ప్రతీకాత్మక చిత్రం
కుంభకర్ణుడి కాలం నుంచి ఇప్పటివరకు పక్కన పడుకునేవాళ్లను దారుణంగా ఇబ్బంది పెట్టేది గురక! సాధారణంగా మనం పీల్చుకునే గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది. నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే మన గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి.
శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు శ్వాస ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది కాబట్టి ఎలాంటి శబ్దమూ రాదు. రిలాక్స్ అయిన కండరాల కారణంగా ఫ్లాపీగా అయి గాలి తీసిన ట్యూబులా ఉన్న శ్వాసనాళంలోంచి గాలి ప్రయాణం చేసేప్పుడు అది తగిలిన మన అంగిలి ప్రకంపనలకు గురవుతాయి. అలా ప్రకంపనలు రేగడం వల్ల శబ్దం వస్తుంది. అదే గురక!
రకాలున్నాయి..
కొన్నిసార్లు కుంచించుకుపోయిన శ్వాసనాళం అలా కాసేపు మూసుకుపోయి ఉండిపోతుంది. అలా కొద్దిసేపు మాత్రమే ఉంటే దాన్ని హైపాప్నియా అంటారు. కానీ అలా మూసుకుపోయిన స్థితి (కండిషన్) చాలాసేపు కొనసాగితే గాన్ని ‘ఆప్నియా’ అంటారు. గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. గురక ఉండటం తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితే. చాలా సందర్భాల్లో హైపాప్నియా, ఆప్నియా కండిషన్లు అంత ప్రమాదకరం కాకపోవచ్చేమోగానీ... ఒక్కోసారి మాత్రం ఆప్నియా వల్ల చాలాసేపు గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది.
అందుకే ఆప్నియా ఉంటే అశ్రద్ధ చేయకూడదు. అది గుండెకు మంచిది కాదు. పడుకునే తీరు సరిగాలేకపోయినా గురక వస్తుంది. ఎవరికి ఎక్కువ డేంజర్... పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నవారికి గురక డేంజర్‌గా మారుతుంది. స్థూలకాయులకు గురక సమస్య ఉంటే వారికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్లీప్ అప్నియా వల్ల వచ్చే సున్నితమైన ముఖ్యమైన సమస్య గురక. గురకపెట్టి నిద్రపోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి గాఢనిద్ర కాదు కదా మామూలుగా కూడా వాళ్లు నిద్రపోవడంలేదనే చెప్పాలి.
స్లీప్ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక,సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. గురక తీవ్రమైతే జబ్బుగానే పరిగణించాలి. కాంప్లికేషన్లు ఏవీ లేనప్పుడు గురక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. కానీ స్లీప్ అప్నియా వల్ల వచ్చే గురక దీర్ఘకాలం ఉంటుంది. గురకతోపాటు బీపీ, షుగర్, ఊబకాయం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి.
నివారణ లేదా?
సరైన ఆహారం తీసుకోవడం, సరైన బీఎంఐ మెయిటెన్ చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వంటివి గురకను నివారిస్తాయి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు నిద్రకు ఉపక్రమించడానికి నాలుగు నుంచి ఆరు గంటల ముందు వరకు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి గురక ఉంటే, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం గుర్తించవచ్చు.
అందుకే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడమే మంచిది. గురకవచ్చే వారు ఒకసారి డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించి అది ప్రమాదరహితమైన మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి సీపాప్ వంటి ఉపకరణాలు వాడటమో లేదా ఈఎన్‌టీ, పల్మునాలజిస్టులు చెప్పే సూచనలు పాటించడం, చికిత్స చేయించుకోవడం అవసరం.
చిట్టి చిట్కాలు..
- ఆరోగ్యవంతమైన జీవనశైలే సుఖ నిద్రకు ముఖ్యం. పైన చెప్పుకున్నట్లు క్రమబద్దమైన జీవనశైలిని అలవరుచుకోవాలి.
- నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి పడుకోవాలి.
- నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపిస్తే పడుకునే ముందు నేసల్ డ్రాప్స్ వేసుకోవాలి.
- పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ పూర్తిచేయాలి.
- రాత్రిపూట వ్యాయామం,వాకింగ్ వంటి చేయకూడదు.
- అలాగే రాత్రి వేళల్లో కాఫీటీల జోలికి అస్సలు వెళ్లకూడదు.
- అర టీస్పూన్ తేనెలో మరో అరటీస్పూన్ ఆలీవ్ ఆయిల్ కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఒక గ్లాసు నీటిలో రెండు చుక్కలు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి పడుకునే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే గురక తగ్గుముఖం పడుతుంది.
- ఒక గ్లాసు వేడినీటిలో అర టీస్పూన్ యలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్యనుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. పడుకునేముందు మరిగే నీటిలో ఐదుఆరు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా తరచూ చేస్తే గురక తగ్గుతుంది.
- వెల్లుల్లిని వాసన చూడడం ద్వారా శ్వాసనాళ తాత్కాలిక ఇబ్బందిని దూరం చేసి గురకను నివారించవచ్చు.
చదవండి: Cyber Crime: ఫోన్‌లోనే పరిచయం, చాటింగ్.. అమెరికా వెళ్దామని..
Comments
Please login to add a commentAdd a comment