రాయని డైరీ : జో బైడెన్‌ (ట్రంప్‌ ప్రత్యర్థి) | Madhav Singaraju Article On Joe Biden | Sakshi
Sakshi News home page

రాయని డైరీ : జో బైడెన్‌ (ట్రంప్‌ ప్రత్యర్థి)

Published Sun, Jun 14 2020 2:26 AM | Last Updated on Sun, Jun 14 2020 2:37 AM

Madhav Singaraju Article On Joe Biden - Sakshi

అమెరికా ఈసారి తనక్కావలసిన అధ్యక్షుడినే ఎన్నుకుంటుంది. అందుకు నేను ఒకట్రెండు సూట్లు, రెండు మూడు డిజైనర్‌ ‘టై’లను ఇప్పటినుంచే ఎంపిక చేసుకుని పెట్టుకోవడంపై శ్రద్ధ వహించవలసిన సమయం దగ్గరికి వచ్చేసింది. నవంబరు మూడున ఎన్నికలు. ఈలోపు ట్రంప్‌తో మూడు డిబేట్‌లు.

ట్రంప్‌కి డిబేట్‌ పెద్ద విషయం కాదు కాబట్టి ట్రంప్‌తో డిబేట్‌ పెద్ద విషయం కాదు. ఏదో మాట్లాడేస్తాడు. ఆ మాట్లాడిన దాని మీద మాట్లాడితే చాలు. తెలియకుండానే తొంభై నిముషాలు గడిచిపోతాయి. పెద్దగా టెన్షన్‌ తీసుకోడు, తనూ టెన్షన్‌ ఇవ్వడు.

తగిన మనిషేనా కాదా అన్న సందేహంతోనే నాలుగేళ్ల క్రితం అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ని ఎన్నుకుంది. ఈ చివరి ఏడాదైనా చైనా నుంచి ప్రపంచ రాయబారిలా కరోనా రాకపోయుంటే ట్రంప్‌ ఎంత సమర్థుడైన అధ్యక్షుడో అమెరికన్‌ ప్రజలకు తెలియకపోయేది. 

నన్నొక్కటే నిరుత్సాహపరుస్తోంది. అమెరికా అధ్యక్షుడిని అయ్యాక పని కట్టుకుని నేను అమెరికా కోసం ఏదైనా పని చేయాల్సిన అవసరం ఉండదేమోనని! ట్రంప్‌ ‘టిక్కు’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘ఇంటూ’లు కొట్టడానికి రెండేళ్లు, ట్రంప్‌ ‘ఇంటూ’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘టిక్కు’లు కొట్టడానికి మరో రెండేళ్లు పడుతుంది. మళ్లీ ఇంకోసారి అధ్యక్షుడినైతేనే నాకు పని! నాలుగేళ్లు ఇప్పుడు పదవి కోసం చూసినట్లు నాలుగేళ్లు అప్పుడు పని కోసం చూడాలి. 

‘ఓడిపోతే నేనెలాగైనా బతుకుతాను. నువ్వెలా బతుకుతావు?’ అని ట్రంప్‌ నన్ను చాలెంజ్‌ చేస్తున్నాడు. ట్రంప్‌కి, నాకు మధ్యే పోటీ అయినప్పుడు.. ట్రంప్‌ ఓడిపోతే నేనే కదా గెలిచేది. తనతో పాటు నేనూ ఓడిపోతానని ట్రంప్‌ ఎందుకు అనుకుంటున్నట్లు?!

ఓడిపోతానన్న భయం ఉన్నవాళ్లే ‘ఎలాగైనా బతగ్గలను’ అంటారు. తను బతకడం కోసం అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తున్నాడంటే అమెరికా అధ్యక్షుడిగా అతడు గెలవలేదనే. 

ట్రంప్‌కి ఫోన్‌ చేసి ఈ సంగతి చెబుదామనిపించింది. పదవిలో ఉన్న రిపబ్లికన్‌ అధ్యక్షుడికి, అధ్యక్షుడి పదవిలోకి వస్తున్న డెమోక్రాటిక్‌ అభ్యర్థి ఫోన్‌ చేయడం బాగుంటుందా?! 

గ్రెగ్‌ షాల్జ్‌ని పిలిపించి అడిగాను. 
నా క్యాంపెయిన్‌ మేనేజర్‌ గ్రెగ్‌. 
‘‘గ్రెగ్‌.. నేనిప్పుడు ట్రంప్‌తో మాట్లాడాలన్న మూడ్‌లో ఉన్నాను. ఈ టైమ్‌లో కరెక్టేనా?’’ 
అని అడిగాను. 
‘‘అది మీడియా మూడ్‌ని బట్టి ఉంటుంది మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అన్నాడు గ్రెగ్‌ నవ్వుతూ. 
‘‘మీడియాకు ఎలా తెలుస్తుంది గ్రెగ్‌?’’ అన్నాను. 
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. మీడియా ఎప్పుడూ తెలియని విషయాలను రాసే మూడ్‌లోనే ఉంటుంది’’ అన్నాడు. 

ఏడాది క్రితమే అతడు నా క్యాంపెయిన్‌ మేనేజర్‌గా వచ్చాడు. అప్పట్నుంచీ నన్ను ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అనే పిలుస్తున్నాడు. ‘ప్రెసిడెంట్‌ కాకముందే మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అని పిలుస్తున్నావు! ప్రెసిడెంట్‌ అయ్యాక మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అనడంలో నీకు కొత్తదనం ఏముంటుంది?’ అని ఓసారెప్పుడో అడిగాను. ‘ప్రెసిడెంట్‌ అవకముందు మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అని పిలిస్తే మీకు కలిగే మానసికోల్లాసం, ప్రెసిడెంట్‌ అయ్యాక మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అని పిలిస్తే  కలగదు కదా మిస్టర్‌ ప్రెసిడెంట్‌. ఇక నేనెందుకు మిమ్మల్ని అలా పిలుస్తున్నానంటే.. ఎన్నికలయ్యాక ముప్పై మూడు కోట్ల మందికీ మీరు మిస్టర్‌ ప్రెసిడెంటే. ఇప్పుడైతే ముప్పై మూడు కోట్ల మందిలో నాకొక్కడికే మీరు మిస్టర్‌ ప్రెసిడెంట్‌..’’ అన్నాడు. 

గ్రెగ్‌ అలా మాట్లాడ్డం మనసుకు 
ఆహ్లాదకరంగా ఉంది. ఈ సమయంలో ట్రంప్‌కి ఫోన్‌ చేసి అతడి ముఖాన్ని వినడం అవసరమా అనిపించింది.

-మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement