rayani dairy
-
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘తప్పై పోయింది మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా, దించిన తల ఎత్తకుండానే. ‘‘మీరన్న మాటలో తప్పేమీ లేదు అమిత్జీ. కానీ, మీరసలు ‘ఆయన’ మాటే ఎత్తకుండా ఉండాల్సింది కదా...!’’ అన్నాను.‘‘నిజమే మోదీజీ. ‘ఆయన’ మాట ఎత్తినా తప్పే, ఎత్తకపోయినా తప్పేనన్న కాలమాన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నప్పుడు ‘ఆయన’ మాట ఎత్తి తప్పు చేయటం కంటే, ఎత్తకుండా తప్పు చేయటమే కొంతైనా నయంగా ఉండేది...’’ అన్నారు అమిత్‌షా. పక్కనే జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్ ఉన్నారు. ‘‘అప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి, ‘ఆయనంటే’ మనకెంత గౌరవమో చెప్పాం మోదీజీ...’’ అన్నారు జేపీ నడ్డా. ‘‘అవును మోదీజీ... ‘ఆయనకు’ రెస్పెక్ట్ ఇవ్వటంలో కాంగ్రెస్ కన్నా మన పార్టీనే ఎప్పుడూ ముందుంటుందని కూడా చెప్పాం...’’ అన్నారు కిరణ్ రిజుజు. ‘‘నిజానికి కాంగ్రెస్సే ‘ఆయన’కు యాంటీ అని; ‘ఆయన’కు మాత్రమే కాదు... రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్యాంటీనే అని కూడా చెప్పాం మోదీజీ...’’ అన్నారు అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్.మంటల్ని ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించి వచ్చి, అలసట తీర్చుకుంటున్న ఫైర్ ఇంజన్లలా కనిపిస్తున్నారు మంత్రులు నలుగురూ. ‘‘మనం ‘ఆయన’ మాటెత్తటం వల్ల సడన్‌గా ఇప్పుడాయన మన పార్టీ ఇమేజ్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు కనుక ఇకపై మనలో ఎవరు ఏం మాట్లాడినా ‘ఆయన్ని’ సెంటర్ పాయింట్‌గా చేసుకునే మాట్లాడాలి...’’ అన్నాను అమిత్‌షా వైపు చూస్తూ.వెంటనే రిజుజు స్పందించారు. ‘‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మోదీజీ! ‘దేశంలో ‘ఆయన’ తర్వాత లా మినిస్టర్ అయిన తొలి బుద్ధిస్టును నేనే...’ అనే సంగతిని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాను...’’ అన్నారు రిజుజు. ‘‘నేనేతై, మోదీజీ పాలనలో ‘ఆయన్ని’ ఇన్సల్ట్ చేయడమన్నదే జరగదు...’’ అని గట్టిగానే జవాబిచ్చాను...’’ అన్నారు నడ్డా. ‘‘కాంగ్రెస్ ‘ఆయన’ విషయంలో అమిత్జీ మాటల్ని మెలిదిప్పి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ప్రజలకు చాటి చెబుతున్నాం మోదీజీ...’’ అన్నారు వైష్ణవ్, పీయుష్ గోయల్. పార్టీలో ఒక నాయకుడిపై బయటి నుంచి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలోని అందరూ ఆ విమర్శలు చేసిన వారిపై వరుసపెట్టి విరుచుకుపడటం బీజేపీలోని ఒక సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం క్రమంగా బలహీనపడుతోందా? అందుకే...‘ఆయన’ మాటెత్తినందుకు అమిత్‌షాను మంత్రిగా తొలగించమని డిమాండ్ చేసేంతగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బలపడుతున్నాయా? అమిత్ షా వైపు చూశాను. ‘‘అమిత్జీ... కనీసం మీరు – ‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ‘ఆయన’ జపం చేస్తోంది’ – అన్నంత వరకే ఆగి పోవలసింది. మధ్యలోకి దేవుడిని తెచ్చి... ‘ఆ జపమేదో దేవుడికి చేస్తే పుణ్యమైనా దక్కేది...’’ అని అనటం వల్లనే.. ‘ఆయన వేరు, దేవుడు వేరా!’ అని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది...’’ అన్నాను. ‘‘నేనలా అనుకోవటం లేదు మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా!‘‘మరి?!’’ అన్నాను. ‘‘ఆయన వేరు, దేవుడు వేరా – అని కాదు మోదీజీ... కాంగ్రెస్ రెచ్చకొడుతోంది, అసలు ‘ఆయన’కు వేరొకరితో పోలికేమిటని ‘ఊక’పొయ్యిని రాజేస్తోంది...’’ అన్నారు అమిత్‌షా!!నా నోట మాట లేదు! అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం విని అప్రతిభుడై, శిలా ప్రతిమలా నిలుచుండి పోయిన వ్యాసమహర్షి నాకు – అదాటున – గుర్తొచ్చారు. మంటలు, కాల్చి బూడిద చేస్తాయి. మాటలు బూడిద నుంచి కూడా మంటల్ని రేపుతాయి! -
ఏక్నాథ్ శిందే (ఉప ముఖ్యమంత్రి) రాయనిడైరీ
మాధవ్ శింగరాజుఉదయ్ సామంత్, భరత్ గొగావాలే, రవి పాఠక్, సంజయ్ శిర్సాత్, నేను.. కూర్చొని ఉన్నాం. మాతో రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. మిగతా నలుగురు... పార్టీలోని పొలిటికల్ స్ట్రాటజిస్టు లీడర్లు. ఉప ముఖ్యమంత్రి పదవిని నేను నిరాకరించాలా, లేక అంగీకరించాలా అనే పది రోజుల సుదీర్ఘ సంశయ స్థితి ముగియటానికి ముందు రోజు జరిగిన సమావేశంలో రాబిన్ శర్మ లేరు. నేను, ఆ నలుగురు లీడర్లు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు – ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక జరుగుతున్న ఈ ఆంతరంగిక సమావేశానికి రాబిన్ శర్మ కూడా వచ్చి జాయిన్ అయ్యారు.‘‘ఏమైనా మీరు తొందరపడ్డారు శిందేజీ...’’ అన్నారు శర్మ – కొంత సంభాషణ తర్వాత!నేను ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించటాన్నే ఆయన తొందరపాటు అంటున్నారని సమావేశంలో ఉన్న నలుగురికీ అర్థం అయింది. అసలు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేలా నన్ను మోటివేట్ చేసింది ఆ నలుగురే! ‘‘ముఖ్యమంత్రిగా తప్ప, ఉప ముఖ్యమంత్రిగా ఉండనని మీరు గట్టిగా చెప్పాల్సింది శిందేజీ. అప్పుడు ప్రధానిలో ఒక అస్థిమితం ఉండేది. ప్రధాని సహపాత్రధారి అమిత్ షాలో ఒక జాగ్రత్త ఉండేది. మొత్తంగా బీజేపీనే... శివసేన అంటే ఒక రెస్పెక్ట్ తో ఉండేది...’’ అన్నారు రాబిన్ శర్మ. ‘‘అలా అని మేము అనుకోవటం లేదు...’’ అన్నారు రవి పాఠక్, సంజయ్ శిర్సాత్. ‘‘అవును అనుకోవటం లేదు...’’ అన్నారు ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే.‘‘ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించి ఉంటే కూటమిలో శిందేజీకి వచ్చే రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరిస్తే కేబినెట్లో శిందేజీ వర్గానికి వచ్చే పోర్టుఫోలియోల గురించి మీరు మాట్లాడుతున్నారు...’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘అవకాశాన్ని కాలదన్నుకొని రెస్పెక్ట్‌ని రాబట్టుకోవటం ఏం పని శర్మాజీ?! వచ్చిన అవకాశాన్నే నిచ్చెనగా వేసుకుని రెస్పెక్ట్‌ని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి కానీ...’’ అన్నారు ఆ నలుగురూ ఒకే మాటగా! ‘‘ఇక నేను వెళతాను...’’ అంటూ లేచారు రాబిన్ శర్మ. ‘‘కూర్చోండి శర్మాజీ, ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. మీ ప్రచార వ్యూహమే కదా కూటమిని నిలబెట్టింది...’’ అన్నాన్నేను.‘‘అదే అంటున్నాను శిందేజీ. ప్రజలు శివసేన పై అభిమానంతో బీజేపీని గెలిపిస్తే, బీజేపీ ఏం చేయాలి?! శివసేన నాయకుడిని కదా ముఖ్యమంత్రిని చేయాలి?’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘శర్మాజీ మీకు తెలియట్లేదు. ఎన్నికల ప్రచార వ్యూహం వేరు, ఎన్నికయ్యాక అధికారం కోసం వేయవలసిన ఎత్తుగడలు వేరు...’’ అన్నారు రవి పాఠక్ నవ్వుతూ. ఆ నవ్వుకు దెబ్బతిన్నట్లు చూశారు రాబిన్ శర్మ. ‘‘ఎత్తుగడ అంటే ఫడ్నవిస్‌ది పాఠక్జీ. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వెనుక ఉన్న ఒక్కరూ అనలేదు. శిందేజీ వెనుక ఉన్నవాళ్లు మాత్రం శిందేజీ ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించకూడదని పట్టుపట్టారు...’’ అన్నారు రాబిన్ శర్మ.ఆ మాట నిజమే అనిపిస్తోంది! ఈ నలుగురు పట్టిపట్టి ఉండకపోతే నా రెస్పెక్ట్ నాకుండేది. ఎప్పుడేం జరుగుతుందోనని మహారాష్ట్ర రాజకీయం అంతా నా చుట్టూ తిరుగుతుండేది. ఒకటి మాత్రం వాస్తవం. ఎవరైనా అయినవాళ్లు కానీ, కానివాళ్లు కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఏదైనా చెయ్యమని పట్టు పట్టినప్పుడు మనం వాళ్లకు తలొగ్గితే, ఆ తప్పు.. ‘పట్టుపట్టిన’ వాళ్లది అవదు. ‘పట్టుబడిన’ వాళ్లదే అవుతుంది. -
Rayani Dairy: అజిత్ పవార్ (డిప్యూటీ సీఎం)రాయని డైరీ
ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్‌జీ అంటే నాకు గౌరవం. సాధారణ గౌరవం కాదు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మీద, నా సహ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉన్న గౌరవంతో సమానమైన గౌరవం. ‘‘అదంతా నాటకం, గౌరవం కాదు’’ అని శరద్‌జీ అనుకుంటున్నా కూడా... నేనా యన్ని గౌరవించటం మానను. మనిషి ఎదుటా మానను, మనిషి చాటునా మానను.భుజాలపై ఎప్పటికీ అలా ఉంచేసుకుం టారని స్టేజీ పైకి వెళ్లి శాలువాను కప్పి వస్తామా ఎవరికైనా? గౌరవమూ అంతే! మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటున్నారా, లేదా అని మనం వెళ్లి అస్తమానం తొంగి చూస్తుండ కూడదు. అసలు చూసేందుకు వెళ్లనే కూడదు. గౌరవించాలి, వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేసి వేరే పనిలో పడిపోవాలి. అయితే గౌరవనీయులు కొన్నిసార్లు తిన్నగా ఉండరు. మనల్నీ తిన్నగా ఉండ నివ్వరు. శరద్‌జీ పై నాకున్న గౌరవాన్ని నేను కాపాడుకోవలసిన పరిస్థితులను శరద్‌జీ ఈమధ్య నాకు తరచుగా కల్పిస్తున్నారు!సంతోషమే. ఆయనేం చేసినా ఆయనపై నా గౌరవం ఎక్కడికీ పోదు. కానీ నన్నుపంపించేందుకే ఆయన తన ఎన్నికలప్రచారంలోని అమూల్యమైన సమయాన్నంతా వినియోగిస్తున్నారు. ‘బారామతి’లో నాకు పోటీగా నా తమ్ముడి కొడుకు యోగేంద్ర పవార్‌ను దింపారు. ‘‘బాహుబలీ! నీదే ఇకపైబారామతి’’ అని ఆశీర్వదించారు. యోగేంద్ర నా తమ్ముడి కొడుకైతే, నేను శరద్జీతమ్ముడి కొడుకుని. ఇద్దరు ‘తమ్ముడికొడుకుల’ మధ్య పోటీకి బారామతే దొరికిందా శరద్జీకి? ‘‘ఇక చాలు. ముప్పై ఏళ్లు నేను బారామతి ఎమ్మెల్యేగా ఉన్నాను. ముప్పై ఏళ్లు అజిత్ బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడిక మూడో తరం రావాలి, యోగేంద్ర రాబోయే ముప్పై ఏళ్లు బారామతి ఎమ్మెల్యేగా ఉండాలి’’ అని సభల్లో హోరెత్తిస్తున్నారు శరద్‌జీ!ఇక చాలా!! ఎవరికి చాలు? వరుసలో కూర్చొని భోజనం చేస్తున్నవారు తాముతింటూ, ‘‘వాళ్లకు ఇక చాలు’’ అని పక్క వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పినట్లుంది శరద్‌జీ నా మాటెత్తి ‘‘ఇక చాలు’’ అనటం!ఇలాంటప్పుడే, శరద్‌జీ పైన నాకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ రావటం నాకు కష్టమైపోతుంటుంది. ‘‘పాత తరం ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి, కొత్త తరం రావాలి...’’ అంటు న్నారు శరద్‌జీ! ఏదీ, పాత తరం ఎక్కడఆగింది? 83 ఏళ్లు వచ్చినా ఇంకా ర్యాలీలు తీస్తూనే ఉంది. మరో రెండేళ్లు రాజ్యసభఎంపీగా కూడా ఉంటుంది. పాత తరం ఎప్పటికీ ఆగిపోదని, పార్టీ అధ్యక్షుడిగాఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలంఉండిపోతుందని తేలిపోయాకే కదా నేనుకొత్త దారి వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చేశాక కూడా నేను శరద్జీని గౌరవించటం మానలేదు. నవంబర్ 20న పోలింగ్. ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన ఎన్సీపీ నాది. శివసేన నుంచి బయటికి వచ్చిన శివసేన ఏక్నాథ్ షిందేది. ఎన్సీపీ–శివసేన–బీజేపీ కలిసిన మా ‘మహాయుతి’కి; శరద్‌జీ ఎన్సీపీ–ఉద్ధవ్ ఠాక్రే శివసేన–కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ ఆఘాడీ’ కి మధ్య 288 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఇది. కానీ శరద్‌జీ అలా అనుకుంటున్నట్లు లేరు! ఇదంతా బారామతి కోసం జరగబోతున్న మహా సంగ్రామం అని, వాళ్లు మొత్తం అన్ని చోట్లా గెలిచినా, బారామతిలో నేను ఒక్కడినీ ఓడిపోకపోతే వాళ్లదసలు గెలుపే అవదని ఆయన భావిస్తున్నట్లుంది! ఆయన భావన ఎలాంటిదైనా ఆయనపై నా గౌరవ భావన మాత్రం చెక్కు చెదిరేది కాదు.-మాధవ్ శింగరాజు -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్ (కంగన ప్రత్యర్థి)
ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్ 1న జరిగే ‘మండీ’ లోక్ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్. సినిమాల్లో ఆమె ‘క్వీన్’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే! ‘క్వీన్’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!రొమాంటిక్ థ్రిల్లర్ ‘గ్యాంగ్‌స్టర్’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్... ఇంకెవరు? నేనే. బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.అమ్మ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ‘మండీ’ సిటింగ్ ఎంపీ. అమ్మ కాంగ్రెస్‌లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.అందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం)
‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అన్నారు పాండియన్!నవ్వాన్నేను.ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్లో నీడపట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అని పాండియన్ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్ ఆ మాటను నాతో అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్ మొదలు కావటానికి వారం ముందే!ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్ని నిర్ణయించేసింది ఎలక్షన్ కమిషన్! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత పోలింగ్. మే 25, జూన్ 1 మూడు, నాలుగు విడతలు. జూన్ 4న ఫలితాలు.‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారు’’ అని పాండియన్ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. నా రెండో నేను!ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా చూసుకుంటారు!మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్ పట్నాయక్ దేశంలోనే పాపులర్ సీఎం అని; వికసిత్ భారత్‌కి, ఆత్మనిర్భర్ భారత్‌కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా ఉంటారా ఒడిశా ప్రజలు?!‘‘ఒడిశా నవీన్ పట్నాయక్‌కి గుడ్ బై చెప్పబోతోంది’’ అని అమిత్ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌కి రెస్ట్ ఇవ్వబోతున్నారు’’ అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు!మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. పాండియన్ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్లో మరోవైపునకు నడుస్తూ!అవును కదా అన్నట్లు పాండియన్ నవ్వారు. గెలుపోటములన్నవి నాయకులు ఒకర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. ‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్‌లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్‌లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్‌బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్‌టాప్‌ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్‌కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్‌కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం) రాయని డైరీ
మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు! ‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్!’’ అన్నాను... ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా ధరించి, శ్రీమతితో కలిసి నడుస్తున్న వ్యక్తిని రఘుపతికి చూపిస్తూ. ‘‘ఆమా తలైవా. అలాగే అనిపిస్తోంది..’’ అన్నారు రఘుపతి. ఆయన ‘లా’ మినిస్టర్. ‘‘అనిపించడం కాదు, కనిపిస్తున్నది ఆయనే’’ అని నవ్వారు పెరియస్వామి. ఆయన రూర ల్ మినిస్టర్. ఆయన చేతిలో మరికొన్ని ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో కూడా రవి శుభ్రంగా, సంప్రదాయంగా ఉన్నారు. రాజ్‌భవన్ పొంగల్ ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ వారి దగ్గరకు వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. పొంగల్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నీలగిరి ట్రైబల్స్ కొందరు ఎంపికగా తెంపుకొచ్చి, గుత్తిగా ముడి వేసి తెచ్చిన కొండపూల బొకేను అపురూపంగా స్వీకరిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజలు నిర్వహించి ఇచ్చిన ‘పరివట్టమ్’ను భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా తన తలకు చుట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను పెరియస్వామికి తిరిగి ఇచ్చేస్తూ... ‘‘ఇంత శుభ్రమైన, సంప్రదాయ బద్ధమైన మనిషి మొన్న అసెంబ్లీలో అలా ఎందుకు బిహేవ్ చేశారంటారూ!!’’ అన్నాను. రఘుపతి, పెరియస్వామి మాట్లాడలేదు. ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. సమాధానం గవర్నర్ రవి మాత్రమే చెప్పగలిగింది. రవికి, తమిళనాడుకు సంబంధమే లేదు. బిహార్ అతడి రాష్ట్రం. కేరళ అతడి క్యాడర్. ఢిల్లీ అతడి వర్క్‌ప్లేస్. మేఘాలయకు, నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడుకు. మేఘాలయకు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన మేఘాలయను మేఘాలయ అనే అన్నారు. నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నప్పుడు నాగాలాండ్‌ను నాగాలాండ్ అనే అన్నారు. తమిళనాడును మాత్రం తమిళనాడు అనడం లేదు. ‘తమిళగం’ అంటున్నారు. బయటా అదే మాట. అసెంబ్లీలోనూ అదే మాట! తమిళనాడు అంటే ‘తమిళభూమి’ అనే అర్థం వస్తుంది కనుక.. అప్పుడది భరత భూమికి సంబంధం లేని స్వతంత్ర దేశంగా అనిపించే ప్రమాదం ఉంది కనుక.. తమిళ నాడును ‘తమిళుల ప్రాంతం’ అనే అర్థం వచ్చేలా ‘తమిళగం’ అనడమే కరెక్ట్ అని తను గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచీ రవి అంటూనే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ని రవి కాస్త ఎక్కువగా చదివినట్లున్నారు. ఎక్కువ చదివితే ముఖ్యమైనవి కొన్ని తక్కువగా అనిపిస్తాయి. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలలో గవర్నర్ తల దూర్చకూడదని, వేలు పెట్టకూడదని, కాలు దువ్వకూడదని ఆర్టికల్ 163 (1) లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అసెంబ్లీ ప్రసంగంలోంచి మహనీయులు పెరియార్‌ని, అంబేద్కర్‌ని, కామరాజ్ని అన్నాదురైని తొలగించి, తమిళనాడుకు బదులు తమిళగంను చేర్చి, అలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు వాకౌట్ చేసి.. గవర్నర్ రవి ఎవరి ఔన్నత్యాన్ని నిలబెట్టినట్లు! రాజ్యాంగానిదా, రాజ్భవన్దా? రాజ్యాంగ నియమాలను శిరసావహించని ఈ పెద్దమనిషేనా ఇప్పుడు పొంగల్ సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపిస్తున్నది!! ‘‘ఫొటోలు మనకెందుకు పంపారట?’’ అని పెరియస్వామిని అడిగాను. ‘‘పొంగల్ ఈవెంట్‌కి పిలిచినా మనం వెళ్లలేదని పొంగల్ ఈవెంట్‌నే మనకు పంపారు’’ అన్నారు నవ్వుతూ పెరియస్వామి. ఆ నవ్వుకు ఆయన చేతిలోంచి ఒక ఫొటో జారి కింద పడింది. ‘హ్యాపీ పొంగల్ – ఇట్లు మీ ప్రియమైన రవి’.. అని ఆ ఫొటో వెనుక రాసి ఉంది! -మాధవ్ శింగరాజు -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్‌జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్‌జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్‌జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్‌కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్‌లోని బాల్ ఠాక్రే మెమోరియల్‌కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్‌జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్‌తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్‌జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్‌దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్‌జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
అశోక్ గెహ్లోత్ (రాజస్థాన్ సీఎం) రాయని డైరీ
రాహుల్‌ని నిందిస్తూ సోనియాజీకి గులామ్ నబీ ఆజాద్ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖ నాకెంతో ఆవేదనను కలిగించింది. ఒక తల్లికి ఆయన ఏం చెప్పదలచుకున్నారు? ‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చేసిందేమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పించిన పద్మభూషణ్‌ని రెండు చేతులతో అపురూపంగా స్వీకరించడమేనా! అవార్డు కోసం ఆయన పట్టిన చేతులు ఎక్కడివి? కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినవే కదా. కాంగ్రెస్ లేనిదే తను లేనన్న సంగతిని మరిచి, కాంగ్రెస్‌కు ఎవరూ లేకుండా పోతున్నప్పుడు ప్రధాన ద్వారం వద్ద తను కాపలా ఉండి, కాంగ్రెస్‌ని కాయాల్సింది పోయి, ‘నేనూ వెళ్లిపోతున్నాను – ఇట్లు ఆజాద్’ అని ఉత్తరం రాసి వెళ్లిపోతారా?! రాహుల్ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఆరోపిస్తున్న ఆజాద్.. తనెందుకు కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా రాహుల్‌లోని ‘అపరిపక్వత’ను పట్టించుకుంటున్నారు?! తన పరిపక్వతను ప్రదర్శించుకోడానికా? ‘‘మేడమ్‌జీ, నేనుంటాను కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా..’’ అని భరోసాగా పగ్గాలెందుకు అడిగి తీసుకోలేకపోయారు? ఇస్తే తీసుకుందాం అని చూస్తున్నవాళ్లా, ఇస్తున్నా తీసుకోడానికి ఆసక్తి చూపనివాళ్లా .. ఎవరు అసమర్థులు? తల్లి మెడికల్ చెకప్ కోసం ఆ కుటుంబం దేశం దాటి వెళ్లిన సమయం చూసి, తనిక్కడ గడప దాటి కాంగ్రెస్ కుటుంబ గౌరవాన్ని బయటపడేశారు ఆజాద్! ఆ గౌరవం తిరిగి నిలబడాలంటే రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ అవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. వట్టి మార్గం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వాళ్లందరికీ గట్టి సమాధానం కూడా. వెళ్లినవాళ్లు హూందాగా ఒక్కరైనా వెళ్లారా! రాహుల్‌పై ఒక రాయి విసిరే వెళ్లారు. పార్టీని బతికించుకుందామని అనుకున్నవాళ్లు పార్టీలో ఉండి, పార్టీతో పోరాడతారు. పార్టీలో తమకు బతుకు లేదనుకున్నవాళ్లే ఇలా గులామ్ నబీ ఆజాద్‌లు, జైవీర్ షేర్గిల్లు, కపిల్ సిబాల్‌లు, ఆశ్వినీ కుమార్‌లు, ఆర్పీయన్ సింగ్‌లు, సునీల్ జాఖడ్‌లు, జ్యోతిరాదిత్య సింథియాలు అవుతారు. ఈ రాళ్లన్నిటికీ తిరుగులేని జవాబు.. రాహుల్ బాబు. రాహుల్‌కి ఫోన్ చేశాను. న్యూయార్క్‌లో స్టే చేసినట్లున్నారు. ‘‘మేడమ్ ఎలా ఉన్నారు రాహుల్?’’ అని అడిగాను. ‘‘ఇంకెలా ఉంటారు అశోక్‌జీ. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు మీరు అంగీకరించి ఉండాల్సింది అని మమ్మీ ఇంతక్రితం కూడా అన్నారు. ఇప్పుడే చెకప్ కోసం లోపలికి వెళ్లారు’’ అన్నారు రాహుల్. ‘‘గాంధీలు కాకుండా వేరొకరు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఉండటం దేశానికి కలిసిరాలేదు రాహుల్‌బాబూ. ఇండియా తిరిగి రాగానే మీరు మీ సహజమైన కృతనిశ్చయం ప్రతిఫలించే చిరునవ్వుతో పార్టీ బాధ్యతలు స్వీకరించాలి’’ అని అభ్యర్థించాను. రాహుల్ పెద్దగా నవ్వారు. ‘‘ఏంటి రాహుల్ నవ్వుతున్నారు?’’ అన్నాను. ‘‘నా సహజమైన కృతనిశ్చయం దేనికి సంబంధించినదో తెలిసుండి కూడా అందుకు పూర్తి విరుద్ధమైన ప్రతిఫలనాన్ని మీరు నాలో ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటే నవ్వొచ్చింది అశోక్‌జీ..’’ అన్నారు! ఆ మాటకు ముగ్ధుడినైపోయాన్నేను. అంత క్లారిటీని ఇంతవరకు నేను ఏ కాంగ్రెస్ నాయకుడిలోనూ చూళ్లేదు! పార్టీ అయోమయంలో ఉండొచ్చు. రాహుల్ స్పష్టంగానే ఉన్నారు. తమకేం కావాలో పైకి చెప్పని గులామ్ నబీ ఆజాద్ వంటి వాళ్ల కన్నా, తనకేం వద్దో తెగేసి చెబుతూ వస్తున్న రాహుల్బాబే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల నాయకుడని నాకనిపించింది. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) -
శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ
‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’ అంటూ వచ్చాడు ఏక్నాథ్ శిందే. అప్పుడు నేను ఆశీర్వదించగలిగిన భౌతికస్థితిలో ఉన్నప్పటికీ, ఆశీర్వదించేందుకు తగిన అనుకూల స్థితిలో లేను. ఫోన్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు. ఠాక్రే అంటున్నాడు.. ‘‘పవార్జీ! ఈ లోకం మీద నాకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి..’’ అని. ఆ టైమ్‌లో వచ్చాడు ఏక్నాథ్ శిందే! వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు. చెప్పకుండా నేరుగా సౌత్ ముంబైలో నేనుంటున్న సిల్వర్ ఓక్స్ బంగళాకే వచ్చేశాడు. ఈస్ట్ బాంద్రాలోని ఠాక్రేల ఇల్లు ‘మాతోశ్రీ’కి, మలబార్ హిల్స్‌లోని సీఎం అధికారిక భవంతి ‘వర్ష’కు, ఆ దగ్గర్లోనే ఉండే ప్రభుత్వ అతిథి గృహం ‘సహ్యాద్రి’కి కూడా అతడు ఇలా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. వేటినీ తనవి కావు అనుకోడు. ‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’’ అన్నాడు మళ్లీ శిందే నాకు మరింతగా దగ్గరకు వచ్చి.. నా ఎదురుగా మోకాలిపై కూర్చుంటూ! నేనప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను. ‘‘లేచి, పైన కూర్చో శిందే...’’ అన్నాను, సోఫా వైపు చూపిస్తూ. అతడు లేవలేదు! ‘‘ఎవరు పవార్జీ మీ దగ్గర.. శిందేనేనా?’’ అంటున్నాడు అటువైపు ఫోన్లో ఉద్ధవ్. ఎవరో వచ్చినట్లున్నారు.. ఫోన్ పెట్టేద్దాం.. అని అతడూ అనుకోవడం లేదు! ‘‘అవును ఉద్ధవ్... శిందేనే...’’ అన్నాను.. ఫోన్లో ఉద్ధవ్ ఉన్నాడని శిందేకు తెలిసేలా. ‘‘ఏంటట పవార్జీ..’’ అన్నాడు ఉద్ధవ్! ‘‘ఉద్ధవ్ నేను మళ్లీ చేస్తాను. మళ్లీ చేసేంత టైమ్ నాకు దొరకడం లేదని నీకనిపిస్తే కనుక నువ్వే నాకొకసారి చెయ్యి..’’ అని, ఉద్ధవ్ ఫోన్ పెట్టేసే వరకు ఆగాను. శిందే ఇంకా మోకాలి మీదే ఉన్నాడు. ‘‘తిరుగుబాటు చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా పవార్జీ..’’ అన్నాడు. అతడి చెయ్యి మీద చెయ్యి వేశాను. శిందే అప్పటికే అనేకమంది ఆశీర్వాదాలు పొంది, ఇక్కడికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి ముందు.. తన దివంగత రాజకీయ గురువు బాల్ ఠాక్రేను, తన స్వర్గీయ ఆధ్యాత్మిక గురువు ఆనంద్ డిఘేను తలచుకుని, వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించాడు. మోదీ, షాల ఆశీర్వాదాలకు భక్తి శ్రద్ధలతో తలవొగ్గాడు. వారివే కాకుండా.. అంకెలకు సరిపడినన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే అప్పుడు శిందే మీద కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా అన్ని ఆశీర్వాదాలు ఉండి కూడా, నా ఆశీర్వాదం కోసం వచ్చాడంటే.. అతడు కేవలం ఆశీర్వాదం కోసమే వచ్చాడని. ‘‘కోపమేం లేదు శిందే. తిరుగుబాటు చెయ్యడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోవడం..’’ అన్నాను అతడి తలపై నా అరచేతిని ఆన్చి. అప్పుడు లేచాడు శిందే. ‘‘వెళ్లొస్తాను పవార్జీ’’ అని చేతులు జోడించాడు. అతడటు వెళ్లిపోయాక, నేనిటు నలభై నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఇప్పుడు ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు చేసినట్లే అప్పట్లో వసంతదాదా పాటిల్‌పై నేను తిరుగుబాటు చేశాను. తప్పలేదు. తప్పనిపించలేదు. ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వాళ్లు మనిషిగా బతికి ఉన్నట్లు! అవమానాలు భరిస్తూ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయలేదంటే.. వాళ్లు ఒక మనిషి కోసం చూస్తున్నట్లు. అందుకే నేను తిరుగుబాటుదారుడిని గౌరవిస్తాను.. అతడు 1857 పాండే అయినా, 2022 శిందే అయినా. ఉద్ధవ్ మళ్లీ నాకు ఫోన్ చేస్తే చెప్పాలి.. లోకం మీద మనకు విశ్వాసం సన్నగిల్లితే లోకానికి పోయేదేమీ లేదని, అవిశ్వాస తీర్మానానికి ముందే మన మీద మనం విశ్వాసం కోల్పోతే లోకం వచ్చి చేసేదేమీ ఉండదని! -
హార్ధిక్ పటేల్(గుజరాత్ కాంగ్రెస్) రాయని డైరీ
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్‌కి వర్క్ ఇవ్వడం మానేస్తారు! వర్క్‌ల ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే అక్కడికి పిలవడం మానేస్తారు. వర్క్ ఎందుకు ఇవ్వందీ చెప్పరు. వర్క్‌ల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవందీ చెప్పరు. రాహుల్‌కి చెప్పుకుందామని ఢిల్లీ వెళితే, అప్పటికే అక్కడ వేరే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు తన సమస్యను చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు! ‘‘మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా.. కాంగ్రెస్‌లోనే ఉండి నీ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకుని..’’ అన్నారు గోపాల్ ఇతాలియా. ‘ఆప్’కి గుజరాత్ స్టేట్ చీఫ్ అతడు. ‘‘మీ పేరు గోపాల్ ఇతాలియానే అయినా నాకు మిమ్మల్ని నరేశ్ పతేలియా అని పిలవాలనిపిస్తోంది..’’ అన్నాను. ‘‘నరేశ్ పతేలియానా!! నరేశ్ పటేల్ కదా ఆయన?!’’ అన్నారు ఇతాలియా. ‘‘అవును నరేశ్ పటేలే! అతణ్ణి లోపలికి తీసుకోడానికి నన్ను బయటికి పంపాలనో, నన్ను బయటికి పంపడానికి అతణ్ణి లోపలికి తీసుకోవాలనో ప్లాన్ చేస్తున్నారు మా వాళ్లు. నేనిప్పుడు మీతో వచ్చేస్తే.. లోపలికి రావడానికి పటేల్‌కి, లోపలికి తీసుకోడానికి మా పార్టీకి మీరు హెల్ప్ చేసినవాళ్లవుతారు. అప్పుడు మీరు నాకెప్పటికీ పతేలియాలా గుర్తుండిపోతారు తప్ప ఇతాలియాలా కాదు..’’ అన్నాను. ‘‘మీ పార్టీకో, నరేశ్ పటేల్కో దారి క్లియర్ చేయడానికి నేనెందుకు నిన్ను రమ్మని అడుగుతాను హార్దిక్? కేజ్రీవాల్ నిన్ను అడుగుతున్నారు. ‘ఆప్’లోకి వచ్చేయ్. ఫీల్ ద లీడర్షిప్..’’ అన్నారు ఇతాలియా. ‘‘నేను రాలేను. మా నాన్నగారి పేరు భరత్. నా చిన్నప్పట్నుంచే ఆయన కాంగ్రెస్ కార్యకర్త’’ అన్నాను. ‘‘లైఫ్‌లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి హార్దిక్. మనకూ ఒక లైఫ్ ఉంటుంది కదా. రేపు నువ్వూ.. నీ కొడుకునో, కూతుర్నో ‘మా తాతగారు భరత్. మా నాన్నగారి చిన్నప్పట్నుంచే మా తాతగారు కాంగ్రెస్ కార్యకర్త’ అనే చెప్పుకోనిస్తావా? మన గురించి చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడే మన పిల్లలు వాళ్ల తాతగారి గురించి, ముత్తాతగారి గురించి చెప్పుకుంటారు. ఇంకేం ఆలోచించకు వచ్చేయ్..’’ అన్నారు ఇతాలియా. ఇతాలియా వెళ్లాక చూసుకుంటే ఫోన్లో మెసేజ్! ‘ఒకసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చి వెళ్లడం కుదురుతుందా హార్దిక్..’ అని జగదీశ్ థాకర్. గుజరాత్‌కి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే జగదీశ్ థాకర్ ప్రెసిడెంట్. ‘‘పార్టీ గురించి బయట నువ్వేదో బ్యాడ్‌గా మాట్లాడుతున్నావట?!’’ అన్నారు థాకర్.. పార్టీ ఆఫీస్‌కి నేను వెళ్లీవెళ్లగానే. ‘‘బ్యాడ్‌గా ఏమీ మాట్లాడలేదు, బ్యాడ్‌గా ఫీల్ అవుతూ మాట్లాడి ఉంటాను’’ అన్నాను. థాకర్ పక్కనే రఘుశర్మ కూర్చొని ఉన్నారు. రఘుశర్మ పక్కన మనీష్ దోషి ఉన్నారు. శర్మ స్టేట్ ఇన్చార్జ్. మనీష్ స్టేట్ అధికార ప్రతినిధి. ‘‘హార్దిక్.. ఒకమాట. ఇంతప్పుడు నిన్ను పార్టీలోకి తెచ్చి, అంతలోనే కాంగ్రెస్ నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేసిందంటే.. అది నీకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదా? గుడ్ని వదిలేసి, బ్యాడ్‌ని పట్టుకుంటావేంటి?’’ అన్నారు శర్మ. ‘‘2017లో నన్ను తెచ్చారు. 2022లో నా మీదకు నరేశ్ పటేల్‌ను తెస్తున్నారు. 2027లో నరేశ్ పటేల్ మీదకు మరొక పటేల్‌ని తెస్తారు. ఇది నాకు గుడ్ అనిపించలేదు..’’ అన్నాను. ‘‘సరే, ‘ఆప్’లోకి ఎప్పుడు వెళ్తున్నావ్?’’ అన్నారు థాకర్ సడన్‌గా! ఆయన అలా అంటున్నప్పుడు పార్టీలోని విలక్షణత ఆయన ముఖంలో ప్రతిఫలించింది. ‘‘అవును.. ఎప్పుడు?’’ అన్నారు శర్మ, దోషి వెంటవెంటనే! నన్ను రప్పించుకోడానికి కేజ్రీవాల్ పడని తొందర కంటే, నన్ను పంపించడానికి కాంగ్రెస్ పడుతున్న తొందరే ఎక్కువగా కనిపిస్తోంది!! -
నిర్మలా సీతారామన్ (ఆర్థికమంత్రి) రాయని డైరీ
పంజాబ్‌లో ఇవాళ పోలింగ్. పంజాబ్‌తో పాటు యూపీలోనూ అతి ముఖ్యమైన మూడో విడత పోలింగ్ ఉన్నప్పటికీ.. పోలింగ్‌కి సరిగ్గా రెండు రోజుల ముందు భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తను హర్ట్ అయ్యానంటూ పంజాబ్ ప్రజలను ఉద్దేశించి, ఇంటి నుంచే హఠాత్తుగా ఒక వీడియో విడుదల చేయడంతో యూపీ అన్నది ఎన్నికల్లో ముఖ్యం, ప్రాముఖ్యం కాకుండా పోయింది! మన్మోహన్సింగ్ భారతదేశ తొలి సిక్కు ప్రధాని. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఆ మాత్రం హర్ట్ అయ్యే అవసరం ఆయనకు ఉంటుంది. పంజాబ్‌ని, పంజాబ్ రైతుల్ని నరేంద్ర మోదీ అవమానించడం పంజాబీ అయిన తన హృదయాన్ని లోతుగా గాయపరిచిందని మన్మోహన్ ఆవేదన! లోతుగా మనసు గాయపడినవాళ్లు మౌనంగా ఉండిపోతారు. అసలు ఉండటమే ఎప్పుడూ లోతైన మౌనంతో ఉండే మన్మోహన్సింగ్ గాయపడటం వల్ల కొత్తగా మౌనం వహించడానికి లోపల చోటు లేకనో ఏమో బయటికి రెండు మాటలు అనేశారు! ‘ఫేక్ నేషనలిజం’ అన్నారు. ‘ఫెయిల్డ్ ఎకానమీ’ అన్నారు. నాలుగేళ్లు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా, మూడేళ్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, రెండేళ్లు ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా, ఐదేళ్లు ఆర్థికమంత్రిగా, పదేళ్లు ప్రధానమంత్రిగా పని చేసిన ఎనభై తొమ్మిదేళ్ల నాయకుడు ‘ఫేక్’, అని, ‘ఫెయిల్’ అనీ ఎలా అంత తేలిగ్గా అనేయగలరు?! ‘మాకు ఓట్లు వెయ్యండి’ అని ఒక మాజీ ప్రధాని అడిగే విధానం ఇదే కనుకైతే.. ‘వాళ్లకు ఓట్లు వేయకండి’ అని ప్రస్తుత ప్రధాని చెప్పే విధానానికీ ఆయన సిద్ధపడేగా ఉండాలి. నెహ్రూజీని మోదీజీ విమర్శిస్తుంటే సహించలేకపోతున్న మన్మోహన్.. తను మోదీజీని విమర్శిస్తుంటే అంతా సహిస్తూ కూర్చోవాలని ఎలా ఆశిస్తారు?! దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కావచ్చు. దేశాన్ని దేశంలా నడిపిస్తున్న తొలి ప్రధాని మాత్రం మోదీజీనే. మోదీజీ ఆలింగనాలు చేసుకుంటారు, ఉయ్యాలలూగుతారు, బిర్యానీలు తింటారు.. ఇవా మోదీజీపై ఆయన చేసే విమర్శలు!! దేశాధినేతల్ని మోదీజీ ఆలింగనం చేసుకుంటే, జిన్‌పింగ్‌తో కలిసి ఉయ్యాలలూగితే, నవాజ్ షరీఫ్‌తో కలిసి బిర్యానీ తింటే అది ఫేక్ నేషనలిజం ఎలా అవుతుంది? ఆర్థిక అభివృద్ధి సూచీలు ఆకాశం వైపు సాగుతుంటే అది ఫెయిల్డ్ ఎకానమీ ఎలా అవుతుంది? ఎకానమీ ఫెయిల్ అవడం అంటే నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ని నడపడం కోసం ఆ సంస్థ అధినేత చిత్రా రామకృష్ణ హిమాలయాల్లోని ఒక అజ్ఞాత యోగీశ్వరుడిని సంప్రదించడం. దేశంలో వరుసగా ఇరవై రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్‌లోనే ఉండిపోవడం. దేశం నుంచి పెట్టుబడులు పక్షుల్లా ఎగిరిపోవడం. బలహీనమైన ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ అపఖ్యాతి పాలవడం. ఇవన్నీ మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా జరిగినవే. ఇక ఫేక్ నేషనలిజం అంటే.. పోలింగ్‌కి కొన్ని గంటల ముందు మాత్రమే మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్ గుర్తుకురావడం. తను పంజాబీనని గుర్తు చేసుకోవడం! పెద్దరికాన్ని కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ ఆశించినట్లు, కాంగ్రెస్ ఆదేశించినట్లు ఆయన చిన్న మాటలు మాట్లాడుతున్నారనిపిస్తోంది.మన్మోహన్జీ అంటే కాంగ్రెస్‌లో రెస్పెక్ట్ లేకపోవచ్చు. బీజేపీలో రెస్పెక్ట్ ఉంది. దేశానికి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు బ్లెస్సింగ్స్ కోసం ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాను. అంతకుక్రితమే ఆయన రాజ్యసభ టర్మ్ అయిపోయింది కనుక బడ్జెట్ రోజు సభలో ఆయన ఉండరు. అందుకనే ఇంటికి వెళ్లి కలిశాను. రెండు నెలల తర్వాత కొత్త టర్మ్‌లో మళ్లీ ఆయన రాజ్యసభకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్జీ ఉంటే సభకు వచ్చే నిండుదనమే వేరు. కాంగ్రెస్‌లో ఆ నిండుతనం ఆయనకు ఎక్కడిది? -
ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు సీఎం)రాయని డైరీ
చదవాలన్న ఆశ బలంగా ఉన్నప్పుడు.. చదవలేక పోతామేమోనన్న భయమూ ఆ వెనకే ఆశను బలహీనపరుస్తూ ఉంటుంది. తమిళనాడు పిల్లలకు మెడిసిన్ పెద్ద ఆశ. కానీ భయం! ‘నీట్’లో పోటీ కి వచ్చే పెద్ద నగరాల పిల్లల్ని తట్టుకోగలమా? మేలురకపు ఇంగ్లిషును సులువుగా, మెలకువలతో మాట్లాడగలిగిన వాళ్లను నెగ్గుకువెళ్లగలమా? ఖరీదైన కోచింగ్ సెంటర్లలో తర్ఫీదై వచ్చినవాళ్లకు దీటుగా నిలవగలమా? ఇంట్లో ఏ గొడవా లేక ఏకధ్యానంతో స్థిమితంగా కూర్చొని టెస్ట్‌కి చక్కగా ప్రిపేర్ అయి వచ్చినవాళ్లతో తలపడగలమా? ఇన్ని భయాలు! నీట్.. ప్రభుత్వం పెట్టిన భయం. ఊహు.. భయం కాదు. ప్రభుత్వం సృష్టించిన భూతం! ఎవరి రాష్ట్రంలో వాళ్లు కష్టపడి చదివి వాళ్ల టెస్ట్‌లు వాళ్లు రాసుకుంటూ ఉన్నప్పుడు.. ‘అంతకష్టం ఎందుకు?! ఇక నుంచీ దేశం మొత్తానికి ఒకటే టెస్ట్’ అంటూ నీట్ పరీక్షను తెచ్చిపెట్టారు! దేశం మొత్తం ఒకేలా ఉందా.. దేశం మొత్తం పెన్ను, పేపరు పట్టుకుని కూర్చొని ఒకే టెస్టు రాయడానికి?! భయంతోనైనా, భూతంతోనైనా పోరాడేందుకు శక్తి కావాలి. సామాన్యమైన ఇళ్లల్లో, అసమానతల సమాజాల్లో, అనుకూలతలు లేని గ్రామాల్లో.. పోరాడేంత శక్తి పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది?! గురువారం అసెంబ్లీకి వెళుతున్నప్పుడు టీటీకే రోడ్డులో ఒక యువకుడు ‘సిఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని కాన్వాయ్కి ఎదురొచ్చాడు! నీట్ ఎగ్జామ్‌ని అపోజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడట. నీట్ వద్దన్న మిగతా స్టేట్లకు కూడా నీట్ లేకుండా చెయ్యమని అతడి అభ్యర్థన. అసెంబ్లీ ప్రాంగణంలోకి కారు మలుపు తిరుగుతుండగా, ఆ ముందురోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఇచ్చిన 45 నిముషాల ప్రసంగంలోని రెండు మాటలు మళ్లొకసారి నా హృదయాన్ని మృదువుగా తాకాయి. ఆయనెంత అర్థవంతంగా మాట్లాడారు! ‘ఉత్తరప్రదేశ్‌లోని నా సోదరునికి రాజ్యాంగం ఎలాంటి హక్కులనైతే కల్పించిందో అవే హక్కులను తమిళనాడులోని నా సోదరుడికీ ప్రసాదించింది. ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ ఆత్మాభిమానం ఉంటుంది. వాటిని గౌరవించకుండా ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పరిపాలించడానికి మీరేమీ చక్రవర్తి కాదు’ అని మోదీకి ఎంత మర్యాదగా పాఠాలు చెప్పారు! కారు దిగి, అసెంబ్లీ వరండాలో నడుస్తున్నాను. స్పీకర్ ఎదురొచ్చి, నీట్ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారని చెప్పారు! నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించమని కోరుతూ ఐదు నెలల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు అది. ఏ కారణాలైతే చూపి తమిళనాడు నీట్‌ని వద్దందో.. అవే కారణాలు చూపి నీట్‌ని వద్దనడానికి వీల్లేదనేశారట గవర్నర్ గారు. నీట్‌ని ‘యాంటీ–పూర్’ అని మేము అంటే.. నీట్‌ని వద్దనడం ‘యాంటీ–పూర్’ అని గవర్నర్! మోదీకి ఏమాత్రం తీసిపోవడం లేదు గవర్నర్లు. మోదీ తనని తాను చక్రవర్తినని అనుకుంటుంటే, గవర్నర్లు తమని తాము మోదీలమని అనుకుంటున్నారు. ఆరోజు అన్నాదురై వర్ధంతి. సభలో నివాళులు అర్పించి కూర్చున్నాం. ‘ఆడుక్కు దాడియం, నాటుక్కు గవర్నురు తేవై ఇల్లయ్’ అని అన్నాదురై తరచూ అంటుండేవారని నాన్నగారు నా చిన్నప్పుడు చెబుతుండేవారు. ఆ మాట నాకు బాగా నవ్వు తెప్పించేది. మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదని అన్నాదురై అలా బలంగా విశ్వసిస్తుండేవారట! గవర్నర్లపై ముఖ్యమంత్రులకు విశ్వాసాలు ఊరకే ఏర్పడతాయా?! విశ్వాసాలను ఏర్పరచడమే పనిగా కొంతమంది గవర్నర్లు రాష్ట్రాలకు బదలీ అయి వస్తారనుకుంటాను. శనివారం నీట్‌పై సెక్రటేరియట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, అన్నాడిఎంకె రాలేదు. నీట్ పరీక్ష రాసే పని మనకైతే లేదుగా అనుకున్నట్లున్నారు!! -
రాయని డైరీ.. జైరామ్ రమేశ్ (కాంగ్రెస్ ఎంపీ)
మేడమ్ సోనియాజీ స్క్రీన్ మీదకు వచ్చాక వీడియో కాన్ఫరెన్సింగ్ మొదలైంది. మేడమ్ రాగానే మాలో కొందరం లేచి, కూర్చున్నాం. మాలోనే మరికొందరు లేచే లోపే, కూర్చోమన్నట్లుగా మేడమ్ వారించడంతో వాళ్లెవరూ లేచి కూర్చోలేకపోయారు. ఆంటోనీ, వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్యం టాగోర్, మనీశ్ తివారీ, నేను.. మొత్తం పది మందితో మేడమ్ ఏర్పాటు చేసిన ప్రీ–బడ్జెట్ మీటింగ్ అది. మేడమ్ స్క్రీన్ మీదకు రావడంతోనే.. ‘‘జయ్! మీరేం చెప్పబోతున్నారు?’’ అన్నారు.. నా వైపు చూస్తూ! ఆ మాటకు ఆంటోనీ నవ్వారు. సాధారణంగా మా ప్రీ–బడ్జెట్ మీటింగ్‌ని.. ‘వెల్కమ్ టు స్ట్రాటెజీ గ్రూప్’ అనే మాటతో మొదలుపెడతారు మేడమ్. కానీ ఈసారి అలా జరగలేదు. మీటింగ్‌ని నాతో స్టార్ట్ చేశారు! ‘‘ఎంత ఎకానమిస్ట్ అయితే మాత్రం బడ్జెట్ గురించి జైరామ్‌జీ కొత్తగా ఏమైనా చెప్పబోవ డానికి నిర్మలా సీతారామన్ అవకాశం ఇవ్వబోతారంటారా!’’ అన్నారు ఆంటోనీ. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎలాగైతే ఉండాల్సిన విధంగా లేదో, ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందని నేను చెప్పగలను..’’ అన్నారు ఆనంద్ శర్మ. ‘‘మనం మాత్రం అలా ఉండకూడదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్స్‌లో ఎంత గట్టిగా డిబేట్ చేయబోయామో అంతకన్నా గట్టిగానే చెయ్యాలి..’’ అన్నారు మల్లికార్జున్ ఖర్గే. ‘‘ఇష్యూస్ అవే కనుక.. సేమ్ రిలీఫ్ ప్యాకేజ్, సేమ్ డిజిన్వెస్ట్‌మెంట్, సేమ్ ఇన్ఫ్లేషన్, సేమ్ చైనా బోర్డర్, సేమ్ ఫార్మర్స్.. మనం కొత్తగా స్ట్రాటెజీ మార్చే పని కూడా లేదు’’ అన్నారు మనీశ్ తివారీ. ‘‘స్ట్రాటెజీలో ఒకటైతే యాడ్ చేయొచ్చు. ప్రతిపక్షంలోని వాళ్లకు ‘పద్మ’ అవార్డులిచ్చి అంతర్గత విభేదాలు సృష్టించాలని చూసే పాలకపక్ష కుట్రల్ని, కుయుక్తుల్ని బట్టబయలు చెయ్యొచ్చు’’ అన్నారు మాణిక్యం. అవునన్నట్లు మాణిక్యం వైపు చూసి, నా వైపు తిరిగారు మేడమ్. ‘‘జయ్! మీ ట్వీట్ చూశాను. సెవన్టీ త్రీలో ప్రభుత్వం పద్మవిభూషణ్‌ని ఆఫర్ చేస్తే అప్పటి పి.ఎం. ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎన్.హస్కర్ ఎంత మర్యాదపూర్వకంగా నిరాకరించిందీ మీరు ట్వీట్లో పోస్ట్ చేసిన పుస్తక భాగాన్ని చదివాను. అంతగా విలువల్ని పాటించే మనిషిని ఈకాలంలో అరుదుగా మాత్రమే చూస్తాం..’’ అన్నారు. ‘‘అవును మేడమ్‌జీ! అవార్డుల్ని నిరాకరించేందుకు ఆత్మబలం, ఆత్మనిగ్రహం కావాలి’’ అన్నాను. ‘‘కానీ జైరామ్‌జీ, మీరు పెట్టిన మరొక ట్వీట్లో మీ ఉద్దేశాన్ని మన సీనియర్ సహచరులు కరణ్‌సింగ్ సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని నేనెంతో ఆవేదనతో గమనించాను. మోదీజీ ఇచ్చిన ‘పద్మభూషణ్’ని తిరస్కరించినందుకు మీరు బుద్ధదేవ్ భట్టాచార్యజీని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసను కరణ్‌సింగ్.. పద్మభూషణ్‌ని నిరాక రించని గులామ్ నబీ ఆజాద్‌పై ఎత్తిపొడుపుగా తీసుకున్నారు’’ అన్నారు అధీర్ రంజన్. ‘‘కరణ్‌సింగ్ అలా ఎప్పుడు ట్వీట్ చేశారు?!’’ అన్నారు గొగోయ్. ‘‘ట్వీట్ చేయలేదు. స్టేట్మెంట్ విడుదల చేశారు’’ అన్నారు సోనియాజీ! ఆజాద్ తన ‘పద్మ’ అవార్డును నిరాకరించని పర్యవసాన పరిణామాలను మేడమ్ ఆసక్తిగా గమనిస్తున్నట్లున్నారు! మేడమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ అయ్యాక మా పది మందిలో ఒకరితో నేను వేరుగా కనెక్ట్ అయ్యాను. ‘‘ఆత్మబలం కాదు, ఆత్మ నిగ్రహం కాదు. అవార్డును నిరాకరించడానికి ఆత్మప్రబోధానుసారం వెళ్లగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తూ మన పార్టీలోని సీనియర్లు తమ ఆత్మ ఢిల్లీలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేందుకు నిరంతరం పెనుగు లాడుతూనే ఉంటారు..’’ అన్నారాయన. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. హరీశ్ రావత్ (73), కాంగ్రెస్
వికలమైన మనసుతో బుధవారం నేను భగవాన్ కేదార్‌నాథ్‌కి ట్వీట్ పెడితే గురువారం ఆ భగవానుడే చెప్పి చేయించినట్లుగా ప్రియాంకా గాంధీ నాకు ఫోన్ చేశారు! ‘‘నమస్తే రావత్జీ! రేపు ఢిల్లీ వచ్చి రాహుల్జీని కలవండి’’ అని చెప్పి, ఫోన్ పెట్టేశారు ప్రియాంక!! రాహుల్‌ని ‘రాహుల్జీ’ని చెయ్యడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, రావత్‌జీని ‘రావత్’గా చేయడానికి డెహ్రాడూన్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ఢిల్లీలో ఎవరూ గమనిస్తున్నట్లు లేరు. ‘‘దేవేంద్ర యాదవ్ నన్ను లెక్కచేయడం లేదు రాహుల్జీ. అందుకే ఆ కేదారేశ్వరుడికి మొర పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో నాకో దారి చూపించమని, లేదంటే కాస్త విశ్రాంతిని ప్రసాదించమని ఆయన్ని వేడుకున్నాను..’’ అని శుక్రవారం ఢిల్లీ వెళ్లీ వెళ్లగానే రాహుల్‌తో చెప్పేశాను. ‘‘రావత్జీ! మీరలా వికలమైన మనసుతో మీ ఇష్టదైవానికి ట్వీట్ చేయడం నన్ను, మమ్మీని, ప్రియాంకను ఎంతో బాధించింది. మీ ట్వీట్‌ను కేదారేశ్వరుడొక్కడే చూడడు కదా! నరేంద్ర మోదీజీ చూస్తారు. మమతాజీ చూస్తారు. అమరీందర్‌సింగ్ కూడా చూస్తారు. ట్వీట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా?’’ అన్నాడు రాహుల్. ‘‘క్షణికావేదనలో అలా చేసేశాను రాహుల్జీ. కానీ దేవేంద్ర యాదవ్ అన్నీ తనే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. ‘రావత్‌కి అంత శక్తి లేదు’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మీరు చెప్పండి రాహుల్జీ. రెండుసార్లు ఉత్తరాఖండ్‌కి సీఎంని అయిన నాకే అంత శక్తి లేకుంటే.. ఎక్కడి నుంచో ఉత్తరాఖండ్ ఇన్ఛార్జిగా వచ్చిన దేవేంద్ర యాదవ్‌కి ఉంటుందా?!’’ అని అడిగేశాను. ‘‘దేవేంద్ర యాదవ్ ఎక్కడి నుంచో రాలేదు రావత్జీ. ఢిల్లీ నుంచే వచ్చాడు’’ అన్నాడు రాహుల్. ‘‘సంతోషం రాహుల్జీ! ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా సంతోషమే. అందుకే కదా.. డెహ్రాడూన్‌కి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో.. డయాస్ మీద మీతో పాటు ఎవరెవరు ఉండాలో నిర్ణయించవలసింది నేను కదా, దేవేంద్ర యాదవ్ నిర్ణయించేశాడేమిటి అనే ఆలోచన కూడా నాకు రాలేదు!’’ అన్నాను. రాహుల్ అలా వింటూ ఉండిపోయాడు. వినడం వరకేనని నిర్ణయించుకున్నాకే నన్ను ఢిల్లీ పిలిపించినట్లున్నాడు! ‘‘రాహుల్జీ, మీరు మా ఇద్దర్నీ కలిసి పని చెయ్యమన్నారు. దేవేంద్ర యాదవ్ తనొక్కడే చాలనుకుంటున్నాడు. ‘పేరుకే స్టేట్ ఇన్ఛార్జ్. స్టేట్‌లో ఛార్జ్ మొత్తం నాదే’ అని ప్రచారం చేసుకుంటున్నాడు. సీఎం క్యాండిడేట్ని ముందే ప్రకటిస్తే తప్ప అతడు, నేను కలిసి పనిచేసే పరిస్థితి లేదు రాహుల్జీ’’ అన్నాను. ‘‘పరిస్థితా? ప్రసక్తా రావత్జీ’’ అన్నాడు రాహుల్! అంత లోతుగా అతడు ఆలోచించగలడని నేను అనుకోలేదు. ‘‘రావత్జీ! 2017లో అమరీందర్ సింగ్‌ని తప్ప, ఆ తర్వాత ఎవర్నీ మనం సీఎం క్యాండిడేట్‌గా ఎన్నికలకు ముందే ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. ఎన్నికలు అయ్యాకే సీఎంగా ఎంపికయ్యారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పేరు కూడా ఎన్నికలు అయ్యాకే సీఎంగా బయటికొచ్చింది. వాళ్లిద్దరూ ఈరోజుకీ సీఎంలుగా ఉన్నారు. ముందే సీఎంగా ప్రకటించి, సీఎంని చేసిన అమరీందర్ సింగ్ ఏమయ్యారో మీకు తెలిసిందే కదా’’ అన్నాడు రాహుల్! ఒక నమస్కారం పెట్టి, వచ్చేశాను. డెహ్రాడూన్‌లో అడుగుపెట్టగానే.. పంజాబ్ నుంచి అమరీందర్‌సింగ్ ఫోన్! ‘‘రావత్జీ! పంజాబ్ స్టేట్ ఇన్‌ఛార్జ్‌గా మీరు నాకు తవ్వారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఛార్జిగా దేవేంద్ర యాదవ్ ఇప్పుడు మీకు తవ్వుతున్నాడు. కాంగ్రెస్సే కోరి తవ్వకాలు జరిపించుకుంటున్నప్పుడు మీరెంత, నేనెంత, ఆ కేదారేశ్వరుడెంత చెప్పండి’’ అన్నారాయన! -
రాయని డైరీ: అమిత్ షా (కేంద్ర మంత్రి)
‘‘ఇండియాలో ఏంటి విశేషాలు అమిత్జీ..’’ అని రాత్రి పన్నెండు గంటలప్పుడు రోమ్ నుంచి మోదీజీ ఫోన్ చేశారు. రోమ్ కన్నా ఢిల్లీ మూడున్నర గంటలు ముందుంటుంది కాబట్టి, ఆయన నాకు ఫోన్ చేసిన టైమ్‌లో అక్కడ రాత్రి ఎనిమిదిన్నర అయుండాలి. మోదీజీ అప్పుడే డిన్నర్ ముగించుకుని నాలుగడుగులు వేయడానికి బాల్కనీలోకి వచ్చి ఫోన్ చేసినట్లున్నారు. ‘‘పెద్దగా విశేషాలేం లేవు మోదీజీ’’ అన్నాను.. బలమైన ఆవలింత నొకదాన్ని బలంగా నొక్కిపట్టేస్తూ. ‘‘పెద్దగా లేవంటే.. కొద్దిగా ఉన్నాయనేగా..’’ అని మోదీజీ తన కవితాత్మక ధోరణిలో అన్నారు. మామూలుగానైతే అది నేను కవితల్ని ఆస్వాదించే టైమ్ కాదు. డిన్నర్ ముగించుకుని బాల్కనీలో నేనూ నాలుగు అడుగులు వేసి అప్పటికే మూడున్నర గంటలు దాటింది కాబట్టి ఇక్కడి విశేషాలు కూడా ఏవీ వెంటనే గుర్తుకు రాలేదు. నిద్ర మత్తును వదిలించుకునేందుకు కొంత టైమ్, విశేషాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మరికొంత టైమ్ తీసుకున్నాను. మొత్తం మీద ఐదు సెకన్ల టైమ్ తీసుకుని ఉంటాను. ‘‘చెప్పండి అమిత్జీ..’’ అన్నారు ఉత్సాహంగా. అక్కడ మోదీజీకి నిద్ర తన్నుకొచ్చేవరకు ఇక్కడ నేను విశేషాలను గుర్తుకు తెచ్చుకోడానికి తన్నుకులాడటం తప్పేలా లేదని అర్థమైంది. ‘‘కొన్ని విశేషాలైతే ఉన్నాయి మోదీజీ! రాజ్‌నాథ్‌సింగ్ మిమ్మల్ని ఇక్కడ ఒక సభలో 24 క్యారెట్ల బంగారం అన్నారు. అంతే కాదు. గాంధీజీ తర్వాత గాంధీజీ అంతటి వారని కూడా అన్నారు. లక్నో వెళ్లినప్పుడు నేను కూడా అదే మాట అన్నాను. 2024 లోనూ మోదీజీనే మనకు కావాలంటే కనుక 2022లోనూ యోగినే మనం ఎన్నుకోవాలి అని అక్కడి వారికి చెప్పి వచ్చాను’’ అన్నాను. ‘‘మన విశేషాలు మనకెందుకు అమిత్జీ! మనవాళ్ల విశేషాలేమైనా ఉంటే చెప్పండి’’ అన్నారు మోదీజీ. మనవాళ్లు అంటే ఆయన అర్థం వేరే. ‘‘ఉన్నాయి మోదీజీ! రాహుల్ గుజరాత్ వెళ్లి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ‘రెండేళ్ల క్రితం.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని మీరు అన్నారా?’ అని రాహుల్‌ని జడ్జి అడిగితే.. నేనెప్పుడన్నాను, నేనెందుకంటాను అని అనకుండా.. ‘నాకు తెలియదు’ అని చెప్పి వచ్చేశాడు. రాహుల్ సూరత్ కోర్టులో అలా చెప్పి వచ్చేయడం ఇది మూడోసారి మోదీజీ’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు. ‘‘మమతా బెనర్జీ పణాజి వెళ్లారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘వెళ్లి?’’ అన్నారు. ‘‘టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కాదు.. టి అంటే టెంపుల్, ఎం అంటే మసీద్, సి అంటే చర్చి అని అంటున్నారు మోదీజీ..’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు! ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ గురించి కూడా ఒక విషయం ఉంది మోదీజీ. అయితే అది విషయమే కానీ విశేషం ఏమీ కాదు..’’ అన్నాను. ‘‘అయినా చెప్పండి’’ అన్నారు. ‘‘2024లో మీరు వచ్చే ప్రసక్తే లేదట. పార్టీలన్నీ ఏకమై, మిమ్మల్ని ఓడిస్తాయని లాలూ అంటున్నారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘అవునా’’ అన్నారు. ‘మరి అక్కడి విశేషాలేంటి మోదీజీ’ అని అడగబోయి ఆగాను. అప్పటికే ఒంటి గంట అవుతోంది. ‘‘ఇక్కడా విషయాలున్నాయి అమిత్ జీ. ఓ గంటలో మళ్లీ ఫోన్ చేస్తాను.. మీ డిన్నర్ అయింది కదా?’’.. అని ఫోన్ మాట్లాడుతూనే ఎవరితోనో మాటల్లోకి వెళ్లిపోయారు!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)
రాత్రి కలలోకి మన్మోహన్ సింగ్, చిదంబరం, అరుణ్ శౌరి వచ్చారు! ముగ్గురూ కలిసే కలలోకి వచ్చారా, కలలోకి వచ్చాకే ముగ్గురూ కలిశారా గుర్తుకు రావడం లేదు. ‘‘డెంగీ నుంచి ఎప్పుడు కోలుకున్నారు మన్మోహన్ జీ’’ అని అడిగినట్లున్నాను. అందుకు ఆయన.. ‘‘ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు మన్మోహన్జీ అని అడిగినట్లుగా అడుగుతున్నావేంటి థరూర్..’’ అని మృదువుగా నవ్వుతూ అన్నారు! ఎనభై తొమ్మిదేళ్ల వయసులోని ఒక మాజీ ప్రధానిని ఎంపిక చేసుకుని మరీ ఆ డెంగీ దోమ కుట్టడం వెనుక ఉండగల సంభావ్యతల గురించి కలలోనే నేను ఆలోచిస్తూ ఉన్నాను. ‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్! ఆ అడగడం కూడా ఆయన నా కలలోకి వచ్చి అడిగినట్లుగా కాకుండా, నేను ఆయన కలలోకి వెళితే అడిగినట్లుగా అడిగారు. ‘‘ఏం లేదు మన్మోహన్ జీ. కబురు పంపితే నేనే ఢిల్లీ వచ్చేవాడిని కదా.. మీరు తిరువనంతపురం వరకు రావడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను’’ అని చెప్పాను. ‘‘నువ్వు అంత టైమ్ ఇస్తే కదా థరూర్’’ అన్నారు మన్మోహన్ భారంగా. ‘‘ఎంత టైమ్ మన్మోహన్ జీ’’ అన్నాను ‘‘కబురు పంపేంత టైమ్’’ అన్నారు మన్మోహన్. ‘‘అవునవును. కబురు పంపే టైమ్ కూడా ఇవ్వలేదు మీరు..’’ అని చిదంబరం గొంతు కలిపారు. అరుణ్ శౌరి కలపలేదు. గొంతూ కలపలేదు, మాటా కలపలేదు. మన్మోహన్ కాంగ్రెస్. చిదంబరం కాంగ్రెస్, నేను కాంగ్రెస్. అరుణ్ శౌరి ఒక్కరే బీజేపీ. ‘‘ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నావని అనుకుంటున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు థరూర్’’ అని చిదంబరం అడిగారు!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉన్నారో గుర్తు చేసే టైమ్‌ని కూడా మీరు మాకు ఇవ్వలేదు థరూర్’ అని అరుణ్ శౌరి అన్నారు!! ‘‘ఆ ట్వీట్ ఏంటి థరూర్! కాంగ్రెస్ పార్టీనే వంద కోట్ల వ్యాక్సిన్లు వేయించినంత గొప్పగా ట్వీట్ చేశావు! ‘ఇది భారతీయులకు గర్వకారణం’ అంటావు! ‘క్రెడిట్ అంతా గవర్నమెంటుదే’ అంటావు. దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకుంటున్నావా ఏంటి?’’ అన్నారు మన్మోహన్. ‘‘అందుకే థరూర్.. మీరెంత అందంగా ఉన్నా, మీకెంత ఇంగ్లిష్ వచ్చినా, మీరెన్ని పుస్తకాలు రాసినా, ఆఖరికి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రెటరీ జనరల్‌గా పని చేసి వచ్చినా.. కాంగ్రెస్ పార్టీలో సహాయ మంత్రిగా తప్ప మీరు ఏ టెర్మ్లోనూ పూర్తి స్థాయి మంత్రిగా లేరు’’ అన్నారు అరుణ్ శౌరీ!! ‘‘మళ్లీ ఎప్పుడైనా మోదీని అభినందిస్తూ ట్వీట్ ఇచ్చే ముందు మాక్కొద్దిగా టైమ్ ఇవ్వు థరూర్. మోదీని విమర్శిస్తూ నువ్వొక పుస్తకం రాసిన సంగతిని నీకు గుర్తు చేస్తాం..’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును గుర్తు చేస్తాం..’’ అన్నట్లు చూశారు చిదంబరం, అరుణ్‌శౌరి. కల ఎగిరిపోయింది. మోదీని అభినందించడం ఏంటని అడిగేందుకు.. వస్తే రాహుల్ రావాలి. లేదంటే సోనియాజీ రావాలి. వాళ్లు రాకుండా వీళ్లు కలలోకి రావడం ఏంటి? అసలు ఈ ముగ్గురి కాంబినేషన్ కలకు అర్థం ఏమై ఉంటుంది? ‘కలలు–అర్థాలు’ పుస్తకం కోసం షెల్ఫ్ వెతుకుతున్నాను. వరుసల్లోంచి ‘ది ప్యారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ చేతిలోకి వాలింది. మోదీని విమర్శిస్తూ నేను రాసిన పుస్తకం అదే. కలకు అర్థం, కాంబినేషన్‌కు లింకూ రెండూ దొరికాయి! మూడేళ్ల క్రితం.. వేదికపై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది మన్మోహన్, చిదంబరం, అరుణ్ శౌరీలే! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్ సీఎం)
‘‘గురూ.. నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిసొస్తే బాగుంటుందా..!’’ అని భూపేష్ బఘేల్ ఉదయాన్నే ఫోన్ చేశాడు. బఘేల్ నన్నెప్పుడూ ‘గురూ’ అన్నది లేదు. ఇప్పుడు అంటున్నాడు! గురూ అనే అవసరం లేకున్నా ఎవరైనా ఇంకొకర్ని ‘గురూ’ అన్నారంటే ఆ ఇంకొకరితో తమని ఈక్వల్ చేసుకుంటున్నారని. లేదంటే, ఆ ఇంకొకరిని తమకు ఈక్వల్ చేస్తున్నారని. ‘‘నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను. బఘేల్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ‘‘అశోక్‌జీ.. నేను మిమ్మల్ని ‘గురూ’ అన్నందుకు మీరు చిన్నబుచ్చుకున్నట్లున్నారు. నేను కూడా మీలా ఒక రాష్ట్రానికి సీఎంని కనుక మీతో సమస్థాయినో, సమస్థానాన్నో ఆశించి మిమ్మల్ని ‘గురూ’ అనలేదు. ఇద్దరం కాంగ్రెస్ సీఎంలమే కనుక మిమ్మల్ని ‘గురూ’ అని చొరవగా అనగలిగాను’’ అన్నాడు. ‘‘మనిద్దరం కాంగ్రెస్ సీఎంలమే అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను నవ్వుతూ. కొంచెం తేలిక పడినట్లున్నాడు. ‘‘అందుకే మిమ్మల్ని గురూ అన్నాను అశోక్‌జీ. నేను కూడా మీలా బాగున్న ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండాలని ఆశ పడుతున్నాను..’’ అన్నాడు బఘేల్. ఆ మాటతో అతడిలో నాకు గురుస్వరూపం గోచరించింది! అలాగని అతడిని నేను గురూ అంటే అతడింకేదో స్వరూపాన్ని నాకు చూపించవచ్చు. కాంగ్రెస్‌లో స్వరూపాలను ఊహించలేం. సాక్షాత్కారం జరిగినప్పుడు చూసి ఆశ్చర్యపోవడమే. అందుకే, ‘‘చెప్పు బఘేల్’’ అని మాత్రం అన్నాను. ‘‘చెప్పడానికి కాదు అశోక్‌జీ, నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిస్తే బాగుంటుందా అని అడగడానికి ఫోన్ చేశాను’’ అన్నాడు. కాంగ్రెస్‌కు ఉన్నదే ముగ్గురు సీఎంలు. రాజస్తాన్‌లో నేను, ఛత్తీస్‌గఢ్‌లో బఘేల్, పంజాబ్‌లో కొత్తగా వచ్చిన చరణ్‌జిత్ చన్నీ. కొత్తగా వచ్చాడు కాబట్టి చన్నీ కర్టెసీగా వెళ్లి మోదీజీని కలిసుంటాడు. చన్నీకైతే సాకుగా రైతు చట్టాల రద్దు డిమాండ్లు ఉన్నాయి. మరి బఘేల్‌కి ఏమున్నాయి? ‘‘ఇష్యూ ఏంటి బఘేల్..’’ అన్నాను. ‘‘ఇష్యూ కాకూడదనే అశోక్‌జీ’’ అన్నాడు! బఘేల్ మళ్లీ నాకు గురుస్వరూపాన్ని అనుగ్రహించాడు. ‘‘అశోక్‌జీ! కాంగ్రెస్‌లో సీఎం అనే ప్రతి రూపానికీ ఎప్పుడూ ఒక ప్రతిరూపం ఉంటుంది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కి నవజోత్ సింగ్ సిద్ధూ, రాజస్తాన్‌లో అశోక్ గెహ్లోత్ అనే మీకు సచిన్ పైలట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ అనే నాకు టి.ఎస్. సింగ్ దేవ్ ఆ ప్రతిరూపాలు’’ అన్నాడు బఘేల్. బఘేల్ గురుస్వరూపం క్రమంగా ఎత్తుకు పెరుగుతోంది. ‘‘నేనైతే అమరీందర్ సింగ్‌ని కావాలనుకోవడం లేదు అశోక్‌జీ! అమరీందర్ కూడా ముందు నుంచే మోదీజీని కలుస్తూ ఉంటే ఇప్పుడు అమరీందర్ అయి ఉండేవారు కాదు. మొన్న చన్నీ కూడా అమరీందర్ కాకుండా ఉండేందుకే కదా మోదీజీని కలిశారు. మీకైతే మోదీజీని కలిసే అవసరమే రాలేదు. ఆయనే మిమ్మల్ని కలుపుకొన్నారు. ‘అడిగే సీఎంలు ఉంటే పెట్టే పీఎంలు ఉంటారు’ అని ఆయన మిమ్మల్ని పొగిడారు కాబట్టి మీరూ అమరీందర్ అయ్యే ప్రమాదం లేదు..’’ అంటున్నాడు బఘేల్! ‘‘మోదీజీకి టచ్‌లో ఉంటే కాంగ్రెస్ మనల్ని టచ్ చెయ్యదు అనుకోవడంలో లాజిక్ కనిపించడం లేదు బఘేల్..’’ అన్నాను. ‘‘నిజమే అశోక్‌జీ! లాజిక్ లేదు. లాజిక్‌తో అసలు మన పార్టీకి ఏం పనుంది కనుక?! రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకుండానే, అధ్యక్షుడిగా నిర్ణయాలన్నీ తీసుకోవడంలో మాత్రం లాజిక్ ఉందా?..’’ అన్నాడు అశోక్!! మళ్లొకసారి గురు సాక్షాత్కారం!! గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురు బఘేల్!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)
యు.ఎస్. నుంచి తిరుగు ప్రయాణం. సీటు బెల్టులింకా పెట్టుకోలేదు. నాతో పాటు జైశంకర్, శ్రింగ్లా, అజిత్ డోభాల్ ఉన్నారు. శ్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శి. అతడిని చూస్తుంటే ఎందుకో నాకు పన్నెండేళ్ల తర్వాత అతడు యోషిహిడేలా ఉంటాడేమో అనిపించి నవ్వొచ్చింది. యోషిహిడే జపాన్ ప్రధాని. శ్రింగ్లాకు అరవై. యోషిహిడేకు డెబ్బై రెండు. ‘‘ఏంట్సార్ నవ్వుతున్నారు?’’ అన్నాడు జైశంకర్. అతడు విదేశీ వ్యవహారాల మంత్రి. ‘‘నవ్వుతున్నానా, నవ్వుకుంటున్నానా జైశంకర్?’’ అన్నాను. ‘‘నవ్వుకుంటున్నా నవ్వినట్లే కదా సర్ కనిపిస్తుంది..’’ అని నవ్వాడు జైశంకర్. అతడి నవ్వు చూస్తుంటే ఐదేళ్ల క్రితం నా నవ్వు అతడి నవ్వులా ఉండేదేమో అనిపించింది. అతడికి అరవై ఆరు. నాకు డెబ్బై ఒకటి. ‘అవును సర్, మీరు నవ్వుకోవడం నేనూ చూశాను’ అని శ్రింగ్లా గానీ, అజిత్ డోభాల్ గానీ అంటారేమోనని చూశాను. అనలేదు! శ్రింగ్లా ఏవో ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అజిత్ డోభాల్ తన విండో పైభాగాన్ని చేతి వేళ్లతో కొట్టి చూస్తున్నాడు. విమానంలో కాకుండా విధి నిర్వహణలో ఉన్నట్లున్నారు వాళ్లిద్దరూ!! ‘‘ఏమైంది అజిత్‌జీ? విమానాన్ని అలా వేళ్లతో ఎందుకు కొట్టి చూస్తున్నారు అని అడిగాను. ‘‘కొట్టలేదు మోదీజీ, కొట్టినట్లు ఉన్నాను..’’ అన్నారు అజిత్ తన వేళ్లను చూసుకుంటూ! అజిత్ జాతీయ భద్రత సలహాదారు. డెబ్బై ఆరేళ్ల మనిషి. ఇంకో రెండేళ్లు పోతే బైడెన్ వయసుకు వచ్చేస్తారు ఆయన. జైశంకర్ ఇంకా నావైపే చూస్తూ ఉన్నాడు. నేనెందుకు నవ్వుకున్నానో తెలుసుకోవడం కోసం కావచ్చు. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని, అందుకే నవ్వొచ్చిందనీ చెబితే బాగుంటుందా? ‘క్వాడ్’లోని మా నలుగురిలో బైడెన్ కన్నా, యోషిహిడే కన్నా, పద్దెనిమిదేళ్లు నా కన్నా కూడా యంగెస్ట్.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఒకవేళ ఆ యంగ్ మ్యాన్‌తో కనుక శ్రింగ్లా తనని తను పోల్చుకుని ఉంటే.. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని జైశంకర్‌తో నేను అనడం శ్రింగ్లాను హర్ట్ చేయడమేగా!! అందుకే.. ‘‘ఏం లేదు జైశంకర్’’ అన్నాను. జైశంకర్, శ్రింగ్లా, అజిత్ సీటు బెల్టులు పెట్టుకుంటూ కనిపించారు. ‘‘అజిత్‌జీ ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంకా ఈ సీటు బెల్టులు పెట్టుకోవడం ఏంటి?!’’ అన్నాను నేనూ సీటు బెల్టు పెట్టుకుంటూ. అజిత్ సగం ఆశ్చర్యంతో చూశారు. మిగతా సగం అది ఏ భావమో అర్థం కాలేదు. బహుశా.. ఇండియాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రాని సందేహం అమెరికాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రావడం ఏంటీ అని అలా చూసి ఉండొచ్చు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా చేతి నిండా ఫైల్సే ఉన్నాయి. విమానం ఎప్పుడు ఎక్కానో, సీటు బెల్టు ఎప్పుడు పెట్టుకున్నానో గుర్తే లేదు! ‘‘మోదీజీ.. సీటు బెల్టు అన్నది టెక్నాలజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక భద్రతా ఏర్పాటు. అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కూడా సీటు బెల్టులు ఉంటాయి. మన బెల్టులు అంతకన్నా బలమైనవి..’’ అని నవ్వారు అజిత్. ఇండియాకు పదిహేను గంటల ప్రయాణం. విమానంలో చేయడానికి పనేమీ లేదు. యు.ఎస్. వచ్చేటప్పుడు ‘వర్క్ ఫ్రమ్ ఫ్లయిట్’ అంటూ నా ఫొటో ఒకటి ట్వీట్ చేసినందుకు ప్రతీకారంగా కాంగ్రెస్ వాళ్లు ఫ్లయిట్లో వర్క్ చేస్తున్న రాజీవ్ గాంధీ పాత ఫొటోను పోస్ట్ చేశారు! దేశం లోపలే కలిసిరాని వారుంటే దేశం బయట ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడూ ఎవరో ఒకరు కశ్మీర్ పేరు ఎత్తడంలో వింతేముంది?! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: మల్లికార్జున్ ఖర్గే
ల్యాండ్‌లైన్ మోగుతోంది!! సాధారణంగా అది మోగదు. వారం క్రితం మాత్రం వెంకయ్య నాయుడు చేశారు. ‘‘ఆ రోజు అలా జరిగి ఉండాల్సింది కాదు ఖర్గేజీ..’’ అన్నారు వెంకయ్య నాయుడు నిన్న శనివారం కాకుండా ఆ ముందరి శనివారం ఫోన్ చేసి! ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అంటున్నారో వెంటనే గ్రహించలేక పోయాను. ‘వెంకయ్యాజీ... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?!’ అని నేను ఆయన్ని అడగొచ్చు. అయితే అలా అడగటం ఆయనకు ఆగ్రహాన్నో, ఆవేదననో ఏదో ఒకటి కలిగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధపడి ఉండాలి. ఎవరైనా కరెంట్ ఈవెంట్స్ తెలియకుండా ఊరికే జీవించేస్తుంటే వారిపై వెంకయ్య నాయుడుకి ఆగ్రహం వస్తుంది. కరెంట్ ఈవెంట్స్‌ని ఫాలో అవుతున్నప్పటికీ సమయానికి వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేని వారిని చూస్తే ఆయనకు ఆవేదన కలుగుతుంది. ‘ఎటువైపు వెళుతోంది సమాజం!’ అని ఆగ్రహం. ‘ఏమైపోతున్నాయి విలువలు!’ అని ఆవేదన. ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదో గుర్తుకు తెచ్చుకునేందుకు అప్పటికప్పుడు ప్రయత్నించి, విఫలమై.. ఇక తప్పక.. ‘‘ఏ రోజు వెంకయ్యాజీ’’ అని అడిగేశాను. ‘‘ఏ రోజు అని అడుగుతున్నారా ఖర్గేజీ! రాజ్యసభలో మీరు ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడై ఉండీ ‘ఏ రోజు?’ అని అడుగుతున్నారా? ఏ రోజో చెప్పడం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను. గర్భగుడి లాంటి సభలో మీవాళ్లు టేబుళ్ల పైకి ఎక్కారు. ఫైళ్లు విసిరేశారు. పెద్ద పెద్దగా అరిచేశారు. కాగితాలు చింపేశారు. వాటన్నిటిపై దర్యాప్తు కోసం ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆ కమిటీలో ఉండాలి..’’ అన్నారు వెంకయ్య నాయుడు. గుర్తొచ్చింది నాకు! సభలో వెంకయ్య నాయుడు ఆవేదనతో కంటతడి పెట్టిన రోజు అది. ఆగస్టు 11. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి, రెండు రోజుల ముందే ముగిసిన రోజు. పాత సంగతిని ఇప్పుడెందుకు గుర్తుచేసుకుని ఆయన కమిటీ వేస్తున్నట్లు! ‘‘వెంకయ్యా జీ... మా మీద కమిటీ వేస్తూ మమ్మల్నే కమిటీలో చేరమంటే ఎలా చెప్పండి? ఆ రోజు మీరు చర్చకు పెట్టకుండా బీమా బిల్లును పాస్ చేయించడం కూడా జరిగి ఉండాల్సింది కానీ వాటిలో ఒకటి కదా..’’ అని.. అప్పటికేమీ చెప్పకుండా.. ఆ తర్వాత లెటర్ రాసి పంపాను. ఇప్పుడు మళ్లీ ల్యాండ్‌లైన్ మోగుతోంది!! మళ్లీ వెంకయ్య నాయుడేనా! అయినా ఈరోజు, రేపు ఆయన పుదుచ్చేరిలో బిజీగా ఉంటారు. పక్కనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై ఉంటారు. ‘జిప్మెర్’లో సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించాక అక్కడి నుంచి ఇద్దరూ అరవింద ఆశ్రమానికి వెళ్తారు. మధ్య మధ్య తెలుగు భాష గొప్పదనం గురించి వెంకయ్యనాయుడు, తమిళ భాష ప్రాచీన ప్రాశస్త్యం గురించి తమిళిసై ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు. కనుక ఆయన నాకు ఫోన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఫోన్ చేస్తున్నది ఆయనే కనుకైతే.. ఈసారి ‘ఆ రోజు’ జరిగి ఉండాల్సినవి కాని వాటిని టాపిక్‌లోకి రానివ్వకుండా.. చరిత్రలో ఆ రోజు జరిగిన ఒక ‘అపురూప’ ఘటనను ఆయనకు గుర్తు చేయాలి. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఆగస్టు 11నే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆనాటి కరెంట్ ఈవెంట్‌ను నేనింకా మర్చిపోలేదంటే... ‘సమాజంలో విలువలు ఎక్కడికీ పోలేదు, భద్రంగానే ఉన్నాయని’ ఆయన సంతోషించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అధికార పక్షంలోని ఒక వ్యక్తిని సంతోష పెట్టకూడదనేముంది? -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ యడియూరప్ప (కర్ణాటక సీఎం)
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఎనిమిది రోజులు ఒకసారి, మూడు రోజులు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణానికి సుఖంగా ఉంది! ఈ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులోనూ వదులుకోవడానికి నేను ఏమాత్రం ఇష్టపడని నా తలనొప్పిని ఎలా ఇంకో రెండేళ్లయినా భద్రంగా కాపాడుకోవడం?! ‘‘లాక్డౌన్లో మీ అబ్బాయి ఏదో చేశాడట కదా, మీరింకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారేమిటీ?!’’ .. అంటారు! అబ్బాయిలు లేకుండా ఉంటారా, ఏదో ఒకటి చేయకుండా ఉంటారా?! ‘‘ఏం చేశావ్ విజయేంద్రా ఈ లాక్డౌన్లో చెయ్యకూడని పని!’’ అని పిలిచి అడిగాను. ‘‘మీ కోసమే నాన్నగారూ, నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాను. ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఐదే నిమిషాల్లో తిరిగొచ్చేశా..’’ అన్నాడు. ‘‘నా కోసం దేవస్థానానికి వెళ్లాలా విజయేంద్రా.. ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు. పాలనలో వైఫల్యం అంటున్నారు. పాలన అంటే ఎవరు? నేనే కదా. తండ్రులు కొడుకుల్ని అర్థం చేసుకోగలరు కానీ, కోర్టులు ప్రభుత్వాలను అర్థం చేసుకోలేవు విజయేంద్రా. నీపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్జి అన్నారట’’ అన్నాను. ‘‘సారీ నాన్నగారూ, ఇక ముందు ఇంట్లోనే దండం పెట్టుకుంటాను’’ అన్నాడు. ‘సరే వెళ్లు’ అన్నట్లు చూసి, ప్రభులింగకు ఫోన్ చేశాను. లైన్లోకి వచ్చాడు. ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఎవరు మాట్లాడుతున్నది..’’ అన్నాడు!! ‘‘నేను ఫోన్ చేసింది అడ్వకేట్ జనరల్ ప్రభులింగకు అని నాకు తెలిసినప్పుడు.. మీకు ఫోన్ చేసింది కర్ణాటక సీఎం యడియూరప్ప అని మీకెందుకు తెలియడం లేదు!’’ అన్నాను. ‘‘సర్.. మీరా! నమస్తే. మీ గొంతు ఎవరిదో గొంతులా ఉంది సర్. వెంటనే పోల్చుకోలేక అలా అడిగేశాను’’ అన్నాడు. ‘‘నా గొంతు గుర్తుపట్టకుండా ఉండటానికి మీకింకా రెండేళ్ల టైమ్ ఉంది ప్రభులింగా. పాలనలో వైఫల్యం అని మావాళ్లు అంటున్నా మా పైవాళ్లేమీ నన్ను తీసేయరు. ఇంకో రెండేళ్లు సీఎంగానే ఉంటాను. విజయేంద్రది అంత సీరియస్ కేసు కాదనకుంటున్నాను. మీరేమంటారు?’’ అని అడిగాను. ‘‘నేనూ అదే అన్నాను సర్. టెంపుల్లో విజయేంద్ర దండం పెట్టుకుంది ఐదే నిమిషాలు అని వాదించాను. చీఫ్ జస్టిస్ నా మీద సీరియస్ అయ్యారు. నెక్ట్స్ వాయిదా ఉంది. అప్పుడు మళ్లీ వాదిస్తాను’’ అన్నాడు. ‘‘వాదించండి’’ అని ఫోన్ పెట్టేశాను. పెట్టిన వెంటనే ఎవరిదో కాల్. శివరాజ్‌సింగ్ చౌహాన్!! ‘‘యడియూరప్పాజీ.. విప్లవ్‌దేవ్ మీకేమైనా ఫోన్ చేశాడా?’’ అన్నాడు. విప్లవ్‌దేవ్ త్రిపుర ముఖ్యమంత్రి. చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. నేను కర్ణాటక ముఖ్యమంత్రి. ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇంకో బీజేపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మరొక బీజేపీ ముఖ్యమంత్రి గురించి అడగడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి కావచ్చు. ‘‘విప్లవ్‌దేవ్ నాకేమీ ఫోన్ చేయలేదు చౌహాన్‌జీ. ఎందుకు అలా అడుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు. ఇంతక్రితం నాతో మాట్లాడుతూ సలహా కోసం మీకు ఫోన్ చేయాలని అన్నాడు. అందుకే.. చేశాడా అని అడుగుతున్నాను’’ అన్నాడు. ‘‘దేనికి సలహా?’’ అని అడిగాను. ‘‘రాష్ట్రంలో పాలన వైఫల్యం అని మనవాళ్లు అతడిని దిగిపొమ్మంటున్నారట. మీ రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని మీవాళ్లు మిమ్మల్ని దిగిపొమ్మంటున్నారు కనుక మీరేదైనా సలహా ఇస్తారని మీకు ఫోన్ చేస్తానన్నాడు. మా రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని నన్ను మావాళ్లు దిగిపొమ్మంటున్నారు కనక అతడికి మీరిచ్చే సలహా నాకూ పనికొస్తుందని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్‌తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్‌తో న్యూస్ పేపర్‌పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్‌లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్‌లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్‌షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్‌లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్‌లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్‌లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్‌లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
గౌతమ్ గంభీర్ (ఢిల్లీ ఎం.పి.).. రాయని డైరీ
పదేళ్ల క్రితం అందరం పదేళ్లు చిన్నవాళ్లం. వరల్డ్ కప్ గెలిచాం! మా కెప్టెన్ ధోనీ. ధోనీలో నాకెప్పుడూ ఒక గొప్పతనం కనిపిస్తుంది. ప్రతి గెలుపులోనూ అతడొక్కడే మనందరికీ కనిపిస్తున్నా.. ‘ఇదిగో నేనిక్కడ ఉన్నాను’ అంటూ అతడెక్కడా మనకు కనిపించడు! ఆ రోజు వరల్డ్ కప్ గ్రూప్ ఫొటోలో కూడా ధోనీ ఎత్తిపట్టిన కప్పు కనిపించింది తప్ప, ధోనీ కనిపించలేదు. మరి మనం ఎందుకు కప్పు గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా కప్పుని కాకుండా అతడిని ఎత్తిపట్టి చూపిస్తున్నాం?! అతడికి నచ్చే విషయమేనా? చేతులు కట్టుకుని దూరంగా చిరు దరహాసంతో తన టీమ్ సంబరాలను పదేళ్లుగా చూస్తూ నిలబడి ఉన్న కెప్టెన్ దగ్గరకు వెళ్లి, ‘నేటికి పదేళ్లు’ అని గుర్తు చేసి, అతడి చేతిని బలవంతంగా పైకెత్తించి, ఆ చేతిలోని రెండు వేళ్లను ‘వి’ షేప్‌లో బలవంతంగా తెరిపించి.. ఏమిటిదంతా! నాయకుడి ఆత్మ టీమ్‌లో ఉంటుంది. టీమ్ ఆ ఆత్మకు తిరిగి నాయకుడి రూపం ఇవ్వడం అంటే అతడి పెద్దరికాన్ని అతడికి కాకుండా లాగేయడమే. వరల్డ్ కప్ విజయంలో ప్లేయర్స్‌కి మాత్రమే కాదు.. ప్రతి రన్‌కి, ప్రతి బంతికి భాగస్వామ్యం ఉంది. రన్ అవుట్‌కి, మిస్ అయిన క్యాచ్‌కి కూడా గెలుపులో షేర్ ఉంది. పదేళ్ల క్రితం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అదీ ఆ రోజు ఫైనల్స్‌లో ఇండియా సాధించిన అసలు విజయం. దాని గురించి చెప్పుకోవాలి. లేదంటే, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ టీమ్‌లోని వాళ్లంతా ఏం చేస్తున్నారో చెప్పుకోవడం కూడా ఆ రోజు సాధించిన విజయం గురించి చెప్పుకోవడమే అవుతుంది. అది మంచి సంగతి కదా! ధోనీ ఇప్పుడు చికెన్ ఫామింగ్ చేస్తున్నాడు. క్రి కెట్ మానేశాడని కాదు. ఆడుతున్నాడు. ఆటెప్పుడూ ఆటగాడిని వదిలేసిపోదు. సచిన్ రిటైర్ అయ్యాడని ఆట అతడిని ఏ రోజైనా ‘ఏయ్ రిటైర్డ్ మ్యాన్’ అనిందా? లేదు. ఈమధ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడొచ్చాడు. ఈ పదేళ్లలో సెహ్వాగ్ కామెంటేటర్ అయ్యాడు. ట్విట్టర్లోనే ఎప్పుడూ అతడు కనిపించడం! కోహ్లీ వరల్డ్‌కప్‌లో బేబీ బాయ్. ఇప్పుడొక బేబీ గర్ల్‌కి ఫాదర్. యువరాజ్ పదేళ్ల క్రితం మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. తర్వాత క్యాన్సర్‌తో ఫైట్. ధైర్యంగా ఆడాడు. గట్టిగా నిలబడ్డాడు. గ్రేట్. రైనా ఆనాటి స్క్వాడ్‌లో యంగ్‌మ్యాన్. స్టార్లు ఆడుతుంటే తను ఆడే చాన్స్ కోసం చూశాడు. కప్పొచ్చిన టీమ్‌లో ఉన్నాడు కానీ, కప్పు విజయాన్ని ఒక చెయ్యేసి పట్టుకునే చాన్సే రాలేదు. ఇప్పుడతడు చెన్నై సూపర్ కింగ్. పఠాన్ ఆల్ రౌండర్. వరల్డ్ కప్పులో పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. సచిన్‌లా అతడూ ఇప్పుడు కరోనాపై ఆడుతున్నాడు. హర్బజన్ కెరీర్ చివరికొచ్చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్ అతడిప్పుడు. జహీర్ ముంబై ఇండియన్స్‌కి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్. పటేల్ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నెహ్రా కామెంటరీలు చెబుతున్నాడు. ఈ మధ్యే ఢిల్లీ నుంచి గోవా షిఫ్ట్ అయ్యాడు.. నేనిప్పుడు ఢిల్లీ నుంచి బెంగాల్ షిఫ్ట్ అయినట్లు! కొన్ని రోజులుగా ఇక్కడే నా మకాం. బెంగాల్లో ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించాలని అమిత్‌షా! ‘‘అమిత్జీ అలా వద్దు. బీజేపీని గెలిపించుకుందాం’’ అని చెప్పి క్యాంపెయిన్ కోసం బెంగాల్ వచ్చాను. ‘‘ఆ రోజు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓపెనర్‌గా నువ్వు తొంభై ఏడు రన్స్ తీసి శ్రీలంక మీద ఇండియా గెలవడానికి కారణం అయినట్లే.. తృణమూల్ మీద బీజేపీ జట్టును గెలిపించి మంచి ఓపెనింగ్ ఇవ్వాలి గౌతమ్’’ అంటున్నారు అమిత్‌షా! అశ్విన్, పీయుష్, శ్రీశాంత్.. వరల్డ్ కప్పులో ఆడిన మిగతా ప్లేయర్స్. అశ్విన్ ప్రస్తుతం ఫామ్‌లోనే ఉన్నాడు. పీయుష్ గుజరాత్ వెళ్లిపోయాడు. శ్రీశాంత్ బ్యాన్ నుంచి బయట పడ్డాడు. జీవితంలోనైనా, ఆటలోనైనా కలిసి ఆడిన ఆటలోని గెలుపు ఓటములకు ఏ ఒక్కరో కారణం అయి ఉండరు. వరల్డ్ కప్పు విజయంలోనూ అంతే.