న్యూఢిల్లీ/సిమ్లా: గత కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఆఖరి దశ పోలింగ్ వేళ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రధాని మోదీని నీచమైన మనిషి(నీచ్ ఆద్మీ) అంటూ అవహేళన చేయడం సరైందేనంటూ అయ్యర్ తాజాగా రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రధానుల్లో మోదీని అత్యంత చెడుగా మాట్లాడే వ్యక్తి అని వ్యాసంలో పేర్కొన్నారు. రైజింగ్ కశ్మీర్, ది ప్రింట్ పత్రికల్లో ఈ వ్యాసం ప్రచురితమైంది. అయ్యర్ తన వ్యాసంలో..‘మే 23వ తేదీన మోదీని ప్రజలు తిరస్కరించక తప్పదు.
అత్యంత చెడుగా మాట్లాడే ఈ ప్రధానికి అదే సరైన ముగింపు. 2017 డిసెంబర్ 7వ తేదీన నేను ఏం చెప్పానో గుర్తుందా? భవిష్యత్తును చెప్పలేదా?’అని పేర్కొన్నారు. 2017లో ఆయన మోదీని ‘నీచ మనిషి’ అని పేర్కొనగా అది వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దూషణలకు అధిపతి అయ్యర్ అని పేర్కొంది. ‘అయ్యర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. మాజీ పీఎం రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాను తూలనాడి ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చిన మోదీయే వారిపై తను వాడిన భాషను చూసి సిగ్గుపడాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
తిట్లను బహుమతులుగా భావిస్తా: మోదీ
‘ఆయన(మణి శంకర్ అయ్యర్) మళ్లీ అదే మాట అంటున్నారు. తన దూషణలను సమర్థించుకుంటున్నారు. గొప్ప వంశీకుడు(రాహుల్), ఆయన కుటుంబం, వారి మిత్రులు ఇదే అహంకారంతో దేశాన్ని ఏళ్లపాటు పాలించారు. వారి దూషణలను బహుమతులుగా స్వీకరిస్తా. నన్ను తిట్టిన ప్రతి తిట్టుకూ సమాధానంగా బీజేపీని గెలిపించి ప్రజలే సమాధానమిస్తారు’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment