ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్‌జీ అంటే నాకు గౌరవం. సాధారణ గౌరవం కాదు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే మీద, నా సహ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉన్న గౌరవంతో సమానమైన గౌరవం. ‘‘అదంతా నాటకం, గౌరవం కాదు’’ అని శరద్‌జీ అనుకుంటున్నా కూడా... నేనా యన్ని గౌరవించటం మానను. మనిషి ఎదుటా మానను, మనిషి చాటునా మానను.
భుజాలపై ఎప్పటికీ అలా ఉంచేసుకుం టారని స్టేజీ పైకి వెళ్లి శాలువాను కప్పి వస్తామా ఎవరికైనా? గౌరవమూ అంతే! మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటున్నారా, లేదా అని మనం వెళ్లి అస్తమానం తొంగి చూస్తుండ కూడదు. అసలు చూసేందుకు వెళ్లనే కూడదు. గౌరవించాలి, వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేసి వేరే పనిలో పడిపోవాలి.
అయితే గౌరవనీయులు కొన్నిసార్లు తిన్నగా ఉండరు. మనల్నీ తిన్నగా ఉండ నివ్వరు. శరద్‌జీ పై నాకున్న గౌరవాన్ని నేను కాపాడుకోవలసిన పరిస్థితులను శరద్‌జీ ఈమధ్య నాకు తరచుగా కల్పిస్తున్నారు!
సంతోషమే. ఆయనేం చేసినా ఆయనపై నా గౌరవం ఎక్కడికీ పోదు. కానీ నన్నుపంపించేందుకే ఆయన తన ఎన్నికల
ప్రచారంలోని అమూల్యమైన సమయాన్నంతా వినియోగిస్తున్నారు. ‘బారామతి’లో నాకు పోటీగా నా తమ్ముడి కొడుకు యోగేంద్ర పవార్‌ను దింపారు. ‘‘బాహుబలీ! నీదే ఇకపైబారామతి’’ అని ఆశీర్వదించారు. యోగేంద్ర నా తమ్ముడి కొడుకైతే, నేను శరద్‌జీతమ్ముడి కొడుకుని. ఇద్దరు ‘తమ్ముడికొడుకుల’ మధ్య పోటీకి బారామతే దొరికిందా శరద్‌జీకి?
‘‘ఇక చాలు. ముప్పై ఏళ్లు నేను బారామతి ఎమ్మెల్యేగా ఉన్నాను. ముప్పై ఏళ్లు అజిత్ బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడిక మూడో తరం రావాలి, యోగేంద్ర రాబోయే ముప్పై ఏళ్లు బారామతి ఎమ్మెల్యేగా ఉండాలి’’ అని సభల్లో హోరెత్తిస్తున్నారు శరద్‌జీ!
ఇక చాలా!! ఎవరికి చాలు? వరుసలో కూర్చొని భోజనం చేస్తున్నవారు తాముతింటూ, ‘‘వాళ్లకు ఇక చాలు’’ అని పక్క వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పినట్లుంది శరద్‌జీ నా మాటెత్తి ‘‘ఇక చాలు’’ అనటం!
ఇలాంటప్పుడే, శరద్‌జీ పైన నాకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ రావటం నాకు కష్టమైపోతుంటుంది.
‘‘పాత తరం ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి, కొత్త తరం రావాలి...’’ అంటు న్నారు శరద్‌జీ! ఏదీ, పాత తరం ఎక్కడ
ఆగింది? 83 ఏళ్లు వచ్చినా ఇంకా ర్యాలీలు తీస్తూనే ఉంది. మరో రెండేళ్లు రాజ్యసభఎంపీగా కూడా ఉంటుంది. పాత తరం ఎప్పటికీ ఆగిపోదని, పార్టీ అధ్యక్షుడిగాఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలం
ఉండిపోతుందని తేలిపోయాకే కదా నేను
కొత్త దారి వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చేశాక కూడా నేను శరద్‌జీని గౌరవించటం మానలేదు.
నవంబర్ 20న పోలింగ్. ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన ఎన్సీపీ నాది. శివసేన నుంచి బయటికి వచ్చిన శివసేన ఏక్‌నాథ్ షిందేది. ఎన్సీపీ–శివసేన–బీజేపీ కలిసిన మా ‘మహాయుతి’కి; శరద్‌జీ ఎన్సీపీ–ఉద్ధవ్ ఠాక్రే శివసేన–కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ ఆఘాడీ’ కి మధ్య 288 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఇది.
కానీ శరద్‌జీ అలా అనుకుంటున్నట్లు లేరు! ఇదంతా బారామతి కోసం జరగబోతున్న మహా సంగ్రామం అని, వాళ్లు మొత్తం అన్ని చోట్లా గెలిచినా, బారామతిలో నేను ఒక్కడినీ ఓడిపోకపోతే వాళ్లదసలు గెలుపే అవదని ఆయన భావిస్తున్నట్లుంది! ఆయన భావన ఎలాంటిదైనా ఆయనపై నా గౌరవ భావన మాత్రం చెక్కు చెదిరేది కాదు.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment