విజయం సరే... విలువలు? | Sakshi Editorial On Exit polls 2024 | Sakshi
Sakshi News home page

విజయం సరే... విలువలు?

Published Sun, Jun 2 2024 12:27 AM | Last Updated on Sun, Jun 2 2024 11:09 AM

Sakshi Editorial On Exit polls 2024

జనతంత్రం 

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.

ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.

హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.

‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!

అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.

భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.

కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు.  ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.

ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.

ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్,  నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.

గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.

రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.

విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌  నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!

అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.

మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.

జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?

ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement