'వాళ్లిద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలు'
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ ఇద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని, ప్రధానమంత్రి ఈ విషయంలో చెబుతున్న మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందని ఆమె అన్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 130 మంది మరణించినా, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఐఎస్ఐఎస్, తాలిబన్లకు ప్రచారకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భారత్- పాక్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన తొలగిపోవాలంటే ముందు మోదీని తొలగించి తమను అధికారంలోకి తీసుకురావాలని మణిశంకర్ అయ్యర్ ఓ పాకిస్థానీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపైనే బీజేపీ మండిపడింది. అలాగే విదేశాంగ శాఖ మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా గత వారం పాకిస్థాన్‌లో ఉండి ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో ఆయనపైనా మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు దశాబ్దాలుగా బిహార్‌లో ఓటమి అనుభవం లేదని, అలాగే ఆయనకు తనను ఆరాధించే వాళ్లతో తప్ప ఇతరులతో మాట్లాడటం పెద్దగా రాదని ఖుర్షీద్ పాకిస్థాన్‌లోని జిన్నా ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన ప్రసంగంలో అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడి.. కాంగ్రెస్ నేతలను తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలుగా అభివర్ణించింది.