హోరాహోరీ తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ కూటములు
2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్
48 స్థానాల్లో 41 కైవసం
ఈసారి అఘాడీ గట్టి పోటీ
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి...
స్టేట్ స్కాన్
48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు.
రెండేళ్లలో అంతా తలకిందులు
పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది.
కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు.
మాటల యుద్ధం
ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు.
కాగా, బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్‌డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్‌కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు.
బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు.
అధికార కుమ్ములాటలు
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు.
100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది!
‘మహా’యుతి కూటమి
బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్‌సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్‌పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు.
ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు!
‘ఇండియా’ పైచేయి సాధించేనా?
ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సర్వేల సంగతేంటి?
సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment