‘‘ఊరెళ్లాలి మేడమ్ సెలవు కావాలి’’ అన్నాడు అనురాగ్ ఠాకూర్ సడన్‌గా వచ్చి!
‘‘ఏమైంది అనురాగ్?!’’ అన్నాను.
‘‘ఏం కాలేదు మేడమ్’’ అన్నాడు.
‘‘ఏం కానప్పుడు నువ్వు ఫిబ్రవరి 15 తర్వాత గానీ, మార్చి 8 లోపు గానీ, ఏప్రిల్ 8 తర్వాత గానీ ఊరెళ్లొచ్చు కదా అనురాగ్’’ అన్నాను. అవి సెషన్స్ ఉండని రోజులు.
అయినా ఊరెళ్లడానికి సెలవు తీసుకునే వయసు కాదు అనురాగ్‌ది. నాకన్నా పదిహేనేళ్లు చిన్నవాడు కదా అని మాత్రమే అతడికి ఇస్తే సెలవు ఇవ్వాలి.
‘‘నువ్వేమీ బడి పిల్లాడివి కాదు అనురాగ్. బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రికి సహాయ మంత్రివి. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే సమయానికి ఊరెళతానంటే ఎలా! బడ్జెట్ సెషన్స్ కానివ్వు..’’ అన్నాను.
‘‘బడ్జెట్ సెషన్స్ బోర్ కొడుతున్నాయి మేడమ్’’ అన్నాడు!!
‘‘బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ హల్వాలా ఎలా ఉంటాయి అనురాగ్!’’ అన్నాను.
‘‘ఓ.. హల్వా! రెండు వారాలైంది కదా మేడమ్. మాలో ఎవరికైనా హల్వా చేయడం వచ్చా అని కూడా అడిగారు మీరు..’’ అన్నాడు.
నిజమే! నిన్న మొన్న హల్వా చేసినట్లుంది. సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చుట్టూ చిన్న డాక్టర్లు చేరి మాస్కుల్లోంచి కళ్లు అప్పగించి చూస్తున్నట్లు నా ఫైనాన్స్ స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి హల్వా తయారవుతున్న బాణలిలోకి తొంగి చూస్తున్నారు తప్పితే చూడ్డం వచ్చని గానీ, రాదని గానీ చెప్పలేదు!
నా వెనుక భుజం మీద నుంచి ఎవరో చెక్క గరిట అందించారు. హల్వాను మెల్లిగా గరిటెతో పైకీ కిందికీ తిప్పుతున్నాను. పిల్ల డాక్టర్‌లు హల్వా మీదకు వంగి చూస్తున్నారు.
‘హల్వాని ఎలా తిప్పుతాం అబ్బాయిలూ.. పైకీ కిందికా, పక్కలకా..’ అని మా హల్వా డాక్టర్‌లని అడిగితే, ‘అసలు తిప్పుతామా మేడమ్’ అని తిరిగి నన్నే అడిగాడు ఒక డాక్టర్. ఆ అడిగిన డాక్టర్ ఎవరా అని తలతిప్పి చూశాను. అనురాగ్ ఠాకూరే!
‘కొంచెం చూస్తుంటావా అనురాగ్, బ్రేక్ తీసుకుంటాను..’ అన్నాను. ‘అలాగే మేడమ్’ అని కదా నా సహాయకుడిగా అతడు అనవలసింది.. ‘అందరం బ్రేక్ తీసుకుందాం మేడమ్..’ అన్నాడు!
‘అవును మేడమ్ అందరం బ్రేక్ తీసు కుందాం.. హల్వా కింద స్టౌ మంటను ఆపేసి..’ అనే మాట వినిపించింది! ఆ మాట అన్నది అనురాగ్ డాక్టర్ కాదు. ఇంకో హల్వా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్. ఫైనాన్స్ సెక్రెటరీ.
‘అరె సుబ్రహ్మణియన్.. నువ్వెప్పుడొచ్చావ్?’ అన్నాను.
‘మీ చేతికి గరిటె ఇచ్చింది నేనే మేడమ్’ అన్నాడు.
‘బ్రేకులు మనం తీసుకోవచ్చు సుబ్రహ్మణియన్. స్టౌ మీద ఉన్న హల్వాకు బ్రేక్‌లు ఇవ్వకూడదు’ అని చెప్పాను.
ఆ రోజంతా హల్వాతోనే గడిచిపోయింది. నా టీమ్‌లో స్టౌ వెలిగించడం వచ్చిన వాళ్లు కూడా లేనట్లున్నారు. ‘హల్వా సూపర్‌గా ఉంది మేడమ్’ అనైతే అన్నారు. ‘మీరు కూడా నేర్చుకుని చేసి చూడండయ్యా.. ఇంకా సూపర్‌గా వస్తుంది’ అన్నాను. మోటివేట్ అయినట్లు లేదు. ఈ మగపిల్లలు మాటలు ఎన్నైనా చెబుతారు. వంట మాత్రం నేర్చుకోరు.
సండే కావడంతో రిలాక్సింగ్‌గా ఉంది. మొన్న మాన్‌సూన్ సెషన్స్‌కైతే శని, ఆది వారాల్లో కూడా పని చేశాం.
‘‘నమస్తే ఆంటీ..’’ అంటూ వచ్చింది పక్కింట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న అమ్మాయి. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లుంది.
‘‘రామ్మా.. కూర్చో..’’ అన్నాను.
‘‘ఆంటీ, వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుంది అన్నారు కదా మీరు. అంత ఎలా పెరుగుతుంది ఆంటీ!’’ అంది.
‘‘అబ్బాయిలు వంట నేర్చుకుంటే పెరుగుతుందమ్మా..’’ అన్నాను.
పెద్దగా నవ్వింది.
‘‘అవునాంటీ.. వృద్ధి రేటు పెరగడానికైనా ఈ బాయ్స్ వంట నేర్చుకోవాల్సిందే..’’ అంది.
Comments
Please login to add a commentAdd a comment