Mani Shankar Aiyar
-
ఇతరులూ కాంగ్రెస్ చీఫ్ కావొచ్చు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం వారు కాకుండా ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చని.. అయితే కచ్చితంగా గాంధీ కుటుంబం మాత్రం పార్టీలో చురుకుగా ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. గాంధీ ముక్త్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడమే బీజేపీ అసలు లక్ష్యమని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ ఎవరనే ప్రతిష్టంభనపై అయ్యర్ స్పందించారు. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండటమే మంచిదని.. అయితే ఆయన అభిప్రాయాలను నాయకులు, కార్యకర్తలు గౌరవించాలని అభిప్రాయపడ్డారు. గాంధీ–నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నాపార్టీ మనగలుగుతుంది. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు.. నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సత్తా వారికే ఉందని చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని వారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పార్టీలో నేతల మధ్య తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో ఉదహరించారు. చీఫ్‌గా రాహులే ఉంటారా? ఇతరులు వస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందే అని అయ్యర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడానికి రాహుల్ ప్రతిపాదించగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే, చీఫ్‌గా ఎవరుండాలనేది పార్టీనే నిర్ణయిస్తుందని రాహుల్ ప్రకటించారు. -
ఆ వ్యక్తి కాంగ్రెస్ చీఫ్ కావచ్చు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు కానీ, పార్టీపై మాత్రం ఆ కుటుంబం పట్టు కోల్పోకుండా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. కాంగ్రెస్ తదపరి అధ్యక్షునిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌ను నియమిస్తారంటూ.. వస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఉంటే మంచిదే గానీ, ఆయన అభిప్రాయాలను సైతం గౌరవించాల్సిన అవసరం కార్యకర్తలకు, నాయకులకు ఉందని సూచించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీ ప్రజల్లో బలంగా ఉంటుందన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినపుడు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే మాత్రం వాటిని పరిష్కరించే సత్తా మాత్రం గాంధీ కుటుంబానికే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహులే కొనసాగుతారా? లేక అశోక్‌కు అప్పగిస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందేనని మణి శంకర్ బదులిచ్చారు. మొదట గాంధీ ముక్త్ కాంగ్రెస్ కావాలని బీజేపీ ప్రయత్నించిందని, తద్వారా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటోదని విమర్శించారు. -
మోదీ ‘నీచ్ ఆద్మీ’నే..!
న్యూఢిల్లీ/సిమ్లా: గత కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఆఖరి దశ పోలింగ్ వేళ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రధాని మోదీని నీచమైన మనిషి(నీచ్ ఆద్మీ) అంటూ అవహేళన చేయడం సరైందేనంటూ అయ్యర్ తాజాగా రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రధానుల్లో మోదీని అత్యంత చెడుగా మాట్లాడే వ్యక్తి అని వ్యాసంలో పేర్కొన్నారు. రైజింగ్ కశ్మీర్, ది ప్రింట్ పత్రికల్లో ఈ వ్యాసం ప్రచురితమైంది. అయ్యర్ తన వ్యాసంలో..‘మే 23వ తేదీన మోదీని ప్రజలు తిరస్కరించక తప్పదు. అత్యంత చెడుగా మాట్లాడే ఈ ప్రధానికి అదే సరైన ముగింపు. 2017 డిసెంబర్ 7వ తేదీన నేను ఏం చెప్పానో గుర్తుందా? భవిష్యత్తును చెప్పలేదా?’అని పేర్కొన్నారు. 2017లో ఆయన మోదీని ‘నీచ మనిషి’ అని పేర్కొనగా అది వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దూషణలకు అధిపతి అయ్యర్ అని పేర్కొంది. ‘అయ్యర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. మాజీ పీఎం రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాను తూలనాడి ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చిన మోదీయే వారిపై తను వాడిన భాషను చూసి సిగ్గుపడాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తిట్లను బహుమతులుగా భావిస్తా: మోదీ ‘ఆయన(మణి శంకర్ అయ్యర్) మళ్లీ అదే మాట అంటున్నారు. తన దూషణలను సమర్థించుకుంటున్నారు. గొప్ప వంశీకుడు(రాహుల్), ఆయన కుటుంబం, వారి మిత్రులు ఇదే అహంకారంతో దేశాన్ని ఏళ్లపాటు పాలించారు. వారి దూషణలను బహుమతులుగా స్వీకరిస్తా. నన్ను తిట్టిన ప్రతి తిట్టుకూ సమాధానంగా బీజేపీని గెలిపించి ప్రజలే సమాధానమిస్తారు’ అని మోదీ అన్నారు. -
‘అయ్యర్.. కావాలని అన్నవి కావు’
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై విధించిన సస్పెన్షన్‌ను కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తీసుకుంది. గుజరాత్లో తొలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. దీనిపై రాజకీయ దుమారం రేగటంతో అయ్యర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం రద్దుచేసింది. షోకాజ్ నోటీసులూ జారీచేసింది. అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయ్యర్ వ్యాఖ్యల కారణంగా గుజరాత్ ఎన్నికల్లో పెనుప్రభావం చూపి కాంగ్రెస్ ఓటమికి కారణమయింది. అయితే తాజాగా అయ్యర్.. మోదీపై కావాలని చేసిన వ్యాఖ్యలు కావని నమ్మిన కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ రాహుల్ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అసలేం జరిగింది.. గుజరాత్ ఎన్నికల సమయంలో ఢిల్లీలో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. దీనిపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రధాని అదే స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్ నేతల మొఘల్ ఆలోచనకు ఇది ప్రతిరూపమని అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ ప్రభావం గుజరాత్ ఎన్నికలపై తీవ్రంగా పడి కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన విషయం తెలిసిందే. -
2017 : అత్యంత వివాదాస్పద ఘటనలు
మరికొన్ని గంటల్లో 2017 చరిత్రలోకి జారుకుని.. జ్ఞాపకాలను మాత్రం మనకు వదిలేస్తోంది. పలువురు నేతలు దేశాన్ని, పార్టీలను, మత విశ్వాసాలను ప్రభావితం చేసే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని మంటలు పుట్టించాయి.. మరికొన్ని ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. ఏడాది ముగుస్తున్న సందర్భంలో.. ఇటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాహుల్ గాంధీ : వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏడాదిని మొదలు పెట్టారు. జనవరి 11న న్యూఢిల్లీలో జరిగిన ‘జనవేదన సమ్మేళన్’లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ‘శివాజీ, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు’ వంటి వారిలో నేను కాంగ్రెస్ గుర్తును చూశాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది అభయహస్తం అంటూ.. ఆయన చెప్పుకొచ్చారు. శరద్‌యాదవ్ : జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఓటు గొప్పతనం గురించి చెప్పే క్రమంలో మహిళలను అత్యంత దారుణంగా అవమానించారు. పట్నాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న శరద్ యాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల గౌరవం కన్నా ఓటుకు ఉన్న గౌరవమే ఎక్కువని చెప్పారు. ఆడపిల్ల గౌరవం పోతే ఆ గ్రామం.. ఊరుకు అవమానమని.. అదే ఓటు గౌరవం పోతే దేశానికే నష్టమని ఆయన అన్నారు. సాక్షి మహరాజ్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన బీజేపీనేత సాక్షి మహరాజ్.. నలుగురు భార్యలు 40 మంది పిల్లల సంస్కృతి వల్లే జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. వినయ్ కతియార్: 2017 ఏడాది మొత్తం వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ తిరిగిందని చెప్పవచ్చు. ఏడాది ఆరంభంలో.. ప్రియాంక గాంధీ అందంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రియాంక గాంధీ తరువాత.. తాజ్ మహల్, జామా మసీదుపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ శివాలయమే అని, ప్రఖ్యాత జామా మసీదు జమునా దేవి అలయం అంటూ ఆయన కొత్త వివాదాలకు తెరలేపారు. సందీప్ దీక్షిత్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన సందీప్ దీక్షిత్, ఆర్మీ చీఫ్ బిపన్ రావత్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బిపిన్ రావత్‌ను ఒక వీధి గూండాగా సందీప్ పోల్చడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై చివరకు సందీప్ దీక్షిత్ క్షమాపణలు కోరారు. సంగీత్ సోమ్ బీజేపీ యువనేత సంగీత్ సోమ్ తాజ్ మహాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ ఏడాది ప్రజల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజ్ మహల్‌ను ఆయన దేశద్రోహులు కట్టిన కట్టడంగా పేర్కొనడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో మొఘల్ చక్రవర్తులపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన రెండు వివాదాస్పద వ్యాఖ్యల ఆ పార్టీకి శరాఘాతంలా మారాయి. ముఖ్యంగా 2014లో మోదీపై చేసిన చాయ్‌వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరణశయ్య మీదకు చేర్చాయి. 2017లో గుజరాత్ ఎన్నికల ఆఖరి సమయంలో మోదీపై అయ్యర్ చేసిన నీచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ పీఠాన్ని దూరం చేశాయి. 2014లో ప్రధాని మోదీపై చేసిన చావ్వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేస్తే.. ఈ ఏడాది చేసిన నీచ్ వ్యాఖ్యలు అనంత్ కుమార్ హెగ్డే : 2017 ముగుస్తుందన్న సమయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా రాజ్యంగ పీఠికలో ఉన్న ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తామని..అందుకే అధికారంలోకి వచ్చామని అనంత్ కుమార్ చేసిన ప్రకటనపై ఉభయసభలు దద్దరిల్లాయి. చివరకు అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై పార్టీకి సంబంధంలేదని బీజేపీ ప్రకటించింది. చివరకు అనంత్ కుమార్ హెగ్డే కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. -
తర్జుమా సమస్యలు
జీవన కాలమ్ నాయకులు తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు– ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూంటాయి. కాంగ్రెస్ సీనియర్ నాయ కులు మణిశంకర్ అయ్యర్ నరేంద్రమోదీని ‘నీచ వ్యక్తి’ అనీ, ‘నీచ జాతి’ వాడనీ అన్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌నే కాక గాంధీ కుటుంబానికి ‘విధేయుడి’గా ఉన్న అయ్య ర్ని పార్టీ ప్రాథమిక సభ్య త్వం నుంచే బర్తరఫ్ చేశారు. ఇందులో చాలా అన్యాయం ఉన్నదని నాకు అని పిస్తోంది. అలా అనడానికి అయ్యర్ కారణాలను ఉటం కిస్తూ తనకు హిందీ సరిగ్గా రాకపోవడంవల్ల ఈ అనర్థం జరిగిందని వాపోయారు. ఆయన తన మన స్సులో ‘నీచ’ శబ్దాన్ని ‘కిందిస్థాయి’ వాడనే వాడాలని అనుకున్నారు. ‘నీచ జాతి’ వాడని అనడం ఎంత మాత్రం ఆయన ఉద్దేశం కాదు. ఆయన 30 సంవత్స రాలుగా ఢిల్లీలో ఉంటున్నా, మరో ముప్పై సంవత్స రాలు ఐఏఎస్‌గా అధికారాల్లో ఉంటున్నా వారికి హిందీలో ‘నీచ జాతి’ అనడం ద్వారా నరేంద్ర మోదీ ‘ఉత్కృష్ట జాతి’ వారని చెప్పాలనే ఉద్దేశం. అయితే తన మాతృభాష కాని భాషలో మాట్లాడుతున్నప్పుడు– ఎంత 50 సంవత్సరాల అనుభవం ఉన్నా ‘గొప్ప’ పదానికి ‘నీచ’ పదం దొర్లడాన్ని కేవలం తర్జుమా సమ స్యగానే మనం అర్థం చేసుకోవాలి. తన ‘నీచ’ ప్రసంగం కార ణంగా రేపు గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఎట్టి హాని జరిగినా, ఎటువంటి శిక్షనయినా అనుభవిం చడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయ్యర్ వక్కా ణించారు. కాగా, నిన్న దినేష్ వార్షిణీ అనే కమ్యూనిస్టు నాయకులు ఇంగ్లిష్ చానల్ చర్చలో ఈ ‘నీచ’ శబ్దం ఇప్పటిది కాదని మనుస్మృతిలో మనువే ఉపయో గించారని వాకృచ్చారు. ఏతావాతా ఈ పదానికి బ్రాహ్మణ మూలాలున్నాయని వారు తేల్చారు. చాలా మంది గుర్తుంచుకోని విషయం మనువు క్షత్రియుడు. చక్రవర్తి. అయితే ఈ దేశంలో కమ్యూనిస్టు నాయకులు కారల్‌మార్క్స్ నుంచి మనువుదాకా అందరినీ ఆపో శన పట్టినందుకు మనం గర్వపడాలి. లోగడ సోనియా గాంధీ కూడా మోదీ విష యంలో ఈ ‘నీచ’ శబ్దాన్ని వాడారట. మరి రాహుల్ గాంధీ మణిశంకర్ అయ్యర్ కంటే ముందు తమ తల్లి గారిమీద క్రమశిక్షణ చర్యని తీసుకోవాలి కదా? అని ఒక నాయకులు ప్రశ్నించారు. మోదీని కాంగ్రెస్ నాయకులు ఇదివరకే ‘గూండా’, ‘నపుంసకుడు’ వంటి ముద్దు పేర్లతో పిలు చుకుని మురిసిపోయారు. అయితే ‘నపుంసకుడు’ అనడంలో వారికి అర్ధనారీశ్వరుడనే స్మృతి ఉన్నదనీ, ‘గూండా’ని 500 బీసీ నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఇదివరకే వాడారని మనకు తెలియకపోవచ్చు. ఈ విష యాన్ని మనం కమ్యూనిస్టు నాయకులనడిగి తెలుసు కోవాలి. మణిశంకర్ అయ్యర్ తన క్షమాపణని కుంచిం చుకుపోయి, తలవంచుకుని, కన్నీటి పర్యంతం అయి చెప్పలేదు. గర్వంగా, ధైర్యంగా, స్పష్టంగా తనకు హిందీ తర్జుమా సమస్యలున్నాయని వెన్నెముక నిట్ట నిలువుగా నిలిపి చెప్పారు. ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ వారసత్వం. కాంగ్రెస్ నాయకులు ఏ పని చేసినా కుంచించుకుపోరు. సిగ్గుపడరు. లోగడ 31 కుంభకో ణాల్లో ఏ కాంగ్రెస్ నాయకులూ సిగ్గుతో కుంగి పోవ డాన్ని మనం గమనించలేదు. ఇది వారి డీఎన్ఏలో ఉన్న శక్తిగా మనం అంగీకరించాలి. అన్నిటికన్నా గొప్ప బూతుని కాంగ్రెస్ నాయ కులు దిగ్విజయ్ సింగ్ తమ ట్వీటర్లో ప్రకటించారు. మోదీ ‘‘.... వారిని భక్తుల్ని చేస్తారు. భక్తుల్ని... గా మారుస్తారు’’ అన్నది వారి తాత్పర్యం. ఈ ‘....’ మాట పత్రికలో ప్రకటించడానికి వీలు లేనంత బూతు. అయితే ‘ఇది నేనన్న మాట కాదు. ఎవరో అన్న మాటని నేను ఉదహరించాను’ అన్నారు సింగ్. ఎంగిలి చేసి నంత మాత్రాన ‘బూతు’కి అర్థం మారదు. ఈ వ్యవహారం వల్ల ఒక్క విషయం మనకి అర్థమవుతోంది. కాంగ్రెస్ వారికి తర్జుమా సమస్య లున్నాయి. వారు– భాష సరిగా రాకపోవడం వల్ల ‘నీచ’ పదాన్ని– కమ్యూనిస్టు నాయకుల మాటల్లో– ‘మనుస్మృతి’లో ఉన్న పవిత్రమైన ‘బ్రాహ్మణ’ పదాన్ని దుర్వినియోగం చేశారని. ఈ సందర్భంగా నాకు ఈ రాజకీయ నాయ కులకు ఒక సలహా చెప్పాలని అనిపిస్తోంది. ఎప్పుడైనా తమరు ‘నీచ’ వంటి శబ్దాన్ని వాడాలనుకున్నప్పుడు లేదా దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్టు ‘...’ ప్రచురణకు లొంగని మాట ఏదైనా వాడినప్పుడు కమ్యూనిస్టు నాయకులను సంప్రదించి ఆయా మాటలు ‘పరాశర స్మృతి’, ‘యాజ్ఞ్యవల్క్య స్మృతి’, ‘గౌతమ స్మృతి’, ‘అప స్థంబ స్మృతి’ వంటి వాటిలో ఉన్నాయో లేదో తెలు సుకోవాలని నా మనవి. నాయకులు ఉచ్చం, నీచం మరచిపోయి, తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు–ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూ ఉంటాయి. ఇది ఆయా నాయకుల నీచమైన కుమ్మక్కుకి నిదర్శనం. (ఇక్కడ ‘నీచ’ శబ్దానికి తర్జుమా సమస్య లేదు– తమరు గ్రహించాలి). గొల్లపూడి మారుతీరావు -
మణిశంకర్ అయ్యర్ రాయని డైరీ
కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది. కాంగ్రెస్‌కే నేను ఏమీ ఇవ్వలేకపోయాను! కనీసం రాహుల్బాబుకైనా ఇవ్వాలి. పార్టీ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ అవుతున్న యువకుడిని పార్టీ పెద్దల మధ్య దివాన్ పరుపుల మీద అలా ఖాళీగా కూర్చోబెట్టకూడదు. చేతిలో ఇంత స్వీటో, కారబ్బూందీనో పెట్టి వచ్చేయాలి. పెట్టాక వచ్చేయాలి. అక్కడ ఉండకూడదు. ఉంటే, ఇంకా ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది నాకు. అప్పుడు నేనేమిస్తానో నాకే తెలీదు. రేపు రాహుల్‌బాబుని ప్రెసిడెంట్‌ని చేస్తున్నప్పుడు సీనియర్స్ అంతా కార్యక్రమం పూర్తయ్యేవరకూ దగ్గరే ఉండాలని పార్టీ పట్టు పట్టితే అప్పుడు నాకు వెంటనే వచ్చేయడానికి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ కల్చరే వేరు. లోపల ఉన్నవాళ్లకు ఎంత వ్యాల్యూ ఇస్తుందో, బయటికి గెంటేసినవాళ్లకూ అంతే వ్యాల్యూ ఇస్తుంది. రాహుల్‌బాబు బాడీలో ఉన్నదీ కాంగ్రెస్ బ్లడ్డే కాబట్టి, రాహుల్‌బాబు నుంచి నాకు దక్కాల్సిన వ్యాల్యూ ఎక్కువ తక్కువల గురించి నేనేం దిగులు పెట్టుకోనక్కర్లేదు. ‘రెండు రోజుల క్రితమే కదా అయ్యర్‌ని పార్టీ నుంచి పంపించేశాం. రాహుల్‌బాబుని అతడి చేత ఎలా ఆశీర్వాదం తీసుకోనిస్తాం?’ అని చిదంబరం లాంటివాళ్లు మెలిక పెట్టొచ్చు. రాహుల్‌బాబు ఊరుకుంటాడని నేను అనుకోను. చిదంబరం చేత వెంటనే నాకు ‘సారీ’ చెప్పిస్తాడు. రాహుల్‌బాబు చెప్పమనగానే మోదీకి మొన్న నేను ‘సారీ’ చెప్పాను కాబట్టి.. అందుకు ప్రతిఫలంగా చిదంబరం చేత నాకు సారీ చెప్పిస్తాడు రాహుల్‌బాబు. అదేంటో, కాంగ్రెస్‌కు నేను ఏదైనా ఒకటి ఇవ్వాలని ట్రై చేసిన ప్రతిసారీ కాంగ్రెస్‌కి ఏదో ఒకటి చుట్టుకుంటోంది. ‘‘మీరు మనకు ఇవ్వబోయి, మోదీకి ఇస్తున్నారేమో అనిపిస్తోందండీ అయ్యర్‌జీ’’ అని నిన్న ఫోన్లో రాహుల్‌బాబు చాలాసేపు బాధపడ్డాడు. ‘‘అలా అవుతుందని నేనూ అనుకోలేదు రాహుల్‌బాబూ’’ అని నేనూ చాలాసేపు బాధపడ్డాను. ‘‘ఎవరి లాంగ్వేజ్‌లో వాళ్లు మాట్లాడితేనే ఐడెంటిటీ ఉంటుంది అయ్యర్‌జీ. మన లాంగ్వేజ్ వేరు, మోదీ లాంగ్వేజ్ వేరు. మోదీని మోదీ లాంగ్వేజ్‌లో తిడితే మోదీకి పోయేదేం ఉండదు. మన లాంగ్వేజ్ ఐడెంటిటీ పోతుంది. కాస్త ఆలోచించాల్సింది’’ అన్నాడు రాహుల్‌బాబు. ‘‘ఆలోచించాను రాహుల్‌బాబూ. కానీ ఇంగ్లిష్‌లో ఆలోచించి, హిందీలో తిట్టాను. అది దెబ్బకొట్టింది మనల్ని’’ అన్నాను. ‘‘అర్థం చేసుకోగలను అయ్యర్‌జీ’’ అన్నాడు రాహుల్‌బాబు. సంతోషం వేసింది నాకు. రాహుల్‌బాబు నన్ను అర్థం చేసుకున్నందుకు! గుజరాత్లో రెండో విడత ఎన్నికలు అయ్యేవరకైనా.. కాంగ్రెస్‌కు ఏదైనా ఒకటి ఇవ్వాలన్న కోరికను అణచిపెట్టుకోవాలి. - మాధవ్ శింగరాజు -
మాటసాయం
రాజకీయ నాయకులక్కూడా స్టయిల్ షీట్ ఉండాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? అది బూమరాంగ్ అయింది. అందుకే అంటారు– కాలు జారితే తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేమని. గుజరాత్లో అసలే టగ్గాపోరుగా ఉంటే మణిశంకర్ అయ్యరు మాట తూలాడు. వాక్స్థానంలో శనిగాడుంటే మాటలిలాగే జారతాయ్! ఒక్కోసారి చిన్న పలుకైనా మంగలంలో పేలపు గింజల్లా పేలి పువ్వులా తేల్తుంది. కొన్ని మాటలు పెనం మీది నీటిబొట్టులా చప్పున ఇగిరిపోతాయ్. ఇసకలో పడ్డ చందంగా కొన్ని చుక్కలు ఇంకిపోతాయ్. ఇప్పుడీ అయ్యర్ మాట మోదీ పాలిట ముత్యపుచిప్పలో పడ్డ మంచి ముత్యమైంది. ఇప్పుడా మాటను మోదీ నిండు మనసుతో స్వీకరించారు. ఆ ముత్యాన్ని పూర్తిగా సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనుకోకుండా వరంలా ఈ తరుణంలో లభించిన ముత్యానికి నగిషీలు చెక్కుతున్నారు. ఇప్పుడు చూడండి, అధికార పక్షానికి ఒక్కసారి బరువు దిగింది. అభివృద్ధి పనులు ఏకరువు పెట్టాల్సిన పనిలేదు. గుజరాత్ యువతకు కొత్త ఆశలు పెట్టి మనసు మళ్లించాల్సిన అగత్యం లేదు. ఎజెండాలో లేనివి కూడా సభల్లో వల్లించి బెల్లించాల్సిన కంఠశోష లేదు. ఆ జారిన ముక్కని పల్లకీలో ఊరేగించడమే తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం ‘నీచ్’శబ్దం మీద క్యాంపైన్ ఉధృతంగా నడుస్తోంది. ‘‘ఔను, నేను నీచుణ్ణే’’అనే మకుటం మీద ఓ శతకం రచించి జనం మీదకి వదుల్తారు. ‘‘జనహితం, దేశక్షేమం కోరడంలో నేనెంతకైనా దిగజారతా! ఎంత నీచానికైనా పాల్పడతా. నల్ల ధనవంతులు, అవినీతిపరులు, పన్ను ఎగవేతదారులు, దేశద్రోహులు, ఉగ్రవాదులు నన్ను నీచుడన్నా సరే! వారిని వదిలి పెట్టను’’అంటూ దానికి బహుముఖాలుగా పదును పెడతారు. రాజకీయ నాయకులక్కూడా స్టయిల్ షీట్ ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవడానికి టాబ్లెట్లు కావాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? బహుశా నెహ్రూ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతుందని కౌంటర్ ధాటిగా ఇచ్చి ఉండాలి. అది బూమరాంగ్ అయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం పోయింది. అంటే కూకటివేళ్లతో పార్టీ నుంచి పెకలించినట్టు. ఇంతకు ముందు కూడా అయ్యర్ ‘చాయ్ వాలా’ అని మోదీకి సాయపడ్డారు. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఊరికే చీకట్లో రాళ్లేసినట్లు విసరకూడదు. ఇప్పుడీ రెండక్షరాల మాటని ఓట్లలోకి మారిస్తే, హీనపక్షం పది లక్షలంటున్నారు. మణిశంకర్ మాటని చెరిపెయ్యడానికి క్షమాపణలతో సహా అన్ని చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కానీ అవతలివైపు బాగా రాజు కుంటోంది. ఆ మాత్రం దొరికితే వదుల్తారా! మా ఊరి రచ్చబండ మీద రెండ్రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ‘‘మంచి సమయంలో ఇంతటి మాట సాయం చేసిన అయ్యర్‌ని ఊరికే వదలరు. కొంచెం ఆగి బీజేపీలోకి లాక్కుంటారు’’ అనేది ఒక వెర్షన్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘మణి’ రేపిన తుఫాను!
ఎదుటి వ్యక్తిపై పట్టరాని కోపం వచ్చిన సందర్భంలో రాయికి బదులు మాట విసరడానికి తొలిసారి మనిషి ప్రయత్నించడంతో నాగరికత మొదలైందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెబుతాడు. కానీ ఆ మాటలైనా ఒక పరిధి దాటితే అనాగరికమనిపించు కుంటాయి. ఎదుటివారి సంగతలా ఉంచి...అలా మాట్లాడినవారినే వెంటాడ తాయి. పట్టి పీడిస్తాయి. సాధారణ సమయాల్లో అంతటితో ఆగవచ్చేమోగానీ... ఎన్నికల రుతువులో కొంప ముంచుతాయి. కనుచూపు మేరలో కనబడే అందలాన్ని మాయం చేస్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడుతున్న సర్వేలు కాస్త గొంతు సవరించుకుని కాంగ్రెస్‌కు కొద్దో గొప్పో ఆశలు కల్పిస్తుండగా ఉన్నట్టుండి ఆ పార్టీ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నోరు జారారు. ప్రధాని నరేంద్రమోదీపై ‘నీచ’ పదప్రయోగానికి సాహసించారు. అయితే ఈ తరహా వ్యాఖ్యలు ఆయనకు ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఆయన పరిధిని దాటిన సందర్భా లున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా మోదీని ‘చాయ్‌వాలా’గా హేళన చేసి బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది అయ్యరే. ‘నేను టీ అమ్ముకున్నానుగానీ... దేశాన్ని అమ్మకానికి పెట్టలేదు’ అని మోదీ ఇచ్చిన ప్రత్యుత్తరం అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని పరాభవం దాపురించడంలో ఈ వ్యాఖ్యల పాత్ర కూడా ఉంది. వాజపేయి ప్రధానిగా ఉన్న ప్పుడు ఆయన్ను ‘లాయక్ వ్యక్తి... నలాయక్ నేత’(సమర్ధుడైన వ్యక్తి, అసమర్ధ నేత) అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్య పెద్ద దుమారం రేపడం, ములాయం సైతం మణిశంకర్‌ను దుర్భాషలాడటం కొన్నేళ్లక్రితం సంచలనమైంది. నిజానికి ఇప్పుడు ఆయన తాజాగా మోదీపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించలేరు. తనకు హిందీ సరిగా రాదని సంజాయిషీ ఇచ్చుకున్నా అట్టడుగు కులాలను కించపరిచేలా మణి శంకర్ మాట్లాడిన తీరు గర్హనీయమైనదే. అయితే ఈ వ్యాఖ్యలపై ఎదురుదాడి చేయడంలో బీజేపీ ప్రదర్శించిన ఒడుపూ, వేగమూ గురించి చెప్పుకోవాలి. గుజరాత్ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో సమానంగా పరిగణిస్తూ అక్కడ అన్నీ తానే అయి ప్రచార యుద్ధంలో తలమునకలైన నరేంద్ర మోదీ దీనిపై గట్టిగానే స్పందించారు. ‘ఇది నాకు కాదు... గుజరాత్‌కే అవమానమ’న్నారు. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్టుండే కాంగ్రెస్ కూడా ఈసారి పెను వేగంతో నష్ట నివారణ చర్యలు మొదలెట్టింది. రాహుల్‌గాంధీ మణిశంకర్‌ను పబ్లిగ్గా మందలించారు. ఆ తర్వాత ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దుచేశారు. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. వానాకాలం వస్తే కప్పల బెకబెకలు మొదలైనట్టు ఎన్నికల రుతువు వచ్చేసరికి దూషణల పర్వం ప్రారంభం కావడం దేశ ప్రజలకు కొత్తేమీ కాదు. ఈ పరస్పర తిట్ల యుద్ధంలో ఆ నాయకులకు కలుగుతున్న నష్టమేమిటో తెలియదుగానీ... సమా జానికి మాత్రం చాలా నష్టం జరుగుతోంది. అది రాను రాను బండబారుతోంది. ఏ విలువలూ పాటించని నేతలు ఎదుటివారిని దూషించి సులభంగా పైకి రావొచ్చునని భావిస్తున్నారు. అట్టడుగు కులాలలకూ, మహిళలకూ, మైనారిటీలకూ తీరని అన్యాయం జరుగుతోంది. తాము ఎదుటి నాయకుడిని కాక కొన్ని కులాల వారిని కించపరుస్తున్నామని, మహిళలను అవమానిస్తున్నామని, మైనారిటీల్లో అభద్రతాభావన కలగజేస్తున్నామని ఎవరూ అనుకోవడం లేదు. ఆయా వర్గాల వారు స్పందిస్తున్నా వారికి జవాబు లభించడం లేదు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మూడేళ్లక్రితం కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. చివరకు పార్లమెంటు ఉభయ సభలూ స్తంభించాక ప్రధాని జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలు తప్పేనని అంగీకరించారు. నిజానికి మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పక్షాలు రెండూ పెను వేగంతో కదలడం వెనక ఎన్నికల లెక్కలు కూడా ఉన్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ పుంజుకుంటున్నదని చెబుతున్న వేళ మణిశంకర్ మాటలు ఏం ముప్పు తెచ్చిపెడతాయోనని కాంగ్రెస్ కంగారు పడింది. ఆదరాబాదరాగా చర్యలు తీసుకుంది. తానెంతో శ్రమపడి పరస్పరం సంఘర్షించే వర్గాలకు చెందిన నాయకులను పార్టీ ఛత్రఛాయలోకి తీసుకొచ్చి ఒక పెద్ద కసరత్తు చేస్తే...అది మంచి ఫలితాలను రాబట్టేలా ఉన్నదని సర్వేలు చెబుతుంటే పానకంలో పుడకలా అయ్యర్ దాన్నంతటినీ ఊడ్చిపెట్టేలా ఉన్నాడని కాంగ్రెస్‌లో బెంగ పట్టుకుంది. అటు బీజేపీ కూడా పైకి ఎంత గంభీరంగా ఉన్నా సర్వేలను ‘సీరి యస్’గానే తీసుకున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందుకే కాంగ్రెస్ వైపు నుంచి జరిగే ఏ చిన్న తప్పునూ బీజేపీ వదిలిపెట్టడం లేదు. మణిశంకర్ అయ్యర్ లాంటివారు చేసే పెద్ద తప్పుల గురించి చెప్పనవసరమే లేదు. ప్రతి విషయం లోనూ ఆ పార్టీని బీజేపీ చీల్చి చెండాడుతోంది. తాను శివభక్తుడినని రాహుల్‌గాంధీ ప్రకటించుకుంటే... ఆయనా మన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నాడని బీజేపీ మురి సిపోలేదు. పైగా కమ్యూనిస్టులు ఎద్దేవా చేసిన తరహాలో ‘ఈమధ్య వారికి బాబా సాహెబ్(అంబేడ్కర్) కన్నా... బాబా భోలే(మహాశివుడు)యే గర్తుకొస్తున్నారు’ అంటూ మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. దీనికి ఏం జవాబివ్వాలో దిక్కుతోచక ఆవేశంలో అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. మన రాజకీయ రంగంలో విలువలు క్షీణిస్తున్నమాట నిజం. అయితే ఉన్న తస్థాయి నేతలపై నోరు పారేసుకున్నప్పుడు మాత్రమే కాదు... సాధారణ ప్రజా నీకంలో అభద్రతా భావాన్ని కలగజేసేలా, అట్టడుగు కులాలను హేళన చేసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే స్థాయిలో పార్టీలు స్పందించాలి. వెనువెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లూ, సీట్లూ సంపాదించి అధికారం రాబట్టుకోవడం మాత్రమే పర మావధి కాకుండా అన్ని స్థాయిల్లో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడేందుకు దోహదపడాలి. -
రాహుల్.. వాట్ ఏ షాట్?
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ జీ.. వాట్ ఏ షాట్.. మీ షాట్ పక్కా సిక్స్.. బంతి కూడా దొరక్కుండా పోయింది. వాట్ ఈజ్ దిస్.. రాహుల్ కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు కదా.! ఈ షాట్ కొట్టడం ఏమిటి అనుకుంటున్నారా..? ఇవన్నీ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటోకు వస్తున్న కామెంట్లు.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీపై నోరు జారీ సస్పెండ్ అయిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ విషయంలో రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఆయన అభిమానులు. అలహాబాద్‌కు చెందిన హసీబ్ అహ్మద్ అనే యువనేత అయితే ఏకంగా ధోని ఫొటోను రాహుల్‌గా, బంతిని అయ్యర్‌గా మార్ఫింగ్ చేసి... బంతిని లాగి కొట్టే ఓ పోస్టర్‌ను రూపోందించి ‘వెల్డన్ రాహుల్ బాయ్’ అని సోషల్ మీడియాలోకి వదిలాడు. ఇంకేముంది.. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఢిల్లీలో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. దీనిపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అని తీవ్రంగా విమర్శించారు. మోదీపై చేసిన ఈ పరుష వ్యాఖ్యలు దుమారం రేగటంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. షోకాజ్ నోటీసులూ జారీచేసింది. అయ్యర్ వ్యాఖ్యలను సమర్థించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఇలాంటి పదజాలాన్ని వినియోగించకూడదని కూడా కోరారు. -
బ్రేకింగ్... మణిశంకర్ అయ్యర్‌కు కాంగ్రెస్ షాక్
-
బ్రేకింగ్... మణిశంకర్ అయ్యర్‌కు కాంగ్రెస్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేయటంతోపాటు, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ‘నీచ్ ఆద్మీ’ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీ కీలక నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూడా. పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చివరకు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించటంతో దిగొచ్చిన మణిశంకర్ అయ్యర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 2014 లో నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన చేసిన ఆయన తాజాగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు వాస్తవ రూపం తేవడానికి జవహర్లాల్ నెహ్రూ కృషి చేశారని, అటువంటి కుటుంబంపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన నీచుడు, సభ్యత లేనివాడు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. -
'క్షమించండి మోదీ.. నాకు హిందీ బాగా రాదు'
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నోరు జారారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో మోదీని చాయ్‌వాలా అంటూ అవమానించిన ఆయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఈయన(నరేంద్రమోదీ) తక్కువ స్థాయి మనిషి. ఆయనకు సంస్కారం లేదు.. ఈ సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు?' అని అన్నారు. గతంలో మోదీని విమర్శించిన సమయంలో ఇరుకునపడిన అనుభవం ఉన్న కాంగ్రెస్ ఈసారి వెంటనే మేల్కొంది. అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ అయ్యర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'బీజేపీ, ప్రధాని తప్పుడు మాటలు ఉపయోగిస్తూ కాంగ్రెస్‌ను నిత్యం విమర్శిస్తుంటారు. అది వారి సంస్కారం.. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సంస్కారం, వారసత్వం ఉంది. మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోదీని సంబోధించిన తీరును నేను సమర్థించను. కాంగ్రెస్ పార్టీ, నేను వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాం' అని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మణిశంకర్ వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని, అందుకు మన్నించాలని కోరారు. -
అయ్యర్ విసుర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుండగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా లేదా రాహుల్ మాత్రమే అధ్యక్షులు కాగలరని ఇంతమాత్రం దానికి ఎన్నికలు అవసరమా అని ప్రశ్నించారు. ‘తల్లి లేదా కొడుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాగలర’ని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రాహుల్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ... ‘ఏదైనా పదవికి ఎక్కువ మంది పోటీ పడినప్పుడు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తారు. బరిలో ఎవరూ లేనప్పుడు, పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నిక ఎలా నిర్వహిస్తార’ని అన్నారు. దీపావళి తర్వాత రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 31న ఆయనకు పట్టంకట్టే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మణిశంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి అక్టోబర్ 15-20 మధ్య షెడ్యూల్ ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నిక నిర్వహిస్తామని తెలిపాయి. దీపావళి తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. -
నాశనం తప్ప వికాసం ఎక్కడ?
మోదీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: బీజేపీ సబ్కా వికాస్ నినాదం మాటలకే పరిమితమైందని, వ్యవసాయం సర్వనాశనం అయిందేగానీ వికాసం లేదని కేంద్ర మాజీమంత్రి మణిశంకర్ అయ్యర్ ధ్వజ మెత్తారు. ఓవైపు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గుతుంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా మంటూ ప్రధాని మోదీ మాయమాటలతో మభ్యపెడుతున్నారన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ‘దేశ వ్యవసాయ రంగంలో ఇందిరాగాంధీ పాత్ర’ అంశంపై టీపీసీసీ సదస్సు నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, పార్టీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మణిశంకర్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ హయాంలో వ్యవ సాయ వృద్ధి 10.76కు పెరిగిందని, జీడీపీలో వ్యవసాయం నుంచి 70–80 శాతం వాటా ఉండేదన్నారు. ఇప్పుడు జీడీపీలో వ్యవసా యం, అనుబంధ రంగాలు కలిపి కూడా 17 శాతం మించడంలేదన్నారు. 1987–88లో తీవ్రౖ మెన కరువుతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయిన సందర్భంలో దేశాన్ని కరువు నుంచి కాపాడ టానికి రాజీవ్ ఊరూరూ తిరిగారని గుర్తు చేశారు. రాజస్తాన్‌లోని కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి చర్యలను తీసుకున్నారని వివరించారు. దోమల్లేకుండానే చికున్‌గున్యా వచ్చిందని ప్రచారం చేసినట్టుగా, సమస్య లేకుండా సర్జికల్ స్రైక్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అయ్యర్ ఎద్దేవా చేశారు. దేశంలో జమ్మూ–కశ్మీర్ సమస్యగా ఉండేదని, ఇప్పుడు జమ్మూ, కశ్మీర్ కూడా పరస్పరం సమస్యగా పరిణమించాయన్నారు. భూ సంస్కరణలు, హరితవిప్లవంతో వ్యవసాయ వృద్ధిరేటును పెంచిన ఇందిర స్ఫూర్తిని ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు. రక్తంతో పనిలేకుండా హరిత విప్లవం భూస్వాముల తలలతో దండలు కట్టిన నక్సల్బ రీ విప్లవానికి ప్రత్యామ్నాయంగా రక్తం చుక్కతో పనిలేకుండా హరిత విప్లవాన్ని ఇందిరాగాంధీ తెచ్చారని కేంద్ర మాజీమంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో హరితవిప్లవంలో పాల్గొన్నానని, సరైన ఫలితా లు సాధించామని చెప్పారు. సదస్సులో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హను మంతరావు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, టీపీసీసీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీని ఓడించాలంటే..?
న్యూఢిల్లీ: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అడ్డుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. మహాకూటమితోనే బీజేపీ, మోదీని ఎదుర్కొగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించగలదని అనుకోవడం మూర్ఖత్వమన్నారు. కలిసికట్టుగా పోరాడితే 2019లో బీజేపీపై విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పారు. ‘సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు చాలాపెద్ద నష్టమే జరిగింది. కానీ 2014 పార్లమెంటు ఎన్నికల్లో 59 శాతం, 2017 యూపీ ఎన్నికల్లో 69 శాతం ప్రజలు ప్రధానికి ఓటు వేయలేద’ ని మణిశంకర్ తెలిపారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌లో ఎటువంటి ఇబ్బంది లేదన్న అయ్యర్, జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడుతోందని అంగీకరించారు. పార్టీని పటిష్టం చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి యువతరాన్ని చేర్చుకోవాలని అయ్యర్ సూచించారు. 2004 స్ఫూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన కోరారు. కేంద్రంలో యూపీఏ ఓడిపోవడానికి కారణం ఈ కూటమి చెల్లాచెదురు కావడమేనన్నారు. అప్పట్లో సోనియా గాంధీ మిత్రపక్షాలను కలుపుకునిపోయారని, ఇప్పడు రాహుల్ గాంధీపై ఆ బాధ్యత ఉందన్నారు. మహాకూటమి ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా బలపడాలని అయ్యర్ సూచించారు. -
మాజీ కేంద్ర మంత్రికి తీవ్ర పరాభవం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో బలగాల ఫైరింగ్ లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్‌కు చుక్కెదురైంది. ఆయనతోపాటు ఉన్న జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝా కూడా తిరస్కృతిని ఎదుర్కొన్నారు. కశ్మీర్ అల్లర్లను అదుపు చేసేందుకు బలగాలు జరిపిన పెల్లెట్స్ గన్స్ కాల్పుల్లో గాయపడిన వారంతా ప్రస్తుతం ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు కొందరు జర్నలిస్టులు సహా మణిశంకర్ అయ్యర్ ఇతర మాజీ అధికారుల బృందం ఆస్పత్రికి వెళ్లింది. అయితే, ఆస్పత్రి వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు వారిని అక్కడికి రానివ్వలేదు. గో ఇండియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆస్పత్రి ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. కశ్మీర్ లోయలో ఇంత జరుగుతున్నా పరామర్శపేరిట ఇన్ని రోజులకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హంతకులతో, హత్యలకు మద్దతిచ్చేవారితో చేయి కలపబోమని మణిశంకర్ పై మండిపడ్డారని తెలుస్తోంది. అనంతరం కొందరు జర్నలిస్టులను మాత్రం గాయపడిన వారిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించారు. -
హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకో?
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మిక పాకిస్థాన్ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేతల విమర్శలు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్... మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత కొద్ది నెలల వరకూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడని నరేంద్ర మోదీలో హఠాత్తుగా ఇంత మార్పేంటబ్బా అంటూ ఎద్దేవా చేశారు. ఇదంతా కన్ఫ్యూజుడ్ పాలసీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మనీష్ తివారీ స్పందిస్తూ...గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ లాహోర్‌లో పర్యటించిన అనంతరం 'కార్గిల్' యుద్ధం జరిగిందని, మరి ఇప్పుడూ అంటూ ప్రశ్నించారు. అది ఒక వ్యాపారి చేసిన ముందస్తు ఏర్పాటని, దేశ ప్రయోజనాల పెంపు, ఉగ్రవాద నియంత్రణకు కాకుండా ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని పాక్ వెళ్లారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. పాక్‌తో మోదీ సంబంధాలు అవివేకం, గత నిర్ణయాలకు భిన్నం అని ఆయన ఆక్షేపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతల విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. -
వారి వ్యాఖ్యలపై వెంకయ్య అభ్యంతరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షిద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో చర్చలు పునరుద్ధరిస్తే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాలని అయ్యర్ అన్నారు. వీరి వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షిద్ వ్యాఖ్యలను ఖండించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. -
'వాళ్లిద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలు'
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ ఇద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని, ప్రధానమంత్రి ఈ విషయంలో చెబుతున్న మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందని ఆమె అన్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 130 మంది మరణించినా, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఐఎస్ఐఎస్, తాలిబన్లకు ప్రచారకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భారత్- పాక్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన తొలగిపోవాలంటే ముందు మోదీని తొలగించి తమను అధికారంలోకి తీసుకురావాలని మణిశంకర్ అయ్యర్ ఓ పాకిస్థానీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపైనే బీజేపీ మండిపడింది. అలాగే విదేశాంగ శాఖ మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా గత వారం పాకిస్థాన్‌లో ఉండి ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో ఆయనపైనా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు దశాబ్దాలుగా బిహార్‌లో ఓటమి అనుభవం లేదని, అలాగే ఆయనకు తనను ఆరాధించే వాళ్లతో తప్ప ఇతరులతో మాట్లాడటం పెద్దగా రాదని ఖుర్షీద్ పాకిస్థాన్‌లోని జిన్నా ఇన్స్టిట్యూట్లో చేసిన ప్రసంగంలో అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడి.. కాంగ్రెస్ నేతలను తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలుగా అభివర్ణించింది. -
'మణిశంకర్ కు మతి తప్పింది'
గువాహటి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ దేశాన్ని అగౌరవపరిచారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. పాకిస్థాన్ టీవీ చానల్ తో మాట్లాడినప్పుడు ఆయన మానసిక సమతుల్యం కోల్పోయారని ధ్వజమెత్తారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయితే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాల్సిన అవసరముందని పాక్ టీవీ చానల్ తో అయ్యర్ అన్నారు. అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మోదీనే కాకుండా యావత్ జాతిని అవమానించేలా ఉన్నాయని జవదేకర్ విమర్శించారు. మంగళవారం గువాహటిలో విలేకరులతో మాట్లాడుతూ... చర్చల పునరుద్ధరణపై ముందడుగు వేయాల్సింది పాకిస్థానేనని అన్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పారిస్ లో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని సమర్థిస్తూ యూపీ మంత్రి ఆజంఖాన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను సమాజ్ వాది పార్టీ ఖండించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుందని తెలిపారు. -
మణి శంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువ కనిపిస్తున్నారు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు మోదీ పీఎంగా కంటే ఈవెంట్ మేనేజర్ గానే ఎక్కువగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ' నాకు మోదీ పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన ఎక్కువ సొంత పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు కచ్చితంగా ఆయన మనకు పీఎంగా ఉన్నారా?లేక ఈవెంట్ మేనేజర్ గా ఉన్నారా?అని ప్రశ్నించే రోజులు తప్పకుండా వస్తాయి' అని అయ్యర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సంవత్సరం దాటిన ప్రజలకు చేసేందేమీ లేదంటూ అయ్యర్ మండిపడ్డారు. మోదీ అచ్చా దిన్ కార్యక్రమంతో బీజేపీ కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. ఎన్డీఏ పాలనపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని.. ప్రత్యేకంగా రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాలనతో పాటు కాంగ్రెస్ తదితర అంశాలపై మణిశంకర్ అయ్యర్ రాస్తున్న 'అచ్చా దిన్?హా!హా!!' పుస్తకం వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సోనియా గాంధీపై నట్వర్ సింగ్ వ్యాఖ్యలు వాస్తవమే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పునురుద్ఘాటించారు. సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారన్న నట్వర్ వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. 2004 లో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపినా. ఆ పదవిపై ఆమె వెనక్కు తగ్గడానికి రాహులే ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చని మణిశంకర్ తెలిపారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వాఖ్యలను మణిశంకర్ తాజాగా పునరుద్ఘాటించారు. అయితే తల్లి సంరక్షణపై కొడుకు ఉండే ఆందోళనలో భాగంగానే రాహుల్ అలా చెప్పి ఉండవచ్చన్నారు. ప్రధాని పదవిని ఆమె తిరస్కరించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నా అవి నట్వర్ కు తెలియకపోవచ్చన్నారు. నట్వర్ సింగ్ గాంధీ కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను ఆత్మకథ రూపంలో బయటకు తేవడం కష్టసాధ్యమన్నారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిజాలను వెల్లడిస్తానని నట్వర్ చెప్పినా.. అంతర్లీనంగా ఉన్న పూర్తి వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రం సాధ్యపడదని మణిశంకర్ తెలిపారు. -
ఓటమి స్వయంకృతాపరాధం
నాగపూర్: యూపీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, కుంభకోణాలపై ఎప్పటికప్పుడు దీటుగా స్పందించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని గురువారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కార్‌పై, కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు, కుంభకోణాల ఆరోపణలను తమ పార్టీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. దీంతో ఆయా విమర్శలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాక, ప్రజల్లో కూడా పార్టీపై వ్యతిరేకత పెరిగేందుకు అవకాశమిచ్చినట్లయ్యిందని విశ్లేషించారు. ‘కాంగ్రెస్‌పై వచ్చిన విమర్శలపై మా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా స్పందించకపోవడంతో ప్రజలు మాకు ఓటు వేసేందుకు ఇష్టపడలేద’ని అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌పై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అయిన అయ్యర్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘ప్రతి రాజకీయపార్టీకి గెలుపోటములు సహజం. ఈ ఎన్నికల్లో ఓటమితో మేం కుంగిపోవడంలేదు. మళ్లీ మేం పుంజు కుంటాం. ఆ ధీమా మాకుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలోనే తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటాం..’ అని స్పందించారు. కుంభకోణాల ఆరోపణలపై తమ పార్టీ నాయకులు స్పందించిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘రూ.1.76 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికపై అప్పటి టెలికాం మంత్రి అయిన కపిల్ సిబాల్ వెంటనే స్పందించకుండా మూడు నెలల తర్వాత మాట్లాడారు. ఆ వ్యవధిలో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరోపణలపై బాధ్యులెవరూ స్పందించకపోవడంతో అవి నిజమేనేమోనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడింది. అలాగే కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన జాప్యం కూడా పరాజయానికి కారణమైందని చెప్పొచ్చు. ఉదాహరణకు తమిళనాడులోని ద క్షిణ చెన్నై స్థానానికి నామినేషన్ల ఘట్టం ఇంకో రెండు గంటల్లో ముగుస్తుందనగా పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించారు. అలాంటి సందర్భాల్లో పార్టీ ప్రజల మద్దతును ఎలా కూడగట్టుకోగలుగుతుంది..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అలాగే ‘బోఫోర్స్’ కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును అన్యాయంగా ఇరికించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని తర్వాత బయటపడింది. సదరు ఒప్పందంలో రాజీవ్ గాంధీకి ఎటువంటి సంబంధంలేదని నాకు వ్యక్తిగతంగా తెలుసు..’ అని అయ్యర్ వివరించారు.