అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ తయారీ | NASA just compiled a map of lunar water | Sakshi
Sakshi News home page

అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ తయారీ.. కీలక ప్రయోగానికి ఏర్పాట్లు

Published Mon, Mar 20 2023 5:05 AM | Last Updated on Mon, Mar 20 2023 8:12 AM

NASA just compiled a map of lunar water - Sakshi

జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్‌)ను తాజాగా రూపొందించారు.

దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్‌’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై..
► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్‌ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు.  
► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్‌ కవర్‌ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది.  
► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు.  
► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్‌ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది.  
► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు.  
► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు.  


ఆర్టిమిస్‌ ప్రయోగం  
► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్‌ సైట్లను గుర్తించింది.  
► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది.  
► ఆర్టిమిస్‌ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. 
► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి.  
► చంద్రుడి నీటి మ్యాప్‌ ఆర్టిమిస్‌ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్‌’సైన్స్‌ టీమ్‌ సభ్యుడు కాసీ హానీబాల్‌ చెప్పారు.
 

అరుణ గ్రహంపై జల సవ్వడి!
అంగారక గ్రహం (మార్స్‌)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్‌ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్‌) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు.

ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement