ప్రధాని కాని ప్రధాని..రాజపక్స | Madhav Singaraju Article On Rajapakse | Sakshi

Dec 2 2018 12:57 AM | Updated on Dec 2 2018 12:57 AM

Madhav Singaraju Article On Rajapakse - Sakshi

హిజ్‌ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన చేసిన పని తప్పా ఒప్పా అని డిసెంబర్‌ ఏడున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఆ లోపే హిజ్‌ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన తనకు తనే తీర్పు ఇచ్చుకునేలా ఉన్నాడు.. తను చేసింది తప్పేనని! 

ప్రెసిడెంట్‌ అంటే ఎలా ఉండాలి!  పార్లమెంట్‌ని డిజాల్వ్‌ చేశాడు. బాగుంది. తనిచ్చిన డిజాల్వ్‌ ఆర్డర్‌ మీద తను నిలబడాలి కదా. కోర్టువాళ్లొచ్చి తన ఆర్డర్‌ కాగితాలను చింపేసి వెళ్లకముందే తనే వాటిని చింపేస్తే ఆ కాగితం ముక్కల్ని పడేయడానికి ‘మన దగ్గర డస్ట్‌బిన్‌ ఉందా’ అని ప్రెసిడెంట్స్‌ హౌస్‌లో ఎవర్నో పట్టుకుని అడిగాడట! అక్కడివాళ్లెవరో ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు. పదేళ్లు ప్రెసిడెంట్‌గా ఉన్నాను. రెండేళ్లు ప్రధానిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంత వీక్‌గా లేను. 

మైత్రిపాల వచ్చి తన ప్రెసిడెంట్‌ పోస్ట్‌నీ, తనే పిలిచి నాకిచ్చిన ప్రధాని పోస్ట్‌నీ.. రెండిటినీ వీక్‌ చేసి పడేశాడు.
శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం అని దేశాలన్నీ రోజూ ఉదయాన్నే పేపర్లలో చదివి నివ్వెరపోతూ ఉండి ఉంటాయి.. ‘ఎల్టీటీఈ’నే లేకుండా చేసిన సివిల్‌ వార్‌ హీరో రాజపక్స ఇంకా బతికే ఉండగా శ్రీలంకలో సంక్షోభం ఏమిటి!’ అని. మైత్రిపాలకేం.. తను బాగానే ఉన్నాడు. నాకే తలవంపులు. సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.. వాటిని సంక్షేమాలుగా మార్చుకోవాలి గానీ, వెళ్లి కన్ఫెషన్‌ బాక్స్‌లో నిలబడతాను అనడం రాజనీతిజ్ఞతేనా? రాజకీయ సంక్షోభాల కంటే క్లిష్టమైనవా రాజ్యాంగ సంక్షోభాలు?! 

‘తప్పు చేశాను, నా గెజిట్‌ను నేను రద్దు చేసుకుంటాను. తప్పు చేశాను, నేను నీకిచ్చిన షేక్‌హ్యాండ్‌ను వెనక్కు తీసుకుంటాను..’ అంటారా గ్రేట్‌ లీడర్‌ ఎవరైనా! 
పార్లమెంట్‌లో నన్నెవరూ సపోర్ట్‌ చెయ్యడం లేదు. అయినా నేను వెళ్లి రోజూ పార్లమెంటులో కూర్చొని రావడం లేదా? విక్రమసింఘే రోజూ వచ్చి నన్ను ప్రధాని సీట్లోంచి తోసేసి తను కూర్చుంటున్నాడు. నేనేమైనా హర్ట్‌ అవుతున్నానా! అతడినే హర్ట్‌ చేసి మళ్లీ నా సీట్లో నేను కూర్చోవడం లేదా?! 

‘‘నేను ప్రధానిని. లెయ్‌ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాడు సింఘే.
‘‘నేనూ ప్రధానినే. నన్నెందుకు లేపుతున్నావ్‌ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాను.
‘‘నేను ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని. నువ్వు ప్రెసిడెంట్‌ ఎన్నుకున్న ప్రధానివి’’ అంటాడు. పార్లమెంటులో జనాన్ని పోగేసి ఒక్క నెలలోనే రెండుసార్లు నా మీద అవిశ్వాసం పెట్టించాడు. ‘‘చూశావ్‌ కదా. నేనే ప్రధానిని. నువ్వు కాదు’’ అన్నాడు. ఆ రెండుసార్లూ నేనేమైనా ప్రధాని సీట్లోంచి పరాజితుడిలా లేచి వెళ్లానా?
‘‘టీవీలో రోజూ నన్ను చూస్తూనే ఉన్నారు కదా మైత్రిపాలా.. మీరేమీ ఇన్‌స్పైర్‌ కావడం లేదా?’’ అని ఫోన్‌ చేసి అడిగాను.
 
‘‘ఇన్‌స్పైర్‌ అయ్యే మూడ్‌లో లేను’’ అన్నాడు! 
‘‘ఇన్‌స్పిరేషన్‌కి మూడ్‌తో పనేంటి మిస్టర్‌ ప్రెసిడెంట్‌? మూడ్‌ రావడానికే కదా ఇన్‌స్పిరేషన్‌ ఉండాలి’’ అన్నాను. 
‘‘మూడ్‌ వల్ల ఇన్‌స్పిరేషన్‌ వస్తుందా, ఇన్‌స్పిరేషన్‌ వల్ల మూడ్‌ వస్తుందా అని ఆలోచించే మూడ్‌ కూడా లేదు రాజపక్సా..’’ అన్నాడు. ‘‘మరేం ఆలోచించే మూడ్‌లో ఉన్నారు?’’ అని అడిగాను. 
‘‘దేశాధ్యక్షుడనే మనిషి కంపల్సరీగా ఏదో ఒకటి ఆలోచించే మూడ్‌లో ఉండాల్సిందేనా రాజపక్సా’’ అన్నాడు! 

ఆయన పక్కనుంచి మాటలు వినిపిస్తున్నాయి. 
‘‘రాజపక్స ఎలాగూ కోర్టు మాట వినడు. కోర్టు కన్నా ముందే మీరు మీ ఆర్డర్‌ని డిజాల్వ్‌ చేసుకుని.. మైత్రిపాల చెప్పినా రాజపక్స వినలేదని అనిపించుకోవడం ఎందుకు?’’ అంటున్నారెవరో.. తెలివైనవాళ్లు. 

మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement