మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే.
‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను.
సియాటిల్‌లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్‌లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు.
‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే.
నేనూ నవ్వాను.
‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె.
‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను.
ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి.
‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా!
67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!!
‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను.
ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు.
‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను.
‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా.
ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్‌బ్లాడ్‌లో ఉన్నట్లు, జిల్ బెనెట్‌లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?!
మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్‌బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని.
జెఫ్రీ ఎప్‌స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి
నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను.
కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు.
నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా.
రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ
ఉండిపోయాన్నేను.
మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్‌ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్‌టాప్‌ని తగిలించుకుని పైకి లేవవల
సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్.
‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ.
మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్‌కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే!
‘అవునా! బిల్ గేట్స్‌కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా.
మాధవ్ శింగరాజు
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
Published Sun, Feb 12 2023 1:05 AM | Last Updated on Sun, Feb 12 2023 1:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment