ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ ఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్‌గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment