ఫస్ట్ డే! వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లో ఉన్న ఓవల్ ఆఫీస్‌లోకి వెళ్లి కూర్చున్నాను. ప్రెసిడెంట్ చెయిర్! బాగా తొక్కి, పాడు చేసినట్లున్నాడు ట్రంప్. కూర్చోగానే కుర్చీ కిందకీ వెళ్లలేదు. పైకీ రాలేదు. చుట్టూ తిరగలేదు. కొన్ని స్క్రూలు, కొన్ని నట్లు ఏమైనా ఊడదీసి గానీ వెళ్లాడా ఏంటి ట్రంప్ అనే డౌట్ వచ్చింది. అలా చేస్తాడని నేను అనుకోను కానీ, కమలకు చెబితే మాత్రం తను అనుకుంటుంది.. ‘ఆ మనిషి అలాంటివాడే మిస్టర్ ప్రెసిడెంట్’ అని పెద్దగా నవ్వుతుంది.
కమల నవ్వు బాగుంటుంది. ఆ నవ్వు ట్రంప్‌కి నచ్చదు. ‘ఎందుకు పిచ్చిదానిలా ప్రతిదానికీ పగలబడి నవ్వుతుంది!’ అని కమల ఎలా నవ్వుతుందో ఎన్నికల ర్యాలీలో నవ్వి చూపించాడు ట్రంప్! ఏమైంది? అమెరికన్ ప్రజలు కమల నవ్వును ఇష్టపడ్డారు. ‘కమల ఇలా నవ్వుతుంది’ అని నవ్వి చూపించిన ట్రంప్‌ని ఇష్టపడలేదు.
వెస్ట్ వింగ్‌లోనే నా ఆఫీస్‌కి ఓ పక్కగా కమల ఆఫీస్. అందులోనే వైస్ ప్రెసిడెంట్ చెయిర్. రెండొందల తొంభై ఏళ్ల ఆ చెయిర్ జీవితంలో తొలి మహిళ కమల. చెయిర్‌కి మాటలు వచ్చుంటే కమలతో ఇప్పటికే ఇష్టంగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టి ఉంటుంది. కబుర్లు చెప్పడం, కబుర్లు వినడం ఆడవాళ్ల రైట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడీ సీట్లో నేను కాకుండా ట్రంప్ ఉండి, పక్క సీట్లో కమల ఉండి ఉంటే.. ‘ఏంటా కబుర్లు!’ అని ఇక్కడి నుంచే గట్టిగా కుర్చీని తిట్టేసేవాడు.. కుర్చీ అని కూడా చూడకుండా.
అప్పుడు కమల.. ‘మిస్టర్ ట్రంప్.. మీకెందుకంత కోపం వస్తోంది. కుర్చీ అయితే మాత్రం?! కబుర్లు చెప్పాలని ఉండదా తనకు?!’ అని కుర్చీకి సపోర్ట్‌గా వెళ్లి ఉండేవారు. అప్పుడు ట్రంప్‌కు ఇంకా కోపం వచ్చి ఉండేది. ‘కుర్చీకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధుండక్కర్లా? కుర్చీ.. కబుర్లు చెబుతోందని వింటూ కూర్చుంటావా?’ అని కుర్చీ ముందే కమలని తిట్టేసేవాడు. స్త్రీ ద్వేషి!
అయినా ఫస్ట్ డే ఫస్ట్ టైమ్ ప్రెసిడెంట్ చెయిర్‌లో కూర్చొని, వెళ్లిపోయిన ప్రెసిడెంట్ గురించి ఆలోచిస్తున్నానేమిటి!
కాళ్లు లాగుతున్నాయి! కుర్చీలో వెనక్కి వాలి, రెండు కాళ్లూ లేపి లేబుల్‌పై పెట్టే ప్రయత్నం చేశాను. కుర్చీ వెనక్కి వెళ్లడం లేదు! అమెరికా ప్రెసిడెంట్‌లకు కాళ్లు టేబుల్ పైన ఎత్తి పెట్టి కూర్చునే అలవాటు ఉంటుంది. ఒబామా అయితే కాళ్లు టేబుల్ మీద ఎత్తి పెట్టుకోడానికే వచ్చి కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండేవారు!
నేను మాత్రం పూర్వపు ప్రెసిడెంట్‌లు కూర్చున్నంత స్వేచ్ఛగా కాళ్లెత్తి పెట్టుకోడానికి లేదు. కమల ఎప్పుడొచ్చి.. ‘హాయ్.. మిస్టర్ ప్రెసిడెంట్’ అంటారో తెలీదు. అదీగాక ఎన్నికల ఫలితాలు వచ్చీరావడంతోనే ఆమెకు చెప్పేశాను.. ‘మన మధ్య ఎక్స్‌క్యూజ్‌మీలు, మే ఐ కమిన్‌లు ఉండకూడదు’ అని. ఆ మాటకు కమల పెద్దగా నవ్వారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. నేను మిమ్మల్ని ‘మే ఐ కమిన్’ అని అడగక్కర్లేదు. కానీ మీరు నన్ను ‘మే ఐ కమిన్’ అని అడగడం నాకు సౌకర్యంగా ఉంటుంది’’ అన్నారు. నిజమే కదా! ఓవల్ ఆఫీస్ ఇక తనకు అలవాటు లేని కొత్త మర్యాదల్ని నేర్చుకోవడం మొదలుపెట్టాలి. కొంచెం శుభ్రం, కొంచెం శుచీ కూడా.. మాటల్లో, చేతల్లో, చూపుల్లో.
‘‘మిస్టర్ ప్రెసిడెంట్, మే ఐ కమిన్’’ అంటూ వచ్చారు కమల!
‘‘ప్లీజ్ కమ్.. మీ గురించే ఆలోచిస్తున్నాను’’ అన్నాను. ‘‘నా గురించా!’’ అని పెద్దగా నవ్వారు కమల. ఆమె నవ్వు బాగుంది.
‘‘అవును మీ గురించే’’ అన్నాను.
‘‘ఏంటి నా గురించి!’’ అన్నారు.
‘‘ఓవల్ ఆఫీస్ మీకు డే వన్ నుంచే అలవాటవుతుంది. ఓవల్ ఆఫీస్‌కి మీరు ఎప్పటికి అలవాటవుతారా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను.
క్షణం ఆగగలిగి, నవ్వునిక ఆపుకోలేక పోయారు కమల.
Comments
Please login to add a commentAdd a comment