Artemis program
-
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
చంద్రుడి మీదకు మనుషులు.. నాసా కీలక ప్రకటన!
చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్న నలుగురు ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ప్రారంభించింది. ఈ శిక్షణ 18 నెలల పాటు కొనసాగనుందని నాసా తెలిపింది. 51 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా ఆర్టెమిస్ 2పై పనిచేస్తుంది. ఇందులో భాగంగా జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లును సురక్షితంగా తీసుకెళ్లే ఓరియన్ క్యాప్య్సూల్, స్పేస్ లాంచ్ సిస్టం గురించి ఈ 18 నెలల కఠిన శిక్షణలో వివరించనుంది. వీటితో పాటు సిస్టమ్‌లను ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం కూడా నేర్చుకుంటారు. ఆరోహణ, కక్ష్య, తీరం, ఎంట్రీ ఫేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి’ అనే అంశం గురించి ఆస్ట్రోనాట్స్ వీరికి వివరించనుంది. View this post on Instagram A post shared by NASA (@nasa) -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుని చెంతకు ఓరియాన్
వాషింగ్టన్: పలు అడ్డంకుల్ని, బాలారిష్టాల్ని దాటుకుంటూ నాసా ఇటీవల ఎట్టకేలకు ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రున్ని చేరి చరిత్ర సృష్టించింది. అది చందమామకు వెనకవైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్లిందని నాసా సోమవారం ప్రకటించింది. దీన్ని అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణించింది. నాసా విడుదల చేసిన వీడియోల్లో చంద్రుడు అతి భారీ పరిమాణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్ రాకెట్ ద్వారా గత బుధవారం ఓరియాన్‌ను నాసా ప్రయోగించడం తెలిసిందే. ఇందులో మనుషులను పోలిన మూడు డమ్మీలను పంపారు. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో మిషన్ తర్వాత చంద్రున్ని చేరిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇది విజయవంతమైతే తర్వాతి మిషన్‌లో మనుషులను, 2024లో మూడో మిషన్‌లో వ్యోమగాములను పంపనున్నారు. సరిగ్గా ఓరియాన్ చంద్రునికి అత్యంత సమీపానికి చేరిన సమయానికే అరగంట పాటు దాన్నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఒక దశలో గందరగోళం నెలకొంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే శుక్రవారం మరో ఇంజన్‌ను పేల్చడం ద్వారా ఓరియాన్‌ను చంద్రుని కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. చంద్రునిపై దిగకుండా దాదాపు వారంపాటు అది కక్ష్యలోనే గడుపుతుంది. అనంతరం డిసెంబర్ 11న భూమికి తిరిగి రావాలన్నది ప్లాన్. -
ఆర్టెమిస్ 1 ప్రయోగం నిలిపివేత.. ప్రకటించిన నాసా
తల్లాహస్సీ: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్లు ఇంజిన్లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్‌డౌన్ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా. The countdown clock is on a hold at T-40 minutes. The hydrogen team of the @NASA_SLS rocket is discussing plans with the #Artemis I launch director. Operational commentary continues at https://t.co/z1RgZwQkWS. pic.twitter.com/5J6rHVCe44 — NASA (@NASA) August 29, 2022 The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom — NASA (@NASA) August 29, 2022 ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. శాశ్వత ఆవాసాల కోసం.. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి. ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?