
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుండగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా లేదా రాహుల్ మాత్రమే అధ్యక్షులు కాగలరని ఇంతమాత్రం దానికి ఎన్నికలు అవసరమా అని ప్రశ్నించారు. ‘తల్లి లేదా కొడుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాగలర’ని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రాహుల్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ... ‘ఏదైనా పదవికి ఎక్కువ మంది పోటీ పడినప్పుడు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తారు. బరిలో ఎవరూ లేనప్పుడు, పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నిక ఎలా నిర్వహిస్తార’ని అన్నారు. దీపావళి తర్వాత రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 31న ఆయనకు పట్టంకట్టే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మణిశంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి.
కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి అక్టోబర్ 15-20 మధ్య షెడ్యూల్ ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నిక నిర్వహిస్తామని తెలిపాయి. దీపావళి తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment