చెన్నై: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మెడికల్ ఆక్సిజన్ కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం పళనిస్వామి కోరారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ అవసరమున్న కరోనా పేషెంట్లు ఎక్కువైనందున, నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ ప్రణాళిక అనుసరించి ఏపీ, తెలంగాణలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలిస్తున్న కారణంగా తమిళనాడులో సంక్షోభం తలెత్తే అవకాశముందన్నారు. ఇప్పటికే 310 టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రుల్లో వినియోగిస్తుండగా 220 మెట్రిక్ టన్నులే కేటాయించారని తెలిపారు. మహమ్మారి తీవ్రతను బట్టి రాష్ట్రానికి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ కాలుష్యంపై వివాదంతో 2018, మేలో మూతపడిన వేదాంత స్టెరిలైట్ యూనిట్‌ను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవలని నిర్ణయించింది. అలాగే, చెన్నై నగరానికి ఆక్సిజన్ సరఫరా చేసే శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మళ్లింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా రాష్ట్రంలో గత కోవిడ్ సమయంలో 58 వేల యాక్టివ్ కేసులు ఉండగా అవి ఇప్పుడు లక్షకు పెరిగిపోయాయని పళనిస్వామి వెల్లడించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment