Aruna Graham
-
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్స్ పైకి ‘పెర్సీ’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’పంపించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం(భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) ఆ గ్రహంపై దిగనుంది. ‘మార్స్ 2020’ ప్రయోగంలో భాగంగా అక్కడ రాళ్లు, మట్టి తదితరాలను సేకరించనుంది. రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన తరువాత ఆ విషయాన్ని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి సంకేతాలను పంపిస్తుంది. ల్యాండింగ్ విజయవంతమైతే.. మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’ నిలుస్తుంది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’ నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్. ఇది కార్ సైజ్‌లో ఉంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. స్వాతి మోహన్ కీలక పాత్ర ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
అంగారకుడిపైకి చైనా!
బీజింగ్: అరుణ గ్రహంపైకి ఓ శోధక నౌకను ప్రయోగించడంలో చైనా గురువారం విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్–5 రాకెట్ ద్వారా వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి గురువారం నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించిందని, ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. తియాన్‌విన్–1 పేరున్న ఈ శోధక నౌక అరుణగ్రహంపై దిగిన తరువాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తరువాత శోధక నౌకలోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు విడిపోతాయని, ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు నిర్వహిస్తుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలిపింది. ల్యాండర్/రోవర్లు తమంతట తాముగా అంగారక గ్రహంపై ల్యాండ్ అవుతాయని తెలిపింది. ఆరు చక్రాలున్న రోవర్ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్‌హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
అంగారకుడిపై నీటికి కొత్త ఆధారాలు..
వాషింగ్టన్: అరుణగ్రహంపై గేల్ క్రేటర్‌లో 300 కోట్ల ఏళ్ల క్రితం ఇలా ఓ భారీ సరస్సు ఉండేదట. కాలక్రమంలో సరస్సులోకి నీరు పదేపదే ప్రవహించడం, బలమైన గాలుల వల్ల ఇసుక, మట్టి, బురద పొరలుపొరలుగా పేరుకుంటూ పోయి చివరకు శిలలు, గుట్టలుగా రూపాంతరం చెందాయని, 154 కి.మీ. వైశాల్యంలో ఉన్న గేల్ క్రేటర్‌లోని 5 కి.మీ. ఎత్తయిన మౌంట్ షార్ప్ పర్వతం అలాగే ఏర్పడి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. మౌం ట్షార్ప్ పర్వతంపైకి ప్రయాణిస్తూ.. ఆ పర్వత పాదం వద్ద శిలలను పరిశీలిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫొటోల ఆధారంగా తాము అధ్యయనం చేయగా.. ఈ విషయం వెల్లడైందని భారతీయ అమెరికన్, క్యూరియాసిటీ ప్రాజెక్టు డిప్యూటీ శాస్త్రవేత్త అశ్విన్ వాసవదా వెల్లడించారు. మార్స్‌పై ఒకప్పుడు సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణం, సరస్సులు ఉండేవనడానికి ఇవి మరిన్ని రుజువులు అని పేర్కొన్నారు. మౌంట్ షార్ప్ వద్ద ఇసుకరాతి పొరలను చూస్తే.. పురాతన కాలంలో అక్కడ నీటి ప్రవాహాల వల్ల ఒకదానిపై ఒకటి డెల్టా పొరలు ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. ఈ పరిశోధనలో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ గుప్తా కూడా పాల్గొన్నారు.