![ప్రధాని మోదీని ఓడించాలంటే..?](/styles/webp/s3/article_images/2017/09/5/61389949140_625x300.jpg.webp?itok=7xTHfbUn)
ప్రధాని మోదీని ఓడించాలంటే..?
న్యూఢిల్లీ: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అడ్డుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. మహాకూటమితోనే బీజేపీ, మోదీని ఎదుర్కొగలరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించగలదని అనుకోవడం మూర్ఖత్వమన్నారు. కలిసికట్టుగా పోరాడితే 2019లో బీజేపీపై విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పారు.
‘సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు చాలాపెద్ద నష్టమే జరిగింది. కానీ 2014 పార్లమెంటు ఎన్నికల్లో 59 శాతం, 2017 యూపీ ఎన్నికల్లో 69 శాతం ప్రజలు ప్రధానికి ఓటు వేయలేద’ ని మణిశంకర్ తెలిపారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌లో ఎటువంటి ఇబ్బంది లేదన్న అయ్యర్, జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడుతోందని అంగీకరించారు. పార్టీని పటిష్టం చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి యువతరాన్ని చేర్చుకోవాలని అయ్యర్ సూచించారు.
2004 స్ఫూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన కోరారు. కేంద్రంలో యూపీఏ ఓడిపోవడానికి కారణం ఈ కూటమి చెల్లాచెదురు కావడమేనన్నారు. అప్పట్లో సోనియా గాంధీ మిత్రపక్షాలను కలుపుకునిపోయారని, ఇప్పడు రాహుల్ గాంధీపై ఆ బాధ్యత ఉందన్నారు. మహాకూటమి ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా బలపడాలని అయ్యర్ సూచించారు.