snoring
-
గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే!
గురక సమస్యను చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారుగానీ, నిజానికి ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. గురకపెట్టేవారికి దాని ఇబ్బందులు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పక్కనున్న వారికి అదో పెద్ద సమస్య. అసలు అంతపెద్దగా గురక పెడుతున్నామనేది కూడావారికి తెలియదు. వినేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది గురక శబ్దం ఎంత బిగ్గరగా ఉందో. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక ఇచ్చే వార్నింగ్ బెల్స్ ఏంటి? తెలుసుకుందాం. నోటితోగాలి పీల్చుకోవడం, శ్వాసలో ఇబ్బంది ద్వారా నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్ధం.కొంత మందికి ఈ శబ్దం చిన్నగా గురక వస్తే మరి కొంత మందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువగాఅలసిపోయినపుడు, అలర్జీలు, మద్యం సేవించడం, స్థూలకాయం ఉన్నవాళ్లకి గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే ఈ గురక రోజూ వస్తోంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. దీర్ఘకాలిక గురక స్లీప్ అప్నియా కు దారి తీస్తుంది. ఈ స్లీప్ అప్నియా రెండు రకాలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): గొంతు కండరాలు రిలాక్స్ అవుతూ ఊపిరితిత్తులలోకి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది పెద్ద వయసువారిలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో చాలా కామన్. అలాగే టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ సమస్య ఉన్న పిల్లలోలనూ , ఊబకాయం, మద్యం, ధూమపానం అలవాటు, మత్తుమందులు లేదా ట్రాంక్విలైజర్లనువాడేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు ,టైప్ 2 మధుమేహం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల రుగ్మతలు, ముందస్తు స్ట్రోక్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA), ఇది శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు సంభవిస్తుంది. పెద్ద,మధ్య వయస్కులు , వృద్ధులకు సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సెంట్రల్ స్లీప్ అప్నియా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె లోపాలు. రక్తప్రసరణ గుండె ఆగిపోయేప్రమాదాన్ని పెంచుతుంది.నార్కోటిక్ నొప్పి మందులను, ఓపియాయిడ్ ముఖ్యంగా మెథడోన్ వంటి దీర్ఘం కాలం తీసుకుంటే సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి. గురక సమస్యలు: సాధారణంగా గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతీరును కూడా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. గురకతో మధ్యలో లేవడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతోపగటి పూట బద్ధకంగా, నిస్తేజంగా ఉండటమే కాదు, నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. నోట్. ఇది అవగాహనకు సంబంధించిన సమాచారం మాత్రమే. గురక సమస్యగా ఎక్కువగా బాధిస్తోంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊబకాయులైతే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ యోగా ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు అన్నీఇన్నీ కావు! ఒక్కోసారి..
నిద్రలో కొంతమందికి గురక వస్తుంది. గురక మంచి నిద్రకు సూచన అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. నిద్రలో అన్ని కండరాల్లాగే గొంతు కండరాలూ రిలాక్స్ అవుతాయి. దాంతో ఊపిరితిత్తులకు వెళ్లే నాళం ముడుచుకుపోయినట్లుగా (ఫ్లాపీగా) అవుతాయి. అందులోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ... అందులో ప్రకంపనలు కలిగి, గురక వస్తుంది. ఇలా గురక వస్తూ వాయునాళంలోంచి పది సెకండ్లకు పైగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకపోతే... ఆ కండిషన్‌ను ‘ఆప్నియా’ అంటారు. అప్పుడు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరుగుతాయి.. దాంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక, రాత్రిళ్లు నాణ్యమైన నిద్రలేక, పగలంతా జోగుతూ ఉంటారు. ఫలితంగా రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లలో చక్కెరలు నియంత్రణలో ఉండకపోవడం, పక్షవాతం, ఆస్తమా, సీవోపీడీ జబ్బు ఉన్నవాళ్లలో వాటి తీవ్రత పెరగడం, గుండెజబ్బులు రావడం వంటి సమస్యలూ వస్తాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలూ మరణానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు. ఆప్నియాను నివారణకు పాటించాల్సిన సూచనలివి... మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. అలవాటు మానేయలేకపోతే... నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే ఇలా మానకపోవడం చాలామందిలో ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయడమే మంచిది. (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా.. ) ∙ -
గురక ఇబ్బంది పెడుతోందా!..వెంటనే తగ్గిపోవాలంటే..
గురక చాలామందికి ఓ పీడలా వెంటాడుతుంది. అంత తేలిగ్గా అది వదలదు. లావుగా ఉండటం వల్ల గురక వస్తుందనుకుంటారు గానీ సన్నగా ఉన్నా కూడ కొందరికి గురక వస్తుంది. దీని వల్ల మీకే గాక మీతో పాటు పడుకునేవాళ్లు కూడా ఇబ్బంది పడ్తుంటారు. గురక అనేది మనకు తెలియకుండా నిద్రలో వచ్చేది. కంట్రోల్ చేయడం అసాధ్యం. అలాంటి ఈ గురకను ఎలా నివారించాలంటే?.. గురక వ్యాధి కాదు. శ్వాస సంబంధ సమస్యల వల్ల వస్తుంది. ఇది తగ్గాలంటే ఈ కింది చిట్కాలు పాటించండి గురక రాకూడదంటే.. తేనెతో ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లలో చికిత్స చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ తేనె నాసికా రంధ్రాలను క్లియర్‌గా తెరుస్తుంది. గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. పైగా దీనిలో యాంటి మైక్రోబయల్స్ ఉంటాయి. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడూ తేనెను సేవించినా లేదా పాలల్లో కలిపి తీసుకుని తాగిన చక్కటి ఫలితం ఉంటుంది. పుదీనా దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఈ ఆకుల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముక్కు, గొంతు లోపల మంటను తగ్గిస్తాయి. పడుకునే ముందు పిప్పరమెంటు టీ తాగడం లేదా కొన్ని ఆకులను వేడి నీటిలో వేసి తీసుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా హాయిగా నిద్రపోతారు. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు ఖాళీ కడుపున వెల్లుల్లిని తినమని సలహ ఇస్తారు. రాత్రిపూట పచ్చి వెల్లుల్లి తింటే గుక వెంటనే తగ్గుతుంది. ఉల్లి లేని కూర, వంటిల్లు ఉండదు. ప్రతి రోజు రాత్రి ఉల్లిపాయను మీ ఆహారంలో చేర్చి చూడండి గురక అస్సలు రాదు. ఈ చిట్కాలను పాటించి గురక సమస్య నుంచి త్వరగా బయటపడండి. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
గురుక పెట్టి హాయిగా నిద్రపోతున్నారా?.. అంతకు మించి సమస్యలు
‘చెవిచిల్లు పెట్టే నీ గురక... చిందరవందర అయింది నా పడక’ అని నిద్రలో గురక పెట్టే వాళ్లపైన చుట్టుపక్కలవాళ్లు గింజుకుంటారు. అయితే నిద్రలో గురకపెట్టేవారికి అంతకు మించిన సమస్యలే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. ఎవరైనా మంచం మీద ఇలా వాలి అలా గుర్రుపెట్టారంటే హాయిగా నిద్రపోతున్నారనుకుంటాం. అయితే గురకపెడుతూ నిద్రపోవడం హాయిగా భావించడం సరికాదని, దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురక తెచ్చిపెట్టే సమస్యలపై మన దేశంలో అవగాహన అత్యల్ప స్థాయిలో ఉందని వారంటున్నారు సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చేసిన రెస్‌మెడ్–2023 గ్లోబల్ స్లీప్ సర్వేలో 58 శాతం మంది భారతీయులు గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్టు తేలడం నిద్ర ఆరోగ్యంపై వారి అవగాహన లేమిని తేల్చింది. 2022తో పోలిస్తే 2023లో మన వాళ్ల నిద్ర నాణ్యత 22 శాతం క్షీణించినా సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది తమ నిద్ర నాణ్యత బాగుందన్నారని సర్వే వెల్లడించింది. మూడ్ మార్పులు, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం ఉన్న 20 శాతం మంది మాత్రమే వైద్యుడ్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారని తేల్చింది. గురక.. అనారోగ్య కారణమే... అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ‘న్యూరాలజీ ఆన్లైన్’సంచికలోప్రచురించిన అధ్యయనం ప్రకారం..గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 91 శాతం ఎక్కువ. అంతేకాదు గురకపెట్టేవారిలో దాదాపు 20–25 శాతం మంది గురక.. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఒఎస్ఎ)తో బాధపడుతూ ఉండవచ్చునని మరో అధ్యయనం తేల్చింది. గురకపెట్టే వారిలో ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా రోగి అని వైద్యులు అంటున్నారు. పెరుగుతున్నబాధితులు గురక–స్లీప్ అప్నియాతో బాధపడుతున్న చాలా మందికి దాని తీవ్రమైన పరిణామాల గురించి తెలియదని ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ అంటున్నారు. ‘40 శాతం మంది వ్యక్తులు గురక పెట్టినట్లయితే, వారిలో 10 శాతం మందికి స్లీప్ అప్నియా ఉన్నట్టే’అని దేశంలో తొలి స్లీప్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ జేసీ సూరి అన్నారు. తాను స్లీప్ ల్యాబ్ ప్రారంభించినప్పుడు నెలకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని అందులో మధ్య వయసు్కలు, వృద్ధుల సంఖ్య దాదాపు 15–20 శాతంగా ఉందన్నారు. ‘స్లీప్ అప్నియా ద్వారా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. బాల్యంలోనే... నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఇటీవలి అధ్యయనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది పిల్లలు గురక, నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్నారుల్లో గురకకు చికిత్స చేయకపోతే మానసిక వికాసం, మేధో సామర్థ్యాలు దెబ్బతింటాయని, శారీరక చురుకుదనంపై కూడా ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక లక్షణాలున్న కేసుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలకు స్లీప్ అప్నియా ఉన్నట్టు, 15 నుంచి 20 శాతం మంది పాఠశాల పిల్లలు ఊబకాయంతో ఉన్నారని వీరిలో అత్యధికులు గురకతో బాధపడేవారేనని ఏఐజీ అధ్యయనంలో తేలింది, నిద్ర పోకుండా పిల్లలు ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం అధిక చురుకుదనం లక్షణంగా తల్లిదండ్రుల భావిస్తే అది అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్లీప్ అప్నియాలక్షణాలివే.. నిద్రలో కండరాలు సడలించడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆక్సిజన్ అందక అది నాణ్యమైన శ్వాసక్రియకు, నిద్రకు తీవ్రమైన అంతరాయం కలిగించే పరిస్థితే స్లీప్ అప్నియా. గురక ముదిరి స్లీప్ అప్నియాకు దారి తీస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. మెడ చుట్టుకొలత తగినంత లేకపోవడం, ఎగువవైపునకు గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారడం స్లీప్ అప్నియాకు దోహదం చేస్తుంది. ఉదాహరణకు, పిల్లలలో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ కూడా స్లీప్ అప్నియాకు కారణం కావచ్చు. స్లీప్ అప్నియా ముదురుతున్న దశలో వ్యక్తి సురక్షితంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అధికంగా నిద్రపోవడం ఏకాగ్రత లోపాలకు దారితీస్తుంది. ‘స్లీప్ అప్నియా చికిత్సలో భాగంగా బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ బాగా తగ్గించడం, తీరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి తీవ్రమైతే రోగులకు మాస్క్ ద్వారా గాలిని అందించే వైద్య పరికరం, కొన్ని సందర్భాల్లో, అడ్డంకిని సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. పిల్లలకు మరింత చేటు... తీవ్ర గురకతో బాధపడుతున్న పిల్లల్లో చురుకుదనం, శ్రద్ధ లోపిస్తాయి. చిరుతిళ్లు అధికంగా తినడం, చిరాకు, తరచుగా అలసట ఉంటాయి. గురక, నోటితో శ్వాస తీసుకోవడం, రాత్రి పూట చెమట పట్టడం వంటివి పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. –ఆర్.దీప్తి, చీఫ్ పీడియాట్రిషియన్,అమోర్ హాస్పిటల్స్ -
ఈ దిండుతో గురకకు చెప్పండి గుడ్ బై.. ఇది చాలా స్మార్ట్ గురూ!
ఈ దిండు గురక నివారిణి. దీని మీద తలపెట్టుకుని ఆదమరచి నిద్రించినట్లయితే, గురక బెడద ఉండదు. నిద్రలో అటూ ఇటూ కదిలేటప్పుడు తల ఎటు తిరిగితే అటువైపు ఈ దిండు తనంతట తనే సర్దుకుంటుంది కూడా! అమెరికన్ కంపెనీ ‘ప్యూర్–లెక్స్’ తయారు చేసిన ఈ దిండు ఆషామాషీ దిండు కాదు, చాలా స్మార్ట్ తలదిండు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు నిద్రిస్తున్న వ్యక్తి తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి. (ఇదీ చదవండి: బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?) గురక మొదలయ్యేట్లు ఉంటే, గురక నివారించేందుకు వీలుగా ఒకవైపు ఎత్తు పెరగడం, ఒక వైపు ఎత్తు కుదించుకోవడం చేస్తుంది. నిద్రిస్తున్న వ్యక్తి తల సౌకర్యవంతంగా ఉండేలా సర్దుకుంటుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ దిండు చక్కని పరిష్కారం. దీని ధర 134 డాలర్లు (రూ.11,027). -
పీసీఓఎస్‌తో నిద్రాభంగాలు ఎందుకంటే...
అండాశయాల్లో నీటితిత్తులు కనిపించే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న కొందరు మహిళల్లో రాత్రివేళల్లో నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. అంటే... కొందరిలో రాత్రి నిద్రపట్టకపోవడం (ఇన్సామ్నియా), గురకవస్తూ... దాంతో మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం (స్లీప్ ఆప్నియా)తో నిద్రాభంగం అవుతుండటం, కాళ్లు విపరీతంగా కదిలించే ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’తో నిద్రనుంచి లేచి, ఆపై ఎంతకూ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. పీసీఓఎస్ ఉండి, ఇలాంటి నిద్ర సంబంధిత సమస్యలు కనిపించే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అండాశయాల్లో నీటితిత్తులకు హార్మోన్ల అసమతౌల్యతే ప్రధాన కారణం. అంటే కొన్ని హార్మోన్ల స్రావాల్లో హెచ్చు తగ్గులు, ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా ఉండే యాండ్రోజెన్ వంటి హార్మోన్ల మోతాదులు పెరగడం వంటి అంశాలు అసమతౌల్యతకు దారితీస్తాయి. ఈ అసమతౌల్యతే నిద్రా సమస్యలకూ కారణమవుతుంది. ఆహార అలవాట్లతో అధిగమించడం ఇలా... కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచడం వల్ల స్లీప్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. అవి... ఎక్కువగా చక్కెరలను వెలువరించే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకుంటూ... అదే సమయంలో అతి తక్కువగా చక్కెరను వెలువరించే (లో–గ్లైసీమిక్ ఇండెక్స్) ఆహారాలను తీసుకోవడం. (అంటే ఉదాహరణకు వరిలాంటి ఎక్కువ చక్కెరలను వెలువరించే ఆహారాలు కాకుండా కొర్రలు, రాగుల వంటి చిరుధాన్యాలను తీసుకోవడం, అతిగా పాలిష్ చేయనివీ, పొట్టుతో ఉండే ధాన్యాలనే తీసుకోవడం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో పాటు కొవ్వులు తక్కువగా ఉండి, ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే చిక్కుళ్ల వంటి ఆహారాలను తీసుకోవడం. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానియాలకు దూరంగా ఉండటం. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే బాదం వంటి నట్స్, ఎండుఫలాలను ఎక్కువగా తీసుకోవడం. వేట మాంసాన్ని చాలా పరిమితంగా తీసుకుంటూ, వైట్ మీట్ (చేపలను) ఎక్కువగా తీసుకోవడంతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలితో... క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే (ధ్యానం, యోగా వంటి)టెక్నిక్స్‌తో, బరువును నియంత్రిస్తూ స్థూలకాయం రాకుండా చూసుకోవడం, రోజుకు కనీసం 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవడం వంటి చర్యలతో పీసీఓఎస్‌ను చాలావరకు నివారించవచ్చు. దాంతో నిద్రసమస్యలతో పాటు, ఇతరత్రా అనేక సమస్యలూ నివారితమై, మహిళల ఆరోగ్యం అన్ని విధాలా మెరుగుపడుతుంది. డాక్టర్ ఎమ్ రజనీ సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు) -
గురక ప్రమాదమా ..? రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ..
-
Health Tips: ఆయాసంతో బాధపడుతున్నారా? ఇలా చేశారంటే..
Health Tips: ఆయాసం ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. ►రెండు చిటికల పసుపు, చిటికడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. ►వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి తాగడం చాలా మంచిది. ►ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది. ►అదే విధంగా లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది. ►అయితే మినుములు, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు. అయితే, శరీర ధర్మాలను బట్టే వీటిని అనుసరిస్తే మేలు. గురక తగ్గాలంటే.. ►నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ►ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు. ►అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది. పాలకూర తరచూ తింటే.. ►పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. ►పాలకూర తరచు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. ►దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ►జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
అదిరిపోయే డివైజ్, పడుకున్న ఐదు నిముషాలకే గురక పెడుతున్నారా?
నిద్రలో గురక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. గురక పెట్టే వారి కంటే, వారితో కలసి ఒకే గదిలో పడుకునేవారికి మరింత సమస్య. చాలామంది గురక నివారణ కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. వాటి ఫలితం అంతంత మాత్రమే! జీవితాంతం గురకతో బాధపడాల్సిందేనా అని బెంగపడే వారి కోసం తాజా సాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి కెటిల్‌లా ఉంది, దీనితో గురక నివారణేమిటా అనుకుంటున్నారా? నిజమే! ఇది ఎలక్ట్రిక్ కెటిలే! అయితే, కాఫీ, టీలు కాచుకునే కెటిల్ కాదిది. గురక బాధితుల శ్వాసవ్యాయామాల కోసం ఫిన్లాండ్లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కెటిల్ ఇది. ‘వెల్ ఓ2’ పేరుతో రూపొందించిన ఈ కెటిల్ వెలుపలి వైపు ఉండే గొట్టం ద్వారా ఒక్కో విడతకు 10–15 సెకన్ల సేపు గాలి ఊదుతూ వ్యాయామం చేసినట్లయితే, మెడ, ఛాతీ కండరాలు బలపడి గురక బాధ శాశ్వతంగా తప్పుతుందని చెబుతున్నారు. దీని ధర 244.80 డాలర్లు (రూ.19,250) మాత్రమే! -
Snoring: గురక పెట్టేవారు నిద్రపోయేప్పుడు దీన్ని ముక్కురంధ్రాలకు పెట్టుకుంటే..
Electronic Anti Snoring Device: ప్రపంచంలోనే విచిత్రమైన ఆరోగ్య సమస్య గురక. ఆ శబ్దంతో ఇంటిల్లిపాదీ జాగారం చేస్తున్నా గురక పెట్టే వారు మాత్రం హాయిగా ‘సౌండ్’ స్లీప్‌లో తరిస్తుంటారు. మరి ఆ డిస్టర్బెన్స్‌కు చెక్ పెట్టేదే.. ఈ మినీ గాడ్జెట్ (ఎలక్ట్రానిక్ యాంటీ స్నోరింగ్ డివైజ్). గురక సమస్య ఉన్న వారు నిద్రపోయేప్పుడు దీన్ని ముక్కురంధ్రాలకు పెట్టుకుంటే.. స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపించడంతో పాటు.. శ్వాసకూ ఇబ్బందిపడకుండా చేస్తుంది. దాంతో శబ్దం లేకుండా నిద్రపోతారు. ఈ పరికరంలోని యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్.. హానికరమైన వాయువులను, దుమ్ము, ధూళిని సమర్థవంతంగా అరికట్టి, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఇలాంటి మెషిన్స్ బ్యాటరీలతో నడిచేవి, చార్జింగ్ పెట్టుకునేవి రెండూ మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ చార్జింగ్ పెట్టుకునే మెషిన్ అయితే మన్నిక బాగుంటుంది. కొనే ముందు క్వాలిటీ, రివ్యూస్ చూసి కొనుగోలు చేయడం మంచిది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -ధర: 9 డాలర్లు (రూ.672) చదవండి: Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
గురకకూ... ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా?
ఇటీవల బప్పీలహరి మరణం తర్వాత స్లీప్ ఆప్నియా సమస్య గురించి చర్చ జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా’ వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ ఆప్నియా కాకపోవచ్చుగానీ... స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం... అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్లీప్ ఆప్నియా గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈసీ వినయకుమార్‌ను అడిగి తెలుసుకుందాం. ప్రశ్న : అసలు గురక ఎందుకు/ఎలా వస్తుంది? జ: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ప్రశ్న : గురకకూ, ఆప్నియాకు సంబంధమేమిటి? జ: అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి... ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. పైగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్న : గురకకూ... ఆప్నియాకూ తేడా ఏమిటి? జ: గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. అది ఆరోగ్యపరంగానే కాదు... కుటుంబ బంధాల్లో... ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు... రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి. ప్రశ్న : మంచి జీవనశైలితో మెరుగవుతుందా? జ: మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. (బప్పీ లహరి స్థూలకాయం కూడా ఆయన సమస్యకు దోహదం చేసి ఉండవచ్చు). ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకూ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. ప్రశ్న : ఏ డాక్టర్‌ను కలవాలి? ఎప్పుడు సంప్రదించాలి? జ: వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్ స్పెషలిస్టులను లేదా ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. కారణాలు / నివారణ కొన్ని అలవాట్లు ఆప్నియాకు కారణం కావడంతో పాటు, మరిన్ని దుష్ప్రభావాలు కలిగేలా చేస్తాయి. మద్యం అలవాటు వాటిలో ముఖ్యమైనది. దాంతోపాటు పొగతాగడం, స్థూలకాయం ఆప్నియాను మరింతగా తీవ్రతరం చేస్తాయి.ఈ అలవాట్లను తప్పక మానేయాలి. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ – అంటే బరువు ను ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్య) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది 27 కంటే ఎక్కువ ఉంటే స్లీప్ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. మరీ ఎక్కువ బరువు (మార్బిడ్ ఒబేసిటీ) ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లడం మంచిది. చికిత్స స్లీప్ టెస్ట్‌ల తర్వాత... తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్’ అంటే... ‘కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్–వే’ మెషిన్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స (వ్యూలో పాలటో ఫారింగోప్లాస్టీ – యూపీపీపీ) అవసరం కావచ్చు. -ఇ.సి వినయ కుమార్ సీనియర్ ఇఎన్‌టి సర్జన్ -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
గురకతో ఇబ్బందా.. చిట్టి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి!
కుంభకర్ణుడి కాలం నుంచి ఇప్పటివరకు పక్కన పడుకునేవాళ్లను దారుణంగా ఇబ్బంది పెట్టేది గురక! సాధారణంగా మనం పీల్చుకునే గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది. నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే మన గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు శ్వాస ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది కాబట్టి ఎలాంటి శబ్దమూ రాదు. రిలాక్స్ అయిన కండరాల కారణంగా ఫ్లాపీగా అయి గాలి తీసిన ట్యూబులా ఉన్న శ్వాసనాళంలోంచి గాలి ప్రయాణం చేసేప్పుడు అది తగిలిన మన అంగిలి ప్రకంపనలకు గురవుతాయి. అలా ప్రకంపనలు రేగడం వల్ల శబ్దం వస్తుంది. అదే గురక! రకాలున్నాయి.. కొన్నిసార్లు కుంచించుకుపోయిన శ్వాసనాళం అలా కాసేపు మూసుకుపోయి ఉండిపోతుంది. అలా కొద్దిసేపు మాత్రమే ఉంటే దాన్ని హైపాప్నియా అంటారు. కానీ అలా మూసుకుపోయిన స్థితి (కండిషన్) చాలాసేపు కొనసాగితే గాన్ని ‘ఆప్నియా’ అంటారు. గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. గురక ఉండటం తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితే. చాలా సందర్భాల్లో హైపాప్నియా, ఆప్నియా కండిషన్లు అంత ప్రమాదకరం కాకపోవచ్చేమోగానీ... ఒక్కోసారి మాత్రం ఆప్నియా వల్ల చాలాసేపు గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆప్నియా ఉంటే అశ్రద్ధ చేయకూడదు. అది గుండెకు మంచిది కాదు. పడుకునే తీరు సరిగాలేకపోయినా గురక వస్తుంది. ఎవరికి ఎక్కువ డేంజర్... పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నవారికి గురక డేంజర్‌గా మారుతుంది. స్థూలకాయులకు గురక సమస్య ఉంటే వారికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్లీప్ అప్నియా వల్ల వచ్చే సున్నితమైన ముఖ్యమైన సమస్య గురక. గురకపెట్టి నిద్రపోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి గాఢనిద్ర కాదు కదా మామూలుగా కూడా వాళ్లు నిద్రపోవడంలేదనే చెప్పాలి. స్లీప్ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక,సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. గురక తీవ్రమైతే జబ్బుగానే పరిగణించాలి. కాంప్లికేషన్లు ఏవీ లేనప్పుడు గురక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. కానీ స్లీప్ అప్నియా వల్ల వచ్చే గురక దీర్ఘకాలం ఉంటుంది. గురకతోపాటు బీపీ, షుగర్, ఊబకాయం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. నివారణ లేదా? సరైన ఆహారం తీసుకోవడం, సరైన బీఎంఐ మెయిటెన్ చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వంటివి గురకను నివారిస్తాయి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు నిద్రకు ఉపక్రమించడానికి నాలుగు నుంచి ఆరు గంటల ముందు వరకు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి గురక ఉంటే, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం గుర్తించవచ్చు. అందుకే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడమే మంచిది. గురకవచ్చే వారు ఒకసారి డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించి అది ప్రమాదరహితమైన మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి సీపాప్ వంటి ఉపకరణాలు వాడటమో లేదా ఈఎన్టీ, పల్మునాలజిస్టులు చెప్పే సూచనలు పాటించడం, చికిత్స చేయించుకోవడం అవసరం. చిట్టి చిట్కాలు.. ఆరోగ్యవంతమైన జీవనశైలే సుఖ నిద్రకు ముఖ్యం. పైన చెప్పుకున్నట్లు క్రమబద్దమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి పడుకోవాలి. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపిస్తే పడుకునే ముందు నేసల్ డ్రాప్స్ వేసుకోవాలి. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ పూర్తిచేయాలి. రాత్రిపూట వ్యాయామం,వాకింగ్ వంటి చేయకూడదు. అలాగే రాత్రి వేళల్లో కాఫీటీల జోలికి అస్సలు వెళ్లకూడదు. అర టీస్పూన్ తేనెలో మరో అరటీస్పూన్ ఆలీవ్ ఆయిల్ కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో రెండు చుక్కలు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి పడుకునే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే గురక తగ్గుముఖం పడుతుంది. ఒక గ్లాసు వేడినీటిలో అర టీస్పూన్ యలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్యనుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. పడుకునేముందు మరిగే నీటిలో ఐదుఆరు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా తరచూ చేస్తే గురక తగ్గుతుంది. వెల్లుల్లిని వాసన చూడడం ద్వారా శ్వాసనాళ తాత్కాలిక ఇబ్బందిని దూరం చేసి గురకను నివారించవచ్చు. చదవండి: Cyber Crime: ఫోన్లోనే పరిచయం, చాటింగ్.. అమెరికా వెళ్దామని.. -
ప్రేయసి గురక భరించలేక ప్రియుడు..
గురక చాలా మందికి సాధారణ సమస్య. ఇది బాధితుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా పక్కనున్న వారిని బాగా ఇబ్బంది పెట్టే సమస్యే. అలాంటిది మీ భాగస్వామే గురకతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఆ సమస్య రోజూ ఎదురైతే పరిస్థితి ఏంటి..?. ఇలాంటి పరిస్థితే ఎదురైనా ఓ వ్యక్తి ఆ సమస్యకు ఓ గమ్మత్తయిన పరిష్కారాన్ని కనుగొన్నాడు. వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్ అబ్రహం తన ప్రియురాలు షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉంది. దీంతో జాసన్ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. అయితే ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది. వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్ నో కామెంట్ అంటూ సమాధానమిస్తున్నాడు. (హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్) -
ఇంత చిన్న పాపకు గురకా?
మా పాపకు ఇప్పుడు ఐదో నెల. పుట్టిన రెండో వారం నుంచే గురక వస్తోంది. ఈమధ్య ఈ గురక శబ్దం మరీ పెరిగింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్లేదు అంతా సర్దుకుంటుంది’ అన్నారు. పాప విషయంలో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటునప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పాపకు గురక వస్తోంది... ఏం చేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆర్నెల్లు. పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవలి కాలంలో శబ్దం మరీ ఎక్కువగా ఉంది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్లేదు అంతా సర్దుకుంటుంది’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – నివేదిత, రాజమండ్రి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. గవదబిళ్లలు తిరగబెడుతున్నాయి.. మా బాబుకి ఎనిమిదేళ్లు. గత ఏడాది వాడికి గవదబిళ్లలు వచ్చాయి. అప్పుడు విపరీతమైన దగ్గు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరోసారి జ్వరం, గవదబిళ్లలు వచ్చాయి. అసలు ఈ గవదబిళ్లలు అంటే ఏమిటి? దీనివల్ల ముమ్ముందు ఏవైనా సమస్యలు వస్తాయా? ఇవి మళ్లీ తిరగబెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? – సుకన్య, అనంతపురం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ అబ్బాయికి మాటిమాటికీ పెరోటిడ్ గ్లాండ్స్‌లో వాపు వస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల్లో, పెద్దల్లో ఈ పెరోటిడ్ గ్రంథి వాపు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మంప్స్ అనే వైరల్ వ్యాధి ఈ కారణాల్లో ప్రధానమైనది. ఇది ఒక సిస్టమిక్ జబ్బు (అంటే శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలది అన్నమాట). ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 30 శాతం మంప్స్ రోగుల్లో అది శ్వాససంబంధిత లక్షణాలతో బయటపడుతుంది. మరో 30–40 శాతం రోగుల్లో మెదడులోని ద్రవం (సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్)లో మార్పులు కూడా ఉండవచ్చు. ఇక ఇది సిస్టమిక్ వ్యాధి కావడంతో మగపిల్లల్లో ఆర్కయిటిస్ (వృషణాల వాపు), ఆడపిల్లల్లో ఊఫోరైటిస్ (ఓవరీస్ వాపు), మయోకార్డయిటిస్ (గుండెకు ఇన్ఫెక్షన్), మెదడు జ్వరం లక్షణాలు, వినికిడి శక్తిలోపం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి ఇతర ఎలాంటి కాంప్లికేషన్లకూ దారితీయవచ్చు. అంతేగాక ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు, హెచ్ఐవీలోనూ, ఫైటోమెగోలోవైరస్, పారా ఇన్ఫ్లుయెంజా, టీబీ, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలోనూ ఈ పెరోటిడ్ గ్రంథుల వాపు వస్తుంటుంది. అలాగే కొన్ని మందులు వాడినప్పుడు, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్లోనూ ఈ గ్రంథుల వాపు కనిపించవచ్చు. ఇక మీ అబ్బాయి విషయంలో అతడి పెరోటిడ్ గ్లాండ్స్ వాపునకు ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ అది మంప్స్ వైరస్ వల్ల వచ్చి ఉండవచ్చు. రెండోసారి రావడానికి ఇతర వైరస్లు కూడా కారణం కావచ్చు. పిల్లల్లో ఇలా పదేపదే పెరోటిడ్ గ్రంథుల వాపు వస్తున్నప్పుడు ఇతర కారణాలను విశ్లేషించడం చాలా ముఖ్యం. వాటిని కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షల ద్వారా తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా డే–కేర్ సెంటర్స్ లేదా స్కూళ్లలో పిల్లలకు వచ్చే దగ్గు, జలుబు ద్వారా ఇతర పిల్లలకు వ్యాపించే అవకాశం ఎక్కువ. మంప్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కేవలం లక్షణాల ఆధారంగా చేసే సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ పైన పేర్కొన్న కాంప్లికేషన్లు వచ్చినప్పుడు మాత్రం ఇతరత్రా కొన్ని మందులు (స్టెరాయిడ్స్ వంటివి) వాడాల్సి ఉంటుంది. ఇక ఇంత తీవ్రమైన ఈ జబ్బుకు పిల్లలు పుట్టాక 15వ నెలలో, నాలుగు నుంచి ఆరేళ్ల వయసులో, కొందరిలో కొద్దిగా పెద్దయ్యాక కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా జబ్బును నివారించడంతో పాటు, ఒకవేళ వస్తే దాని తీవ్రతనూ తగ్గించవచ్చు. మీరు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించి ఒకవేళ మీరు ముందుగా తీసుకుని ఉండకపోతే మీ అబ్బాయికి ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్‌ను ఇప్పించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
నిద్ర గురకాయ స్వాహా!!
‘నిద్ర... గురకను మింగుతుందా? గురక... నిద్రను మింగుతుందా?’ గురకే... నిద్రను మింగుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బాగా పడుకున్నావోయ్ రాత్రి... పక్క వీధి దాకా నీ గురక వినబడింది’ అని ఎవరైనా అంటే... ఆయన పెట్టిన గురకతో ఈయనకు నిద్ర పట్టలేదనే కాదు... ఆయన గురక వల్ల ఆయనకే నిద్ర పట్టలేదని గమనించండి. నిద్రకు అడ్డం పడేదే - గురక. దాన్నే ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు. ఈ ఆర్టికల్ చదివి...గురకను స్వాహా చేయండి. గురకనే స్వాహా చేయండి. శ్వాస తీసుకోవడం అనునిత్యం అవసరం. ఒక్క క్షణం ఆగినా తగినంత ఆక్సిజన్ అందక ప్రమాద పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే సమస్యే... ‘స్లీప్ ఆప్నియా’. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. అందుకే గురకను ఎప్పుడూ మంచి నిద్రకు సంకేతంగా కాక... శ్వాసకు అవరోధంగా భావించాలి. అలాంటి పరిస్థితిలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చికిత్సపై అవగాహన కోసమే ఈ కథనం. ‘ఆప్నియా’ అంటే ‘శ్వాస లేకపోవడం’ అని అర్థం. ఆప్నియా అనే పరిస్థితిలో నాలుక వెనకే ఉండే శ్వాసనాళం కొద్దిగా మూసుకుపోయినట్లు అవుతుంది. దాంతో శ్వాస ఆడదు. ఫలితంగా మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. అది ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. ఎందుకిలా అవుతుంది? మనం నిద్రపోయినప్పుడు మన కండరాలు రిలాక్స్ అవుతాయి. దాంతోపాటే మన గొంతు కండరాలు కూడా. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కానీ... కొందరిలో వేలాడబడినట్లు (ఫ్లాపీ) మారిపోతాయి. ఒక్కోసారి శ్వాసనాళం కుంచించుకుపోయినట్లు అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే - గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. సమస్య తీవ్రం కావచ్చు. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు. కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు. ఇక మరికొందరిలో ముక్కు దూలం కాస్త వంకరగా ఉండడం వల్ల కూడా గురక రావచ్చు. న్యూనతకు గురయ్యే వ్యక్తులు కొందరు కునుకు తీయడానికి కూడా భయపడి నిద్రలేమితో బాధపడతారు. గురకలో శ్వాస అందని పరిస్థితిని ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. రక్తసరఫరా కోసం, ఆక్సిజన్ కోసం గుండె మరింత ఎక్కువ శ్రమిస్తుంది. మెదడు ఒక అద్భుతం మన మెదడు ప్రమాదకరమైన పరిస్థితిని వెంటనే పసిగడుతుంది. వెన్వెంటనే ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. తక్షణం శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితిని గుర్తెరిగి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మనకు నిద్రాభంగమై మేల్కొంటాం. తగినంత శ్వాస తీసుకున్న తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఈ పనులన్నీ మనకు తెలియకుండానే జరిగిపోయేలా మెదడు నిశ్శబ్దంగా పనిచేస్తుంటుంది. ఆ టైమ్‌లో మనల్ని ఎవరైనా చూస్తే అదేదో నిద్రలో ఒకసారి లేచి కాళ్లూ చేతులు ఆడించి, మళ్లీ పడుకున్నట్లుగా ఉంటుంది తప్ప... ఇంత ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లినట్లు తెలియనే తెలియదు. పగటి నిద్రతో గుర్తించండి... నిద్రలో అనేక సార్లు ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి వస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల సార్లు కూడా. ఇలా రాత్రివేళల్లో అనేక సార్లు నిద్రాభంగం కావడం వల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. అందుకే రాత్రుళ్లు గురకపెడుతూ, పగటి వేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఎవరెవరిలో ఆప్నియా? అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అన్నది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. పిల్లల్లో కూడా ఇది ఉండవచ్చు. పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉన్నా, ముక్కు రంధ్రాల మధ్య ఉండే అడ్డుగోడ వంకరగా ఉన్నా స్లీప్ ఆప్నియా కనిపించవచ్చు. స్థూలకాయులైన మధ్యవయస్కుల్లో ఈ సమస్య ఎక్కువ. మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ (మధ్యవయస్కులైన పురుషుల్లో 4% మందిలో ఈ సమస్య ఉంటే, మహిళల్లో 2% మందిలో ఇది ఉంటుంది). సాధారణంగా 45 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో గురకపెడతారు. అయితే, వారిలో కేవలం 25 శాతం మందిలో మాత్రమే స్లీప్ ఆప్నియాకి చికిత్స అవసరమవుతుంది. ఆప్నియాను గుర్తించే లక్షణాలు... పగటి వేళ చురుగ్గా ఉండాల్సిన సమయంలో మాటిమాటికీ నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం తెల్లవారుజామున నిద్రలేవగానే తలనొప్పి, నోరంతా తడారిపోయినట్లుగా ఉండటం నిద్ర లేచాక ఫ్రెష్‌గా లేకపోవడం మాటిమాటికీ మూడ్స్ మారిపోతూ, తరచూ కోపం వస్తున్నట్లు అనిపించడం ఎప్పుడూ అలసటగా ఉండటం రాత్రివేళల్లో పెద్ద శబ్దంతో గురకపెడుతుండటం గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా శ్వాస ఆగడం మాటిమాటికీ నిద్రాభంగం కావడం రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం నిద్రాభంగం కాగానే కాళ్లూ, చేతులు అకస్మాత్తుగా కుదుపునకు గురైనట్లు కదలడం ఎవరెవరిలో ఆప్నియాతో చేటు? మామూలుగానే ఆప్నియా ఉన్నవారిలో శ్వాసనాళం వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) మారుతుంది. నిద్రమాత్రలు వాడే వారిలో నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకునేవారిలో పరిస్థితి మరింత తీవ్రమై ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఆప్నియాతో ఆందోళన ఎందుకంటే... సాధారణంగా ఆప్నియాతో ఎలాంటి ప్రాణాపాయమూ ఉండదు. అయితే కొందరిలో ఇది ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మాటిమాటికీ రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ర్పభావం చూపవచ్చు. కొందరిలో స్టీప్ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్షలు: వ్యాధి చరిత్ర, గురక గురించి సమాచారం సేకరించడం కోసం ఒక ప్రశ్నావళితో కూడిన పత్రాన్ని రోగి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఆ ప్రశ్నవళిలోని సమాధానాలను బట్టి కూడా వ్యాధిని, తీవ్రతను నిర్ణయిస్తారు. వాటితో పాటు స్లీప్ ఎండోస్కోపీ, సినీ ఎమ్మారై ద్వారా వారి శ్వాస వ్యవస్థలో నిర్మాణ పరమైన (అనటామికల్) ఇబ్బందులు తెలుసుకుంటారు. నిద్రలో గురకపెట్టేవారికి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి స్లీప్ ఆప్నియా నిర్ధారణ చేస్తారు. దీన్ని స్లీప్ ల్యాబ్‌లో, ఒక్కోసారి ఇంటిలో చేయవచ్చు. స్లీప్ ల్యాబ్‌లో ఉన్నప్పుడు రోగి కొంత ఒత్తిడికి గురై, సరిగా నిద్రపోలేకపోవచ్చు. అందుకే ఇంటిలోనే ఈ పరీక్ష చేయడానికి డాక్టర్లు ప్రాధాన్యం ఇస్తారు. చికిత్స ఇలా... ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు. కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు. నివారించే మార్గాలు మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి. మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి. చికిత్స ఇలా... ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు.కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు. నివారించే మార్గాలు మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి. మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి. మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. రిస్క్ ఎవరిలో ఎక్కువంటే... స్లీప్ ఆప్నియా సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఈ కిందివారిలో ఎక్కువ. స్థూలకాయుల్లో (అంటే... బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో... మన బరువు కిలోగ్రాముల్లో తీసుకుని ఆ విలువను మన ‘ఎత్తు స్క్వేర్’తో భాగిస్తే వచ్చే విలువ 30, అంత కన్నా ఎక్కువ ఉంటే దాని స్థూలకాయంగా పరిగణిస్తారు). పెద్ద శబ్దంతో గురకపెట్టే వారిలో గతంలో గుండెపోటు వచ్చిన మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో నియంత్రణ లేని రక్తపోటు ఉన్నవారిలో గుండె లయ సరిగా లేనివారిలో రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారిలో ఇటీవల చాలా ఎక్కువగా బరువు పెరిగిన వారిలో. వీరిలో ప్రమాదం మరింత తీవ్రం గురకపెడుతున్న వారికి పొగతాగే అలవాటు ఉన్నా... గురక పెట్టేవారికి స్థూలకాయం ఉన్నా... వాళ్లలో ఒక్కోసారి పరిస్థితి అకస్మాత్తుగా ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్లలో ఆప్నియా కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
మంచి నిద్ర కోసం చేయాల్సినవి...
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు గురక వస్తోంది. ఇది నా సైనస్ సమస్యల వల్లనే అని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. మన ముఖంలోని ఖాళీ ప్రదేశాల్లో ఉండే సైనస్ గదులలో ఎక్కువ ప్రతిధ్వనులు జరగడం వల్లనే గురక సౌండ్ కూడా పెరుగుతోందని అంటున్నారు. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. సుభాష్, మంచిర్యాల మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక సంక్షిప్త పట్టిక ఇది... అపోహ : సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం : నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం : నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపకరిస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. వైద్యపరమైన అంశాలలో మీరు మీ ఫ్రెండ్స్ మాటలను విశ్వసించకండి. నిపుణులను కలిసి, మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ శ్రీనివాస్ కిశోర్ ఎస్., సీనియర్ ఈఎన్టీ వైద్య నిపుణులు, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ నాకు రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పడుతోంది. అంత నిద్ర సరిపోవడం లేదని నాకు అనిపిస్తోంది. నిజానికి ఏ వయసు వాళ్లకు ఎంత నిద్ర కావాల్సి ఉంటుంది? రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి. - మహేశ్, విశాఖపట్నం ఫలానా వయసు వారు ఇంతే నిద్రపోవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం అనే అంశంపై నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకటించిన వివరాలివి... అప్పుడే పుట్టిన పిల్లలు (0-3 నెలలు) ... 14- 17 గంటలు పసిపిల్లలు (4-11 నెలల పిల్లలు) ... 12 - 15 గంటలు నిలబడే పిల్లలు (1- 2 ఏళ్లు) ...11 - 14 గంటలు ప్రీస్కూల్ పిల్లలు (3-5 ఏళ్లు) ... 10 - 13 గంటలు స్కూల్‌కు వెళ్లే పిల్లలు (6-13 ఏళ్లు) ... 9 - 11 గంటలు కౌమార బాలలు (14 - 17 ఏళ్లు) ... 8 - 10 గంటలు యుక్తవయసు వారు (18-25 ఏళ్లు) ... 7- 9 గంటలు పెద్దవారు (26 - 64 ఏళ్లు) ... 7 - 9 గంటలు 65 ఏళ్లు పైబడ్డవారు ... 7 - 8 గంటలు నిద్ర పోయే వ్యవధి పైన చెప్పిన దానికంటే కాస్త ఎక్కువ తక్కువ అయినా పరవాలేదు. అంతకు మించి మరీ ఎక్కువ నిద్రపోతున్నా లేదా మరీ తక్కువ నిద్రపోతున్నా, వారిలో ఏదైనా సమస్య ఉందా అన్న అంశాన్ని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, రాత్రి మిగతావారి కంటే కాస్త నిద్ర తగ్గినా మర్నాడు పగటి వేళంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే మంచి నిద్ర కోసం ఈ కింది సూచనలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి సాయుంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ తీసుకోకండి ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపొండి పగలు చిన్నకునుకు (పవర్ న్యాప్) చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకుఎనిమిదేళ్లు. వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - సుమ, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్) లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇవి రావడానికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. ఎక్కువ సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం. నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం. నోటి పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య పదేపదే వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ (లో) కాన్సన్ట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత పాటించడంతో పాటు విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్యనిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ -
గురక వస్తోంది... పరిష్కారం చెప్పండి!
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 57 సంవత్సరాలు. నాకు రెండు సంవత్సరాల నుండి శీతాకాలంలో కఫంతో కూడిన దగ్గు. కొంచెం ఆయాసం వస్తోంది. ప్రస్తుతం పది రోజుల నుండి ఇబ్బందిగా ఉంటోంది. ఊపిరితిత్తుల వైద్య నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే చేయించాను. వారు పరీక్షించి ‘‘ఇస్నోఫిలియా’’ అని చెప్పారు. దీనికి ఆయుర్వేద మందులు సూచింప ప్రార్థన. - వి. సరవన్న , విశాఖపట్నం మీరు చెప్పిన దాన్ని బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘కఫజకాస’గా చెప్పుకోవచ్చు. మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, వేడివేడిగా తినండి. చల్లగాలి, మంచుకు గురి కాకుండా, ఛాతీని, చెవులను కప్పి ఉంచే దళసరి దుస్తులు ధరించండి. ఈ దిగువ సూచించిన మందుల్ని ఒక మూడు వారాల పాటు వాడి, రక్త పరీక్ష చేయించుకుని, ‘ఎబ్సల్యూట్ ఇస్నోఫిల్స్ కౌంటు’ను గమనించండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. 1. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు): 3 గ్రా॥తేనెతో రెండు పూటలా నాకాలి. లేదా - వ్యోషాది వటి (మాత్రలు): పూటకు రెండు చొప్పున, మూడు పూటలా. 2. ‘మల్లసిందూరం’ (భస్మం), ‘ప్రవాళభస్మ’: ఒక్కొక్కటి రెండేసి చిటికెలు, తేనెతో కలిపి రెండుపూటలా. 3. తులసి ఆకుల రసం (‘నల్ల తులసి’ శ్రేష్ఠం): ఒక చెంచా తేనెతో రోజూ మూడు పూటలా సేవించాలి. గమనిక: మీ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా, తులసి రసాన్ని రోజూ ఒక చెంచా తేనెతో ఓ ఆరునెలలపాటు సేవించండి. ఇది దగ్గు, ఆయాసాన్ని తగ్గించటమే కాకుండా అజీర్ణం, మధుమేహం, చర్మరోగాలను నియత్రించడానికి కూడా దోహదపడుతుంది. నా వయసు 37 సంవత్సరాలు. అప్పుడప్పుడు మలవిసర్జనతో బాటు కొంచెం నెత్తురు పడుతోంది. ఇంటర్నల్ పైల్ మాస్ (లోపల ఉండే మూలశంక)గా డాక్టర్లు నిర్ధారణ చేశారు. పూర్తిగా నయమవ్వడానికి మంచి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - కె. ప్రత్యూష, కరీంనగర్ ఆయుర్వేదంలో దీనిని ‘రక్తజ అర్మో రోగం’గా చెప్పవచ్చు. ఆహారంలో ఉప్పు, పులుపు, కారాలు గణనీయంగా తగ్గించి, పీచు, నీరు అధికంగా ఉండే శాకాహారం తినండి. తాజాఫలాలలో ‘జామిపండు’ చాలా ఉపయోగకారి. కంద, బచ్చలి కూర ప్రతి రోజూ తినండి. వ్యాయామం, ప్రాణాయామం ప్రతీరోజూ చెయ్యండి. ఈ క్రింది మందులు ఒక నెలరోజులు వాడండి. 1. కాంకాయనవటి (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1. 2. బోలబద్ధరస (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1. గృహవైద్యం: ఒక చెంచా ఉల్లిపాయ రసం, ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది రోజూ ఒక ఉసిరికాయ, ఆరు నెలలపాటు తింటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. గృహిణిని. ఒక ఏడాదిగా నాకు కీళ్లు, వెన్ను, భుజాలు, చేతుల్లో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇంటి పనిచేస్తున్న సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదయం లేవగానే ఈ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పనిచేస్తున్న కొద్దీ నొప్పులు కాస్త తగ్గుతున్నాయి. కానీ సాయంత్రానికల్లా చేతులు విపరీతంగా లాగుతుంటాయి. డాక్టర్‌ను సంప్రదించాను. రక్త పరీక్షలు చేశారు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వచ్చింది. దాని ఆధారంగా నాకు ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ ఉన్నట్లు చెప్పారు. మందులు మొదలుపెట్టారు. రోజూ చాలా మందులు వాడాల్సి వస్తోంది. అది నాకు చాలా సమస్యగా ఉంది. ఇన్నేసి మందులు మింగకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? - సులక్షణ, నిజామాబాద్ మీరు రాసిన లేఖను విశ్లేషించాక మీకు రెండు అంశాలను స్పష్టంగా చెప్పాలి. మొదటిది... జనాభాలో ఆరు శాతం మందికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష పాజిటివ్ రావచ్చు. కానీ వాళ్లందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోవడం సరికాదు. ఇక రెండో అంశం... మీ నొప్పులూ, శరీరంలో నొప్పులు వస్తున్న అవయవాలు, మీలో కనిపించే ఇతర లక్షణాలూ, అవి ఎంతకాలంగా కనిపిస్తున్నాయి, మీ రక్తపరీక్షలూ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నిర్ధారణ చేయాలి. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నిర్దిష్టమైన కొన్ని లక్షణాలను నిశితంగా పరిశీలన చేయడంతో పాటు వివిధ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని నిర్ణయం జరగాలి. మీకు రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నప్పటికీ మీరు చెబుతున్న లక్షణాల ప్రకారమైతే మీకు ఆ వ్యాధి ఉన్నట్లుగా చెప్పలేం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ నిపుణులను కలవండి. మళ్లీ కూలంకషంగా అన్ని పరీక్షలూ చేయించుకోండి. అప్పుడు వ్యాధి నిర్ధారణ అయితే... దాని ఆధారంగానే చికిత్స నిర్ణయించవచ్చు. అంతేగానీ ఇన్నిన్ని మందులను ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. బరువు 84 కేజీలు. నేను గురకతో బాధపడుతున్నాను. ఇటీవల ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాను. గదిలో, కారులో పడుకున్న వెంటనే గురకపెట్టేవాణ్ణి. ఆరోజు నుంచి తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నాను. న్యూనతకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి. రవి, సూర్యాపేట వయసు పెరుగుతున్న కొద్దీ గురక సమస్య తీవ్రమవుతుంది. మనం నిద్రపోగానే అన్ని అవయవాలూ రిలాక్స్ అయినట్లే శ్వాసనాళమూ మెత్తబడుతుంది. శ్వాసనాళంతో పాటు, నాలుక చివర, అంగిలిలోన, గొంతు ముందు భాగం వద్ద గాలి ప్రకంపనలు సంభవిస్తాయి. ఆ కంపన వల్ల నోటి నుంచి, ముక్కు నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. అదే గురక. గురక వస్తుందంటే ఈ సమస్యలకు అది సూచన కావచ్చు: శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు గురకలో శ్వాస అందని పరిస్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. గుండె రక్తసరఫరా కోసం ఆక్సిజన్ కోసం మరింత ఎక్కువ శ్రమిస్తుంది. చికిత్స : కొందరిలో ముక్కుకు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తొడుగుతారు. దీన్ని సీపాప్ చికిత్స అంటారు. మరికొందరిలో ‘ఉవాలోపాలటోఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే సర్జరీ చేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులను తొలగిస్తారు. గురక నివారణ: బరువును అదుపులో పెట్టుకోడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, అలర్జీని అదుపులో ఉంచే మందులను తీసుకోకండి ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య 4 గంటలూ, నిద్రకూ, హెవీ మీల్కూ మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి ఒకవైపునకు ఒరిగి పడుకోండి మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
ఒంట్లో వేడికి ఇంట్లో బల్బు వెలుగుతుంది!
రేపటికి ముందడుగు లైటు వెలగాలంటే... కరెంటు కావాల్సిందే. ఫొటోలో ఉన్న లూమెన్ ఫ్లాష్లైట్కు మాత్రం అవసరం లేదు. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. మీ శరీర ఉష్ణోగ్రతనే ఇంధనంగా మార్చుకుని వెలుగులిచ్చే ఫ్లాష్‌లైట్ ఇది. ఇందుకోసం దీంట్లో చిన్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్‌ను ఉపయోగించారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఫ్లాష్లైట్పై వేలు ఉంచితేచాలు.. 5 మిల్లీమీటర్ల పొడవున్న ఎల్ఈడీ బల్బు వెలగడం మొదలవుతుంది. శరీరం వేడికి, పరిసరాల్లోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ దాదాపు మూడు వోల్టుల స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 15 మిల్లీఆంపియర్స్ విద్యుత్తుతో బల్బు వెలుగుతుందన్నమాట. మిగిలిపోయే కొంత విద్యుత్తును నిల్వ చేసుకునేందకు దీంట్లో ఓ సూపర్ కెపాసిటర్ కూడా ఉంది. వెలుతురు విషయంలో సాధారణ బ్యాటరీలతో పనిచేసే ఫ్లాష్లైట్లకు సరితూగకపోయినా చీకట్లో దారి వెతుక్కునేందుకు, విపత్కర పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు ఈ ఫ్లాష్‌లైట్ ఆవిష్కర్త రాస్ట్. కలుపును నలిపేస్తుంది వ్యవసాయంలో టెక్నాలజీ గురించి మనం తరచూ వింటూంటాం. శాటిలైట్ ఇమేజరీ, జీపీఎస్ ఆటోమేషన్, ఫార్మింగ్ డ్రోన్స్ వంటి ఎన్నో గాడ్జెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరనుంది ‘బోనీరోబో’. కలుపుమొక్కల్ని ఏరిపారేసి క్రిమి, కీటకనాశినుల వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగే ఈ యంత్రాన్ని జర్మన్ సంస్థ బాష్‌కు చెందిన డీప్ఫీల్డ్ రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ రోబో ఇటీవలే ఈయూ రోబోటిక్స్ పోటీలో విజయం సాధించింది కూడా. ఆధునిక సెన్సర్లు, అల్గారిథమ్స్, ఉపగ్రహాల్లో ఉపయోగించే లిడార్ టెక్నాలజీల సాయంతో ఇది పంటకు, కలుపు మొక్కలకు ఉన్న తేడాలను ఇట్టే గుర్తుపడుతుంది. మొక్కల ఆకుల ఆకారం, రంగు వంటి అంశాలన్నీ పరిగణించిన తరువాత కలుపుమొక్కలను చిన్న ఇనుప కడ్డీ సాయంతో అక్కడికక్కడే భూమిలోకి పాతేసి నాశనం చేసేస్తుంది. వేర్వేరు పంటల వివరాలను నమోదు చేయడం ద్వారా దీన్ని అన్ని రకాల పంటల్లోనూ వాడుకోవచ్చునని అంచనా. ఇవే అంశాల ఆధారంగా భవిష్యత్తులో బోనీరోబో మెరుగైన వంగడాల అభివృద్ధిలోనూ సాయపడుతుందని డీప్ఫీల్డ్ రోబోటిక్స్ సీఈవో ప్రొఫెసర్ అమోస్ ఆల్బర్ట్ అంటున్నారు. మీ గురకను దిండు కింద దాచేయచ్చు మీరు నిద్దట్లో జోరుగా గురకపెడతారా? మీ సౌండుకు చుట్టుపక్కల వాళ్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారా? ఎన్ని రకాల చిట్కాలు వాడినా మీ గురక తగ్గడం లేదా? అయితే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నది... మీ గురకకు చెక్ పెట్టే హైటెక్ గాడ్జెట్ మరి! కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ ‘నోరా’ నిజానికి ఓ మైక్? ఈ గాడ్జెట్తోపాటు వచ్చే వైర్లెస్ ప్యాడ్‌ను మీ దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలు.. మీరు గురకపెట్టినప్పుడల్లా నోరా దాన్ని గ్రహించి మంచం పక్కనే పెట్టుకునే ఓ పంప్‌కు సిగ్నల్ పంపుతుంది. పంపుకు కనెక్ట్ అయి ఉండే ప్యాడ్‌లోకి గాలి చేరి కొంచెం ఎత్తుగా మారుతుంది. దీంతో మీ తల పొజిషన్ మారిపోయి గురక కూడా ఆగిపోతుందన్నమాట. ఇదంతా మీ సుఖనిద్రకు భంగం కలగకుండానే జరిగిపోతుంది. స్మార్ట్ నోరా ఇన్కార్పొరేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వివరాలకు... http://www.smartnora.com/ వెబ్సైట్ చూడండి. కంటికి దీపం... ఎల్సీడీ! వయసుతోపాటు కంటిచూపు మందగించడం సహజం. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూంటాం. ఇంకొన్నేళ్లలో వీటి అవసరం ఉండదంటున్నారు దేవేశ్ మిస్త్రీ. కంటిలోపలి సహజ లెన్స్ స్థానంలో ఎల్సీడీ టీవీ తెరను పోలిన వాటిని ఉపయోగిస్తే వృద్ధాప్యంలో వచ్చే చత్వారాన్ని అధిగమించవచ్చునని అంటున్నాడు ఈ లీడ్స్ యూనివర్శిటీ యువ శాస్త్రవేత్త. వయసుతోపాటే మన లెన్స్ పెళుసుగా మారిపోతాయి. దీంతో కళ్ల కండరాలు దృష్టి కేంద్రీకరించేందుకు చేసే సంకోచ, వ్యాకోచాలకు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా వస్తువులను కంటికి దగ్గరగా తెచ్చుకుంటేగానీ చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎల్సీడీ తెరల్లో ఉపయోగించే లిక్విడ్ క్రిస్టల్స్ ద్వారా అధిగమించవచ్చునని దేవేశ్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. కంటి కండరాల కదలికలకు తగ్గట్టుగా ఈ లిక్విడ్ క్రిస్టల్స్ తమ ఆకారాన్ని మార్చుకుంటూ వస్తువులను చూసేందుకు అవసరమైన ఫోకస్‌ను అందిస్తాయన్నమాట. -
తన గురకే తన శత్రువు
మెడికల్ మెమరీస్ ...::: యాసీన్ పురుషాధిక్య సమాజంలో మగాళ్లు ఎంతగా గురకపెట్టినా మహిళ సహనంతో భరిస్తుంది. కానీ భార్యే గురక పెడితే... కావ్యకు (పేరు మార్చాం) 32 ఏళ్లు. కోల్‌కతాలోని అంతర్జాతీయ బ్యాంకులో ఉన్నతోద్యోగి. భర్త అదే ఆఫీసులో సహోద్యోగి. అపశ్రుతులే లేని అందాల కాపురం. కానీ అకస్మాత్తుగా కావ్యకు గురక రావడం మొదలైంది. స్లీప్ ఆప్నియా! గురకను భరించలేక ఆమెను వదిలేశాడా భర్త! నిజానికి గురకతో వచ్చే సౌండ్ వల్ల... నిద్రపోయే వ్యక్తి ‘సౌండ్’ స్లీప్‌లో ఉన్నారని అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఓ వ్యక్తి గురక పెడుతున్నాడంటే అతడి నిద్ర నాణ్యమైన నిద్ర కాదని అర్థం. నిద్రాదేవి ఎంత దయామయురాలో... అంత నిర్దయురాలు కూడా. ఆ నిర్దయనంతా కావ్య మీద చూపించింది నిద్రాదేవత. నిద్రాదేవత తన ఒడిలోకి తీసుకున్న వారి ప్రాపంచిక బాధలను మరిపిస్తుంది. కలలతో మురిపిస్తుంది. కానీ గురకతో నిద్ర పొల్యూట్ అయినప్పుడు సదరు వ్యక్తికి సరిగా నిద్రలేక నిద్రాదేవతకు నిద్రబాకీ పడతాడు. దాన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. అలాంటి సందర్భాల్లో బాకీ వసూలులో నిద్రాదేవత నిర్దయతో వ్యవహరిస్తుంది. తన నిద్రబాకీని వసూలు చేయడానికి పగటివేళ ప్రయత్నిస్తుంటుంది. దాంతో పగ పెంచుకున్నట్లుగా పగలూ నిద్రలోకి లాగేయడానికి యత్నిస్తుంటుందా నిద్రాదేవత. ఫలితంగా రాత్రుళ్లు గురకపెట్టే వారు పగలూ డల్‌గా అయిపోతుంటారు. ఓ పక్క వదిలి పోయిన భర్త. మరో పక్క పగటి వేళల్లోనూ లోపించిన క్రియాశీలత. దాంతో ఆఫీసు పనుల్లో ఆమె చురుకుదనం తగ్గి, బాసుల్లో కరుకుదనం పెరిగింది. తొలుత ఆమె స్లీప్ ఆప్నియాను తగ్గించుకోడానికి చెస్ట్ స్పెషలిస్ట్‌ను కలిసింది. ఆయన సరిగానే వైద్యం చేసి గురకను తగ్గించే ఉపకరణమైన సీపాప్‌ను ఇచ్చారు. కానీ దాంతో ప్రయోజనం కనిపించలేదు. పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైంది. ఈ డిప్రెషన్‌ను తగ్గించుకోడానికి సైకియాట్రిస్ట్‌ను కలిసింది. వాళ్లిచ్చే మందులతో మరింత మగత! ఫలితంగా ఆఫీసులో సమయానుకూలంగా ఆమెకు రావాల్సిన ఎన్నో పదోన్నతులను మిస్ అయ్యింది. పైగా అన్ని మందుల దుష్ర్పభావాలతో క్రమంగా ఆమెకు స్థూలకాయం కూడా వచ్చింది. దాంతో ఇంకా ఇంకా డిప్రెషన్లోకి కూరుకుపోయింది. ఆ పరిస్థితుల్లో ఆమె ఒకసారి డాక్టర్ శ్రీనివాస్ కిశోర్‌ను కలిసింది. అది ఆమె జీవితంలో ఒక మేలుమలుపు! నిజానికి స్లీప్ ఆప్నియాతో వచ్చే పేషెంట్స్‌కి సీపాప్ పరికరాన్ని సూచిస్తారు. ఆమెకూ అక్కడి డాక్టర్లు అదే చేశారు. కానీ ఆమె దాన్ని సరిగా ఉపయోగించలేకపోతోంది. దానికి కారణాలు అన్వేషించడం మొదలుపెట్టారు శ్రీనివాస్ కిశోర్. స్లీప్ ఎండోస్కోపీ పరీక్షలో ఒక విషయం తేలింది. ఆమె గదమ చాలా చిన్నది. నాలుక కాస్త వెనగ్గా ఉంది. శరీర నిర్మాణంలోని ఈ స్వభావం వల్ల ఆమె సీపాప్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేకపోయింది. దాన్ని కనిపెట్టిన శ్రీనివాస్ కిశోర్ ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో ఆమె సీపాప్‌ను సమర్థంగా ఉపయోగించగలిగింది. తన కంటినిండా నిద్రతో నిద్రాదేవతకు కడుపునిండా నివేదన. ఆ నివేదనలతో ఆవేదనలన్నీ తీరాయి. అంతే... మూడు వారాల్లోనే ముచ్చటైన ఫలితం. గురక తగ్గింది. చురుకు పెరిగింది. బరువు తగ్గింది. మునుపటిలాగే మళ్లీ తీగలాంటి ఆకృతి. భర్తలోనూ పశ్చాత్తాపం కలిగిందో ఏమో... తప్పెరగక తొలుత తప్పుకున్న భర్త తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగివచ్చాడు. ఎప్పట్లాగే అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆఫీసులో తొలి ప్రమోషనూ అందుకుంది. అంతకంటే ముఖ్యమైన మరో ప్రమోషన్! అదే... త్వరలో ఆమె అమ్మ కాబోతోంది!! -
గురక మంచిదే ..!
వోల్వో బస్సులో పొగలు.. వృద్ధుడి గురకతో మేల్కొన్న తోటి ప్రయాణికులు కొత్తకోట, న్యూస్‌లైన్: గురక భరించడం ఇబ్బందే అయినా.. ఇక్కడ మాత్రం చాలామంది ప్రాణాలు కాపాడింది. ఓ ప్రయాణికుడు పెట్టిన గురక భరించలేక నిద్ర మేల్కొన్న తోటి ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల స్టేజీ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. నీతా ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 49 ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరింది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 1.30 గంటలకు కొత్తకోట మీదుగా వెళ్తుండగా ఓ వృద్దుడు పెట్టిన గురకను భరించలేక.. నిద్ర మేల్కొన్న తోటి ప్రయాణికులు బస్సులో కమ్ముకున్న పొగలను చూసి ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి అందులోని వారందరినీ కిందికి దింపివేశాడు. ఇంజిన్‌లోని కంప్రెషర్ పైపునకున్న బోల్టు ఊడిపోవడంతో పొగలు కమ్ముకున్నాయని, ఒకవేళ.. ప్రయాణికులు గమనించకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని డ్రైవర్ రహమాన్ చెప్పాడు. -
మద్యం మత్తులో ఇంజినీర్ల వీరంగం
ఎర్రావారిపాళెం, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రమైన తలకోనలో శనివారం రాత్రి మద్యం మత్తులో వీరంగం చేసిన ఇంజినీర్లను స్థానికులు చితకబాదారు. పో లీసుల కథనం మేరకు.. శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు భరత్ (28), మోహన్ (29), అలెక్స్ (26), ప్రీతిజిత్ (27), కృష్ణకిషోర్(31) తలకోనలోని టీటీడీ అతిథిగృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. వీరు తమ వెంట తెచ్చుకున్న మద్యం సేవించి మాంసంతో విందు చేసుకున్నారు. మత్తులో ఉన్న వీరు గదికి సైతం మద్యం తీసుకొచ్చి సే వించేందుకు ప్రయత్నించారు. టీటీడీ అతిథిగృహంలో మద్యం, మాంసం అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది అన్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇంజినీర్లు మేమనుకుంటే ఏమైనా చేస్తాం.. మమ్మల్నే ఎదిరిస్తారా’’ అంటూ సెక్యూరిటీగార్డులు శంకర, బాలకృష్ణపై దాడికి దిగారు. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సెక్యూరిటీగార్డులు పరుగులు తీసి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెరబైలు గ్రామంలోని తమ బంధువులకు విషయాన్ని తెలిపారు. వారంతా టీటీడీ అతిథిగృహం వద్దకు చేరుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్లను చితకబాదారు. ఈఘర్షణలో అతిథిగృహంలో ఫర్నిచర్ ధ్వంసం అయింది. గాయపడిన వారినందరినీ చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎర్రావారిపాళెం ఇన్చార్జ్ ఎస్ఐ నెత్తికంఠయ్య ఇరువర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.