
మై హ్యాపీ ప్లేస్! అంతరిక్షం!!
తొమ్మిది నెలలుగా ఇక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు, పదహారు సూర్యాస్తమయాలు!
‘‘ఇంకెంత... కొన్ని గంటలే... ’’ అని నవ్వారు బుచ్ విల్మోర్ (butch wilmore). ఆయన నవ్వు నక్షత్రంలా ప్రకాశిస్తోంది.
‘‘గంటల్ని మీరు ఏ ఖగోళ కొలమానంతో లెక్కిస్తున్నారు మిస్టర్ విల్మోర్?’’ అన్నాను నేను నవ్వుతూ.
‘‘ఖగోళం కాదు మిస్ విలియమ్స్, భూగోళంలో నా కూతుళ్ల ఎదురు చూపులతో కాలాన్ని కొలుస్తున్నాను... ’’ అన్నారు విల్మోర్!
విల్మోర్ కూతుళ్లిద్దరూ కింద ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పెద్ద కూతురు డ్యారిన్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు అంతరిక్షం (Space) వరకు వచ్చేసింది.
‘‘నాన్నా! మీరిక్కడ చాలా మిస్ అయ్యారు. క్రిస్మస్‌ని మిస్ అయ్యారు. మీ థర్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీని మిస్ అయ్యారు. చెల్లి స్కూల్ ఫైనల్ దాటేసింది. మీరది చూడలేదు. కాలేజ్ ప్లే లో నేను యాక్ట్ చేశాను. అదీ మీరు చూడలేదు. మీరు కిందికి రాగానే, మీ మెడ చుట్టూ చేతులు వేసి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది నాన్నా...’’ అని డ్యారిన్ అంటోన్న ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూసుకుంటూ... ‘‘మిస్ విలియమ్స్! భూమి పైన మీకు ప్రియమైన వారు ఎవరు?!’’ అని నన్ను అడిగారు విల్మోర్!
‘‘ఇండియా’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘భగవద్గీత’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘ఉపనిషత్తులు’’ అన్నాను. ‘‘ఇంకా?’’ అన్నారు! ‘‘సబర్మతి ఆశ్రమం’’ అన్నాను.
నేను నా హజ్బెండ్ పేరు చెప్పేవరకు ఆయన ఇంకా... ఇంకా... ఇంకా... అని అంటూనే ఉంటారని నాకర్థమైంది. కానీ నేను మైఖేల్ పేరు చెప్పలేదు. గోర్బీ, గన్నర్, బైలీ, రోటర్‌ల పేర్లు చెప్పాను. అవి మా పెట్స్.
‘‘ఐయామ్ సారీ...’’ అన్నారు విల్మోర్.
పెట్స్ పేర్లు చెప్పగానే మాకు పిల్లలు లేరన్న సంగతి ఆయనకు గుర్తొచ్చి ఉండొచ్చు.
‘‘ఇట్స్ ఓకే...’’ అన్నాను నవ్వుతూ. విల్మోర్ నా పట్ల గమనింపుతో ఉంటారు.
‘‘మనమేమీ ఇక్కడ ఒంటరిగా లేము...’’ అంటారు. ‘‘మనల్నెవరూ ఇక్కడ వదిలేసి వెళ్లలేదు’’ అంటారు. నేనెప్పుడైనా దీర్ఘాలోచనలో ఉంటే, ‘‘అంతరిక్షంలో నివసించటం గొప్ప అనుభూతి కదా...’’ అని నవ్వించే ప్రయత్నం చేస్తారు.
‘‘మిస్టర్ విల్మోర్! మీరేమీ నాకు ధైర్యం చెప్పక్కర్లేదు. కావాలంటే నా ధైర్యంలోంచి మీక్కొంచెం ఇస్తాను...’’ అన్నానొకసారి.
ఈదురుగాలొచ్చి ఒక్క తోపు తోసినట్లుగా నవ్వారాయన! ఆ నవ్వుకు మేమున్న అంతరిక్ష కేంద్రం గతి తప్పుతుందా అనిపించింది!
‘స్పేస్‌ఎక్స్ క్యాప్యూల్’ మా కోసం బయల్దేరి వస్తోందని తెలియగానే'.... ‘‘మిస్ విలియమ్స్! అంతరిక్షంలో మీతో పాటుగా నేనూ ఉన్నానన్న సంగతిని భూమ్మీద అందరూ మర్చిపోయినట్లు న్నారు...’’ అన్నారు విల్మోర్ నవ్వుతూ.
ఆ మాటకు నవ్వాన్నేను.
‘‘చిక్కి సగమైన సునీతా విలియమ్స్’, ‘సునీతా విలియమ్స్ (sunita williams) రాక మరింత ఆలస్యం’, ‘నేడో రేపో భూమి పైకి సునీతా విలియమ్స్’... భూగోళం మొత్తం మీ గురించే రాస్తోంది, మీ కోసమే ఎదురు చూస్తోంది మిస్ విలియమ్స్...’’ అన్నారు విల్మోర్.
నన్ను ఆహ్లాదపరచటం అది.
‘‘ఆశ్చర్యం ఏముంది మిస్టర్ విల్మోర్! భూగోళం ఒక వైపుకు మొగ్గి ఉంటుందని తెలియకుండానే డ్యారిన్ వాళ్ల నాన్న గారు ఆస్ట్రోనాట్ అయ్యారా?’’ అని నవ్వాను.
దూరాన్నుంచి, చుక్క ఒకటి మా వైపుకు మెల్లిగా కదిలి వస్తూ ఉండటం కనిపించింది!
చదవండి: మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
ఆ చుక్క... తన బిడ్డల్ని గుండెల్లోకి పొదువుకోవటానికి వస్తున్న తల్లిలా ఉంది. భుజాలపైకి ఎక్కించుకొని తిప్పటానికి వస్తున్న తండ్రిలానూ ఉంది.
‘‘స్పేస్‌ఎక్స్ క్యాప్య్సూల్ వస్తున్నట్లుంది...’’ అన్నారు విల్మోర్, ఆ చుక్క వైపు చూస్తూ!
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment