మార్స్‌పై పెర్సీ ఊహాచిత్రం
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’పంపించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం(భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) ఆ గ్రహంపై దిగనుంది. ‘మార్స్ 2020’ ప్రయోగంలో భాగంగా అక్కడ రాళ్లు, మట్టి తదితరాలను సేకరించనుంది. రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన తరువాత ఆ విషయాన్ని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి సంకేతాలను పంపిస్తుంది. ల్యాండింగ్ విజయవంతమైతే.. మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’ నిలుస్తుంది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’ నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్.
ఇది కార్ సైజ్‌లో ఉంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది.
స్వాతి మోహన్ కీలక పాత్ర
ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే.
Comments
Please login to add a commentAdd a comment