
రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ప్రశంసలు
నాలుగేళ్లలో 15,376 ఆక్సిజన్ పడకలు పెంపు
ఆక్సిజన్ పడకల్లో దేశంలో 8వ స్థానంలో ఏపీ
కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలను భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో కేవలం 2,643 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉండగా అనంతరం నాలుగేళ్లలో అదనంగా 15,376 ఆక్సిజన్ పడకలను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల సంఖ్య 18,019కి చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా వేగంగా ఆక్సిజన్ పడకలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడానికి పలు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ పడకల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది.
మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారు
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వికసిత్ భారత్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ ఆచరణలను నీతి ఆయోగ్ వెల్లడించింది. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
రాజకీయ నిబద్ధత, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సాంకేతిక సాధనాల వినియోగం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందస్తు శిక్షణ, అవగాహన కోసం కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్రచారాలు, నిఘాపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాజకీయ నిబద్ధతతో పాటు అధికారులు, భాగస్వాముల మధ్య సమన్వయం, ముందస్తు స్క్రీనింగ్‌లు, నిఘా, ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేటింగ్, డిజిటల్ పద్ధతులు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొంది.
క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడం, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడం, ప్రజల మానసిక, సామాజిక అవసరాలను పరిష్కరించడం, అవసరమైన ఆరోగ్య సేవల పంపిణీకి హామీ ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో ఉంచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో అత్యధికంగా కోవిడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు తెలిపింది.