దేశాభివృద్ధి చేయకున్నా ప్రధానిగా కొనసాగుతున్నారు
మోదీపై సోనియా గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్‌డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు.
‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు.
స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్‌సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు.
అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు రాలేదు
‘‘రాజ్యాంగంపై ఎన్‌డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్‌సభ తొలి సెషన్‌లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు.
ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి
‘‘పార్లమెంట్‌లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు.
నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా?
‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment