కాంతితో నిమిత్తం లేకుండానే
శాస్త్రవేత్తల సంచలన ప్రకటన
భూమిపై జీవజాలం,(Biome)మనుగడకు (oxygen)ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది!
అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండటం శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఇదెలా సాధ్యమవుతోందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్లు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటిమయమైన డార్క్‌మ్యాటరే ఎక్కువన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్క్‌మ్యాటర్‌లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతోకాలంగా సాగుతున్న వాదనలకు కొత్త బలం చేకూరింది.
ఎక్కడ కనిపెట్టారు?
బంగాళాదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్–క్లిప్పర్‌టన్ జోన్ (సీసీజెడ్)లో 13,100 అడుగుల లోతులో సముద్రగర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని
ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొడుతున్నాయి.
కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్‌మ్యాన్ చెప్పారు. ఇదెలా సాధ్యమవుతోందన్నది తేల్చేందుకు మూడేళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెర తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు! ‘‘ఈ ‘చీకటి ఆక్సిజన్’ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీజెడ్ మాదిరే సముద్రగర్భంలో ఇతర చోట్లా ఇలా ఆక్సిజన్ తయారవుతోందేమో కనిపెడతాం’’ అని స్వీట్‌మ్యాన్ చెప్పారు.
భూగర్భంలోనూ ఆక్సిజన్...?
సముద్ర గర్భంలోని శిలల్లోనే గాక భూమి లోలోపలి పొరల్లోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలో మసాచుసెట్స్‌లోని వుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ లేబోరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమీల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రియరీ భూముల్లోని అత్యంత లోతుల్లోనూ ఆక్సిజన్ ఉందని చెప్పారాయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ఆక్సిజన్ 40 వేల ఏళ్ల క్రితమే భూమి పొరల్లోకి చేరి ఉండాలని ఒక నివేదికలో పేర్కొన్నారు. సూక్షజీవులు కూడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు.
‘‘కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్‌లోని ఆక్సిజన్ పాడుచేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచి్చంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించాం. అవి తన మనుగడ కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, రెండు ఆక్సిజన్ అణువులను రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్‌గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకు అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోంది’’ అని రఫ్ అన్నారు.
మూడు కి.మీ. లోతులో
‘చీకటి ఆక్సిజన్’ జాడ కనిపెట్టేందుకు రఫ్ బృందం దక్షిణాఫ్రికాలో బంగారం, యురేనియం గనుల్లోకి వెళ్లింది. ఏకంగా 3 కి.మీ. లోతులో 120 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో ఆక్సిజన్‌ను కనుగొన్నారు. రేడియోధారి్మక గుణమున్న యురేనియం అక్కడి నీటితో చర్య జరపడం వల్ల ఆక్సిజన్ తయారై ఉంటుందన్న అంచనాకొచ్చారు.
నాసా ఆసక్తి
కాంతితో నిమిత్తం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమంటున్న తాజా పరిశోధనపై నాసా ఆసక్తి చూపుతోంది. చంద్రుని ఆవలివైపు కాంతి ప్రసారమే ఉండదు. అలాంటి చోట్ల ఈ ‘శిలాజ ఆక్సిజన్’ ద్వారా వ్యోమగాముల అవసరాలు తీర్చవచ్చని నాసా ఆశ పడుతోంది. మంచుతో కూడుకున్న శని, బృహస్పతి ఉపగ్రహాలు ఎన్సిలాడస్, యూరోపాలపై ఏ మేరకు పీడనం పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చా అని ఇప్పటినుంచే లెక్కలు వేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment