తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?!
చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి.
చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!
శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.
కారును ఢీకొట్టించు.
జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్‌లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి
ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు
వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు
పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.
మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని
అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా
ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని
తగ్గించుకోరు. ఎంత అమానుషం!!
‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’
ఎంత తేలిగ్గా అనేస్తారు!
బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!
‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!
కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు
అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!
రోజుకొకరు ఫోన్ చేసి,
‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!
బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ
ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే
ఉండదు.
నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా
అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్
మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్‌లను దింపుతూ ఉంటుంది.
లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!
కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.
ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?
-మాధవ్ శింగరాజు
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
Published Sun, Nov 3 2024 8:21 AM | Last Updated on Sun, Nov 3 2024 8:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment