indian origin scientist
-
వర్క్ ఫ్రమ్ హోమ్: లండన్ టు అంగారకుడు
భూమి పైనుండి అంగారక పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా.. బ్రిటన్ నుంచి అమెరికా మాత్రం ప్రయాణించలేకపోయారు! కారణం కరోనా నిబంధనలు. ప్రస్తుతం మార్స్ పైనున్న ‘పెర్సీ’ చేత రాళ్లు రప్పలూ, మట్టి ఎత్తించవలసింది ఆయనే. సంజీవ్ గుప్తా జియాలజిస్ట్. నాసా సైంటిస్ట్. ఎర్సీ టీమ్ మొత్తం కాలిఫోర్నియాలోని ‘జెట్ ప్రొపెల్షన్ లేబరేటరీ’ నుంచి పని చేస్తుంటే, ఆ టీమ్ సభ్యుడు అయిన సంజీవ్ ఒక్కరే సౌత్ లండన్ లోని ఒక అపార్ట్మెంట్ నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్నారు! తొమ్మిదేళ్ల తర్వాత పెర్సీ భూమి మీదకు తిరిగి వస్తుంది. అప్పటి వరకు ప్రొఫెసర్ సంజీవ్ (55) ఈ అపార్ట్మెంట్ లోనే 5 కంప్యూటర్ లు, 2 వీడియో కాన్ఫెరెన్సింగ్ స్క్రీన్ లతో 24 గంటలూ పనిచేస్తుంటారు. మార్స్ ది ఒక టైమ్ జోన్. కాలిఫోర్నియాది ఒక టైమ్ జోన్. సౌత్ లండన్‌ది ఒక టైమ్ జోన్. మూడు భిన్నమైన టైమ్ జోన్ల పర్మినెంట్ ‘జెట్ లాగ్’ నుంచి ఆయన్ని సేద తీర్చే మోనిటర్లు భార్యాపిల్లలే. ఇంతలా వర్క్‌ని, హోమ్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ‘గ్రహస్తు జీవితం’ గురించి తెలుసుకోవలసిందే. దక్షిణ లండన్‌లోని ఒక అపార్ట్మెంట్లో దిగువ భాగాన ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు సరిగ్గా పై పోర్షన్లో ఉంటారు ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా. అక్కడి నుంచి ఆయన తన ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటిలో నుంచి ఆఫీస్ పని చేస్తున్నా, ఆయన చేస్తున్నది భూమి పై ఉన్న ఆఫీస్ పని కాదు. మార్స్ పని! వాడుక పలుకుబడిలో చెప్పాలంటే.. ఈ నెల 18న అంగారకుడిపై దిగిన రోవర్ ‘పెర్సీ’ చేత మట్టి తట్టలు మోయించే పనిలో ఉన్నారు సంజీవ్ గుప్తా! కేవలం మట్టి మాత్రమే కాదు. రాళ్లూ రప్పలు కూడా. పెర్సీ వాటిని చిన్న చిన్న మూటలు కట్టి ఉంచుతుంది. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు తనతో పాటు ఆ మూటల్ని తెస్తుంది. ఆ తర్వాత వాటిని స్టడీ చేసే బాధ్యత కూడా సంజీవ్ గుప్తాదే. ఆయన జియాలజిస్టు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి ఒక్కటే కాదు. గ్రహాల ఉపరితలాల నేలల్ని, సముద్రాల అట్టడుగుల్నీ అధ్యయనం చేయగల నిపుణులు. నాసా సైంటిస్ట్. పెర్సీని అంగారకుడికి పంపడంలోని నాసా ఉద్దేశం తెలిసిందే. మానవ నివాస యోగ్యమైన వాతావరణం అక్కడ ఉందా లేదా, ఉండి ఉండేదా అని తెలుసుకోవడం. నాసా కోసం ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా (55) ఉండవలసింది యూ.ఎస్‌లోనే అయినప్పటికీ బ్రిటన్ నుంచే పని చేస్తున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కుటుంబం వాళ్లది. గుప్తా లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్. యు.ఎస్. మార్స్ ‘పెర్సీ’ ప్రాజెక్ట్ బృందంలో ఆయన కీలక సభ్యుడు. భార్యా పిల్లలు లండన్‌లో ఉండటంతో వాళ్లతోపాటు సంజీవ్‌ను అక్కడే ఉండి ప్రాజెక్ట్ పని చేసేందుకు నాసా సమ్మతించింది. అందుకు అవసరమైన ఉపకరణాలను, టెక్నాలజీని ఆయన ఆపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసింది. ఐదు కంప్యూటర్లు, రెండు వీడియో కాన్ఫరెన్సింగ్ స్క్రీన్లు, మధ్య మధ్య భార్య అందించే టీ, టిఫిన్లు, భోజనం, కాఫీలతో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. నిద్రవేళల్ని కూడా మెల్లిగా ఆయన క్రమబద్ధం చేసుకోగలిగారు. అంగారకుడిపై ఉన్న రోవర్ కదలికల్ని అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్రాంతాల సమన్వయంతో నియంత్రిస్తూ ఉండవలసిన ఒక శాస్త్రవేత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో ఊహించండి. పెర్సీ ఉన్నది మార్స్ మీద. పెర్సీ బృందం ఉన్నది కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో. ప్రొఫెసర్‌గారు ఉన్నది దక్షిణ లండన్‌లోని తన అపార్ట్మెంట్లో. మూడూ మూడు టైమ్ జోన్లు. ఒకసారి విమానయానం చేసొస్తేనే ‘జెట్ లాగ్’ అంటుంటారు. అలాంటి వివిధ టైమ్ జోన్లలో సంజీవ్ గుప్తా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆ శక్తిని ఇస్తున్నది చేస్తున్న పని ధ్యాస మాత్రమే కాదు. భూమిపై ఆయన్నొక పెర్సీలా కనిపెట్టుకుని ఉంటున్న అర్ధాంగి కూడా. జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో వందల మంది నాసా సైంటిస్టులు ల్యాప్‌టాప్‌లోకి కూరుకుపోయి గడియారాల్లా పని చేస్తుంటారు. వారందరితో ఏకకాలంలో గానీ, విడివిడి గానీ ప్రొఫెసర్ సంజీవ్ మాట్లాడవలసి ఉంటుంది. ఇది ఆయన కు పెద్దసంగతేమీ కాదు. ప్రస్తుతం ఆయన మానసికంగా 2030లో ఉన్నారు! భూమిపైకి పెర్సీ మణులు మాణిక్యాల్లాంటి మట్టి రాళ్లను తీసుకొచ్చే సంవత్సరం అది. 1,043 కిలోల బరువు గల ఆ రోవర్‌ను అంగారకుడిపై కదిలిస్తూ ఉండే శాస్త్రవేత్త ఒకరు. రీచార్జ్ చేస్తుండేవారొకరు. ప్రోగ్రామింగ్ చేస్తుండేవారు వేరొకరు. ఇలా పెర్సీ ప్రాజెక్ట్ టీమ్‌లో ప్రొఫెసర్ సంజీవ్ ఒకరు. ఏ రాయిని పడితే ఆ రాయిని, ఏ ధూళిని పడితే ఆ ధూళిని కాకుండా, జీవం కనుగొనేందుకు వీలైన వాటిని పెర్సీ చేతబట్టేలా చేయడం ఆయన ప్రధాన విధి. పెర్సీ దిగేందుకు ‘జెజెరో’ బిలాన్ని ఎంపిక చేసినవారిలో సంజీవ్ కూడా ఉన్నారు. సంజీవ్ గుప్తాకు 5 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు ఆగ్రా నుంచి బ్రిటన్ వలస వెళ్లారు. ఆయన తండ్రి కూడా రిసెర్చ్ సైంటిస్టే. అయితే తన కొడుకు మెడిసిన్ గానీ, మామూలు ఇంజినీరింగ్ గానీ చేయాలని ఆయన అనుకున్నారు. సంజీవ్ మాత్రం జియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ప్ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయనే విషయమై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ‘సెయింట్ క్రాస్ కాలేజీలో’ సంజీవ్ పీహెచ్.డీ చేశారు. హిమాలయాలు, జర్మనీలోని ‘బ్లాక్ ఫారెస్ట్’ పర్వత శ్రేణులు, అట్లాంటిక్ సముద్ర గర్భంలోని అడుగు నేలలపైన కూడా సంజీవ్ గుప్తా అధ్యయనం జరిపారు. అంగారకుడిపై నీటి జాడలు ఉండేవని కానీ, ఉన్నట్లు లేవని ఈ ప్రపంచానికి నిర్థారణగా చెప్పగలవారు ప్రస్తుతానికైతే గుప్తా ఒక్కరే. అలాగని అందుకు తోడ్పడే పెర్సీ ‘మట్టిమూటల’ కోసం ఆయన మరో పదేళ్లు ఆగనక్కర్లేదు. ఈలోపే వేరొక మార్గంలో అంగారకుడి నుంచి భూమి పైకి ఆక్కడి మట్టి నమూనాలు చేరినా చాలు. వాటిని సంజీవ్ విశ్లేషిస్తారు. ‘వేరొక మార్గం’ అంటే.. ఇప్పుడు పెర్సీని అంగారకుడిపై వదిలి వచ్చిన వన్ టైమ్ రాకెట్ కాకుండా, భూమిపైకి తిరిగి వచ్చే రీ యూజబుల్ రాకెట్ అక్కడికి వెళ్లినప్పుడు పెర్సీ సేకరించిన నమూనాలను తీసుకురావడం. తెచ్చి సంజీవ్ చేతికివ్వడం. -
చల్లని ‘రాజా’ ఓ చందమామ
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అంటారు.ఈ చిత్రాన్ని చూడండి...పదాలు మాత్రమే కాదు కల, పట్టుదల కలిసికట్టుగా కనిపిస్తాయి. చంద్రుడి పైకి పంపడానికి ‘నాసా’ ఎంపిక చేసిన బృందంలో ఒకరైన రాజాచారి పదకొండు సంవత్సరాల వయసులో తయారుచేసిన పోస్టర్ ఇది.. రాజాచారి పదకొండు ఏళ్ల వయసులో, ప్రస్తుతం.. నిన్న అనేది నేటి జ్ఞాపకంరేపు అనేది నేటి కల. –ఖలీల్ జిబ్రాన్ చిన్న వయసులో పిల్లలు కనే కలలు పెద్దలకు మురిపెంగా ఉంటాయి. చాలామంది పిల్లల్లో ఆ కలలు వయసు పెరుగుతున్నకొద్దీ కరిగిపోతుంటాయి. కొందరు దీనికి మినహాయింపు. వారిలో కలలు కరిగిపోవు. బలపడతాయి. రాజాచారి ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘రాజాచారి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరు. ‘నాసా’ చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇండియన్–అమెరికన్ రాజాచారి ఒకరు. పదకొండు సంవత్సరాల వయసులో ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్నాడు రాజా. ‘ఇది పిల్లకల’ అని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోలేదు. ఆ కలల సౌధానికి దగ్గర కావడానికి ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ఉన్నత చదువు, సక్సెస్ఫుల్ కెరీర్ కోసం శ్రీనివాస్‌చారి(రాజా తండ్రి) ఇంజనీరింగ్ డిగ్రీతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడ అమెరికన్ పెగ్గి ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే రాజాచారి. రాజా చిన్నప్పుడు కాగితాలు, మెటల్ హుక్‌లతో బొమ్మ విమానాలు తయారుచేసి మురిసిపోయేవాడు. పక్కింటి పిల్లలు ఈ బొమ్మల కోసం పరుగులు తీస్తూవచ్చేవారు. తన భుజాలకు రెక్కలు తగిలించుకొని ఊహాల్లో ఆకాశంలోకి వెళ్లి వచ్చేవాడు రాజా. ‘ఫాంటసీ ప్రపంచం’లో వీరవిహారం చేసేవాడు. తల్లి టీచర్ కావడంతో ‘చందమామ పాఠాలు’ ఆసక్తికరంగా చెప్పేది. ఎన్నో సందేహాలను ఓపిగ్గా తీర్చేది. సైన్స్ మాత్రమే కాదు సంగీతం అంటే కూడా రాజాకు బాగా ఇష్టం. రెండేళ్ల వయసులోనే సుజుకి మెథడ్ వయోలిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆరేళ్ల వయసులో ఫ్రెంచ్ హార్న్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.‘నీ బ్రెయిన్లో కుడి,ఎడమ భాగాలు సమానంగా వృద్ధి చేయడానికి ప్రయత్నించు’ అని రాజాకు పదేపదే చెప్పేది తల్లి. మెదడులోని ఎడమభాగం విశ్లేషణ, కుడిభాగం సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. స్ఫూర్తిని ఇచ్చే వాళ్లు పెద్దల రూపంలో మన చేరువలోనే ఉంటారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌చారి అలాంటి వారే. చేతిలో ఇంజనీరింగ్ పట్ట, గుండెలో ధైర్యం...అంతే...అమెరికాకు వచ్చేశాడు. దేశం కాని దేశం. తెలియని మనుషులు. తెలియని కష్టాలు..కాని ఇవేమీ ఆయన ఆలోచించలేదు. అర్జునుడి చూపు పిట్టకన్ను మీదే ఉన్నట్లు శ్రీనివాస్ కన్ను కూడా ఒకే లక్ష్యాన్ని చూసింది. సాధించాలి....ఎలాగైనా సాధించాలి! ఆయన తన ప్రయాణంలో విజయాన్ని సాధించాడు. ఆ స్ఫూర్తిని కుమారుడికి అందించాడు.‘బాగా కష్టపడి చదివితే ఎన్నో ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కష్టాన్ని ఇష్టపడాలి’ అని రాజాచారితో చెబుతుండేవారు శ్రీనివాస్.‘‘ఇతరులు ఏమైనా అనుకుంటారని, హేళన చేస్తారనే భయం నాలో ఎప్పుడూ లేదు. నేను ఒకటి ఇష్టపడ్డాను అంటే. ఇక అంతే...చాలా కష్టపడతాను’ అంటాడు రాజాచారి. ఆ కష్టమే అతడిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేసేలా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్డిగ్రీ చేసేలా చేసింది. టెస్ట్ పైలట్‌గా మార్చింది. ఆతరువాత తన ఆస్ట్రోనాట్ కల గుర్తుకు వచ్చింది. అదేమీ ఆషామాషీ కల కాదు. అలా అని వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ‘నాసా’లో పనిచేసే వ్యక్తులను కలవడం మొదలైంది. వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారు. కమాండర్ ఆఫ్ ది 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్, డైరెక్టర్ ఆఫ్ ది ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్గా తన టాలెంట్ చాటుకున్న చారి 2017లో నాసా ‘ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్’కు ఎంపికయ్యాడు. టెస్ట్ పైలట్‌గా రోజువారీ సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెదికే ధైర్యం ‘నాసా కమ్యూనిటీ’లో ఉపయోగపడింది. ‘నిరంతర పఠనం, నిరంతరం మెరుగుపరుచుకోవడం ఇదే నా జీవనతత్వం’ అని చెబుతున్న రాజాచారికి జయహో చెబుదాం. -
చందమామపైకి రాజాచారి!
వాషింగ్టన్ : చందమామను మళ్లీ అందుకునే యత్నాలు ఆరంభించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ఆర్టిమిస్‌లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది. మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే కావడం విశేషం. విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు. వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో జరిగిన వైట్ హౌస్ జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో చంద్రుడిపైకి పంపే వారి తుది జాబితాను ఖరారు చేశారు. అమెరికా ఉపా«ధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ‘‘మన భావి హీరోలను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లంతా చంద్రుడి పైకి వెళ్లి చరిత్రను తిరగరాస్తారు. వీరిని ఆర్టిమిస్ తరంగా భావించవచ్చు’’ అని మైక్ పెన్స్ చెప్పారు. నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది. ఆకాశంలోనే కాదు.. ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. గత ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్ పాట్ ఫారెస్ట్ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు. మనోడే.. నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గణితశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చారి. తన 13 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయిన శ్రీనివాస్ తల్లి, అక్కల సంరక్షణలో పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1970లో శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు. విస్కన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుండగా పెగ్గీ ఎగ్బర్ట్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు డేటింగ్ చేశాక 1976లో పెళ్లి చేసుకున్నారు. వారికి 1977 జూన్ 25న రాజాచారి జన్మించారు. అయోవా రాష్ట్రంలో పెరిగిన రాజాచారి ప్రఖ్యాత మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ నుంచి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు. 43 ఏళ్ల వయసున్న రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు చరిత్రాత్మక మూన్ మిషన్‌లో చోటు సంపాదించారు. రాజాచారి, ఆయన తమ్ముడు కృష్ణ అమెరికాలో పుట్టి పెరిగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎనలేని మమకారం. శ్రీనివాస్ తన ఇద్దరు కుమారుల్ని భారతీయ మూలాలను మర్చిపోకుండా పెంచారు. రాజాచారికి కొంచెం హిందీ కూడా వచ్చు. తల్లిదండ్రుల పెంపకమే తననీ స్థాయికి చేర్చిందని రాజాచారి గర్వంగా చెప్పుకుంటారు. -
నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం
నాసాలో పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్తను అమెరికా కస్టమ్స్ అధికారులు అవమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని, బలవంతంగా ఫోన్ అన్‌లాక్ చేయించారు. సిద్ బిక్కన్నవార్ (35) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను వెళ్లినప్పుడు అక్కడి కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు తన సెల్‌ఫోన్ పాస్వర్డ్ అడిగారని, అది చెబితేనే వెళ్లనిస్తామన్నారని అన్నారు. తాను గత వారం అమెరికాకు తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ముస్లింలను నిషేధిస్తున్నప్పుడు అందులో భాగంగానే తనను కూడా నిర్బంధించారని ఆయన ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు. తొలుత తాను పాస్వర్డ్ ఇవ్వనన్నానని, అది నాసా వాళ్లు ఇచ్చిన ఫోన్ కాబట్టి అందులో ఏమున్నాయో అందరికీ చెప్పడం కుదరదని వివరించానని ఆయన తెలిపారు. నాసాలో పనిచేస్తున్న బిక్కన్నవార్ అక్కడ భారీ స్పేస్ టెలిస్కోపులకు కావల్సిన టెక్నాలజీని డిజైన్ చేస్తారు. తాను అమెరికాలో పుట్టిన పౌరుడినని, నాసాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, తనవద్ద అమెరికా పాస్‌పోర్టు ఉందని చెప్పినా, వాళ్లు మాత్రం తన ఫోన్ లాగేసుకున్నారని, అందులో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్న తర్వాతే తనకు ఫోన్ ఇచ్చి వెళ్లనిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ కార్ల రేసింగులో పాల్గొనడం తన హాబీ కావడంతో దాని కోసం ఆయన కొన్నాళ్ల పాటు సెలవులో వెళ్లారు. పైగా ఆయన ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఉన్న దేశాలు వేటికీ కూడా ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత తన అధికారులు కూడా తన ఫోన్ చెక్ చేస్తున్నారని, అందులో కస్టమ్స్ వాళ్లు ఏవైనా ఇన్స్టాల్ చేశారేమో పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనిపై నాసా అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు. -
మూర్ఛ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు!
టొరంటో: మూర్ఛ వ్యాధిని ముందుగానే పసిగట్టే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందిచారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండడం విశేషం. వ్యాధి రావడానికి కారణమైన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. కెనడాలోని ఒట్టావా ఆస్పత్రి, యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందిచారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో మూర్ఛ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. తాము తయారు చేసిన పరికరంతో ముందుగానే మూర్ఛవ్యాధి లక్షణాలను గుర్తించవచ్చని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త వెంకటేష్ మూర్తి తెలిపారు. అధ్యయనంలో భాగంగా కెనడాకి చెందిన ఆరు ఆస్పత్రిల్లోని సుమారు నాలుగు వేల మంది రోగులపై పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తలు ఈ సాధనంతో ముఖ్యంగా మూర్ఛ వ్యాధి రావడానికి గల 8 కారణాలను గుర్తించారు. ఈ అధ్యయన వివరాలను కెనడా మెడికల్ అసోసియేషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. -
బొద్దింక స్ఫూర్తితో రోబో తయారీ!
బొద్దింకలు.. ఎంత చిన్న సందు దొరికినా ఇట్టే దూరిపోతాయి. వాటి స్ఫూర్తితో అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం రోబోలను తయారుచేశారు. భూకంపాలు, టోర్నడోలు లేదా పేలుళ్ల సమయంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు అత్యంత చిన్న పరిమాణంలో ఉండే ఈ రోబోలు ఉపయోగపడతాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ వాళ్లు కనుగొన్న ఈ కొత్త టెక్నాలజీని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ఆవిష్కరించారు. 0.6 సెంటీమీటర్ల స్థలం మాత్రమే ఉన్నా అందులోంచి కూడా బొద్దింకలు శరవేగంగా వెళ్లగలవని, అంఉదకోసం తమ కాళ్లను పూర్తిగా లోపలకు, బయటకు అవి మార్చుకోగలవని పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టరల్ ఫెలో కౌశిక్ జయరామ్ చెప్పారు. అవి మామూలుగా కదిలినప్పుడు అర అంగుళం పొడవు ఉంటాయని, కానీ అవసరాన్ని బట్టి అవి అంగుళంలో పదోవంతుకు తమ శరీరాలను కుదించుకోగలవని తెలిపారు. వీటి స్ఫూర్తితో రూపొందించిన 'క్రామ్' అనే రోబోకు ప్లాస్టిక్ షీల్డు ఒకటి ఉంటుంది. అది అచ్చం బొద్దింక వీపుమీద ఉండే రెక్కల్లా కనిపిస్తుంది. భూకంపాలు వస్తే అక్కడ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుందని, ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ తరహా రోబోలు ఉపయోగపడతాయని రాబర్ట్ ఫల్ అనే ప్రొఫెసర్ చెప్పారు. అమెరికా ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది. -
కేన్సర్‌పై ‘తులసి’ పోరు
వాషింగ్టన్: కేన్సర్‌పై పోరాడేందుకు తులసి మొక్కలోని ఔషధ గుణాలను మరింత పెంపొందించే దిశగా భారత సంతతి శాస్త్రవేత్త చంద్రకాంత్ ఏమాని ఆధ్వర్యంలో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. తులసిలోని ‘యూజెనాల్’ అనే ఔషధం మరింత ఎక్కువగా ఉత్పత్తయ్యేలా జన్యుపరంగా మార్పులు (జెనిటికల్ ఇంజనీరింగ్) చేస్తున్నారు. తులసిలో లభించే ‘యూజెనాల్’కు వైద్య పరంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. బ్రెస్ట్ కేన్సర్‌తో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ఈ రసాయనం తోడ్పడుతుంది. అందువల్ల ‘యూజెనాల్’ను మరింత ఎక్కువగా జన్యుపరంగా మార్పులు చేస్తున్నట్లు చంద్రకాంత్ పేర్కొన్నారు. -
రెండు కొక్కేలతో రక్తకణాలకు అతుక్కుంటుంది!
మలేరియా పరాన్నజీవి గుట్టువిప్పిన భారత సంతతి శాస్త్రవేత్త వాషింగ్టన్: దోమకాటు వల్ల మనిషిలోకి ప్రవేశించి క్రమంగా ఎర్ర రక్తకణాలను తినేస్తూ.. ప్రాణాలు హరించే మలేరియా వ్యాధికారక ప్లాస్మోడియం వైవాక్స్ పరాన్నజీవి గుట్టును భారత సంతతి శాస్త్రవేత్త నీరజ్ తోలియా విప్పారు. భారత్‌లోని ప్లాస్మోడియం జాతుల్లో అతి ప్రమాదకరమైన వైవాక్స్ పరాన్నజీవి మనిషి ఎర్ర రక్తకణాలకు రెండు ప్రొటీన్ కొక్కేలతో అతుక్కుంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నీరజ్ కనుగొన్నారు. ఎర్ర రక్తకణంపై ఉండే రెండు ప్రొటీన్లను, తనలోని రెండు ప్రొటీన్లను ఉపయోగించి అది రెండు దశల ప్రక్రియ ద్వారా కొక్కేలను తయారు చేసుకుంటుందని ఆయన తేల్చారు. దీంతో మనిషి ఎర్ర రక్తకణాలపై ఆ ప్రొటీన్లను తొలగించేందుకు లేదా ప్లాస్మోడియం ప్రొటీన్లను నివారించేందుకు కొత్త టీకాలు, మందులు కనుగొంటే.. ఈ పరాన్నజీవిని నిర్మూలించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.