Indian-Origin Professor Sanjeev Gupta Life Story, Telugu - Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: లండన్‌ టు అంగారకుడు

Published Wed, Mar 3 2021 12:22 AM | Last Updated on Wed, Mar 2 2022 7:07 PM

Professor Sanjay Gupta Life Story - Sakshi

భూమి పైనుండి అంగారక పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్‌ సంజీవ్‌ గుప్తా.. బ్రిటన్‌ నుంచి అమెరికా మాత్రం ప్రయాణించలేకపోయారు! కారణం కరోనా నిబంధనలు. ప్రస్తుతం మార్స్‌ పైనున్న ‘పెర్సీ’ చేత రాళ్లు రప్పలూ, మట్టి ఎత్తించవలసింది ఆయనే. సంజీవ్‌ గుప్తా జియాలజిస్ట్‌. నాసా సైంటిస్ట్‌. ఎర్సీ టీమ్‌ మొత్తం కాలిఫోర్నియాలోని ‘జెట్‌ ప్రొపెల్షన్‌ లేబరేటరీ’ నుంచి పని చేస్తుంటే, ఆ టీమ్‌ సభ్యుడు అయిన సంజీవ్‌ ఒక్కరే సౌత్‌ లండన్‌ లోని ఒక అపార్ట్‌మెంట్‌ నుంచి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేస్తున్నారు! తొమ్మిదేళ్ల తర్వాత పెర్సీ భూమి మీదకు తిరిగి వస్తుంది. అప్పటి వరకు ప్రొఫెసర్‌ సంజీవ్‌ (55) ఈ అపార్ట్‌మెంట్‌ లోనే 5 కంప్యూటర్‌ లు, 2 వీడియో కాన్ఫెరెన్సింగ్‌ స్క్రీన్‌ లతో 24 గంటలూ పనిచేస్తుంటారు. మార్స్‌ ది ఒక టైమ్‌ జోన్‌. కాలిఫోర్నియాది ఒక టైమ్‌ జోన్‌. సౌత్‌ లండన్‌ది ఒక టైమ్‌ జోన్‌. మూడు భిన్నమైన టైమ్‌ జోన్‌ల పర్మినెంట్‌ ‘జెట్‌ లాగ్‌’ నుంచి ఆయన్ని సేద తీర్చే మోనిటర్‌లు భార్యాపిల్లలే. ఇంతలా వర్క్‌ని, హోమ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకుంటున్న ప్రొఫెసర్‌ సంజీవ్‌ గుప్తా ‘గ్రహస్తు జీవితం’ గురించి తెలుసుకోవలసిందే.

దక్షిణ లండన్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో దిగువ భాగాన ఉన్న హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌కు సరిగ్గా పై పోర్షన్‌లో ఉంటారు ప్రొఫెసర్‌ సంజీవ్‌ గుప్తా. అక్కడి నుంచి ఆయన తన ఆఫీస్‌ వర్క్‌ చేస్తుంటారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. ఇంటిలో నుంచి ఆఫీస్‌ పని చేస్తున్నా, ఆయన చేస్తున్నది భూమి పై ఉన్న ఆఫీస్‌ పని కాదు. మార్స్‌ పని! వాడుక పలుకుబడిలో చెప్పాలంటే.. ఈ నెల 18న అంగారకుడిపై దిగిన రోవర్‌ ‘పెర్సీ’ చేత మట్టి తట్టలు మోయించే పనిలో ఉన్నారు సంజీవ్‌ గుప్తా! కేవలం మట్టి మాత్రమే కాదు. రాళ్లూ రప్పలు కూడా. పెర్సీ వాటిని చిన్న చిన్న మూటలు కట్టి ఉంచుతుంది. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు తనతో పాటు ఆ మూటల్ని తెస్తుంది. ఆ తర్వాత వాటిని స్టడీ చేసే బాధ్యత కూడా సంజీవ్‌ గుప్తాదే. ఆయన జియాలజిస్టు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి ఒక్కటే కాదు. గ్రహాల ఉపరితలాల నేలల్ని, సముద్రాల అట్టడుగుల్నీ అధ్యయనం చేయగల నిపుణులు. నాసా సైంటిస్ట్‌. పెర్సీని అంగారకుడికి పంపడంలోని నాసా ఉద్దేశం తెలిసిందే. మానవ నివాస యోగ్యమైన వాతావరణం అక్కడ ఉందా లేదా, ఉండి ఉండేదా అని తెలుసుకోవడం.

నాసా కోసం ప్రొఫెసర్‌ సంజీవ్‌ గుప్తా (55) ఉండవలసింది యూ.ఎస్‌లోనే అయినప్పటికీ బ్రిటన్‌ నుంచే పని చేస్తున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కుటుంబం వాళ్లది. గుప్తా లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ ప్రొఫెసర్‌. యు.ఎస్‌. మార్స్‌ ‘పెర్సీ’ ప్రాజెక్ట్‌ బృందంలో ఆయన కీలక సభ్యుడు. భార్యా పిల్లలు లండన్‌లో ఉండటంతో వాళ్లతోపాటు సంజీవ్‌ను అక్కడే ఉండి ప్రాజెక్ట్‌ పని చేసేందుకు నాసా సమ్మతించింది. అందుకు అవసరమైన ఉపకరణాలను, టెక్నాలజీని ఆయన ఆపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసింది. ఐదు కంప్యూటర్‌లు, రెండు వీడియో కాన్ఫరెన్సింగ్‌ స్క్రీన్‌లు, మధ్య మధ్య భార్య అందించే టీ, టిఫిన్‌లు, భోజనం, కాఫీలతో ఆయన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. నిద్రవేళల్ని కూడా మెల్లిగా ఆయన క్రమబద్ధం చేసుకోగలిగారు.

అంగారకుడిపై ఉన్న రోవర్‌ కదలికల్ని అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్రాంతాల సమన్వయంతో నియంత్రిస్తూ ఉండవలసిన ఒక శాస్త్రవేత్త వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎలా ఉంటుందో ఊహించండి. పెర్సీ ఉన్నది మార్స్‌ మీద. పెర్సీ బృందం ఉన్నది కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీలో. ప్రొఫెసర్‌గారు ఉన్నది దక్షిణ లండన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో. మూడూ మూడు టైమ్‌ జోన్‌లు. ఒకసారి విమానయానం చేసొస్తేనే ‘జెట్‌ లాగ్‌’ అంటుంటారు. అలాంటి వివిధ టైమ్‌ జోన్‌లలో సంజీవ్‌ గుప్తా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆ శక్తిని ఇస్తున్నది చేస్తున్న పని ధ్యాస మాత్రమే కాదు. భూమిపై ఆయన్నొక పెర్సీలా కనిపెట్టుకుని ఉంటున్న అర్ధాంగి కూడా.

జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీలో వందల మంది నాసా సైంటిస్టులు ల్యాప్‌టాప్‌లోకి కూరుకుపోయి గడియారాల్లా పని చేస్తుంటారు. వారందరితో ఏకకాలంలో గానీ, విడివిడి గానీ ప్రొఫెసర్‌ సంజీవ్‌ మాట్లాడవలసి ఉంటుంది. ఇది ఆయన కు పెద్దసంగతేమీ కాదు. ప్రస్తుతం ఆయన మానసికంగా 2030లో ఉన్నారు! భూమిపైకి పెర్సీ మణులు మాణిక్యాల్లాంటి మట్టి రాళ్లను తీసుకొచ్చే సంవత్సరం అది. 1,043 కిలోల బరువు గల ఆ రోవర్‌ను అంగారకుడిపై కదిలిస్తూ ఉండే శాస్త్రవేత్త ఒకరు. రీచార్జ్‌ చేస్తుండేవారొకరు. ప్రోగ్రామింగ్‌ చేస్తుండేవారు వేరొకరు. ఇలా పెర్సీ ప్రాజెక్ట్‌ టీమ్‌లో ప్రొఫెసర్‌ సంజీవ్‌ ఒకరు. ఏ రాయిని పడితే ఆ రాయిని, ఏ ధూళిని పడితే ఆ ధూళిని కాకుండా, జీవం కనుగొనేందుకు వీలైన వాటిని పెర్సీ చేతబట్టేలా చేయడం ఆయన ప్రధాన విధి. పెర్సీ దిగేందుకు ‘జెజెరో’ బిలాన్ని ఎంపిక చేసినవారిలో సంజీవ్‌ కూడా ఉన్నారు.

సంజీవ్‌ గుప్తాకు 5 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు ఆగ్రా నుంచి బ్రిటన్‌ వలస వెళ్లారు. ఆయన తండ్రి కూడా రిసెర్చ్‌ సైంటిస్టే. అయితే తన కొడుకు మెడిసిన్‌ గానీ, మామూలు ఇంజినీరింగ్‌ గానీ చేయాలని ఆయన అనుకున్నారు. సంజీవ్‌ మాత్రం జియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ప్‌ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయనే విషయమై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ‘సెయింట్‌ క్రాస్‌ కాలేజీలో’ సంజీవ్‌ పీహెచ్‌.డీ చేశారు. హిమాలయాలు, జర్మనీలోని ‘బ్లాక్‌ ఫారెస్ట్‌’ పర్వత శ్రేణులు, అట్లాంటిక్‌ సముద్ర గర్భంలోని అడుగు నేలలపైన కూడా సంజీవ్‌ గుప్తా అధ్యయనం జరిపారు. అంగారకుడిపై నీటి జాడలు ఉండేవని కానీ, ఉన్నట్లు లేవని ఈ ప్రపంచానికి నిర్థారణగా చెప్పగలవారు ప్రస్తుతానికైతే గుప్తా ఒక్కరే.

అలాగని అందుకు తోడ్పడే పెర్సీ ‘మట్టిమూటల’ కోసం ఆయన మరో పదేళ్లు ఆగనక్కర్లేదు. ఈలోపే వేరొక మార్గంలో అంగారకుడి నుంచి భూమి పైకి ఆక్కడి మట్టి నమూనాలు చేరినా చాలు. వాటిని సంజీవ్‌ విశ్లేషిస్తారు. ‘వేరొక మార్గం’ అంటే.. ఇప్పుడు పెర్సీని అంగారకుడిపై వదిలి వచ్చిన వన్‌ టైమ్‌ రాకెట్‌ కాకుండా, భూమిపైకి తిరిగి వచ్చే రీ యూజబుల్‌ రాకెట్‌ అక్కడికి వెళ్లినప్పుడు పెర్సీ సేకరించిన నమూనాలను తీసుకురావడం. తెచ్చి సంజీవ్‌ చేతికివ్వడం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement