చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్‌ పైప్‌లైన్‌! | Nasa planning to lay down gas pipeline on Moon South pole | Sakshi
Sakshi News home page

చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్‌ పైప్‌లైన్‌!

Published Sat, Nov 16 2024 5:48 AM | Last Updated on Sat, Nov 16 2024 5:50 AM

Nasa planning to lay down gas pipeline on Moon South pole

చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్‌ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్‌ సౌత్‌పోల్‌ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ (ఎల్‌–ఎస్‌పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్‌ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.

ఎలా చేస్తారు?
చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్‌ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్‌ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్‌ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.

→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.
→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి
→ పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది
→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement