నిద్ర గురకాయ స్వాహా!! | special story to Snoring | Sakshi
Sakshi News home page

నిద్ర గురకాయ స్వాహా!!

Published Wed, Nov 30 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

నిద్ర గురకాయ స్వాహా!!

నిద్ర గురకాయ స్వాహా!!

‘నిద్ర... గురకను మింగుతుందా?
గురక... నిద్రను మింగుతుందా?’
గురకే... నిద్రను మింగుతుందని నిపుణులు చెబుతున్నారు.
‘బాగా పడుకున్నావోయ్ రాత్రి... పక్క వీధి దాకా నీ గురక వినబడింది’ అని ఎవరైనా అంటే...
ఆయన పెట్టిన గురకతో ఈయనకు నిద్ర పట్టలేదనే కాదు...
ఆయన గురక వల్ల ఆయనకే  నిద్ర పట్టలేదని గమనించండి.
నిద్రకు అడ్డం పడేదే - గురక.
దాన్నే ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు.
ఈ ఆర్టికల్ చదివి...గురకను స్వాహా చేయండి.
గురకనే స్వాహా చేయండి.

శ్వాస తీసుకోవడం అనునిత్యం అవసరం. ఒక్క క్షణం ఆగినా తగినంత ఆక్సిజన్ అందక ప్రమాద పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే సమస్యే... ‘స్లీప్ ఆప్నియా’. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. అందుకే గురకను ఎప్పుడూ మంచి నిద్రకు సంకేతంగా కాక... శ్వాసకు అవరోధంగా భావించాలి. అలాంటి పరిస్థితిలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చికిత్సపై అవగాహన కోసమే ఈ కథనం.

‘ఆప్నియా’ అంటే ‘శ్వాస లేకపోవడం’ అని అర్థం. ఆప్నియా అనే పరిస్థితిలో నాలుక వెనకే ఉండే శ్వాసనాళం కొద్దిగా మూసుకుపోయినట్లు అవుతుంది. దాంతో శ్వాస ఆడదు. ఫలితంగా మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. అది ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు.

ఎందుకిలా అవుతుంది?
మనం నిద్రపోయినప్పుడు మన కండరాలు రిలాక్స్ అవుతాయి. దాంతోపాటే మన గొంతు కండరాలు కూడా. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కానీ... కొందరిలో వేలాడబడినట్లు (ఫ్లాపీ) మారిపోతాయి. ఒక్కోసారి శ్వాసనాళం కుంచించుకుపోయినట్లు అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే - గురక.  శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు.

గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. సమస్య తీవ్రం కావచ్చు.  కొందరిలో గొంతులోని కండరాలు  మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు. కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్‌లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు.

ఇక మరికొందరిలో ముక్కు దూలం కాస్త వంకరగా ఉండడం వల్ల కూడా గురక రావచ్చు. న్యూనతకు గురయ్యే వ్యక్తులు కొందరు కునుకు తీయడానికి కూడా భయపడి నిద్రలేమితో బాధపడతారు. గురకలో శ్వాస అందని పరిస్థితిని ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. రక్తసరఫరా కోసం, ఆక్సిజన్ కోసం  గుండె మరింత ఎక్కువ శ్రమిస్తుంది.

మెదడు ఒక అద్భుతం
మన మెదడు ప్రమాదకరమైన పరిస్థితిని వెంటనే పసిగడుతుంది. వెన్వెంటనే ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. తక్షణం శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితిని గుర్తెరిగి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మనకు నిద్రాభంగమై మేల్కొంటాం. తగినంత శ్వాస తీసుకున్న తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఈ పనులన్నీ మనకు తెలియకుండానే జరిగిపోయేలా మెదడు నిశ్శబ్దంగా పనిచేస్తుంటుంది. ఆ టైమ్‌లో మనల్ని ఎవరైనా చూస్తే అదేదో నిద్రలో ఒకసారి లేచి కాళ్లూ చేతులు ఆడించి, మళ్లీ పడుకున్నట్లుగా ఉంటుంది తప్ప... ఇంత ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లినట్లు తెలియనే తెలియదు.

పగటి నిద్రతో గుర్తించండి...
నిద్రలో అనేక సార్లు ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి వస్తుంది. ఒక్కోసారి కొన్ని  వందల సార్లు కూడా. ఇలా రాత్రివేళల్లో అనేక సార్లు నిద్రాభంగం కావడం వల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. అందుకే రాత్రుళ్లు గురకపెడుతూ, పగటి వేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు.

ఎవరెవరిలో ఆప్నియా?
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అన్నది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు.
పిల్లల్లో కూడా ఇది ఉండవచ్చు.
పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉన్నా, ముక్కు రంధ్రాల మధ్య ఉండే అడ్డుగోడ వంకరగా ఉన్నా స్లీప్ ఆప్నియా కనిపించవచ్చు.
స్థూలకాయులైన మధ్యవయస్కుల్లో ఈ సమస్య ఎక్కువ.
మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ (మధ్యవయస్కులైన పురుషుల్లో 4% మందిలో ఈ సమస్య ఉంటే, మహిళల్లో 2% మందిలో ఇది ఉంటుంది). సాధారణంగా 45 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో గురకపెడతారు. అయితే, వారిలో కేవలం 25 శాతం మందిలో మాత్రమే స్లీప్ ఆప్నియాకి చికిత్స అవసరమవుతుంది.

ఆప్నియాను గుర్తించే లక్షణాలు...
పగటి వేళ
చురుగ్గా ఉండాల్సిన సమయంలో మాటిమాటికీ నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం
తెల్లవారుజామున నిద్రలేవగానే తలనొప్పి, నోరంతా తడారిపోయినట్లుగా ఉండటం
నిద్ర లేచాక ఫ్రెష్‌గా లేకపోవడం
మాటిమాటికీ మూడ్స్ మారిపోతూ, తరచూ కోపం వస్తున్నట్లు అనిపించడం
ఎప్పుడూ అలసటగా ఉండటం

రాత్రివేళల్లో
పెద్ద శబ్దంతో గురకపెడుతుండటం
గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా శ్వాస ఆగడం
మాటిమాటికీ నిద్రాభంగం కావడం
రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం
నిద్రాభంగం కాగానే కాళ్లూ, చేతులు అకస్మాత్తుగా కుదుపునకు గురైనట్లు కదలడం

ఎవరెవరిలో ఆప్నియాతో చేటు?
మామూలుగానే ఆప్నియా ఉన్నవారిలో శ్వాసనాళం వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) మారుతుంది.
నిద్రమాత్రలు వాడే వారిలో నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకునేవారిలో
పరిస్థితి మరింత తీవ్రమై ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

ఆప్నియాతో ఆందోళన ఎందుకంటే...
సాధారణంగా ఆప్నియాతో ఎలాంటి ప్రాణాపాయమూ ఉండదు. అయితే కొందరిలో ఇది ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మాటిమాటికీ రక్తంలో ఉండాల్సిన   ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ర్పభావం చూపవచ్చు. కొందరిలో స్టీప్ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు.

నిర్ధారణ పరీక్షలు:
వ్యాధి చరిత్ర, గురక గురించి సమాచారం సేకరించడం కోసం ఒక ప్రశ్నావళితో కూడిన పత్రాన్ని రోగి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఆ ప్రశ్నవళిలోని సమాధానాలను బట్టి కూడా వ్యాధిని, తీవ్రతను నిర్ణయిస్తారు. వాటితో పాటు స్లీప్ ఎండోస్కోపీ, సినీ ఎమ్మారై ద్వారా వారి శ్వాస వ్యవస్థలో నిర్మాణ పరమైన (అనటామికల్) ఇబ్బందులు తెలుసుకుంటారు.

నిద్రలో గురకపెట్టేవారికి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి స్లీప్ ఆప్నియా నిర్ధారణ చేస్తారు. దీన్ని స్లీప్ ల్యాబ్‌లో, ఒక్కోసారి ఇంటిలో చేయవచ్చు. స్లీప్ ల్యాబ్‌లో ఉన్నప్పుడు రోగి కొంత ఒత్తిడికి గురై, సరిగా నిద్రపోలేకపోవచ్చు. అందుకే ఇంటిలోనే ఈ పరీక్ష చేయడానికి డాక్టర్లు ప్రాధాన్యం ఇస్తారు.

చికిత్స ఇలా...
ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్‌మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు.
కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు.

నివారించే మార్గాలు
మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి.
మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి.

చికిత్స ఇలా...
ఓ మోస్తరు స్లీప్ ఆప్నియా మొదలుకొని కాస్త తీవ్రమైన ఆప్నియా ఉన్నవారికి సీప్యాప్, లేదా బైప్యాప్ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా నిద్రపోతున్నవారికి ఆక్సిజన్ మాస్క్ లాంటి ఒక మాస్క్ అమర్చుతారు. దీనికి ఒక ఎలక్ట్రిక్ పంప్ అమర్చి ఉంటుంది. దీని సహాయంతో ఆక్సిజన్ తీసుకునే శ్వాసనాళాన్ని తెరచి ఉంచేలా చేస్తారు. దాంతో శ్వాసనాళం తెరచుకుని ఉండేలా చేస్తారు. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా శ్వాస అందేలా చేస్తారన్నమాట. దీంతో రోగులకు మంచి శ్వాసతో పాటు, నాణ్యమైన నిద్ర ఉంటుంది. మరికొందరిలో ‘వ్యూలో పాలటో ఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స ద్వారా శ్వాసవ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాలను సరిచేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు. హయాయిడ్ సస్పెషన్, మాండిబులార్ అడ్వాన్స్‌మెంట్, టార్స్ అనే శస్త్రచికిత్సల ద్వారా కూడా స్లీప్ ఆప్నియాను నియంత్రించవచ్చు.కొన్ని దవడ ఉపకరణాలతో చికిత్స చేయవచ్చు.

నివారించే మార్గాలు
మీ బరువును అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, ఎలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి.
మీరు ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి.
వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒకవైపు ఒరిగి పడుకోండి.
మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి.

రిస్క్ ఎవరిలో  ఎక్కువంటే...
స్లీప్ ఆప్నియా సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఈ కిందివారిలో ఎక్కువ.
స్థూలకాయుల్లో (అంటే...  బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో... మన బరువు కిలోగ్రాముల్లో తీసుకుని ఆ విలువను మన ‘ఎత్తు స్క్వేర్’తో భాగిస్తే వచ్చే విలువ 30, అంత కన్నా ఎక్కువ ఉంటే దాని స్థూలకాయంగా పరిగణిస్తారు).
పెద్ద శబ్దంతో గురకపెట్టే వారిలో   గతంలో గుండెపోటు వచ్చిన మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో
నియంత్రణ లేని రక్తపోటు ఉన్నవారిలో గుండె లయ సరిగా లేనివారిలో
రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారిలో ఇటీవల చాలా ఎక్కువగా బరువు పెరిగిన వారిలో.

వీరిలో ప్రమాదం  మరింత తీవ్రం
గురకపెడుతున్న వారికి పొగతాగే  అలవాటు ఉన్నా...
గురక పెట్టేవారికి స్థూలకాయం ఉన్నా...
వాళ్లలో ఒక్కోసారి పరిస్థితి అకస్మాత్తుగా ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వాళ్లలో ఆప్నియా కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
మీ తలను మీ పడక కంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి.

డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement