
స్నేహంలో ఎదగాలి కానీ, స్నేహాలతో ఎదగకూడదు.
‘‘ఎదగటానికి కాకపోతే ఇంకెందుకు స్నేహాలు?!’’ అనే వాళ్లకు నేను ఒకటే చెబుతాను. స్నేహాన్ని నిచ్చెనగా చేసుకొని ఎదగటమంత పతనం వేరే ఇంకేదీ ఉండదు.
రాజీవ్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మొదట నేను అదే ఆలో చించాను.
ఇద్దరం డూన్ స్కూల్లో స్నేహితులం.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నేహితులం. తను ఇంపీరియల్ కాలేజ్‌కి మారిపోయాక కూడా స్నేహితులమే. నేను ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరినప్పుడు; శ్రీమతి గాంధీ గవర్నమెంట్‌లో, ఆ తర్వాత రాజీవ్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రెటరీగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు అంటని స్నేహం మాత్రమే మా మధ్య ఉంది. రాజీవ్ రమ్మంటున్నారు కదా అని వెళితే, స్నేహాన్ని నిచ్చెనగా వేసుకోవటమే అవుతుంది. ఆ మాటే రాజీవ్‌తో అన్నాను.
‘‘మీకు నిచ్చెన వేస్తానని అనటం లేదు మణీజీ. కేబినెట్‌కు మీరొక నిచ్చెన అయితే బాగుంటుందని మాత్రమే అడుగుతున్నాను’ అన్నారు రాజీవ్.
రాజీవ్ అలా నాతో ఒక రాజనీతిజ్ఞుడిగా మాట్లాడటం అదే తొలిసారి!
నాకనిపించిందీ, శ్రీమతి గాంధీ చనిపోయిన రోజు సాయంత్రం కాదు రాజీవ్ ఈ దేశానికి ప్రధాని అయింది, ఇదిగో ఇలా ఒడుపుగా మాట్లాడటం నేర్చుకున్నాకేనని!
కేంబ్రిడ్జ్‌లో మార్క్సిస్ట్ సొసైటీ ఉండేది.
అందులో నేను మెంబర్‌ని. నన్ను కలవటానికి రాజీవ్ అక్కడికి వస్తుండేవారు. తను నాకంటే రెండేళ్లు జూనియర్. స్టూడెంట్స్ యూనియన్‌కు నేను ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయన మాట... రాలు పూల తోటలా ఉండేది. కచ్చితంగా ఆయన వల్ల నాకు కొన్ని ఓట్లయితే పడి ఉంటాయి.
బహుశా నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా గెలిచి ఉంటే ఆ హుషారుతో రాజీవ్ రాజకీయాల్లోకి ల్యాండ్ అయ్యేవారా?! లేదు. తల్లి మరణం ఆ పైలట్ తలపై పెట్టి వెళ్లిన కిరీటం ఈ రాజకీయం. కిరీటాన్ని దించకూడదు. కిరీటానికి తలవంపులూ తేకూడదు.
ఆ సాయంత్రం – శ్రీమతి గాంధీ హత్యకు గురైన రోజు సాయంత్రం... కొత్త ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి రాజీవ్ మాట్లాడవలసి వచ్చింది. కెమెరాలు ఆయన ముందు గుమికూడాయి. పది మాటలకు పన్నెండుసార్లు తడబడ్డారు రాజీవ్!
కానీ, కొద్దిరోజులే ఆ తడబాటు!
రాజీవ్‌కు మాటలు, చేతలు వచ్చేశాయి! పడుతూ లేస్తూనే వెళ్లి దేశ ప్రజలకు దగ్గరయ్యారు. ఆఖరికి – శ్రీమతి గాంధీని నిరంతరం విమర్శిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్న అరుణ్ శౌరి కూడా రాజీవ్ మీద నుంచి చూపు మరల్చుకోలేక పోయారు!
రాజీవ్ వెళ్లిపోయి 34 ఏళ్లు. నేను కాంగ్రెస్‌లోనే ఉండి పోయి 36 ఏళ్లు. ఈ 83 ఏళ్ల వయసులో నా స్నేహితుడు రాజీవ్ గురించి నేను ఏం చెబుతాను? రాజకీయ ధురంధరుడు అనా? అలా చెబితే అది జ్ఞాపకం అవుతుందా? ‘‘కాలేజ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు’’ అని చెప్పక పోతేనే మా స్నేహం అపురూపం అవుతుందా?
చదవండి: మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ
‘‘కాలేజ్‌లో రాజీవ్ గాంధీ బాగా చదివేవారు కాదన్న సంగతిని ఇప్పుడెందుకు చెప్పటం! అయ్యర్ కి పిచ్చి పట్టింది’’
అంటున్నారు అశోక్ గెహ్లోత్, బీజేపీ వాళ్లు వైరల్ చేసిన నా జ్ఞాపకాల క్లిప్‌ను చూసి.
స్నేహంలో ఎదిగినవారు కాదు గెహ్లోత్. స్నేహాల నిచ్చెనలతో ఎదిగినవారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే, సీఎం పదవిని వదులుకోవలసి వస్తుందని సోనియాజీ ఆదేశాన్నే కాదన్న సకుటుంబ, సపరివార స్నేహశీలి ఆయన!
ఇలాంటి వాళ్లకు పదవులే జ్ఞాపకాలు. జ్ఞాపకాలనే పదవులుగా మిగిల్చుకున్న నాలాంటి వాళ్లు పిచ్చివాళ్లు!!
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment