‘‘అమెరికా అధ్యక్షుడా.. అమెరికా అధ్యక్షుడా..’’ అని జో బైడెన్‌ను డెమోక్రాట్లు కీర్తిస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. అమెరికన్‌ల జాతీయవాద భావనను గౌరవించని ఉదారవాద సెక్యులర్ సన్నాసులతో కలసి మద్యం సేవిస్తున్నారు. ఓట్లు దొంగిలించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు. డొనాల్డ్ ట్రంప్‌లా నికార్సయిన ఒక మంచి అమెరికన్ కాగలడా! అమెరికా కర్మ ఫ్లోరిడా అడవుల్లా కాలబోతున్నట్లే ఉంది.
వైట్ హౌస్‌లోని నా ఆఫీస్ గది కర్టెన్‌ని తొలగించి బయటికి చూస్తూ నిలుచున్నాను. పౌలా వైట్ పైకి వస్తూ కనిపించారు. ఆమె నా ఆధ్యాత్మిక గురువు. నా గెలుపు కోసం ప్రేయర్ చేశారు. ‘ఐ హియర్ విక్టరీ.. విక్టరీ.. విక్టరీ’ అని కనురెప్పలు మూసి, అలౌకికావస్థలో మూడుసార్లు ఆమె అన్నమాటలో అబద్ధం ఏమీ లేదు. నేను గెలవబోతున్న చప్పుడు ఆమె నుంచి నాకూ వినిపించింది.
‘‘ఓ మై గాడ్’’ అనుకుంటూ వచ్చారు పౌలా నా గదిలోకి.
గాడ్‌ని ఆమె అవసరం అయినంత వరకు మాత్రమే తలుచుకుంటారు. తనను తలుచుకోడానికి గాడ్‌ను కూడా అవసరం అయినంత మేరకే అనుమతిస్తారు. ‘ఫర్ గాడ్స్ సేక్.. ట్రంప్ గెలిచి తీరాల్సిందే’ అని గాడ్‌తో అన్నారు పౌలా. అందుకు గాడ్ ఏమన్నాడో నాకు నేరుగా తెలిసే అవకాశం లేదు. పౌలానే చెప్పారు.. ‘ఫర్ ట్రంప్స్ సేక్.. నేనెందుకు ట్రంప్‌ను గెలిపించాలి?’ అని గాడ్ అన్నాడట. తర్వాత వాళ్లిద్దరూ నాకోసం చాలాసేపు వాదులాడుకున్నారు. నన్ను గెలిపించడం కోసం పౌలా, ‘అది కాదు పౌలా.. ఇప్పుడూ.. మరీ..’ అని నీళ్లు నములుతూ గాడ్.
‘‘మిస్టర్ ట్రంప్.. దేని గురించి మీరింకా ఆలోచిస్తూ ఉన్నారు’’ అన్నారు పౌలా అకస్మాత్తుగా నాకు దగ్గరగా వచ్చి.
‘‘ఓ మై ఏంజెల్ మిస్ పౌలా.. ఆలోచించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని గానీ మీరు నన్ను అడగడం లేదు కదా..’’ అన్నాను. ఆమె నవ్వారు.
‘‘మిమ్మల్ని బ్లెస్ చేశాను మిస్టర్ ట్రంప్. దేవుడి దీవెనలు మాత్రం డెమొక్రాట్‌లపై ఉన్నాయి. కానివ్వండి. మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా, డెమొక్రాట్‌లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది. ‘మిస్టర్ ట్రంప్‌ని బ్లెస్ చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి?!’ అని గాడ్‌ని నేను కాస్త కటువుగానే ప్రశ్నించాను. ‘మిస్టర్ ట్రంప్ ఒక మంచి అమెరికన్ పౌరుడు కాగలడు గానీ, ఒక మంచి అమెరికా అధ్యక్షుడు కాలేడు’ అని గాడ్ అన్నారు..’’ అని చెప్పారు పౌలా.
‘‘గాడ్!!’’ అన్నాను.
‘‘ఏమిటి మిస్టర్ ట్రంప్’’ అన్నారు పౌలా.
‘‘మిస్ ఏంజెల్ పౌలా.. దేవుడూ నేనూ ఒకేలా ఆలోచిస్తున్నాం. మీరు కింది నుంచి పైకి వస్తూ ఉన్నప్పుడు కిటికీ తెర తొలగించి బయటికి చూస్తూ నేనూ ఇదే అనుకున్నాను.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు కానీ, నాలా ఒక మంచి అమెరికన్ కాలేడు అని..’’ అన్నాను.
‘‘ఐ వజ్ ఆల్సో సర్‌ప్రైజ్డ్ మిస్టర్ ట్రంప్. అయితే నేను ఆశ్చర్యచకితురాలిని అయింది.. జో బైడెన్ మంచి ప్రెసిడెంట్ అయి, మీరు మంచి సిటిజెన్ అయి, ఇద్దరిలోనూ మంచి కామన్‌గా ఉన్నప్పుడు గాడ్ ఎందుకని బైడెన్ సైడ్ తీసుకున్నాడూ.. అని! రియల్లీ స్టన్నింగ్..’’ అన్నారు పౌలా.
ఇద్దరం కొద్దిసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ నిలుచున్నాం.
‘‘మిస్ ఏంజెల్ పౌలా.. ‘మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా లేక డెమొక్రాట్‌లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది’ అని మీరు ఇంతకు క్రితం అన్నారు. ఎంత త్వరలో?!’’ అని అడిగాను.
పౌలా కళ్లు తెరిచి లేవు! దేవుడితో మళ్లీ ఆమె వాదనకు దిగినట్లుగా ఉన్నారు.. నా కోసం!!
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment