమన్న సాక్షికి తెలిపారు. ఎక్కడైనా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయటం ద్వారా యాసిడ్ ఫ్లై సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. వర్సిటీ హాస్టల్లో యాసిడ్ ఫ్లై సమస్య గతంలో 38 శాతం ఉండగా.. లైట్ల మార్పుతో 8 శాతానికి తగ్గిందని చెప్పారు. బాధకు పరిష్కారం వెతికానుకొంతకాలంగా హాస్టల్ రూమ్స్‌లో యాసిడ్ ఫ్లై బాధను అనుభవించాం. పరిష్కారం కోసం అన్వే షించడంలో తప్పులేదుగా అనుకున్నా. మొత్తానికి సమస్యకు మూలం గుర్తించడంతో పరిష్కారం కూడా దొరికింది. – తేజస్, హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి -
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్‌లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్‌లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్‌ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
అక్రమాల ‘క్రాంతి’
పల్లె వికాసం పేరుతో నిధుల దోపిడీ జరిగింది.గ్రామ స్వరాజ్యమంటూనే అక్రమాలకుఒడిగట్టారు. గత పాలకుల స్వార్థానికి ‘ఎల్ఈడీ’నిధులు కైంకర్యమయ్యాయి. ‘చంద్రక్రాంతి’ పేరుతోఅమలైన ఈ పథకంలో అక్రమాల వెలుగులు ప్రసరించాయి. జిల్లాలో రూ.6కోట్లకు పైగా నిధులుదుర్వినియోగమయ్యాయి. ఎమ్మిగనూరు: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు గత ప్రభుత్వం ‘చంద్రక్రాంతి’ అనే పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఉన్న పౌరవీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ 2018 అక్టోబర్ 10న ఎమర్జెన్సీ ఎలక్ట్రికల్ సర్వీసు లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఒప్పందంలో ‘చినబాబు’ జేబులోకి భారీగా నిధుల వరద పారిందనే ఆరోపణలు అప్పట్లో విన్పించాయి. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం జిల్లాలోని మొత్తం 889 పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులకు అప్పట్లో ఒత్తిళ్లు వచ్చాయి. ఇదే అదనుగా ఈఈఎస్ఎల్ నుంచి సబ్ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఆదోని డివిజన్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును హైదరాబాదుకు చెందిన నరసింహా ఎలక్ట్రికల్స్ వారు, నంద్యాల, కర్నూలు డివిజన్లలో మస్తాన్‌రెడ్డి ఏజెన్సీ వారు చేపట్టారు. ఆదోని డివిజన్లోని ఎమ్మిగనూరు రూరల్ మండలంలో 3,772, హొళగుంద 2,869, నందవరం 3,911, ఆదోని రూరల్ 5,942, హాలహర్వి 2,629, కోసిగి 3,446, పెద్దకడబూరు 2,732, పత్తికొండ 4,651, మంత్రాలయం 3,462, గోనెగండ్ల 4,242, చిప్పగిరి 1,622, ఆస్పరి 3,646, మద్దికెర 1,852, దేవనకొండ మండలంలోని పల్లెదొడ్డి, కుంకునూరు పంచాయతీల్లో 333 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. కౌతాళం, తుగ్గలి, ఆలూరు మండలాల్లో పనులు మొదలు కాలేదు. అదేవిధంగా నంద్యాల, కర్నూలు డివిజన్లలోని పలు పంచాయతీల్లో పనులు చేపట్టారు. జిల్లా మొత్తమ్మీద ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి 1,53,836 బల్బులు వేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు పొందారు. అక్రమాలు ఇలా.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటులో భాగంగా ప్రతి పౌర విద్యుత్ స్తంభానికి కొత్తగా యాంకర్ క్లాంప్, బోల్టులు, వైరింగ్తో పనులు చేయాలి. ఇందుకు గాను ఒక్కొక్క దానికి రూ.600, ఫిట్టింగ్ చార్జీగా మరో రూ.100 కాంట్రాక్టుఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎల్ఈడీ బల్బులను ఒప్పందంలో భాగంగా ఈఈఎస్ఎల్ సంస్థ సరఫరా చేస్తోంది. అయితే.. ప్రతి పంచాయతీలో 100–150 స్తంభాలకు మాత్రమే కొత్త మెటీరియల్ అమర్చి, మిగతా వాటికి పాత మెటీరియల్‌తోనే పనికానిచ్చేశారు. గోనెగండ్ల మేజర్ పంచాయతీలో 800 ఎల్ఈడీ బల్బులు అమర్చారు. అందులో కేవలం 150 స్తంభాలకే కొత్త మెటీరియల్ అమర్చారు. మిగతా 650 బల్బులను పాత మెటీరియల్‌తోనే అమర్చినట్లు పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. కోసిగి మేజర్ పంచాయతీలో 1,150 ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఇందులో 350 బల్బులు మాత్రమే కొత్త మెటీరియల్‌తో బిగించారు. అయితే..అన్నింటినీ కొత్తవాటితోనే అమర్చినట్లు చూపి బిల్లులు పొందారు. ఇలా జిల్లా మొత్తమ్మీద 70 శాతం అక్రమ బిల్లులే పొందినట్లు తెలుస్తోంది. రూ.6 కోట్లకుపైగా అక్రమాలు జరిగాయని చర్చ సాగుతోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితే అక్రమాల డొంక కదులుతుందని ఆదోని డివిజన్‌కు చెందిన ఓ ప్రధాన అధికారి పేర్కొనడం గమనార్హం. అయితే.. ఈ కుంభకోణంలో పంచాయతీ కార్యదర్శుల అమాయకత్వాన్ని, అవసరాలను సొమ్ము చేసుకుంటూ కాంట్రాక్టర్లు వారి నుంచి రికార్డులపై సంతకాలు కూడా చేయించుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే పనులు గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ప్రభుత్వ ఒప్పందం మేరకే చేపట్టాం. కొన్నిచోట్ల పాత మెటీరియల్ వాడారని మా దృష్టికి కూడా వచ్చింది. అయినా అక్కడ పనులు పూర్తిగా పారదర్శకంగా చేపట్టారని పంచాయతీ కార్యదర్శులు రికార్డుల్లో సంతకాలు చేయటం వల్లే బిల్లులు చెల్లించాం.– జయత్ వేముల, ఈఈఎస్ఎల్ ప్రతినిధి -
వెలుగులేవీ?
గద్వాల్/అయిజ (అలంపూర్): కొన్ని నెలలుగా నగరపంచాయతీ పరిధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అయిజ పట్టణానికి మూడు వేల ఎల్ఈడీ బల్బులు కావాలని అధికారులు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు గత నవంబర్‌లో నగరపంచాయతీకి రెండు విడతలుగా 1,100 పంపిం చారు. అయితే పట్టణంలో ఇంతవరకు వీటిలో 500మాత్రమే విద్యుత్ స్తంభాలకు అమర్చారు. మూడో తీగ లేకపోవడంతో మిగతావి అమర్చలేకపోయారు. వాటి స్థానంలో ఇతర బల్బులు ఉండటంతో అవి రాత్రీపగలు వెలిగి తక్కువ కాలంలోనే కాలిపోతున్నాయి. ఇదిలాఉండగా 2014–15 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌కోకు విద్యుత్ బిల్లుల కింద రూ.3.4లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తు తం ఈ బకాయిలు రూ.4.5కోట్లకు చేరుకున్నాయి. దీంతో ట్రాన్స్‌కో అధికారులు పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు మూడో తీగ ఏర్పాటు చేయడంలేదు. -
సేఫ్ అండ్ హ్యాపీ!
గ్రేటర్లో ఇక ఇంటింటికీ ఎల్ఈడీ వెలుగులు! ►విద్యుత్ ఆదా... పర్యావరణ హితమే లక్ష్యం ►కార్యాచరణకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ►ఎస్‌హెచ్‌జీల సహకారంతో సబ్సిడీపై విక్రయాలు సిటీబ్యూరో: విద్యుత్ ఆదా...పర్యావరణ హితమే లక్ష్యంగా గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల కుటుంబాలకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు విక్రయించిన జీహెచ్ఎంసీ..ఇక నుంచి స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా సబ్సిడీపై ఎల్ఈడీ బల్బుల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా భారీగా విద్యుత్ ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల 20 నుంచి 75 శాతం వరకు విద్యుత్ ఆదా అయి...బిల్లులు భారీగా తగ్గుతాయని చెబుతున్నారు. సాధారణ బల్బులు, ట్యూబ్లైట్ల కంటే ఎల్ఈడీలు ఎంతో మేలని పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద... గ్రేటర్ నగరంలోని అన్ని నివాస గృహాల్లో ఎల్ఈడీ బల్బులను వినియోగించేందుకు స్వయం సహాయక మహిళాసంఘాల (ఎస్‌హెచ్‌జీ) సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలోని 22 లక్షలకుపైగా గృహాలన్నింటికీ వీటిని విక్రయించేందుకు ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉజాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్ నుండి సబ్సిడీ రేట్లకు కొనుగోలు చేసి, ప్రతి ఇంటికి వీటిని విక్రయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. నగరంలో జీహెచ్ఎంసీ సహకారంతో ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్ఈడీ విక్రయ కేంద్రాల ద్వారా ఇప్పటికే 9 వాట్ల సామర్ధ్యం గల 2,17,000 ఎల్ఈడీ బల్బులు, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ట్యూబ్ లైట్లు 50 వేలు, 8750 ఫ్యాన్లు విక్రయించారు. దాదాపు రెండు లక్షల గృహాల వారు వీటిని కొనుగోలు చేశారు. మిగతా 20 లక్షల గృహాలకు కూడా వీటిని విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకుగాను ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవలు వినియోగించుకోనున్నారు. విద్యుత్ ఆదా..పర్యావరణ హితం ఇలా.. ఉదాహరణకు ప్రస్తుతం ఒక్కో ఇంటికి మూడు ఫ్లొరోసెంట్ ట్యూబ్ లైట్లు ఉపయోగించడం ద్వారా దాదాపు 23.33 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. వీటి స్థానంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తే కేవలం 9.72 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది. అంటే దాదాపు 13.61 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా నెలకు 12 నుంచి 20 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా విద్యుత్ చార్జీల స్లాబ్‌రేట్లు గణనీయంగా తగ్గుతాయి. ప్లోరోసెంట్, సాంప్రదాయక విద్యుత్ బల్బులతో పోల్చిచూస్తే ఎల్ఈడీలు వాటికన్నా ఐదురెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో పాటు కార్బన్‌డయాక్సైడ్‌ను అతి తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. కాగా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల ద్వారా రెండు లక్షలకు పైగా బల్బులు విక్రయించారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తుండటంతో దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక ఉజాల కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఎల్ఈడీ బల్బు 70 రూపాయలు, ట్యూబ్ లైట్ 230 రూపాయలు, ఫ్యాన్ 1,150 రూపాయలకు విక్రయిస్తున్నారు. -
రూ.75కే ఎల్ఈడీ బల్బు
♦ ప్రత్యేక స్టాళ్ల ద్వారా విక్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ♦ రెండు రాయితీ బల్బులు పేదలకు అందించే ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో కనీసం రూ.150కు తగ్గకుండా లభిస్తున్న ఎల్ఈడీ బల్బులను రాష్ట్రంలో రూ.75కే విక్రయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఎల్ఈడీ బల్బులను విక్రయించనుంది. బహిరంగ మార్కెట్లో ఒక్క ఎల్ఈడీ బల్బు ధర రూ.150 వరకు ఉండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు అధికంగా సాంప్రదాయ బల్బులనే వినియోగిస్తున్నారు. ఎల్ఈడీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ సైడ్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రాం(డీఈఎల్పీ)ను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలుకు గాను ఎల్ఈడీ బల్బుల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించగా ఉత్పత్తిదారులు పోటీ పడి కేవలం రూ.74.65లకే విక్రయించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద 9వాట్ల సామర్థ్యం గల రెండు ఎల్ఈడీ దీపాలను రాయితీపై రాష్ట్రంలో ఇంటింటికీ అందజేస్తారు. ఒక్కో బల్బుకు రూ.75 వ్యయం అవుతుండగా..వినియోగదారుల నుంచి రూ.10 వసూలు చేసి, మిగిలిన రూ.65ను డిస్కంలు భరించనున్నాయి. ఈ పంపిణీ దశల వారీగా జరగనుంది. వంద రోజుల ప్రణాళిక కింద పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 25 నగర పంచాయతీల పరిధిలోని గృహాలకు ఏప్రిల్ నుంచి పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద నల్లగొండ, మెదక్, నిజామాబాద్‌లను ఎంపిక చేశారు. దీనికి తోడు తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.75కే ఎల్ఈడీ బల్బులను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయితీ కింద సరఫరా చేసినా, వినియోగదారుల అవసరాల మేరకు అదనపు బల్బులను తక్కువ ధరలకు అందించాలని భావిస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు జిల్లాల పరిధిలో 25లక్షల ఎల్ఈడీలను, మరో 25 నగర పంచాయతీల్లో 4.66లక్షల ఎల్ఈడీలను పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ నుంచి బల్బులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 96లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు 1.92లక్షల ఎల్ఈడీలు అవసరం కానున్నాయని అధికారులు తెలిపారు. -
పాత బల్బుకు కొత్త షోకులు!
♦ మరింత సమర్థమైన ఇన్కాండిసెంట్ లైట్ బల్బు తయారీ ♦ కరెంట్ ఖర్చు పిసరంతే ఎంఐటీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ ఒకప్పటి ఇన్కాండిసెంట్ లైట్ బల్బుల కంటే తక్కువ కరెంటు ఖర్చయ్యే సీఎఫ్ఎల్ బల్బులను వాడటం మొదలుపెట్టామోలేదో వాటికంటే మెరుగైన ఎల్ఈడీ బల్బులొచ్చాయి. తాజాగా పాతతరం ఇన్కాండిసెంట్ బల్బులకు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెరుగులు దిద్ది అత్యాధునిక బల్బును తయారుచేసింది. దీంతో ఎల్ఈడీకంటే దాదాపు పదిరెట్లు తక్కువ విద్యుత్‌తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టి వందేళ్లు దాటింది. టంగ్స్టన్ ఫిలమెంట్ వేడి నుంచి పుట్టే వెలుగులను పంచే ఈ బల్బు సామర్థ్యం చాలా తక్కువ. వాడే విద్యుత్‌లో 5 శాతం మాత్రమే వెలుతురుగా మారి ఉపయోగపడుతుంది. మిగతా 95శాతం వేడి రూపంలో వృథాగా పోతుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు వృథా చేసే కరెంటు దాదాపు 86 శాతమని అంచనా. రీసైకిల్ చేస్తే... విద్యుత్ బల్బులు మరింత సమర్థంగా పనిచేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని అవలంబించారు. వేడి రూపంలో వృథాగా గాల్లో కలుస్తున్న శక్తిని తిరిగి కాంతి రూపంలోకి మార్చారు. దీంతో టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు 40 శాతం సామర్థ్యంతో పనిచేసింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫిలమెంట్ చుట్టూ స్ఫటిక ఆకారపు గాజు తొడుగు ఏర్పాటు చేశారు. ఇది వెలుతురును ప్రసారం చేస్తూనే... వెలువడిన శక్తిని మళ్లీ దానిపైకే ప్రసారం చేసింది. అంటే.. ఫిలమెంట్ నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ఉండేందుకు తక్కువ కరెంట్ సరిపోతుందన్నమాట. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ఎల్ఈడీల కంటే మూడు రెట్లు ఎక్కువగా అంటే దాదాపు 40 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. సంప్రదాయ 60 కాండిళ్ల బల్బు ఏడాదిపాటు రూ.100 విద్యుత్ ఖర్చు చేస్తే ఇది కేవలం రూ.10 ఖర్చు చేస్తుంది. సీఎఫ్ఎల్ బల్బులైతే రూ.20, ఎల్ఈడీ బల్బులైతే రూ.18 వరకూ ఖర్చు చేస్తాయని యూకేలోని ఎనర్జీ సేవింగ్ ట్రస్ట్ తెలిపింది. - సాక్షి, హైదరాబాద్ లాభాలెన్నో... కొత్తరకం ఫిలమెంట్ బల్బుతో కరెంటు ఆదాతోపాటు మరెన్నో లాభాలున్నాయి. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ బల్బుల తయారీలో పర్యావరణహానికారక పదార్థాలను వాడతారు. కొత్త బల్బులకు ఈ అవసరం లేదు. అంతేకాకుండా ఫిలమెంట్ బల్బు వెలువరించే వెలుతురు సూర్యకాంతిని పోలి ఉంటుంది. కంటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. సీఎఫ్ఎల్, ఎల్ఈడీల నుంచి వచ్చే నీలం రంగు కాంతి మన నిద్రను చెడగొడుతుందని శాస్త్రవేత్తల అంచనా. కొత్త బల్బులతో ఈ సమస్య ఉండదు. -
విద్యుత్ 'ఆదా'యం!
♦ విద్యుత్ పొదుపు కోసం బృహత్ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం ♦ సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ దీపాలు ♦ ఇళ్లకూ సబ్సిడీ ధరపై అందజేత.. వాయిదాల్లో డబ్బు చెల్లించే చాన్స్ ♦ కోటి మంది రైతులకు ఉచితంగా నాణ్యమైన పంపుసెట్లు ♦ రూ. 4,800 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిన సర్కారు ♦ ఏటా 5,212 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ. 2,500 కోట్లు ఆదా ♦ రెండేళ్లలోనే తిరిగి రానున్న పెట్టుబడి వ్యయం ♦ నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు, పరికరాల వినియోగానికి ప్రోత్సాహం సాక్షి, హైదరాబాద్ రోజు రోజుకూ సరికొత్త సాంకేతికతలు ఎన్నో ప్రజల ముంగిటకు వస్తున్నాయి. ఆ కొత్త పరిజ్ఞానానికి తగినట్లుగా ప్రజల అభిరుచులూ మారిపోతున్నాయి. కానీ వెలుతురు కోసం మాత్రం ఎప్పుడో 120 ఏళ్ల కింద 1879లో థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్న రకం బల్బులనే ఇంకా ఎక్కువ మంది జనాభా వినియోగిస్తున్నారు. ఈ ఫిలమెంట్ బల్బులు విద్యుత్‌ను విపరీతంగా వినియోగిస్తాయి. అందులో 95 శాతం ఉష్ణం (వేడి) రూపంలోనే వృథా అవుతుంది. 60 వాట్ల సాధారణ బల్బు ఇచ్చే వెలుగును 7 వాట్ల ఎల్ఈడీ విద్యుద్దీపాలు ఇవ్వగలవు. దీంతో భారీగా విద్యుత్ పొదుపు అయ్యే అవకాశమున్నా... ప్రజలు వాటిపై మక్కువ చూపడం లేదు. కారణం ఎల్ఈడీల ధర చాలా ఎక్కువగా ఉండడమే. దీంతో విద్యుత్ పొదుపు కోసం రాష్ట్రమంతటా నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు, పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఐదేళ్లలో రూ. 4,800 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 69 నగరాలు, పట్టణాల్లో సాంప్రదాయ వీధిదీపాల స్థానంలో ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయనుంది. గృహాలకూ సబ్సిడీ ధరపై వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించేలా ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతోపాటు నాసిరకం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను ఉచితంగా సరఫరా చేయడం, 80 వేల సోలార్ పంపు సెట్లను మంజూరు చేయడం వంటి చర్యలూ చేపట్టనుంది. ఇవన్నీ అమల్లోకి వస్తే ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఏటా 5,212 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కానుంది. అంటే ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వ్యయం తగ్గుతుంది. విద్యుత్ పొదుపు రూపంలో పెట్టుబడి వ్యయం సైతం రెండేళ్లలో తిరిగి రానుంది. ఇంటింటికీ ఎల్ఈడీ దీపం ఏటా రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం తొమ్మిది బిలియన్ యూనిట్లుకాగా... అందులో 20 శాతం వాటా విద్యుత్ దీపాలదే. సాధారణ ఫిలమెంట్ బల్బులు కేవలం రూ. 10-రూ. 15 మధ్య లభిస్తాయి. అదే ఎల్ఈడీ బల్బు ధర రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. దీంతో వినియోగదారులు సాధారణ బల్బుల వైపే మొగ్గు చూపుతున్నారు. 60 వాట్ల సామర్థ్యం గల సాధారణ బల్బు ఇచ్చే వెలుతురును కేవలం 7 వాట్ల ఎల్ఈడీ దీపం ఇస్తుంది. అసలు సాధారణ బల్బులు కాల్చే విద్యుత్‌లో 95 శాతం కేవలం ఉష్ణం రూపంలోనే వృథా అవుతుంది. అలా ఎల్ఈడీ బల్బు విద్యుత్‌ను వృథా చేయదు. ఒక సాధారణ బల్బు స్థానంలో ఎల్ఈడీని వినియోగిస్తే ఏటా రూ.160 నుంచి రూ.400 వరకు పొదుపు చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఎల్ఈడీల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 100 నగరాల్లో ‘డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం(డీఈఎల్పీ)’ను అమలు చేస్తోంది. రూ.200 నుంచి రూ.350 విలువ చేసే ఎల్ఈడీలను ఈ కార్యక్రమం కింద రూ. 95 నుంచి రూ. 105కే వినియోగదారులకు అందజేస్తున్నారు. అందులోనూ తొలుత రూ.10 చెల్లించగానే ఒక ఎల్ఈడీ బల్బును అందజేసి... మిగతా సొమ్మును పలు వాయిదాల్లో విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేస్తారు. ఈ తరహాలో నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా గృహాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీలను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పంపు.. నాణ్యత పెంపు! రాష్ట్ర వ్యవసాయ రంగం 2014-15లో 12,000 మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వినియోగించగా... ప్రభుత్వం, డిస్కంలపై రూ. 3,664 కోట్ల సబ్సిడీ భారం పడింది. అయితే రైతులు వినియోగిస్తున్న నాసిరకం పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను అమర్చితే 25 నుంచి 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 19.4 లక్షల నాసిరకం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను ఏర్పాటు చేసేందుకు ఇంధన పొదుపు సేవల సంస్థ (ఈఈఎస్ఎల్) ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ. 3,880 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ పంపుసెట్ల మార్పిడితో ఏటా 3,841 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఆదా కానుంది. ప్రభుత్వానికి ఏటా రూ. 1,488 కోట్ల సబ్సిడీ భారం తగ్గనుంది. సాగుకు సౌర పంపు సెట్లు రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 80 వేల సోలార్ పంపు సెట్లను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నారు. 2015-16 నుంచి 2018-19 వరకు ప్రతి ఏటా 20 వేల పంపు సెట్ల చొప్పున మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీధుల్లో ఎల్ఈడీ వెలుగులు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని వీధి దీపాలకు ఏటా 1,001 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. దీనికి ఏటా రూ. 309 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తుండగా... ఆ వీధిదీపాల నిర్వహణ కోసం మరో రూ.363 కోట్లదాకా వెచ్చించాల్సి వస్తోంది. ఈ సాంప్రదాయ వీధిదీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చితే.. 50-55 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. వచ్చే ఐదేళ్లలో వీధిదీపాలన్నింటినీ ఎల్ఈడీలను అమర్చేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ రూ.720 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం అమలు తీరు ఇలా ఉండనుంది. -
ఒంట్లో వేడికి ఇంట్లో బల్బు వెలుగుతుంది!
రేపటికి ముందడుగు లైటు వెలగాలంటే... కరెంటు కావాల్సిందే. ఫొటోలో ఉన్న లూమెన్ ఫ్లాష్లైట్కు మాత్రం అవసరం లేదు. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. మీ శరీర ఉష్ణోగ్రతనే ఇంధనంగా మార్చుకుని వెలుగులిచ్చే ఫ్లాష్‌లైట్ ఇది. ఇందుకోసం దీంట్లో చిన్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్‌ను ఉపయోగించారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఫ్లాష్లైట్పై వేలు ఉంచితేచాలు.. 5 మిల్లీమీటర్ల పొడవున్న ఎల్ఈడీ బల్బు వెలగడం మొదలవుతుంది. శరీరం వేడికి, పరిసరాల్లోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ దాదాపు మూడు వోల్టుల స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 15 మిల్లీఆంపియర్స్ విద్యుత్తుతో బల్బు వెలుగుతుందన్నమాట. మిగిలిపోయే కొంత విద్యుత్తును నిల్వ చేసుకునేందకు దీంట్లో ఓ సూపర్ కెపాసిటర్ కూడా ఉంది. వెలుతురు విషయంలో సాధారణ బ్యాటరీలతో పనిచేసే ఫ్లాష్లైట్లకు సరితూగకపోయినా చీకట్లో దారి వెతుక్కునేందుకు, విపత్కర పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు ఈ ఫ్లాష్‌లైట్ ఆవిష్కర్త రాస్ట్. కలుపును నలిపేస్తుంది వ్యవసాయంలో టెక్నాలజీ గురించి మనం తరచూ వింటూంటాం. శాటిలైట్ ఇమేజరీ, జీపీఎస్ ఆటోమేషన్, ఫార్మింగ్ డ్రోన్స్ వంటి ఎన్నో గాడ్జెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరనుంది ‘బోనీరోబో’. కలుపుమొక్కల్ని ఏరిపారేసి క్రిమి, కీటకనాశినుల వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగే ఈ యంత్రాన్ని జర్మన్ సంస్థ బాష్‌కు చెందిన డీప్ఫీల్డ్ రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ రోబో ఇటీవలే ఈయూ రోబోటిక్స్ పోటీలో విజయం సాధించింది కూడా. ఆధునిక సెన్సర్లు, అల్గారిథమ్స్, ఉపగ్రహాల్లో ఉపయోగించే లిడార్ టెక్నాలజీల సాయంతో ఇది పంటకు, కలుపు మొక్కలకు ఉన్న తేడాలను ఇట్టే గుర్తుపడుతుంది. మొక్కల ఆకుల ఆకారం, రంగు వంటి అంశాలన్నీ పరిగణించిన తరువాత కలుపుమొక్కలను చిన్న ఇనుప కడ్డీ సాయంతో అక్కడికక్కడే భూమిలోకి పాతేసి నాశనం చేసేస్తుంది. వేర్వేరు పంటల వివరాలను నమోదు చేయడం ద్వారా దీన్ని అన్ని రకాల పంటల్లోనూ వాడుకోవచ్చునని అంచనా. ఇవే అంశాల ఆధారంగా భవిష్యత్తులో బోనీరోబో మెరుగైన వంగడాల అభివృద్ధిలోనూ సాయపడుతుందని డీప్ఫీల్డ్ రోబోటిక్స్ సీఈవో ప్రొఫెసర్ అమోస్ ఆల్బర్ట్ అంటున్నారు. మీ గురకను దిండు కింద దాచేయచ్చు మీరు నిద్దట్లో జోరుగా గురకపెడతారా? మీ సౌండుకు చుట్టుపక్కల వాళ్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారా? ఎన్ని రకాల చిట్కాలు వాడినా మీ గురక తగ్గడం లేదా? అయితే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నది... మీ గురకకు చెక్ పెట్టే హైటెక్ గాడ్జెట్ మరి! కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ ‘నోరా’ నిజానికి ఓ మైక్? ఈ గాడ్జెట్తోపాటు వచ్చే వైర్లెస్ ప్యాడ్‌ను మీ దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలు.. మీరు గురకపెట్టినప్పుడల్లా నోరా దాన్ని గ్రహించి మంచం పక్కనే పెట్టుకునే ఓ పంప్‌కు సిగ్నల్ పంపుతుంది. పంపుకు కనెక్ట్ అయి ఉండే ప్యాడ్‌లోకి గాలి చేరి కొంచెం ఎత్తుగా మారుతుంది. దీంతో మీ తల పొజిషన్ మారిపోయి గురక కూడా ఆగిపోతుందన్నమాట. ఇదంతా మీ సుఖనిద్రకు భంగం కలగకుండానే జరిగిపోతుంది. స్మార్ట్ నోరా ఇన్కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వివరాలకు... http://www.smartnora.com/ వెబ్సైట్ చూడండి. కంటికి దీపం... ఎల్సీడీ! వయసుతోపాటు కంటిచూపు మందగించడం సహజం. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూంటాం. ఇంకొన్నేళ్లలో వీటి అవసరం ఉండదంటున్నారు దేవేశ్ మిస్త్రీ. కంటిలోపలి సహజ లెన్స్ స్థానంలో ఎల్సీడీ టీవీ తెరను పోలిన వాటిని ఉపయోగిస్తే వృద్ధాప్యంలో వచ్చే చత్వారాన్ని అధిగమించవచ్చునని అంటున్నాడు ఈ లీడ్స్ యూనివర్శిటీ యువ శాస్త్రవేత్త. వయసుతోపాటే మన లెన్స్ పెళుసుగా మారిపోతాయి. దీంతో కళ్ల కండరాలు దృష్టి కేంద్రీకరించేందుకు చేసే సంకోచ, వ్యాకోచాలకు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా వస్తువులను కంటికి దగ్గరగా తెచ్చుకుంటేగానీ చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎల్సీడీ తెరల్లో ఉపయోగించే లిక్విడ్ క్రిస్టల్స్ ద్వారా అధిగమించవచ్చునని దేవేశ్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. కంటి కండరాల కదలికలకు తగ్గట్టుగా ఈ లిక్విడ్ క్రిస్టల్స్ తమ ఆకారాన్ని మార్చుకుంటూ వస్తువులను చూసేందుకు అవసరమైన ఫోకస్‌ను అందిస్తాయన్నమాట. -
రూ. 44కే ఎల్ఈడీ బల్బు!
న్యూఢిల్లీ: ఎల్ఈడీ బల్బును రూ. 44కే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో సుమారు రూ. 300 గా ఉన్న ఎల్ఈడీ బల్బును డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డెల్ప్) పథకం కింద రూ. 44కే విక్రయించి.. ప్రజలు సామర్థ్యం లేని నాసిరకం బల్బులను వినియోగించకుండా చేయాలన్నది యోచన. ఈ బల్బులను వేలంలో భారీగా కొనడం ఒక్కో బల్బును రూ. 44 కే విక్రయించాలని యోచిస్తున్నట్లు విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బల్పుల ధర ఒక్కోటి రూ. 275-300గా ఉందన్నారు. వేలంలో దీని ధర రూ. 74 వరకు వచ్చిందని తెలిపారు. దీన్ని మరింత తగ్గించాలని యోచిస్తున్నామన్నారు. డెల్ప్ కింద ఎల్ఈడీ బల్బులను తీసుకొన్న వినియోగదారులు నెలవారీగానూ సొమ్ము చెల్లించవచ్చన్నారు. ఎల్ఈడీ బల్బుల వాడకం పెరిగితే విద్యుత్ వినియోగంలో 50 నుంచి 90 శాతం ఆదా అవుతుందన్నారు. -
విద్యుత్ ఆదాపై మున్సిపల్‌శాఖ కసరత్తు
టవర్‌సర్కిల్ : మున్సిపాలిటీలకు గుదిబండగా మారుతున్న విద్యు త్ చార్జీల మోత తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. విద్యుత్ కొరతను సైతం దృష్టి లో ఉంచుకుని తక్కువ విద్యుత్ తో వెలిగే ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇందులో జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీ ఉన్నాయి. ఎంపికైన మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ బల్బులను అమర్చి విద్యుత్ ఆదాను పర్యవేక్షించనున్నారు. 50 శాతానికి పైగా విద్యుత్ చార్జీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం చేసిన సూచనలతో అధికారులు పైలట్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టారు. ఆయా మున్సిపాలిటీలోని ఒక ఏరియాను ఎన్నుకుని 150 నుంచి 200 స్ట్రీట్ లైట్లకు ఎల్ఈడీ బల్బులను బిగించి, విద్యుత్ మీటరు అమర్చి విద్యుత్ ఆదా ను పరీక్షించనున్నారు. గతంలో ఉన్న ఎస్వీ, ట్యూబ్‌లైట్లకు బదులు ఏర్పాటు చేసే ఈ ఎల్ఈడీలతో 50 శాతం పైగా విద్యుత్ ఆదా అవుతుందని, వెలుతురు కూడా పా త బల్బులకు సమానంగా పొందవచ్చని ప్రభుత్వం చె బుతోంది. మొదటి దఫాలో ఏర్పాటు చేసే ఎల్ఈడీ బల్బులను మున్సిపాలిటీలపై ఎలాంటి భారం లేకుం డా ప్రభుత్వమే సరఫరా చేయనుంది. విద్యుత్ ఆదాలో విజయవంతమైతే దశలవారీగా అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చుతారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో ఈ నెల 9న హైదరాబాద్‌లోని సీడీఎంఏ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించనున్నా రు. ఏడాది కాలానికి సంబంధించిన వీధిదీపాల బిల్లులతో హాజరుకావాలని సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వీధిదీపాలుగా ఎల్ఈడీ బల్బులు!
సాక్షి, ముంబై: సీసీటీవీ కెమెరాల పనితీరుపై వీధిదీపాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో వాటిని మార్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. నగర రహదారులపై ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఏకంగా వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) మార్చాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై బీఎంసీ మహాసభలో చర్చలు జరిగాయి. అన్ని పార్టీల కార్పొరేటర్ల నుంచి ఆమోదం లభించడంతో వీధి దీపాల తొలగింపునకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రహదారులపై పసుపు రంగులో వె లిగే వీధి దీపాలు ఉన్నాయి. ఈ వెలుగులో సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వీటి స్థానంలో తెల్లగా వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులు బిగించాలని బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2008 నవంబర్ 26న ఉగ్రవాదుల దాడుల సంఘటన అనంతరం నగర రహదారులపై, జంక్షన్ల వద్ద ఆరు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని ఐదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు వేలకు బదులుగా కేవలం రెండున్నర వేల కె మెరాలు కీలకమైన జంక్షన్లు, రహదారులపై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాని అందులో రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో పసుపు రంగు వెలుగునిచ్చే స్ట్రీట్ లైట్ల కారణంగా ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదని తేలింది. రాత్రి వేళల్లో దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి సంఘటనల్లో నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఎల్ఈడీ దీపాలు అమర్చాలని నిర్ణయించారు. అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. త్వరలో టెండర్లను ఆహ్వానించి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు శివసేన నాయకురాలు శీతల్ మాత్రే చెప్పారు.