వాషింగ్టన్ : చందమామను మళ్లీ అందుకునే యత్నాలు ఆరంభించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ఆర్టిమిస్‌లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది. మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే కావడం విశేషం.
విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు. వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో జరిగిన వైట్ హౌస్ జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో చంద్రుడిపైకి పంపే వారి తుది జాబితాను ఖరారు చేశారు. అమెరికా ఉపా«ధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ‘‘మన భావి హీరోలను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లంతా చంద్రుడి పైకి వెళ్లి చరిత్రను తిరగరాస్తారు. వీరిని ఆర్టిమిస్ తరంగా భావించవచ్చు’’ అని మైక్ పెన్స్ చెప్పారు. నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది.
ఆకాశంలోనే కాదు..
ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. గత ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్‌లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్ పాట్ ఫారెస్ట్ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు.
మనోడే..
నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గణితశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చారి. తన 13 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయిన శ్రీనివాస్ తల్లి, అక్కల సంరక్షణలో పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1970లో శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు. విస్కన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుండగా పెగ్గీ ఎగ్బర్ట్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు డేటింగ్ చేశాక 1976లో పెళ్లి చేసుకున్నారు. వారికి 1977 జూన్ 25న రాజాచారి జన్మించారు.
అయోవా రాష్ట్రంలో పెరిగిన రాజాచారి ప్రఖ్యాత మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ నుంచి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు. 43 ఏళ్ల వయసున్న రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు చరిత్రాత్మక మూన్ మిషన్‌లో చోటు సంపాదించారు. రాజాచారి, ఆయన తమ్ముడు కృష్ణ అమెరికాలో పుట్టి పెరిగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎనలేని మమకారం. శ్రీనివాస్ తన ఇద్దరు కుమారుల్ని భారతీయ మూలాలను మర్చిపోకుండా పెంచారు. రాజాచారికి కొంచెం హిందీ కూడా వచ్చు. తల్లిదండ్రుల పెంపకమే తననీ స్థాయికి చేర్చిందని రాజాచారి గర్వంగా చెప్పుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment