Sangeet Som
-
అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం
ఉత్తర ప్రదేశ్ : మీరుట్లో బుధవారం అర్థరాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్‌తో సంగీత్ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. స్పాట్లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ టీమ్ పరిశీలిస్తుందని మీరుట్ ఎస్ఎస్పీ తెలిపారు. హ్యాండ్ గ్రెనైడ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్ గేట్‌ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎమ్మెల్యే సోమ్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు. -
2017 : అత్యంత వివాదాస్పద ఘటనలు
మరికొన్ని గంటల్లో 2017 చరిత్రలోకి జారుకుని.. జ్ఞాపకాలను మాత్రం మనకు వదిలేస్తోంది. పలువురు నేతలు దేశాన్ని, పార్టీలను, మత విశ్వాసాలను ప్రభావితం చేసే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని మంటలు పుట్టించాయి.. మరికొన్ని ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. ఏడాది ముగుస్తున్న సందర్భంలో.. ఇటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాహుల్ గాంధీ : వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏడాదిని మొదలు పెట్టారు. జనవరి 11న న్యూఢిల్లీలో జరిగిన ‘జనవేదన సమ్మేళన్’లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ‘శివాజీ, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు’ వంటి వారిలో నేను కాంగ్రెస్ గుర్తును చూశాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది అభయహస్తం అంటూ.. ఆయన చెప్పుకొచ్చారు. శరద్‌యాదవ్ : జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఓటు గొప్పతనం గురించి చెప్పే క్రమంలో మహిళలను అత్యంత దారుణంగా అవమానించారు. పట్నాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న శరద్ యాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల గౌరవం కన్నా ఓటుకు ఉన్న గౌరవమే ఎక్కువని చెప్పారు. ఆడపిల్ల గౌరవం పోతే ఆ గ్రామం.. ఊరుకు అవమానమని.. అదే ఓటు గౌరవం పోతే దేశానికే నష్టమని ఆయన అన్నారు. సాక్షి మహరాజ్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన బీజేపీనేత సాక్షి మహరాజ్.. నలుగురు భార్యలు 40 మంది పిల్లల సంస్కృతి వల్లే జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. వినయ్ కతియార్: 2017 ఏడాది మొత్తం వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ తిరిగిందని చెప్పవచ్చు. ఏడాది ఆరంభంలో.. ప్రియాంక గాంధీ అందంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రియాంక గాంధీ తరువాత.. తాజ్ మహల్, జామా మసీదుపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ శివాలయమే అని, ప్రఖ్యాత జామా మసీదు జమునా దేవి అలయం అంటూ ఆయన కొత్త వివాదాలకు తెరలేపారు. సందీప్ దీక్షిత్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన సందీప్ దీక్షిత్, ఆర్మీ చీఫ్ బిపన్ రావత్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బిపిన్ రావత్‌ను ఒక వీధి గూండాగా సందీప్ పోల్చడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై చివరకు సందీప్ దీక్షిత్ క్షమాపణలు కోరారు. సంగీత్ సోమ్ బీజేపీ యువనేత సంగీత్ సోమ్ తాజ్ మహాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ ఏడాది ప్రజల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజ్ మహల్‌ను ఆయన దేశద్రోహులు కట్టిన కట్టడంగా పేర్కొనడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో మొఘల్ చక్రవర్తులపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన రెండు వివాదాస్పద వ్యాఖ్యల ఆ పార్టీకి శరాఘాతంలా మారాయి. ముఖ్యంగా 2014లో మోదీపై చేసిన చాయ్‌వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరణశయ్య మీదకు చేర్చాయి. 2017లో గుజరాత్ ఎన్నికల ఆఖరి సమయంలో మోదీపై అయ్యర్ చేసిన నీచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ పీఠాన్ని దూరం చేశాయి. 2014లో ప్రధాని మోదీపై చేసిన చావ్వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేస్తే.. ఈ ఏడాది చేసిన నీచ్ వ్యాఖ్యలు అనంత్ కుమార్ హెగ్డే : 2017 ముగుస్తుందన్న సమయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా రాజ్యంగ పీఠికలో ఉన్న ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తామని..అందుకే అధికారంలోకి వచ్చామని అనంత్ కుమార్ చేసిన ప్రకటనపై ఉభయసభలు దద్దరిల్లాయి. చివరకు అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై పార్టీకి సంబంధంలేదని బీజేపీ ప్రకటించింది. చివరకు అనంత్ కుమార్ హెగ్డే కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. -
మరక కాదు మట్టి మీద తారక
రెండో మాట బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వంటి వారు సెక్యులర్ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్‌లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. తాజ్‌మహల్‌ను నిర్మించినది హిందూ పాలకుడే గానీ, మొగల్ వంశీకుడు షాజహాన్ కాదు; అది శివాలయమే కానీ, ముంతాజ్ జ్ఞాపక చిహ్నం కాదు... హిందూత్వవాద రచయిత పీఎన్ ఓక్ 1980లో చేసిన సిద్ధాంతమిది. ‘భారత చరిత్ర’ను తిరగరాయవలసిన అవసరం ఉన్నదంటూ ఆయన 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజ్‌మహల్ నిర్మాత హిందూ రాజేనని ప్రకటించాలని కోరారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ సందర్భంగా, ‘తాజ్ గురించి ఇతడు పాత పాటే పాడుతున్నాడు’ అంటూ కోర్టు చురక కూడా వేసింది. అలాగే తాజ్ మహల్ నిర్మించిన స్థలంలో అంతకు ముందు మరొక కట్టడం ఉన్నట్టు చెప్పే చారిత్రక ఆధారాలేవీ లేవని 2007 ఆగస్ట్‌లో భారత పురావస్తు పరిశోధన శాఖ చేసిన సర్వే కూడా ధ్రువపరిచింది. – (వికీ పీడియా విజ్ఞాన సర్వస్వం నుంచి) ‘తాజ్ భారతీయ సంస్కృతికే ఒక మచ్చ. చరిత్ర గ్రంథాల నుంచి దీని ప్రస్తావన తొలగించాలి. పాఠ్యపుస్తకాల నుంచి రూపుమాపాలి. కనుకనే బాబర్, అక్బర్, ఔరంగజేబు–ఎవరైతేనేమి, వీళ్లను చరిత్ర నుంచి తుడిచివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’ – సంగీత్ సోమ్ (యూపీ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే, 16–10–2017) ‘చూస్తూ ఉంటే మేస్తూ పోయింద’న్నట్టు బీజేపీ–ఆరెస్సెస్ పాలకవర్గం సెక్యులర్ రాజ్యాంగ ధర్మాలకూ, నియమాలకూ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పార్లమెంట్లో బ్రూట్ మెజారిటీతో పాలక వర్గం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కనిపిస్తున్నది. తాజ్‌మహల్ గురించి మరోసారి రేపిన వివాదం ఈ రాజ్యాంగ విరుద్ధ పోకడలలో భాగమే. తన ప్రేయసి ముంతాజ్తో తనకు ఉన్న అనురాగానికి గుర్తుగా మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో నిర్మించినదే ప్రపంచ ప్రఖ్యాత సుందర తాజ్. ఇప్పటి వివాదం దీని మీదే. పురుషోత్తం నగేశ్ ఓక్ (1917–2007) ఈ వివాదానికి మూలపురుషుడు. కొందరు కుహనా మేధావుల దృష్టిలో భూమి మీద తొలిగా ఆవిర్భవించినదే భారతదేశం. మిగిలిన దేశాలు తరువాత ఆవిర్భవించినవేనని వారి అభిప్రాయం. మానవ ప్రస్థానంలో కనిపించే అన్ని తాత్విక, గణిత, సాహిత్య, సాంస్కృతిక, ఖగోళ, జ్యోతిషాలకు పుట్టినిల్లు భారతదేశమేనని కూడా వారి నమ్మకం. అలాగే ఇతర మతాలనూ, సంస్కృతినీ తూలనాడడం కూడా వారికో దురలవాటు. ‘నా సంస్కృతి, తాత్వికతలు మహోన్నతమైన’ వంటూ చెప్పుకోవడం సబబైనదే. కానీ ఆ మైకంలో ఇతర దేశాల, జాతుల, ఖండాల వారి చారిత్రక వారసత్వాలను, కళా సంస్కృతులను కించపరచడం స్వదేశీ, విదేశీ భావజాలాలకు చెరుపేనన్న సంగతిని గ్రహించవలసిన రోజు వచ్చింది. నేటి తాజ్ రగడ పూర్వరంగాన్ని తెలుసుకున్నప్పుడు మన తాత్విక భావజాలంలో మార్పు అనివార్యమనిపిస్తుంది కూడా. ఈ రగడకు మూలమైన ఓక్ పుస్తకం (తాజ్, ది ట్రూ స్టోరీ) చదివితే ఆ తాత్వికతలోని వైరుధ్యాలు బయటపడతాయి. తాజ్ నిర్మాణం హిందూ దేవాలయాల శిల్ప రీతులలో జరిగిందని వాదించినప్పుడు, క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఇక్కడ జరిగిన నిర్మాణాలన్నీ ఇండో–ఇస్లామిక్ శిల్ప రీతులతో సాగాయన్న వాస్తవాన్నీ, ఆ కాలంలో వాస్తు, కళారీతుల మధ్య ఆదానప్రదానాలు జరిగాయన్న సత్యాన్నీ అంగీకరించవలసి ఉంటుంది. హిందూ వాస్తుశిల్పంతో తాజ్ రూపొందిందని చెప్పిన ఓక్ అక్కడితో ఆగలేదు. క్రైస్తవమతమనేది లేదు, క్రైస్తవం వైదిక క్రైస్త్తవం లేదా కృష్ణనీతి సిద్ధాంతమేనని ఓక్ సూత్రీకరించారు కూడా. ఇంకా, పోప్ మతాధికార వర్గమంటూ ఏదీ లేదనీ, వైదిక పురోహిత వర్గమే పోప్ మతస్తులనీ కూడా వాపోయారు. వాటికన్‌ను కూడా వైదిక పదం వాటిక నుంచి సాగలాగి వైదిక పురోహిత వర్గమే క్రైస్తవ మతాచార్యులని ఓక్ విశ్లేషించారు. అలా కశ్మీర్ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న చారిత్రక కట్టడాలు, నగర వాటికలు అన్నీ హిందూ మతస్తులవే తప్ప, వివిధ ముస్లిం పాలకులవి కావని ఓక్ సిద్ధాం తీకరించారు. తలాతోకా లేని ఇలాంటి మత ధోరణులు చరిత్ర అనిపించుకోలేవు. ఇవేం ధోరణులు? బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వంటి వారు సెక్యులర్ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్‌లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే, ఇప్పుడు మన సంపదగా భావిస్తున్న ఎర్రకోట (మొగలుల కట్టడం), రాష్ట్రపతిభవన్, పార్లమెంట్ భవనం (ఆంగ్లేయులవి) గురించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొనవలసి వచ్చింది. సింహాసనాల కోసం రక్తాన్ని చిందించిన చరిత్ర విషయంలో ఏ కాలపు పాలకులకూ మినహాయింపు లేదు. తండ్రిని, అన్నదమ్ములను చంపి అధికారానికి వచ్చినవారి గురించి తెలియంది కాదు. బాబర్, అక్బర్లకూ అదే జరిగింది, ఔరంగజేబుకూ అదే జరిగింది. తండ్రి షాజహాన్‌ను బంధించినవాడు ఔరంగజేబు. బాబర్, అక్బర్లు మత సామరస్య ప్రబోధకులు, ఆచరించిన వారైనా బిడ్డల నుంచే ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. కృష్ణదేవరాయలు అధికారంలో ఉన్నప్పుడు రామరాయలు ఇతర శత్రువులతో చేతులు కలిపి రాజ్యాధికారానికి రావడానికి చూశాడు. రాయలు రాజ్య విస్తరణలో లేదా స్వరాజ్య సంరక్షణలో దక్కన్ ఆదిల్షా పైన మన ప్రాంతం కాని కటకం గజపతులపైనా కత్తులు దూయవలసి వచ్చింది– అందుకే రాజ్య విస్తరణ కాంక్షకు నిదర్శనగానే రాయల కాలంలోనే ఒక సామెత పుట్టింది: ‘కాదని వాదుకు వస్తే కటకం దాకా రాయలపాలనే’ కొనసాగుతుందన్న మాట. అలాగే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మొగలాయీలపై భీషణ సమరం సాగిస్తున్న తండ్రిని వదిలేసి వైరి శిబిరంతో ఎందుకు చేతులు కలపవలసి వచ్చిందో చెప్పే చరిత్రకారుడు లేడు. అందుకే ‘రాజన్నవాడు/ పాలకుడన్నవాడు ఏ వ్యక్తినీ తన బంధువనిగానీ, సంబంధి అని గానీ చూసుకోడు’ అన్న జహంగీర్ మాటల్ని ‘భారత చరిత్ర’ గ్రంథ రచయిత జాన్ కేయీ ప్రస్తావించారు. ‘రక్తపుకూడు’ దగ్గర ముస్లిం, హిందూ రాజులకు మధ్య తేడాపాడాలు చూపి మనం ఎవరికీ కొమ్ము కాయనక్కరలేదు. ఆదానప్రదానాలు సాధారణం అయితే వారి పాలనలో సాహిత్య, శిల్ప, కళాదిరంగాలలో జరిగిన కృషిని అంచనా వేసేటప్పుడు (అది అధికార విలాసాలలో అంతర్భాగమైనప్పటికీ) విమర్శకుల వైఖరి వేరుగా ఉంటుంది. ఎందుకంటే, తాజ్‌మహల్ నిర్మాణానికి అవసరమైన భూమిని షాజహాన్‌కు యమునా తీరంలో ఇచ్చినవాడు హిందూ రాజు అంబర్. ఇందుకు ముదరాగా షాజహాన్ ఆగ్రాలోని నాలుగు భవంతులను అంబర్‌కి అప్పగించాడని మరవరాదు. ఆ తర్వాతనే తాజ్ నిర్మాణం 1632లో మొదలై పదేళ్లలో పూర్తయిందని పదివేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను సాధికారికంగా లిఖించిన చరిత్రకారుడు మిఖాయిల్ ఉడ్ వెల్ల డించాడు (బీబీసీ గ్రంథావళి: ‘ది స్టోరీ ఆఫ్ ఇండియా’ 2007, పేజి–251). మనం విస్మరిస్తున్న మరొక అంశం ఉంది. నేటి బ్రాహ్మణ్యానికి పడని ముస్లిముల–మొగలాయీల పాలనలో, దర్బారుల్లో అనేకమంది బ్రాహ్మణులైన సంస్కృత పండితులు, పర్షియన్, హిందీ పండితులు సాహిత్య గోష్ఠులు, కవితా పఠనాలు హృద్యంగా జరిపిన వారే. మొగల్ పాలకుల నుంచి సనదులు పొందినవారే. అలాంటి వారిలో ‘పారసి (పర్షియా) ప్రకాశం’ రచించిన కృష్ణదాస, ఇంకా వేదాంగరాయలు, ‘పారసి ప్రకాశ వినోదిని’ గ్రంథకర్త వజ్రఘోషణుడు వంటి బ్రాహ్మణ పండితులు ఉన్నారు. అక్బర్ ఆస్థానంలోని ‘నీలకంధరుడు’ కూడా సనద్ అందుకున్నాడు. ప్రయాగ, బనారస్‌లను సందర్శించే యాత్రికులపై పన్ను రద్దు చేసేటట్టు షాజహాన్‌ను ఒప్పించిన సంస్కృత కవి కవీంద్రాచార్య సరస్వతికి నివాళిగా వెలసిందే– ‘కవీంద్ర చంద్రోదయ’ సంపుటం. షాజహాన్ కాలంలో తెలుగువారైన అప్పయ్య దీక్షితులు, ‘రసగంగాధరం’ కర్త జగన్నాథ పండిత రాయలు (ముంగండ) తమ పాండితీ కీర్తి పతాకాల్ని ఎగరవేసిన వాళ్లే. ముస్లిం యువతి ‘లవంగి’ని ప్రేమించి, మేలం ఆడుతున్నాడన్న నెపంపైన పండితరాయలను ఎవరో కాదు, కొందరు కుహనా బ్రాహ్మణ పండితులే వెలివేయడానికి ప్రయత్నించారన్న సంగతినీ మరవలేం. పాలనలో ‘పరమానంద’ అనే పండితుడు భారత ఖగోళ శాస్త్రం మీద గ్రంథం రాశాడు. ఇందుకు వెండి, బంగారు నాణాలను పురస్కారంగా పొందాడు. నాడు పర్షియన్, సంస్కృతం, హిందీ భాషా రచనల మధ్య ఆదాన ప్రదానాలు నడిచాయన్నది నిజం. పర్షియన్ ఖగోళ శాస్త్ర గ్రంథం ‘జి జియి–షా–జహానీ’ సంస్కృతంలోకి అనువదించడానికి నిత్యానంద పండితుడిని నియమించారు. ఇలా రుతు చక్ర భ్రమణంలో ఎన్ని మార్పులు జరిగినా కుల మతాలపై ఆధారపడి, ఆ రంగు కళ్లద్దాల్లోంచి మానవ సంబంధాల్ని కొలవడానికి ప్రయత్నించకూడదు. ఆ మాటకొస్తే– వాస్తు శిల్పకళలో అంతర్భాగమైన ఆలంకారిక ప్రవేశద్వారాలు, గుమ్మటాలు, వరండా ‘పయిజాలు’, పచ్చదనాన్ని నిత్యం తలపించే వృక్షపంక్తులు, సరంబీలు, కమాన్లు ఇత్యాది అమరికలలో ఇండో–ఇస్లామిక్ శిల్ప కళారీతులు పరస్పరం ప్రభావితమవుతూ వచ్చినవే. రసాత్మకత మిశ్రమ కళా సంప్రదాయాలకూ మౌలిక ధర్మమే. చివరికి కుంభస్వామి వైష్ణవ దేవాలయం సహితం ఈ మిశ్రమ వాస్తు శిల్ప రీతుల్ని తప్పిం చుకొనలేక పోయిందని చరిత్రకారుల భావన. గుజరాత్ సంప్రదాయం వేరని భావించే కొందరు వేర్పాటువాదులు గుజరాతీ కవి తన ‘అర్థ రత్నావళి’ గ్రంథాన్ని అక్బర్‌కి అంకితమిచ్చాడని మరవరాదు. ఇంతకూ ముక్తాయింపుగా ఒక ఆఖరిమాట– ఒక కథనం ప్రకారం ఔరంగజేబు గుజరాత్‌లోని జైన దేవాలయాన్ని కూల్చేశాడని కథ అల్లినా, గుజరాతీ దేశ భాషా పత్రికలన్నీ ఔరంగజేబు పాలనలో సర్వత్రా మత సామరస్యం వెల్లివెరిసిందని పేర్కొనడం మనకు తెలియని ఒక సత్యాన్ని తెలుసుకోవడమే. ఆమాటకొస్తే దక్కన్లోనూ ఔరంగజేబు హిందూ దేవాలయాలకు కానుకలిచ్చాడనీ వినలేదూ?! తెలి యని మరిన్ని వివరాలకు ఇటీవలి తాజా బృహత్ సాధికార రచన మేడం ఆంధ్రే ట్రస్కీ రాసిన ‘కల్చర్ ఆఫ్ ఎన్కౌంటర్స్’ గ్రంథరాజాన్ని (2016) పరి శీలించడం మన జ్ఞాన పరిధుల్ని విస్తరించుకోవడమే. abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ -
‘తాజ్’ గుణపాఠం
నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉండాలని, అధినాయకుడి దృష్టిలో పడాలని కోరు కోవడం రాజకీయాల్లో ఉంటున్నవారికి సహజం. కానీ అందుకు వేళా పాళా చూసు కోవాలి. లేనట్టయితే ఆ మాటలు బెడిసికొడతాయి. ఒకపక్క పంజాబ్‌లోని గురు దాస్పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై బీజేపీ మథనపడుతున్న వేళ ఆ పార్టీకి చెందిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చరిత్రాత్మకమైన తాజ్‌మహల్ కట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాయకులందరినీ ఇరకాటంలోకి నెట్టారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ బీజేపీ అధికార ప్రతినిధి సర్ది చెప్పగా, ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ రాంనాయక్ కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సివచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తిగా సంగీత్ సోమ్‌కు ఇప్పటికే పేరుంది. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్ల కారకుల్లో సంగీత్ సోమ్ కూడా ఒకరని జస్టిస్ విష్ణుసహాయ్ కమిషన్ నివేదిక ఆరో పించింది. అప్పట్లో ఆయన జాతీయ భద్రతా చట్టం కింద జైలుకెళ్లారు. రెండేళ్లక్రితం న్యూఢిల్లీకి సమీపంలోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై గుంపు దాడిచేసి కుటుంబపెద్ద అఖ్లాక్ను కొట్టి చంపిన కేసులో ‘అమాయకుల్ని’ ఇరికిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించి వార్తల కెక్కారు. తాజ్‌మహల్‌పై సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని బీజేపీ చెబుతుండవచ్చుగానీ చరిత్రకు సంబంధించి, ప్రత్యేకించి తాజ్‌మహల్ గురించి పార్టీలోని చాలామందికి ఈ మాదిరి అభిప్రాయాలే ఉన్నాయి. ఎవరిదాకానో ఎందుకు... యోగి ఆదిత్యనాథే మొన్న జూన్‌లో ‘ఈ సమాధి భారతీయ సంస్కృ తిలో భాగం కాబోద’ని అన్నారు. దానికి కొనసాగింపుగానే కావొచ్చు... యూపీ టూరిజం శాఖ ఈమధ్యే వెలువరించిన ముఖ్య దర్శనీయ స్థలాల బుక్‌లెట్‌లో తాజ్‌మహల్ ఫొటో లేదు. మధ్యలో ఎక్కడో దాని పేరు ప్రస్తావించాం కదా అని ఒకసారి... ఆ బుక్‌లెట్‌లో కేవలం స్థానిక దర్శనీయ స్థలాల గురించే ఇచ్చామని మరోసారి టూరిజం మంత్రి రీటా బహుగుణ వివరణనిచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడు సంగీత్ సోమ్ ఆ వివాదాన్ని ప్రస్తావించే ఇష్టానుసారం మాట్లాడారు. దాన్ని ద్రోహులు నిర్మించారని, అలాంటి కట్టడాలకు చరిత్రలో స్థానం లేదని అన్నారు. ఇంతగా ఊగిపోయిన సంగీత్ సోమ్ 24 గంటలు గడవకముందే స్వరం మార్చారు. తాను మొగలులకే తప్ప ‘అందమైన కట్టడానికి’ వ్యతిరేకం కాదంటూ వివరణనిచ్చుకున్నారు. యోగి సైతం ‘భారతీయుల స్వేదం, నెత్తుటి బొట్లతోనే తాజ్‌మహల్ నిర్మితమైందని ఇప్పుడంటున్నారు. చరిత్రలో మనకు ఇష్టమైనవి ఉంటాయి... ఇష్టంలేనివీ ఉంటాయి. అంత మాత్రాన వాటిని మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చలేం. మన అభిప్రా యాలకు తగ్గట్టు మలచలేం. చరిత్రలో జరిగిన తప్పులు, వాటి పర్యవసానాలూ గ్రహించుకుని అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం...మంచి కన బడితే దాన్ని ఆదర్శంగా తీసుకోవడం వివేకవంతులు చేసే పని. కనీసం వక్రీకరిం చాలన్నా చరిత్ర సంపూర్ణంగా తెలుసుకోవడం, దానిపై పట్టు సాధించడం అవసర మని సంగీత్ సోమ్‌కు ముందుగా తెలియాలి. షాజహాన్, ఔరంగజేబుల్లో ఎవరు తండ్రో, ఎవరు తనయుడో... ఎవరు ఎవరిని చెరసాలపాలుజేశారో, ఎందుకు చేశారో ఆయనకు అవగాహనలేదు. ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ విలువైన మాటన్నారు. స్వీయ చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం లేని దేశం అభివృద్ధి చెందదని, ఇలాంటి ధోరణి మార్చుకోనట్టయితే ఉనికిని కోల్పోతుందని చెప్పారు. చరిత్రలో మొగల్ చక్రవర్తులు కావొచ్చు... అంతక్రితం ఏలిన హిందూ రాజులు కావొచ్చు ఎవరైనా సామ్రాజ్య విస్తరణ కోసమే తమ శక్తియుక్తులు ధారపోశారు. చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆకాంక్షతోనో, తమకు ప్రియమైనవారి జ్ఞాపకంగానో కట్టడాలు నిర్మించారు. ప్రార్ధనామందిరాలు నిర్మించారు. ఇలాంటి కట్టడాలకు చెమటోడ్చిందీ... నెత్తురు ధారపోసిందీ ఇక్కడి శ్రామికులే. ఇందుకవ సరమైన వ్యయమంతా ఈ గడ్డపైనున్న జనం సృష్టించిన సంపదనుంచి, వారు కట్టిన పన్నులనుంచి లభించిందే. తాజ్‌మహల్ కట్టడంలో పర్షియన్, మధ్య ఆసియా, హిందూ శిల్పకళా రీతులున్నాయని చెబుతారు. వాటిని మేళవించి ఒక అద్భుతాన్ని సృష్టించడంలో ఆనాటి శిల్పుల పనితనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఆ నిర్మాణానికి వారనుసరించిన పద్ధతులేమిటో ఆరా తీస్తే మన జ్ఞానం విస్తరిస్తుంది. నిజంగా చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం ఉన్నవారు చేయాల్సిన పని ఇది. కట్టించింది ముస్లిం మతస్తుడు గనుక ఏదో ఒక వివాదం లేవనెత్తి ఉద్వేగాలు పెంచాలని ప్రయత్నించడం వెగటు పుట్టిస్తుంది. అన్ని అపురూప కట్టడాల చుట్టూ అల్లుకునే మార్మికతే దాదాపు నాలుగువందల ఏళ్లనాటి తాజ్‌మహల్‌కు సంబంధించి కూడా ఉంది. అందులో కొన్ని నిజా లుండొచ్చు. కొన్ని కల్పితాలు కావొచ్చు. తాజ్‌మహల్ నిర్మాణానికి అవసరమైన చలువరాళ్లు, ఇతర సామగ్రిని తరలించడానికి వెయ్యి ఏనుగుల్ని వినియోగించారం టారు. ఆ కట్టడం నిర్మాణంలో 22,000మంది పాలుపంచుకున్నారని అంటారు. ఇలాంటి కట్టడం మరోచోట అసాధ్యమయ్యేలా ఈ నిర్మాణంలో కీలకపాత్ర పోషిం చినవారి చేతులు షా జహాన్ నరికించాడని చెబుతారు. ‘కాలం చెక్కిట ఘనీభవిం చిన కన్నీటి చుక్క’గా రవీంద్ర కవీంద్రుడు అభివర్ణించిన తాజ్‌మహల్ ప్రపంచం నలుమూలల్లోని సౌందర్యారాధకులకూ సందర్శనీయ స్థలం. దేశాధినేతలు మొద లుకొని ఫేస్బుక్ జుకర్‌బర్గ్ వరకూ అందరినీ సమానంగా అలరించే తాజ్మహ ల్ను నిరుడు 62 లక్షలమందికిపైగా పర్యాటకులు వీక్షించారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టడంతోపాటు వేలాదిమందికి అది ఉపాధి కల్పి స్తోంది. అన్నిటికీ మించి ఈ దేశ సాంస్కృతిక వైవిధ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. దాని జోలికెళ్లడం క్షేమం కాదని ఆలస్యంగానైనా మన నేతలు గ్రహించినందుకు సంతోషించాలి. -
చేతుల్ని నిజంగా నరికేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ చుట్టూ అల్లుకుపోయిన మంచి, చెడు కథలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. 17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ బేగమ్ పేరిట ఈ సుందర స్మారక భవనాన్ని నిర్మించిన షా జహాన్ (షాహబ్ ఉద్దీన్ ముహమ్మద్ కుర్రమ్) తన తండ్రిని చెరసాలలో బంధించిన దుర్మార్గుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవానికి షా జహాన్ తన తండ్రి జహంగీర్‌ను చెరసాలలో బంధించలేదు. షా జహాన్నే ఆయన కుమారుడు ఔరంగా జేబు బంధించారనే విషయం చరిత్ర పుస్తకాలు చదువుకోని భారతీయుల కూడా తెలుసు. మొఘల్ చక్రవర్తులది తనయులను చంపేసే తండ్రుల సంస్కృతంటూ ప్రముఖ హిందూత్వ వాది, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, సంగీత్ సోమ్ను సమర్థించారు. తండ్రులను చెరసాలల్లో బంధించారే తప్ప తండ్రులను చంపిన మొఘల్ రాజుల గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇంకా రాజ్యం కోసం తండ్రులను చంపిన తనయుల చరిత్ర రాజ్పుత్లకే ఉంది. మెవార్ రాజు రాణా కుంభాను క్రీస్తుశకం 1468లో ఆయన కుమారుడు ఉదయ్ సింగ్ చంపేశారని, క్రీస్తు శకం 1724లో మార్వార్ రాజు అజిత్ సింగ్‌ను ఆయన కుమారులు భక్త్ సింగ్, అభయ్ సింగ్‌లు కలిసి చంపేశారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ఆస్తుల కోసం తండ్రులను చంపేసే సంస్కతి ఇప్పటికీ భారతీయుల్లో కనిపిస్తోంది. దినేష్ శర్మ మరో అడుగు ముందుకేసి షా జహాన్ తాజ్ మహల్‌ను నిర్మించిన కూలీల రెండు చేతులను నరికేయించారని వ్యాఖ్యానించారు. అలాంటి అందమైన నిర్మాణాన్ని మరో చోట నిర్మించకూడదనే భావంతోనే కూలీల చేతులను నరికేయించారన్నది తెలిసీ తెలియని శర్మ లాంటి వ్యక్తుల అభిప్రాయం. తాజ్ మహల్‌ను నిర్మించడానికి ముందే షా జహాన్‌కు మంచి బిల్డర్‌గా పేరుంది. అప్పటికే ఆయన ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, అజ్మీర్‌లో దాదాపు డజన్ కట్టడాలను పూర్తి చేశారు. ఒక కట్టడమయ్యాక అక్కడి నుంచి మరో చోటుకు కూలీలను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. కూలీలకు నిరంతరం పని కల్పించడ వల్ల వారిలో పని నైపుణ్యం పెరుగుతుందని, పైగా ఒకే వ్యక్తి వద్ద ఎక్కువ కాలం పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తారని కూడా ఆయన నమ్మేవారని చరిత్రకారులే చెప్పారు. ఈ రోజుల్లో లాగా నైపుణ్యం కలిగిన కూలీలు అప్పుడు పెద్దగా దొరికేవారు కాదు. అలాంటప్పుడు తాజ్ మహల్ లాంటి మహా సౌధాన్ని కట్టిన చేతులను బుద్ధి ఉన్నవారు ఎవరూ నరక్కోరు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అప్పటికే ప్రముఖుడైన జోహాన్నెస్ డీ లాయెత్ లాంటి యూరప్ చరిత్రకారులు ఆ సంఘటనను కచ్చితంగా నమోదు చేసేవారు. అప్పటి యూరప్ చరిత్రకారులు ఇలాంటి పుకార్లకు, రాజుల ప్రేమ పురాణాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు. ముంతాజ్ బేగమ్ మరణించాక షా జహాన్ తన పెద్ద కూతురు జహనారా బేగమ్‌ల ప్రణయ గాధలు అంటూ ప్రచారం చేసిన చరిత్రకారులు వేల మంది కార్మికుల చేతులను నరికితే పట్టించుకోరా? అప్పుడు ప్రచారంలో ఏ మాత్రంలేని షా జహాన్ ఘోర కృత్యం గురించి కొన్ని దశాబ్దాల తర్వాత ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? పైగా షా జహాన్, కూలీలకు ఇతరుల కన్నా ఎక్కువ వేతనాలిచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. అందుకేనేమో బ్రిటిష్ పాలకుల హయాంలోకన్నా షా జహాన్ కాలంలోనే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువని ఆర్థిక గణాంకాలే తెలియజేస్తున్నాయి (17వ శతాబ్దాన్ని 19వ శతాబ్దంలోని భారత ఆర్థిక వ్యవస్థ పోల్చి చూడండి!). షా జహాన్ విదేశీయుడని సోమ్, శర్మ కూటమి పేర్కొంది. తన జీవితాంతం భారత ఉపఖండంలోనే జీవించిన ఆయనకు మూగ్గురు రాజ్‌పుత్ తాతలు, ఒక పర్షియన్, ఆసియన్ తాత కూడా ఉన్నారు. లియో వర్ద్కర్ ఐరిస్ అని, బరాక్ ఒబామా అమెరికన్ అని ఒప్పుకుంటే షా జహాన్‌ను కూడా భారతీయుడని ఒప్పుకోవాల్సిందే. ఓ అద్భుతమైన కట్టడం వెనక ఓ చీకటి కోణం దాగుందని చెప్పడం మానవ సంస్కృతిలో భాగంగా కనిపిస్తోంది. మాస్కోలోని ప్రముఖ సెయింట్ బేసిల్స్ కెథడ్రల్కు ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన తన కుమారుడైన పోస్తిక్ యకోవ్లెÐŒ ను రష్యా జారు చక్రవర్తి ఇవాన్ ది టెరిబుల్ చంపాలనుకోవడం కూడా అలాంటిదే. బాంబేలోని తాజ్ మహల్ హోటల్‌కు కూడా అలాంటి కథనే అల్లారు. తాను గీసిన ప్లాన్‌ను ముందు భాగాన్ని వెనక్కి, వెనక భాగాన్ని ముందుకు కట్టారని తెలిసి దాని ఆర్కిటెక్ట్ తాజ్‌మహల్ హోటల్ పైనుంచి దూకి చనిపోయారని చెబుతారు. తాజ్ మహల్ ఒకప్పటి ‘తేజో ఆలయం’గా పిలిచే శివాలయం అనే వాదనలో ఎంత నిజం ఉందో, కార్మికుల చేతులు నరకడంలోనూ అంతే నిజం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడంతో మొదలైన ‘తాజ్ మహల్’ వివాదం ప్రధాని జోక్యంతో చివరకు తన మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించారేమో భారతీయుల రక్తం, స్వేదంతో తడిసిన తాజ్ మహల్‌ను రక్షించాల్సిన బాధ్యత తన రాష్ట్రానిదేనని చెప్పారు. పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి దాన్ని తొలగించినప్పుడు అనవసరంగా ఓ సమాధిని రక్షించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అర్థరహితమన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా సమయానుకూలంగా వ్యవహరించడం తెలివైన రాజకీయ నేతల పని. అంత రక్తంతోకాకపోయిన కార్మికుల స్వేదంతో తడిసిన సౌధాన్ని ఏ దేశమైనా రక్షించుకోవాల్సిందే. -
ఆరో తరగతి బుక్ ఇవ్వండి!
సాక్షి, ముంబై: ప్రముఖ సినీ రచయిత జావేద్ అఖ్తర్ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ ఏడోవింతగా పరిగణించే తాజ్‌మహాల్.. భారత సంస్కృతికి మచ్చగా సోమ్ అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. 'సంగీత్ సోమ్‌కు చరిత్ర తెలియకపోవడం చాలా గొప్ప విషయంగా భావించాలి. ఆయనకు ఎవరైనా ఆరో తరగతి చరిత్ర పుస్తకాన్ని ఇవ్వండి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ జమానాలో భారత్‌కు వచ్చిన డాక్టర్ థామస్ రోయి.. సగటు ఆంగ్లేయుల కంటే భారతీయుల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని రాశాడు' అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. 'అక్బర్‌ను ద్వేషించేవాళ్లకు క్లీవ్ (బ్రిటిష్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్)తో ఎలాంటి సమస్యా లేదు. జహంగీర్‌ను ద్వేషించేవాళ్లు వారన్ హస్టింగ్స్ (బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్) గురించి మాట్లాడరు. నిజానికి వాళ్లే నిజమైన దోపిడీదారులు' అని అఖ్తర్ పేర్కొన్నారు. 'తాజ్‌మహాల్ భారత సంస్కృతిపై మచ్చ. హిందువులను నాశనం చేయాలనుకున్న చక్రవర్తి దీనిని నిర్మించారు' అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి దూరం జరిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. త్వరలోనే ఆగ్రాలోని తాజ్‌మహాల్‌తోపాటు ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. -
తాజ్‌కు చరిత్రలో స్థానం లేదు
మీరట్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్రాత్మకంగా తాజ్‌మహల్‌కు ఎటువంటి ప్రాధాన్యం లేదని, హిందువులను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు తండ్రిని జైల్లో పెట్టిన వ్యక్తిని చరిత్రలో గొప్పవాడిగా చూపారని సోమ్ వ్యాఖ్యానించారు. నిజానికి తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్‌ను ఆయన కుమారుడు ఔరంగజేబు చెరసాలలో బంధించాడు. అంతేకానీ షాజహాన్ తన తండ్రిని చెరసాలలో బంధించలేదు. ఇలా చరిత్రను తప్పుగా వక్రీకరించిన సోమ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం మీరట్ జిల్లా పర్యటనలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఆనంగ్పాల్ సింగ్ తోమర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాబర్, అక్బర్, ఔరంగజేబులు ద్రోహులని, వారి పేర్లను చరిత్రపుటల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాజ్‌మహల్‌ను యూపీ టూరిజం బుక్లెట్ నుంచి తొలగించినందుకు కొందరు బాధపడు తున్నారని, అసలు తాజ్‌మహల్‌కున్న చరిత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాణా ప్రతాప్, శివాజీలు నిజమైన యోధులని, వారి జీవితచరిత్ర గురించి స్కూళ్లు, కాలేజీల్లో బోధించాలని సూచించారు. మరి ఎర్రకోటనూ వారే కట్టారు కదా: ఒవైసీ సాక్షి, హైదరాబాద్: తాజ్ మహల్æపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఎర్రకోటను కూడా మీరన్న ఆ దేశ ద్రోహులే నిర్మించారని.. అక్కడి నుంచి ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆపుతారా? ఓవైసీ ప్రశ్నించారు. అలాగే అదే దేశద్రోహులు నిర్మించిన హైదరాబాద్ హౌస్‌లో దేశ పర్యటనకు వచ్చిన విదేశీ నేతలకు ఇస్తున్న ఆతిథ్యాన్ని కూడా మోదీ ఆపేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించే సత్తా కేంద్రానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. -
నేడే యూపీ తొలిదశ
పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్‌లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్‌షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎస్పీ–కాంగ్రెస్‌కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మమద్ నూరూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్‌లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు. -
ఐఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు
మీరట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తనను హతమారుస్తామని బెదిరించినట్టు ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చెప్పారు. శనివారం ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిగా చెప్పుకున్న ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి త్వరలో చంపేస్తామని హెచ్చరించాడని సంగీత్ సోమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ అమెరికా నుంచి ఆగంతకుడు తనకు ఫోన్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్‌కు వచ్చారని, త్వరలో తనను చంపేస్తారని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడని, తాను ఫోన్ కట్ చేయగా, మళ్లీ ఫోన్ చేశాడని తెలిపారు. ఐజీతో పాటు బీజేపీ సీనియర్ నేతలకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి సంగీత్ సోమ్‌కు ప్రాణహాని ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ వర్గాలు తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. -
'వారిద్దరూ నన్ను చంపేందుకు కుట్రపన్నారు'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తనను చంపేందుకు కుట్రపన్నారని ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. అమర్ సింగ్, సంగీత్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, వీరిద్దరూ తనను అంతం చేసేందుకు పథకం రచించారని చెప్పారు. వీరు తాము అనుకున్నది చేయగలరని ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, సోమ్ ఇంతకుముందు ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆజంకు సంబంధముందని ఆరోపించారు. అమర్ సింగ్ కూడా ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపణలు చేశారు. -
దాద్రిలో పర్యటిస్తున్న సంగీత్
లక్నో : ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఆదివారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే ఎమ్మెల్యే సంగీత్ సోమ్ గతంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో గత సోమవారం రాత్రి సుమారు వంద మంది స్థానికులు ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేశారు. మహ్మద్ అక్లాఖ్ (50) ను రాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడి కుమారుడు డానిష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల్లో హెంగార్డ్ కూడా ఉన్నాడు. బాధిత కుటుంబ సభ్యులు ఈ రోజు లక్నోలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.