kennedy space centre
-
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
Florida: ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా
ఫ్లోరిడా: అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు(ఐఎస్ఎస్) ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఎండీవర్’ ప్రయాణం శనివారం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రయాణం వాయిదా పడిందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వెల్లడించింది. పై గాలులు వీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఆదివారం రాత్రి రాకెట్‌ను నింగిలోకి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లో క్రూ డ్రాగన్ ఎండీవర్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ ప్రయాణం ఇప్పటికే ఫిబ్రవరి22న తొలిసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ కంపెనీ 2020 నుంచి వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపిచే విషయంలో నాసాకు వాణిజ్యపరమైన సేవలందిస్తోంది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌తో ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ త్వరలో పోటీపడనుంది. ఇదీ చదవండి.. అమెరికాలో భారతీయుని హత్య -
ఆర్టెమిస్ 1 ప్రయోగం నిలిపివేత.. ప్రకటించిన నాసా
తల్లాహస్సీ: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్లు ఇంజిన్లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్‌డౌన్ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా. The countdown clock is on a hold at T-40 minutes. The hydrogen team of the @NASA_SLS rocket is discussing plans with the #Artemis I launch director. Operational commentary continues at https://t.co/z1RgZwQkWS. pic.twitter.com/5J6rHVCe44 — NASA (@NASA) August 29, 2022 The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom — NASA (@NASA) August 29, 2022 ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. శాశ్వత ఆవాసాల కోసం.. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి. ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే? -
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
-
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
కేప్ కనావెరల్ (అమెరికా): వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూరిజానికి స్పేస్ఎక్స్ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ఇన్స్పిరేషన్–4 పేరిట మూడు రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్ష యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను అమెరికా కుబేరుడు, ఫిష్ట్4 పేమెంట్స్ సంస్థ అధినేత జేర్డ్ ఐసాక్‌మ్యాన్ తన భుజాలకెత్తుకున్నారు. ముగ్గురు ప్రయాణికులతోపాటు తానూ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రొఫెషనల్ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం.5.32 నిమిషాలకు ధవళవర్ణ స్పేస్సూట్లు ధరించిన క్రిస్ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్ ఐసాక్‌మ్యాన్, సియాన్ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్లతో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్–9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. చదవండి: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్ అమర సైనికుని భార్య ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్ ఆకాశంలో దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించనుంది. మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రాకెట్ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. తన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా కేవలం సాధారణ పౌరులనే నింగిలోకి పంపి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అంతరిక్ష టూరిజం రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్ దిగ్గజం ఐసాక్‌మ్యాన్ చరిత్రలకెక్కారు. ఈ జూలై నెలలోనే ఇప్పటికే తమ సొంత రాకెట్లలో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్స్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేసి అంతరిక్ష పర్యాటక యాత్రల పరంపరను మొదలుపెట్టడం తెల్సిందే. తర్వాతి ప్రయాణాలకు మార్గదర్శకంగా.. ఈ ప్రయాణం విజయవంతమైతే దీనిని తదుపరి సాధారణ ప్రయాణికుల పర్యాటక యాత్రలకు మార్గదర్శకంగా భావించనున్నారు. మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని అంతరిక్షంలో పరీక్షించనున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం, మేథో శక్తి, నిద్ర, రక్త ప్రసరణ తదితర అంశాలనూ పరిశీలించనున్నారు. ప్రయాణాన్ని వారు మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా స్పేస్ఎక్స్ రాకెట్ పై భాగంలో తొలిసారిగా అతిపెద్ద డోమ్ విండోను ఏర్పాటుచేశారు. ‘ఇది అద్భుతం’ అని ఐసాక్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణంలో సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ వీరందరికీ వాషింగ్టన్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్ ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్ఎక్స్ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! ఇద్దరు విజేతలు, ఒక హెల్త్‌కేర్ వర్కర్, ఒక కుబేరుడు నలుగురితో మొదలైన ఈ ఇన్స్పిరేషన్–4 యాత్రలో హేలే ఆర్సేనెక్స్ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్ వర్కర్ ఉన్నారు. ఎముక క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఈమె తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని పరిశోధనా వైద్యశాలలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా ఈమె రికార్డు సృష్టించారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. వాషింగ్టన్లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్ సెమ్‌బ్రోస్కీ(42) సైతం యాత్రలో పాలుపంచుకున్నారు. ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సియాన్ ప్రోక్టర్(51) సైతం ఈ యాత్రకు ఎంపికయ్యారు. ప్రయాణికుల ఎంపిక కోసం జరిగిన పోటీలో క్రిస్, ప్రోక్టర్లు విజేతలుగా నిలిచారు. నింగిలోక దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
చల్లని ‘రాజా’ ఓ చందమామ
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అంటారు.ఈ చిత్రాన్ని చూడండి...పదాలు మాత్రమే కాదు కల, పట్టుదల కలిసికట్టుగా కనిపిస్తాయి. చంద్రుడి పైకి పంపడానికి ‘నాసా’ ఎంపిక చేసిన బృందంలో ఒకరైన రాజాచారి పదకొండు సంవత్సరాల వయసులో తయారుచేసిన పోస్టర్ ఇది.. రాజాచారి పదకొండు ఏళ్ల వయసులో, ప్రస్తుతం.. నిన్న అనేది నేటి జ్ఞాపకంరేపు అనేది నేటి కల. –ఖలీల్ జిబ్రాన్ చిన్న వయసులో పిల్లలు కనే కలలు పెద్దలకు మురిపెంగా ఉంటాయి. చాలామంది పిల్లల్లో ఆ కలలు వయసు పెరుగుతున్నకొద్దీ కరిగిపోతుంటాయి. కొందరు దీనికి మినహాయింపు. వారిలో కలలు కరిగిపోవు. బలపడతాయి. రాజాచారి ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘రాజాచారి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరు. ‘నాసా’ చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇండియన్–అమెరికన్ రాజాచారి ఒకరు. పదకొండు సంవత్సరాల వయసులో ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్నాడు రాజా. ‘ఇది పిల్లకల’ అని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోలేదు. ఆ కలల సౌధానికి దగ్గర కావడానికి ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ఉన్నత చదువు, సక్సెస్ఫుల్ కెరీర్ కోసం శ్రీనివాస్‌చారి(రాజా తండ్రి) ఇంజనీరింగ్ డిగ్రీతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడ అమెరికన్ పెగ్గి ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే రాజాచారి. రాజా చిన్నప్పుడు కాగితాలు, మెటల్ హుక్‌లతో బొమ్మ విమానాలు తయారుచేసి మురిసిపోయేవాడు. పక్కింటి పిల్లలు ఈ బొమ్మల కోసం పరుగులు తీస్తూవచ్చేవారు. తన భుజాలకు రెక్కలు తగిలించుకొని ఊహాల్లో ఆకాశంలోకి వెళ్లి వచ్చేవాడు రాజా. ‘ఫాంటసీ ప్రపంచం’లో వీరవిహారం చేసేవాడు. తల్లి టీచర్ కావడంతో ‘చందమామ పాఠాలు’ ఆసక్తికరంగా చెప్పేది. ఎన్నో సందేహాలను ఓపిగ్గా తీర్చేది. సైన్స్ మాత్రమే కాదు సంగీతం అంటే కూడా రాజాకు బాగా ఇష్టం. రెండేళ్ల వయసులోనే సుజుకి మెథడ్ వయోలిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆరేళ్ల వయసులో ఫ్రెంచ్ హార్న్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.‘నీ బ్రెయిన్లో కుడి,ఎడమ భాగాలు సమానంగా వృద్ధి చేయడానికి ప్రయత్నించు’ అని రాజాకు పదేపదే చెప్పేది తల్లి. మెదడులోని ఎడమభాగం విశ్లేషణ, కుడిభాగం సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. స్ఫూర్తిని ఇచ్చే వాళ్లు పెద్దల రూపంలో మన చేరువలోనే ఉంటారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌చారి అలాంటి వారే. చేతిలో ఇంజనీరింగ్ పట్ట, గుండెలో ధైర్యం...అంతే...అమెరికాకు వచ్చేశాడు. దేశం కాని దేశం. తెలియని మనుషులు. తెలియని కష్టాలు..కాని ఇవేమీ ఆయన ఆలోచించలేదు. అర్జునుడి చూపు పిట్టకన్ను మీదే ఉన్నట్లు శ్రీనివాస్ కన్ను కూడా ఒకే లక్ష్యాన్ని చూసింది. సాధించాలి....ఎలాగైనా సాధించాలి! ఆయన తన ప్రయాణంలో విజయాన్ని సాధించాడు. ఆ స్ఫూర్తిని కుమారుడికి అందించాడు.‘బాగా కష్టపడి చదివితే ఎన్నో ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కష్టాన్ని ఇష్టపడాలి’ అని రాజాచారితో చెబుతుండేవారు శ్రీనివాస్.‘‘ఇతరులు ఏమైనా అనుకుంటారని, హేళన చేస్తారనే భయం నాలో ఎప్పుడూ లేదు. నేను ఒకటి ఇష్టపడ్డాను అంటే. ఇక అంతే...చాలా కష్టపడతాను’ అంటాడు రాజాచారి. ఆ కష్టమే అతడిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేసేలా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్డిగ్రీ చేసేలా చేసింది. టెస్ట్ పైలట్‌గా మార్చింది. ఆతరువాత తన ఆస్ట్రోనాట్ కల గుర్తుకు వచ్చింది. అదేమీ ఆషామాషీ కల కాదు. అలా అని వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ‘నాసా’లో పనిచేసే వ్యక్తులను కలవడం మొదలైంది. వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారు. కమాండర్ ఆఫ్ ది 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్, డైరెక్టర్ ఆఫ్ ది ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్గా తన టాలెంట్ చాటుకున్న చారి 2017లో నాసా ‘ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్’కు ఎంపికయ్యాడు. టెస్ట్ పైలట్‌గా రోజువారీ సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెదికే ధైర్యం ‘నాసా కమ్యూనిటీ’లో ఉపయోగపడింది. ‘నిరంతర పఠనం, నిరంతరం మెరుగుపరుచుకోవడం ఇదే నా జీవనతత్వం’ అని చెబుతున్న రాజాచారికి జయహో చెబుదాం. -
చందమామపైకి రాజాచారి!
వాషింగ్టన్ : చందమామను మళ్లీ అందుకునే యత్నాలు ఆరంభించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ఆర్టిమిస్‌లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది. మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే కావడం విశేషం. విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు. వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో జరిగిన వైట్ హౌస్ జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో చంద్రుడిపైకి పంపే వారి తుది జాబితాను ఖరారు చేశారు. అమెరికా ఉపా«ధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ‘‘మన భావి హీరోలను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లంతా చంద్రుడి పైకి వెళ్లి చరిత్రను తిరగరాస్తారు. వీరిని ఆర్టిమిస్ తరంగా భావించవచ్చు’’ అని మైక్ పెన్స్ చెప్పారు. నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది. ఆకాశంలోనే కాదు.. ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. గత ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్ పాట్ ఫారెస్ట్ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు. మనోడే.. నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గణితశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చారి. తన 13 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయిన శ్రీనివాస్ తల్లి, అక్కల సంరక్షణలో పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1970లో శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు. విస్కన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుండగా పెగ్గీ ఎగ్బర్ట్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు డేటింగ్ చేశాక 1976లో పెళ్లి చేసుకున్నారు. వారికి 1977 జూన్ 25న రాజాచారి జన్మించారు. అయోవా రాష్ట్రంలో పెరిగిన రాజాచారి ప్రఖ్యాత మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ నుంచి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు. 43 ఏళ్ల వయసున్న రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు చరిత్రాత్మక మూన్ మిషన్‌లో చోటు సంపాదించారు. రాజాచారి, ఆయన తమ్ముడు కృష్ణ అమెరికాలో పుట్టి పెరిగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎనలేని మమకారం. శ్రీనివాస్ తన ఇద్దరు కుమారుల్ని భారతీయ మూలాలను మర్చిపోకుండా పెంచారు. రాజాచారికి కొంచెం హిందీ కూడా వచ్చు. తల్లిదండ్రుల పెంపకమే తననీ స్థాయికి చేర్చిందని రాజాచారి గర్వంగా చెప్పుకుంటారు. -
అంతరిక్షంలో మన నక్షత్రం!
అది 2003వ సంవత్సరం జనవరి 16వ తేదీ. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌సెంటర్‌లో కౌంట్‌డౌన్ మొదలయింది. కొలంబియా అంతరిక్ష నౌక (స్పేస్ షటిల్) నింగిలోకి ఎగరడానికి సమయం దగ్గరపడుతోంది. క్రూ క్యాబిన్లో ఏడుగురు వ్యోమగాములు విజయకేతనం ఎగురవేస్తున్నట్లు బొటనవేలిని పైకి లేపారు. అలా పైకి లేచిన చేతుల్లో ఒకటి కల్పనాచావ్లాది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన. హర్యానాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కల్పన ఆలోచనలు ఎప్పుడూ అసాధారణంగానే సాగేవని చెప్పేది ఆమె తల్లి సంజ్యోతి చావ్లా. కల్పనకు కరాటే ఇష్టం, జుట్టును కత్తిరించుకోవడం ఇష్టం, ఫ్లయింగ్ ఇష్టం, తొలి భారతీయ పైలట్ జెఆర్‌డి టాటా ఆమె రోల్ మోడల్. ఆ కలలతోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)లో ఉద్యోగం సంపాదించారు. నాసాలో చేరిన రెండేళ్లకు... అది 1997 నవంబరు 19, కొలంబియా ఎస్టిఎస్- 87 వాహకనౌకలో కల్పన తొలిసారి అంతరిక్షయానం చేశారు. దాదాపు ఐదునెలలపాటు అంతరిక్షంలో సాగిన అధ్యయనంలో భాగంగా ఆమె పదకొండు మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 252సార్లు భూమిని చుట్టారు. తర్వాతి ప్రయాణం కొలంబియా ఎస్టిఎస్- 107 అంతరిక్షనౌకలో. ఇది కల్పన తొలి అంతరిక్ష పర్యటనలా నెలలపాటు సాగలేదు. నిండా పదిహేను రోజుల పర్యటన. జనవరి నెల పూర్తయింది. తిరిగి భూమిని చేరాల్సిన రోజు రానే వచ్చింది. అది ఫిబ్రవరి ఒకటవ తేదీ. కక్ష్య నుంచి భూవాతావరణంలోకి వస్తున్నామనే భావన వ్యోమగాములను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక 16 నిమిషాలలో భూమిని చేరాలి. ఇంతలో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లోని ఇంజనీర్లతో కొలంబియా స్పేస్‌షటిల్‌కి సిగ్నల్స్ తెగిపోయాయి. జరగకూడనిదేదో జరగనుందని గ్రహించేలోపే కొలంబియా అంతరిక్ష నౌకలో పేలుడు. గాల్లో సంభవించిన పేలుడు ఏడుగురు వ్యోమగాముల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ప్రపంచదేశాలకు ఇది సాంకేతిక లోపంగానే కనిపించింది. అమెరికాకు తమ విజ్ఞానం మీద సందేహం కలిగింది. భారత్‌కు మాత్రం బిడ్డను బలితీసుకున్న ప్రయాణంగా చేదును మిగిల్చింది. కర్నాల్ వాసులు ఇప్పటికీ ఆకాశాన్ని చూపిస్తూ ‘ఆ కనిపించే నక్షత్రమే మా కల్పన, ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది’ అంటారు మెరుస్తున్న కళ్లతో. హారిసన్ గురించి: కల్పన మరణానంతరం ఆమె జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకం పేరు ‘ద ఎడ్జ్ ఆఫ్ టైమ్’. ఆ పుస్తకాన్ని కల్పన చదువుకున్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆవిష్కరించారు. కల్పన బాల్యం గురించి ఆమెకు తెలిసిన వారందరితో మాట్లాడి ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు హారిసన్. కల్పనాచావ్లా గురించి... పుట్టిన తేదీ: 1962, మార్చి 17 సొంత ఊరు: కర్నాల్ (హర్యానారాష్ట్రం) అమ్మానాన్నలు: బనారసీలాల్ చావ్లా, సంజ్యోతి చావ్లా అక్కలు, అన్న: సునీత, దీప, సంజయ్ ప్రాథమిక విద్య: కర్నాల్‌లోని టాగూర్ పబ్లిక్ స్కూల్ ఉన్నత విద్య: చండీఘర్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, అమెరికా, ఆర్లింగ్టన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డి. కెరీర్: 1995 మార్చిలో నాసాలో వ్యోమగామిగా భర్త: జీన్ పీయరి హారిసన్(ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, కల్పనాచావ్లాకి స్కూబాడైవింగ్, హైకింగ్, లాంగ్ఫ్లయింగ్లలో శిక్షణ ఇచ్చారు), పెళ్లయింది-1988లో.