
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నోరు జారారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో మోదీని చాయ్‌వాలా అంటూ అవమానించిన ఆయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఈయన(నరేంద్రమోదీ) తక్కువ స్థాయి మనిషి. ఆయనకు సంస్కారం లేదు.. ఈ సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు?' అని అన్నారు. గతంలో మోదీని విమర్శించిన సమయంలో ఇరుకునపడిన అనుభవం ఉన్న కాంగ్రెస్ ఈసారి వెంటనే మేల్కొంది.
అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ అయ్యర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'బీజేపీ, ప్రధాని తప్పుడు మాటలు ఉపయోగిస్తూ కాంగ్రెస్‌ను నిత్యం విమర్శిస్తుంటారు. అది వారి సంస్కారం.. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సంస్కారం, వారసత్వం ఉంది. మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోదీని సంబోధించిన తీరును నేను సమర్థించను. కాంగ్రెస్ పార్టీ, నేను వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాం' అని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మణిశంకర్ వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని, అందుకు మన్నించాలని కోరారు.