ఒంట్లో వేడికి ఇంట్లో బల్బు వెలుగుతుంది!
రేపటికి ముందడుగు
లైటు వెలగాలంటే... కరెంటు కావాల్సిందే. ఫొటోలో ఉన్న లూమెన్ ఫ్లాష్‌లైట్‌కు మాత్రం అవసరం లేదు. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. మీ శరీర ఉష్ణోగ్రతనే ఇంధనంగా మార్చుకుని వెలుగులిచ్చే ఫ్లాష్‌లైట్ ఇది. ఇందుకోసం దీంట్లో చిన్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్‌ను ఉపయోగించారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఫ్లాష్‌లైట్‌పై వేలు ఉంచితేచాలు.. 5 మిల్లీమీటర్ల పొడవున్న ఎల్‌ఈడీ బల్బు వెలగడం మొదలవుతుంది. శరీరం వేడికి, పరిసరాల్లోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ దాదాపు మూడు వోల్టుల స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
దాదాపు 15 మిల్లీఆంపియర్స్ విద్యుత్తుతో బల్బు వెలుగుతుందన్నమాట. మిగిలిపోయే కొంత విద్యుత్తును నిల్వ చేసుకునేందకు దీంట్లో ఓ సూపర్ కెపాసిటర్ కూడా ఉంది. వెలుతురు విషయంలో సాధారణ బ్యాటరీలతో పనిచేసే ఫ్లాష్‌లైట్లకు సరితూగకపోయినా చీకట్లో దారి వెతుక్కునేందుకు, విపత్కర పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు ఈ ఫ్లాష్‌లైట్ ఆవిష్కర్త రాస్ట్.
కలుపును నలిపేస్తుంది
వ్యవసాయంలో టెక్నాలజీ గురించి మనం తరచూ వింటూంటాం. శాటిలైట్ ఇమేజరీ, జీపీఎస్ ఆటోమేషన్, ఫార్మింగ్ డ్రోన్స్ వంటి ఎన్నో గాడ్జెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరనుంది ‘బోనీరోబో’. కలుపుమొక్కల్ని ఏరిపారేసి క్రిమి, కీటకనాశినుల వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగే ఈ యంత్రాన్ని జర్మన్ సంస్థ బాష్‌కు చెందిన డీప్‌ఫీల్డ్ రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది.
జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ రోబో ఇటీవలే ఈయూ రోబోటిక్స్ పోటీలో విజయం సాధించింది కూడా. ఆధునిక సెన్సర్లు, అల్గారిథమ్స్, ఉపగ్రహాల్లో ఉపయోగించే లిడార్ టెక్నాలజీల సాయంతో ఇది పంటకు, కలుపు మొక్కలకు ఉన్న తేడాలను ఇట్టే గుర్తుపడుతుంది. మొక్కల ఆకుల ఆకారం, రంగు వంటి అంశాలన్నీ పరిగణించిన తరువాత కలుపుమొక్కలను చిన్న ఇనుప కడ్డీ సాయంతో అక్కడికక్కడే భూమిలోకి పాతేసి నాశనం చేసేస్తుంది. వేర్వేరు పంటల వివరాలను నమోదు చేయడం ద్వారా దీన్ని అన్ని రకాల పంటల్లోనూ వాడుకోవచ్చునని అంచనా. ఇవే అంశాల ఆధారంగా భవిష్యత్తులో బోనీరోబో మెరుగైన వంగడాల అభివృద్ధిలోనూ సాయపడుతుందని డీప్‌ఫీల్డ్ రోబోటిక్స్ సీఈవో ప్రొఫెసర్ అమోస్ ఆల్బర్ట్ అంటున్నారు.
మీ గురకను దిండు కింద దాచేయచ్చు
మీరు నిద్దట్లో జోరుగా గురకపెడతారా? మీ సౌండుకు చుట్టుపక్కల వాళ్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారా? ఎన్ని రకాల చిట్కాలు వాడినా మీ గురక తగ్గడం లేదా? అయితే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నది... మీ గురకకు చెక్ పెట్టే హైటెక్ గాడ్జెట్ మరి! కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ ‘నోరా’ నిజానికి ఓ మైక్? ఈ గాడ్జెట్‌తోపాటు వచ్చే వైర్‌లెస్ ప్యాడ్‌ను మీ దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలు.. మీరు గురకపెట్టినప్పుడల్లా నోరా దాన్ని గ్రహించి మంచం పక్కనే పెట్టుకునే ఓ పంప్‌కు సిగ్నల్ పంపుతుంది.
పంపుకు కనెక్ట్ అయి ఉండే ప్యాడ్‌లోకి గాలి చేరి కొంచెం ఎత్తుగా మారుతుంది. దీంతో మీ తల పొజిషన్ మారిపోయి గురక కూడా ఆగిపోతుందన్నమాట. ఇదంతా మీ సుఖనిద్రకు భంగం కలగకుండానే జరిగిపోతుంది. స్మార్ట్ నోరా ఇన్‌కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. వివరాలకు... http://www.smartnora.com/ వెబ్‌సైట్ చూడండి.
కంటికి దీపం... ఎల్‌సీడీ!
వయసుతోపాటు కంటిచూపు మందగించడం సహజం. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూంటాం. ఇంకొన్నేళ్లలో వీటి అవసరం ఉండదంటున్నారు దేవేశ్ మిస్త్రీ. కంటిలోపలి సహజ లెన్స్ స్థానంలో ఎల్‌సీడీ టీవీ తెరను పోలిన వాటిని ఉపయోగిస్తే వృద్ధాప్యంలో వచ్చే చత్వారాన్ని అధిగమించవచ్చునని అంటున్నాడు ఈ లీడ్స్ యూనివర్శిటీ యువ శాస్త్రవేత్త. వయసుతోపాటే మన లెన్స్ పెళుసుగా మారిపోతాయి.
దీంతో కళ్ల కండరాలు దృష్టి కేంద్రీకరించేందుకు చేసే సంకోచ, వ్యాకోచాలకు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా వస్తువులను కంటికి దగ్గరగా తెచ్చుకుంటేగానీ చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎల్‌సీడీ తెరల్లో ఉపయోగించే లిక్విడ్ క్రిస్టల్స్ ద్వారా అధిగమించవచ్చునని దేవేశ్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. కంటి కండరాల కదలికలకు తగ్గట్టుగా ఈ లిక్విడ్ క్రిస్టల్స్ తమ ఆకారాన్ని మార్చుకుంటూ వస్తువులను చూసేందుకు అవసరమైన ఫోకస్‌ను అందిస్తాయన్నమాట.