రాహుల్ గాందీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
విపక్ష నేతలు అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారు
తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం మాకు తెలియదు
ప్రజల సొమ్ముతో అద్దాలమేడ నిర్మించుకోలేదు.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాం..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చకు సమాధానం
జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగే వారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదు. మేం ముస్లిం సోదరీ మణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చాం. – మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు మన రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను ఏనాడూ అర్థం చేసుకోలేరని అన్నారు. కొన్ని పార్టీలు (ఆమ్ ఆద్మీ పార్టీ) యువత భవిష్యత్తుకు ఆపదగా మారాయని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఎంతో ప్రజాధనం ఆదా అయ్యిందని పేర్కొన్నారు. జనం సొమ్ముతో తాము అద్దాల మేడలు కట్టుకోలేదని స్పష్టంచేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటో సెషన్లు పెట్టుకొని సంబరపడే కొందరు నాయకులు అదే పేదల గురించి పార్లమెంట్‌లో మాట్లాడడం నీరసమైన వ్యవహారంగా భావిస్తున్నారని విమర్శించారు. జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేవారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదని మండిపడ్డారు. ముస్లిం సోదరీమణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
మా పాలనలోనే గరీబీ హఠావో..
తప్పుడు హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం మాకు అలవాటు లేదు. అభివృద్ది చేసి చూపించడమే మాకు తెలుసు. గరీబీ హఠావో నినాదం ఐదు దశాబ్దాలపాటు వినిపించింది. కానీ, జరిగిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. కేవలం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. పేదల కష్టాలు ఏమిటో మాకు తెలుసు. ఎందుకంటే మేము స్వయంగా పేదరికం అనుభవించాం. నిరుపేదల అగచాట్లు, సామాన్య ప్రజల బాధలు అర్థం చేసుకోవాలంటే స్పందించే హృదయం ఉండాలి. అది కొందరు నాయకులకు లేదు. రాజ్యాంగం నిర్దేశించినట్లు నడుచుకుంటున్నాం.
రాజ్యాంగమే మాకు స్ఫూర్తి. విషపూరిత రాజకీయాలను నమ్ముకోవడం లేదు. 21వ శతాబ్దం కోసం సిద్ధం కావాలంటూ పదేపదే నినదించిన ఓ ప్రధానమంత్రి(రాజీవ్ గాం«దీ) 20వ శతాబ్దపు అవసరాలను సైతం తీర్చలేకపోయారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని కొందరు వ్యక్తులు(సోనియా గాం«దీ) విమర్శించడం దారుణం. దేశ ప్రథమ పౌరురాలిని, పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను కించపర్చడం సహించరానిది. రాజకీయంగా మీరు నిరాశలో ఉండొచ్చు. అంతమాత్రాన రాష్ట్రపతిని అవమానించాలా? ఇదెక్కడి పద్ధతి? మన దేశంలో ఏదైనా ఎస్సీ లేదా ఎస్టీ కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు ఎంపీలైన సందర్భాలు ఉన్నాయా? పేదల సంక్షేమం గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారి మాటలకు, చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. అది భూమికి, ఆకాశానికి.. చీకటికి, వెలుతురు మధ్యన ఉన్నంత వ్యత్యాసం.
ప్రజలకు రూ.40 లక్షల కోట్లు బదిలీ
కొందరు నాయకులు(అరవింద్ కేజ్రీవాల్) వారి ఖరీదైన ఇళ్లల్లో స్టైల్‌గా ఉండే నీటి షవర్లు, వేడినీటి ఈత కొలనులు ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడితే మేము ప్రతి ఇంటికీ నీరు అందించడంపై దృష్టి పెట్టాం. కొందరు ప్రజల సొమ్ముతో అద్దాల మేడ కట్టుకుంటే మేము పేదలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్ల క్రితం దాకా పత్రికల్లో కుంభకోణాలు, అవినీతిపై నిత్యం వార్తలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 నుంచి రూ.లక్షల కోట్లు ఆదా చేశాం. సంక్షేమ పథకాల విషయంలో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరిపారేశాం. దాంతో రూ.3 లక్షల కోట్లు ఆదా చేశాం. ప్రజల డబ్బును దేశ నిర్మాణం కోసమే ఖర్చుపెడుతున్నాం. వివిధ పథకాల కింద రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాం.
కులం గురించి మాట్లాడడం ఫ్యాషనైపోయింది
మా ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాం. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. దీనివల్ల పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాం. ప్రతి రంగంలోనూ వారికి మరిన్ని అవకాశాలు కలి్పస్తున్నాం. కులం గురించి మాట్లాడడం కొందరికి ప్యాషనైపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను భారీగా పెంచాం. వేలాది సీట్లు వారికి అందుబాటులోకి వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 780కి చేరింది’’ అని ప్రధాని మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment