నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉండాలని, అధినాయకుడి దృష్టిలో పడాలని కోరు కోవడం రాజకీయాల్లో ఉంటున్నవారికి సహజం. కానీ అందుకు వేళా పాళా చూసు కోవాలి. లేనట్టయితే ఆ మాటలు బెడిసికొడతాయి. ఒకపక్క పంజాబ్‌లోని గురు దాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై బీజేపీ మథనపడుతున్న వేళ ఆ పార్టీకి చెందిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చరిత్రాత్మకమైన తాజ్‌మహల్ కట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాయకులందరినీ ఇరకాటంలోకి నెట్టారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ బీజేపీ అధికార ప్రతినిధి సర్ది చెప్పగా, ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ రాంనాయక్ కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సివచ్చింది.
అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తిగా సంగీత్ సోమ్‌కు ఇప్పటికే పేరుంది. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్ల కారకుల్లో సంగీత్ సోమ్ కూడా ఒకరని జస్టిస్ విష్ణుసహాయ్ కమిషన్ నివేదిక ఆరో పించింది. అప్పట్లో ఆయన జాతీయ భద్రతా చట్టం కింద జైలుకెళ్లారు. రెండేళ్లక్రితం న్యూఢిల్లీకి సమీపంలోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై గుంపు దాడిచేసి కుటుంబపెద్ద అఖ్లాక్‌ను కొట్టి చంపిన కేసులో ‘అమాయకుల్ని’ ఇరికిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించి వార్తల కెక్కారు.
తాజ్‌మహల్‌పై సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని బీజేపీ చెబుతుండవచ్చుగానీ చరిత్రకు సంబంధించి, ప్రత్యేకించి తాజ్‌మహల్ గురించి పార్టీలోని చాలామందికి ఈ మాదిరి అభిప్రాయాలే ఉన్నాయి. ఎవరిదాకానో ఎందుకు... యోగి ఆదిత్యనాథే మొన్న జూన్‌లో ‘ఈ సమాధి భారతీయ సంస్కృ తిలో భాగం కాబోద’ని అన్నారు. దానికి కొనసాగింపుగానే కావొచ్చు... యూపీ టూరిజం శాఖ ఈమధ్యే వెలువరించిన ముఖ్య దర్శనీయ స్థలాల బుక్‌లెట్‌లో తాజ్‌మహల్ ఫొటో లేదు. మధ్యలో ఎక్కడో దాని పేరు ప్రస్తావించాం కదా అని ఒకసారి... ఆ బుక్‌లెట్‌లో కేవలం స్థానిక దర్శనీయ స్థలాల గురించే ఇచ్చామని మరోసారి టూరిజం మంత్రి రీటా బహుగుణ వివరణనిచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడు సంగీత్ సోమ్ ఆ వివాదాన్ని ప్రస్తావించే ఇష్టానుసారం మాట్లాడారు. దాన్ని ద్రోహులు నిర్మించారని, అలాంటి కట్టడాలకు చరిత్రలో స్థానం లేదని అన్నారు. ఇంతగా ఊగిపోయిన సంగీత్ సోమ్ 24 గంటలు గడవకముందే స్వరం మార్చారు. తాను మొగలులకే తప్ప ‘అందమైన కట్టడానికి’ వ్యతిరేకం కాదంటూ వివరణనిచ్చుకున్నారు. యోగి సైతం ‘భారతీయుల స్వేదం, నెత్తుటి బొట్లతోనే తాజ్‌మహల్ నిర్మితమైందని ఇప్పుడంటున్నారు.
చరిత్రలో మనకు ఇష్టమైనవి ఉంటాయి... ఇష్టంలేనివీ ఉంటాయి. అంత మాత్రాన వాటిని మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చలేం. మన అభిప్రా యాలకు తగ్గట్టు మలచలేం. చరిత్రలో జరిగిన తప్పులు, వాటి పర్యవసానాలూ గ్రహించుకుని అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం...మంచి కన బడితే దాన్ని ఆదర్శంగా తీసుకోవడం వివేకవంతులు చేసే పని. కనీసం వక్రీకరిం చాలన్నా చరిత్ర సంపూర్ణంగా తెలుసుకోవడం, దానిపై పట్టు సాధించడం అవసర మని సంగీత్ సోమ్‌కు ముందుగా తెలియాలి. షాజహాన్, ఔరంగజేబుల్లో ఎవరు తండ్రో, ఎవరు తనయుడో... ఎవరు ఎవరిని చెరసాలపాలుజేశారో, ఎందుకు చేశారో ఆయనకు అవగాహనలేదు.
ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ విలువైన మాటన్నారు. స్వీయ చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం లేని దేశం అభివృద్ధి చెందదని, ఇలాంటి ధోరణి మార్చుకోనట్టయితే ఉనికిని కోల్పోతుందని చెప్పారు. చరిత్రలో మొగల్ చక్రవర్తులు కావొచ్చు... అంతక్రితం ఏలిన హిందూ రాజులు కావొచ్చు ఎవరైనా సామ్రాజ్య విస్తరణ కోసమే తమ శక్తియుక్తులు ధారపోశారు. చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆకాంక్షతోనో, తమకు ప్రియమైనవారి జ్ఞాపకంగానో కట్టడాలు నిర్మించారు. ప్రార్ధనామందిరాలు నిర్మించారు. ఇలాంటి కట్టడాలకు చెమటోడ్చిందీ... నెత్తురు ధారపోసిందీ ఇక్కడి శ్రామికులే. ఇందుకవ సరమైన వ్యయమంతా ఈ గడ్డపైనున్న జనం సృష్టించిన సంపదనుంచి, వారు కట్టిన పన్నులనుంచి లభించిందే. తాజ్‌మహల్ కట్టడంలో పర్షియన్, మధ్య ఆసియా, హిందూ శిల్పకళా రీతులున్నాయని చెబుతారు.
వాటిని మేళవించి ఒక అద్భుతాన్ని సృష్టించడంలో ఆనాటి శిల్పుల పనితనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఆ నిర్మాణానికి వారనుసరించిన పద్ధతులేమిటో ఆరా తీస్తే మన జ్ఞానం విస్తరిస్తుంది. నిజంగా చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం ఉన్నవారు చేయాల్సిన పని ఇది. కట్టించింది ముస్లిం మతస్తుడు గనుక ఏదో ఒక వివాదం లేవనెత్తి ఉద్వేగాలు పెంచాలని ప్రయత్నించడం వెగటు పుట్టిస్తుంది. అన్ని అపురూప కట్టడాల చుట్టూ అల్లుకునే మార్మికతే దాదాపు నాలుగువందల ఏళ్లనాటి తాజ్‌మహల్‌కు సంబంధించి కూడా ఉంది. అందులో కొన్ని నిజా లుండొచ్చు. కొన్ని కల్పితాలు కావొచ్చు. తాజ్‌మహల్ నిర్మాణానికి అవసరమైన చలువరాళ్లు, ఇతర సామగ్రిని తరలించడానికి వెయ్యి ఏనుగుల్ని వినియోగించారం టారు.
ఆ కట్టడం నిర్మాణంలో 22,000మంది పాలుపంచుకున్నారని అంటారు. ఇలాంటి కట్టడం మరోచోట అసాధ్యమయ్యేలా ఈ నిర్మాణంలో కీలకపాత్ర పోషిం చినవారి చేతులు షా జహాన్ నరికించాడని చెబుతారు. ‘కాలం చెక్కిట ఘనీభవిం చిన కన్నీటి చుక్క’గా రవీంద్ర కవీంద్రుడు అభివర్ణించిన తాజ్‌మహల్ ప్రపంచం నలుమూలల్లోని సౌందర్యారాధకులకూ సందర్శనీయ స్థలం. దేశాధినేతలు మొద లుకొని ఫేస్‌బుక్ జుకర్‌బర్గ్ వరకూ అందరినీ సమానంగా అలరించే తాజ్‌మహ ల్‌ను నిరుడు 62 లక్షలమందికిపైగా పర్యాటకులు వీక్షించారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టడంతోపాటు వేలాదిమందికి అది ఉపాధి కల్పి స్తోంది. అన్నిటికీ మించి ఈ దేశ సాంస్కృతిక వైవిధ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. దాని జోలికెళ్లడం క్షేమం కాదని ఆలస్యంగానైనా మన నేతలు గ్రహించినందుకు సంతోషించాలి.
Comments
Please login to add a commentAdd a comment