మాజీ కేంద్ర మంత్రికి తీవ్ర పరాభవం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో బలగాల ఫైరింగ్ లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్కు చుక్కెదురైంది. ఆయనతోపాటు ఉన్న జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝా కూడా తిరస్కృతిని ఎదుర్కొన్నారు. కశ్మీర్ అల్లర్లను అదుపు చేసేందుకు బలగాలు జరిపిన పెల్లెట్స్ గన్స్ కాల్పుల్లో గాయపడిన వారంతా ప్రస్తుతం ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు కొందరు జర్నలిస్టులు సహా మణిశంకర్ అయ్యర్ ఇతర మాజీ అధికారుల బృందం ఆస్పత్రికి వెళ్లింది.
అయితే, ఆస్పత్రి వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు వారిని అక్కడికి రానివ్వలేదు. గో ఇండియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆస్పత్రి ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. కశ్మీర్ లోయలో ఇంత జరుగుతున్నా పరామర్శపేరిట ఇన్ని రోజులకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హంతకులతో, హత్యలకు మద్దతిచ్చేవారితో చేయి కలపబోమని మణిశంకర్ పై మండిపడ్డారని తెలుస్తోంది. అనంతరం కొందరు జర్నలిస్టులను మాత్రం గాయపడిన వారిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించారు.