సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్‌వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు...
ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్‌కే మద్దతు
Comments
Please login to add a commentAdd a comment