మరికొన్ని గంటల్లో 2017 చరిత్రలోకి జారుకుని.. జ్ఞాపకాలను మాత్రం మనకు వదిలేస్తోంది. పలువురు నేతలు దేశాన్ని, పార్టీలను, మత విశ్వాసాలను ప్రభావితం చేసే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని మంటలు పుట్టించాయి.. మరికొన్ని ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. ఏడాది ముగుస్తున్న సందర్భంలో.. ఇటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
రాహుల్ గాంధీ :
వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏడాదిని మొదలు పెట్టారు. జనవరి 11న న్యూఢిల్లీలో జరిగిన ‘జనవేదన సమ్మేళన్’లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ‘శివాజీ, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు’ వంటి వారిలో నేను కాంగ్రెస్ గుర్తును చూశాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది అభయహస్తం అంటూ.. ఆయన చెప్పుకొచ్చారు.
శరద్‌యాదవ్ :
జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఓటు గొప్పతనం గురించి చెప్పే క్రమంలో మహిళలను అత్యంత దారుణంగా అవమానించారు. పట్నాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న శరద్ యాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల గౌరవం కన్నా ఓటుకు ఉన్న గౌరవమే ఎక్కువని చెప్పారు. ఆడపిల్ల గౌరవం పోతే ఆ గ్రామం.. ఊరుకు అవమానమని.. అదే ఓటు గౌరవం పోతే దేశానికే నష్టమని ఆయన అన్నారు.
సాక్షి మహరాజ్ :
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన బీజేపీనేత సాక్షి మహరాజ్.. నలుగురు భార్యలు 40 మంది పిల్లల సంస్కృతి వల్లే జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయి.
వినయ్ కతియార్:
2017 ఏడాది మొత్తం వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ తిరిగిందని చెప్పవచ్చు. ఏడాది ఆరంభంలో.. ప్రియాంక గాంధీ అందంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రియాంక గాంధీ తరువాత.. తాజ్ మహల్, జామా మసీదుపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ శివాలయమే అని, ప్రఖ్యాత జామా మసీదు జమునా దేవి అలయం అంటూ ఆయన కొత్త వివాదాలకు తెరలేపారు.
సందీప్ దీక్షిత్:
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన సందీప్ దీక్షిత్, ఆర్మీ చీఫ్ బిపన్ రావత్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బిపిన్ రావత్‌ను ఒక వీధి గూండాగా సందీప్ పోల్చడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై చివరకు సందీప్ దీక్షిత్ క్షమాపణలు కోరారు.
సంగీత్ సోమ్
బీజేపీ యువనేత సంగీత్ సోమ్ తాజ్ మహాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ ఏడాది ప్రజల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజ్ మహల్‌ను ఆయన దేశద్రోహులు కట్టిన కట్టడంగా పేర్కొనడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో మొఘల్ చక్రవర్తులపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మణిశంకర్ అయ్యర్:
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన రెండు వివాదాస్పద వ్యాఖ్యల ఆ పార్టీకి శరాఘాతంలా మారాయి. ముఖ్యంగా 2014లో మోదీపై చేసిన చాయ్‌వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరణశయ్య మీదకు చేర్చాయి. 2017లో గుజరాత్ ఎన్నికల ఆఖరి సమయంలో మోదీపై అయ్యర్ చేసిన నీచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ పీఠాన్ని దూరం చేశాయి. 2014లో ప్రధాని మోదీపై చేసిన చావ్‌వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేస్తే.. ఈ ఏడాది చేసిన నీచ్ వ్యాఖ్యలు
అనంత్ కుమార్ హెగ్డే :
2017 ముగుస్తుందన్న సమయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా రాజ్యంగ పీఠికలో ఉన్న ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తామని..అందుకే అధికారంలోకి వచ్చామని అనంత్ కుమార్ చేసిన ప్రకటనపై ఉభయసభలు దద్దరిల్లాయి. చివరకు అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై పార్టీకి సంబంధంలేదని బీజేపీ ప్రకటించింది. చివరకు అనంత్ కుమార్ హెగ్డే కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment