
తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్ (Sikandar) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi ) నుంచి చంపేస్తామని సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఎదోరోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చిరించారు. అయితే, తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ స్పందించారు.
సినిమా షూటింగ్స్ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై ఆయన ఇలా స్పందించారు. 'నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను. నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయుష్షు ఎంత వరకు ఆ దేవుడు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. గట్టి భద్రత కల్పించారు. ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు.' అని ఆయన అన్నారు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సికిందర్ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. రంజాన్, ఉగాది సందర్భంగా మార్చి 30న థియేటర్స్‌లోకి రానుంది. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆయన ఫ్యాన్స్ సికిందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తోన్న తరుణంలో సికిందర్ పబ్లిక్ ఈవెంట్స్‌లలో ఆయన పాల్గొనడం లేదు.