
ఎదుటి వ్యక్తిపై పట్టరాని కోపం వచ్చిన సందర్భంలో రాయికి బదులు మాట విసరడానికి తొలిసారి మనిషి ప్రయత్నించడంతో నాగరికత మొదలైందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెబుతాడు. కానీ ఆ మాటలైనా ఒక పరిధి దాటితే అనాగరికమనిపించు కుంటాయి. ఎదుటివారి సంగతలా ఉంచి...అలా మాట్లాడినవారినే వెంటాడ తాయి. పట్టి పీడిస్తాయి. సాధారణ సమయాల్లో అంతటితో ఆగవచ్చేమోగానీ... ఎన్నికల రుతువులో కొంప ముంచుతాయి. కనుచూపు మేరలో కనబడే అందలాన్ని మాయం చేస్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడుతున్న సర్వేలు కాస్త గొంతు సవరించుకుని కాంగ్రెస్‌కు కొద్దో గొప్పో ఆశలు కల్పిస్తుండగా ఉన్నట్టుండి ఆ పార్టీ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నోరు జారారు. ప్రధాని నరేంద్రమోదీపై ‘నీచ’ పదప్రయోగానికి సాహసించారు.
అయితే ఈ తరహా వ్యాఖ్యలు ఆయనకు ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఆయన పరిధిని దాటిన సందర్భా లున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా మోదీని ‘చాయ్‌వాలా’గా హేళన చేసి బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది అయ్యరే. ‘నేను టీ అమ్ముకున్నానుగానీ... దేశాన్ని అమ్మకానికి పెట్టలేదు’ అని మోదీ ఇచ్చిన ప్రత్యుత్తరం అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని పరాభవం దాపురించడంలో ఈ వ్యాఖ్యల పాత్ర కూడా ఉంది. వాజపేయి ప్రధానిగా ఉన్న ప్పుడు ఆయన్ను ‘లాయక్ వ్యక్తి... నలాయక్ నేత’(సమర్ధుడైన వ్యక్తి, అసమర్ధ నేత) అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్య పెద్ద దుమారం రేపడం, ములాయం సైతం మణిశంకర్‌ను దుర్భాషలాడటం కొన్నేళ్లక్రితం సంచలనమైంది. నిజానికి ఇప్పుడు ఆయన తాజాగా మోదీపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించలేరు. తనకు హిందీ సరిగా రాదని సంజాయిషీ ఇచ్చుకున్నా అట్టడుగు కులాలను కించపరిచేలా మణి శంకర్ మాట్లాడిన తీరు గర్హనీయమైనదే. అయితే ఈ వ్యాఖ్యలపై ఎదురుదాడి చేయడంలో బీజేపీ ప్రదర్శించిన ఒడుపూ, వేగమూ గురించి చెప్పుకోవాలి. గుజరాత్ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో సమానంగా పరిగణిస్తూ అక్కడ అన్నీ తానే అయి ప్రచార యుద్ధంలో తలమునకలైన నరేంద్ర మోదీ దీనిపై గట్టిగానే స్పందించారు. ‘ఇది నాకు కాదు... గుజరాత్‌కే అవమానమ’న్నారు. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్టుండే కాంగ్రెస్ కూడా ఈసారి పెను వేగంతో నష్ట నివారణ చర్యలు మొదలెట్టింది. రాహుల్‌గాంధీ మణిశంకర్‌ను పబ్లిగ్గా మందలించారు. ఆ తర్వాత ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దుచేశారు. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.
వానాకాలం వస్తే కప్పల బెకబెకలు మొదలైనట్టు ఎన్నికల రుతువు వచ్చేసరికి దూషణల పర్వం ప్రారంభం కావడం దేశ ప్రజలకు కొత్తేమీ కాదు. ఈ పరస్పర తిట్ల యుద్ధంలో ఆ నాయకులకు కలుగుతున్న నష్టమేమిటో తెలియదుగానీ... సమా జానికి మాత్రం చాలా నష్టం జరుగుతోంది. అది రాను రాను బండబారుతోంది. ఏ విలువలూ పాటించని నేతలు ఎదుటివారిని దూషించి సులభంగా పైకి రావొచ్చునని భావిస్తున్నారు. అట్టడుగు కులాలలకూ, మహిళలకూ, మైనారిటీలకూ తీరని అన్యాయం జరుగుతోంది. తాము ఎదుటి నాయకుడిని కాక కొన్ని కులాల వారిని కించపరుస్తున్నామని, మహిళలను అవమానిస్తున్నామని, మైనారిటీల్లో అభద్రతాభావన కలగజేస్తున్నామని ఎవరూ అనుకోవడం లేదు. ఆయా వర్గాల వారు స్పందిస్తున్నా వారికి జవాబు లభించడం లేదు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మూడేళ్లక్రితం కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. చివరకు పార్లమెంటు ఉభయ సభలూ స్తంభించాక ప్రధాని జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలు తప్పేనని అంగీకరించారు.
నిజానికి మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పక్షాలు రెండూ పెను వేగంతో కదలడం వెనక ఎన్నికల లెక్కలు కూడా ఉన్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ పుంజుకుంటున్నదని చెబుతున్న వేళ మణిశంకర్ మాటలు ఏం ముప్పు తెచ్చిపెడతాయోనని కాంగ్రెస్ కంగారు పడింది. ఆదరాబాదరాగా చర్యలు తీసుకుంది. తానెంతో శ్రమపడి పరస్పరం సంఘర్షించే వర్గాలకు చెందిన నాయకులను పార్టీ ఛత్రఛాయలోకి తీసుకొచ్చి ఒక పెద్ద కసరత్తు చేస్తే...అది మంచి ఫలితాలను రాబట్టేలా ఉన్నదని సర్వేలు చెబుతుంటే పానకంలో పుడకలా అయ్యర్ దాన్నంతటినీ ఊడ్చిపెట్టేలా ఉన్నాడని కాంగ్రెస్‌లో బెంగ పట్టుకుంది. అటు బీజేపీ కూడా పైకి ఎంత గంభీరంగా ఉన్నా సర్వేలను ‘సీరి యస్’గానే తీసుకున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందుకే కాంగ్రెస్ వైపు నుంచి జరిగే ఏ చిన్న తప్పునూ బీజేపీ వదిలిపెట్టడం లేదు. మణిశంకర్ అయ్యర్ లాంటివారు చేసే పెద్ద తప్పుల గురించి చెప్పనవసరమే లేదు. ప్రతి విషయం లోనూ ఆ పార్టీని బీజేపీ చీల్చి చెండాడుతోంది. తాను శివభక్తుడినని రాహుల్‌గాంధీ ప్రకటించుకుంటే... ఆయనా మన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నాడని బీజేపీ మురి సిపోలేదు. పైగా కమ్యూనిస్టులు ఎద్దేవా చేసిన తరహాలో ‘ఈమధ్య వారికి బాబా సాహెబ్(అంబేడ్కర్) కన్నా... బాబా భోలే(మహాశివుడు)యే గర్తుకొస్తున్నారు’ అంటూ మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. దీనికి ఏం జవాబివ్వాలో దిక్కుతోచక ఆవేశంలో అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు.
మన రాజకీయ రంగంలో విలువలు క్షీణిస్తున్నమాట నిజం. అయితే ఉన్న తస్థాయి నేతలపై నోరు పారేసుకున్నప్పుడు మాత్రమే కాదు... సాధారణ ప్రజా నీకంలో అభద్రతా భావాన్ని కలగజేసేలా, అట్టడుగు కులాలను హేళన చేసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే స్థాయిలో పార్టీలు స్పందించాలి. వెనువెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లూ, సీట్లూ సంపాదించి అధికారం రాబట్టుకోవడం మాత్రమే పర మావధి కాకుండా అన్ని స్థాయిల్లో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడేందుకు దోహదపడాలి.
Comments
Please login to add a commentAdd a comment